అభినంద‌న‌

సాహితీలోకంలో న‌వ‌లా ర‌చ‌న ఒక ఆద‌ర‌ణీయ‌మైన ప్ర‌క్రియ‌. సాధారణంగా న‌వ‌ల‌లో క‌థావ‌స్తువు క‌ల్పితంగా ఉంటుంది. కాని ఆదిశంకరుల జీవిత‌ము య‌దార్థ గాథ‌. ఒక అవ‌తార పురుషుని జీవితాన్ని న‌వ‌ల‌గా వ్రాయడం అంటే క‌త్తిమీద సామే. అయితే డా|| దిట్ట‌క‌వి శ్యామ‌లాదేవి (ఎం.ఎ., పి.హెచ్‌.డి.) సుల‌భ‌మైన భాష‌లో. ఈనాటి యువ‌త‌రాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ర‌చ‌న సాగించి ఆస్తిక లోకానికి ఒక ర‌మ‌ణీయ‌మైన న‌వ‌ల‌ను అందించారు. ఇక న‌వ‌ల నామ‌క‌ర‌ణం విష‌యానికి వ‌స్తే కైలాసం నుండి - కైలాసం దాకా అన్న పేరు పెట్ట‌డంలో ఎంతో ఔచిత్యం పాటించారు. శంక‌రులు ఒక అవ‌తార పురుషుల‌నీ, వారి అవ‌తార త‌త్వం పూర్తికాగానే తిరిగి కైలాసం చేరార‌నే విష‌యాన్ని న‌వ‌ల పేరులోనే చిత్రంగా నిబిడీకృతం చేశారు.

న‌వ‌ల హాయిగా చ‌దువుకోవ‌టం తేలికే. కాని చ‌క్క‌ని శైలిలో చ‌దివే వారి మ‌న‌సును రంజింజ‌చేసేలా ర‌చ‌నా చేయ‌టం చాలా క్లిష్ట‌మైన విష‌యం. అయితే కైలాసం నుండి - కైలాసందాకా, న‌వ‌ల చ‌ద‌వ‌టం ప్రారంభించింన ద‌గ్గ‌ర‌నుంచీ, న‌వ‌ల ముగిసేవ‌ర‌కు, నేను విరామం తీసుకోవ‌టం జ‌ర‌గ‌లేదు. స‌మ‌య‌మే తెలియ‌లేదు. కొన్ని కొన్ని ఘ‌ట్టాలు చ‌దువుతుంటే ఆ ఘ‌ట్టాల తాలూకు దృశ్యాలు క‌ళ్ళ ముందు స్ప‌ష్టంగా క‌దలాడాయి. అది డా||శ్యామ‌లాదేవిగారి ర‌చ‌న‌లోని గొప్ప‌ద‌నం అని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఈ చిత్రీక‌ర‌ణ చాతుర్యం వీరి ప్ర‌తిభ‌ను వేయినోళ్ళ చాటుతుంది.

శ్రీ‌మ‌తి శ్యామ‌లాదేవి గారికి స్వ‌త‌హాగా దైవ‌భ‌క్తి ఎక్కువ‌. ముఖ్యంగా ఆదిశంక‌రాచార్యుల‌వారు స్థాపించిన చ‌తురామ్నాయ పీఠాల‌లో, ప్ర‌థ‌మ‌ము, ప్ర‌ధాన‌మే అయిన శృంగేరి శ్రీ శార‌దాపీఠంపైన‌, ఆ పీఠాన్ని అధిరోహించిన జ‌గ‌ద్గురు శ్రీ‌శ్రీ‌శ్రీ భార‌తీతీర్థ మ‌హాస్వామివార్ల‌పైన భ‌క్తి ప్ర‌ప‌త్తులు ఎక్కువ‌. పైగా వారు శ్రీ శృంగేరి శార‌దా సేవాస‌మితి - ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంస్థ‌కు ఉపాధ్య‌క్షురాలుకూడ‌. ప‌ద‌వుల కోసం ప్రాకులాడుతూ, ప‌ద‌వుల్ని చూచి గ‌ర్వాన్ని ప్ర‌ద‌ర్శించే వారున్న ఈ స‌మాజంలో, త‌న ప‌ద‌విని ఒక బాధ్య‌త‌గా గుర్తించి, భ‌గ‌వంతుడు త‌న‌కు వ‌రంగా ప్ర‌సాదించిన ర‌చ‌నా ప్ర‌క్రియ‌తో ఒక అపూర్వ న‌వ‌లా కుసుమాన్ని రూపొందించి ఆ కుసుమంతో భ‌గ‌వంతుణ్ణి అర్చించిన ధ‌న్య‌జీవి శ్రీ‌మ‌తి దిట్ట‌క‌వి శ్యామ‌లాదేవిగారు. వీరి భ‌ర్త శ్రీ దిట్ట‌క‌వి ద‌త్తాత్రేయులుగారు. సెంట్ర‌ల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యున‌ల్‌లో న్యాయ‌మూర్తి మెంబ‌రుగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.

వీరి కుటుంబ‌ముతో నాప‌రిచ‌య‌ము రెండు ద‌శాబ్దాల పైమాటే. వీరి కుటుంబ స‌భ్యుల నిబ‌ద్ధ‌త‌, అంకిత భావం నాకు బాగా తెలుసు. వీరి కుటుంబ‌ము య‌ధాశ‌క్తి శ్రీ‌శృంగేరి శార‌దాపీఠానికి సేవ‌లందిస్తున్నారు. వీరికి శార‌దాంబ అనుగ్ర‌హ‌ము, జ‌గ‌ద్గురువులు శ్రీ‌శ్రీ‌శ్రీ భార‌తీతీర్థ మ‌హాస్వాముల వారి దివ్యాశీస్సులు నిండుగా ల‌భించాల‌ని అభిల‌షిస్తూ నా ఆశీస్సులు అంద‌జేస్తున్నాను.

నేటి స‌మాజ‌ములో అన్యాయాలు అక్ర‌మాలు, హింస‌, మోసం, పెరిగి పోతున్నాయి. యువ‌త చెడుప‌ట్ల తేలిక‌గా ఆక‌ర్షింప‌బ‌డుతోంది. ఈ త‌రుణంలో, ఇటువంటి న‌వ‌ల‌ను, యువ‌త‌రం వారు చ‌దివితే, వారికి స‌నాత‌న ధ‌ర్మంప‌ట్ల ఆస‌క్తి, అనుర‌క్తి, ఉద్దీపింప‌చేయ‌బ‌డ‌తాయ‌నండంలో సందేహంలేదు. ఈ న‌వ‌ల‌ను క‌ళాశాల స్థాయిలో, ఉప‌వాచ‌క‌రూపంలో, పాఠ్యాంశంగా ఏర్పాటు చేయ‌డ‌ము మీద ప్ర‌భుత్వం దృష్టిపెడితే బాగుండున‌ని నా భావ‌న‌.

ఆదిశంక‌రులు విశ్వ‌వ్యాప్త‌మైన మ‌హానుభావులు. కాబ‌ట్టి ఈ న‌వ‌ల‌ను అన్ని భార‌తీయ భాష‌ల‌లోనికి అనువ‌దించి స‌మాజానికి అందించే ఏర్పాటు చేస్తే బాగుంటుంద‌ని నేను డా||శ్యామ‌లాదేవికి సూచిస్తున్నాను. ఈ న‌వ‌ల‌కు విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌నుట అతిశ‌యోక్తి కానేర‌దు.

ఇట్లు
ఆకెళ్ళ స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి
శ్రీ శృంగేరి శార‌దాపీఠ రాష్ట్ర ప్ర‌తినిధి