ప్ర‌వేశిక‌

శ్లో నారాయ‌ణ స‌మారంభాం శంక‌రాచార్య మ‌ధ్య‌మామ్ !
అస్మ‌దాచార్య‌ప‌ర్యంతాం వందే గ‌రుప‌రం ప‌రామ్ !!

శ్లో అజ్ఞానాం జాహ్న‌వీతీర్థం విద్యాతీర్థం వివేకినామ్‌
స‌ర్వేషాం సుఖ‌దం తీర్థం భార‌తీ తీర్థ మాశ్ర‌యే !!

శంభోర్మూర్తిశ్చ‌ర తిభువనే శంక‌రాచార్య‌రూపా సాక్షాత్ప‌ర‌మ‌శివుడే శంక‌రాచార్య రూపంతో భూలోకంలో చ‌రించుచున్నాడ‌ని త‌మ శంక‌ర విజ‌య కావ్యంలో చ‌తుర్వేద భాష్య‌క‌ర్త‌లు - స‌ర్వ‌తంత్ర స్వ‌తంత్రులు, స‌ర్వ‌జ్ఞ శ్రీ మాధ‌వ విద్యార‌ణ్యులు వ‌చించిరి. స‌మ‌గ్ర శంక‌ర‌చ‌రిత్ర శ్రీ మాధ‌వీయ శంక‌ర‌విజ‌య‌మందు అత్య‌ద్భుత‌ముగ - ర‌స‌వ‌త్త‌ర‌ముగ - య‌థార్థ విష‌య‌ముల వ‌ర్ణించి యుండిరి. కాని సంస్కృత భాషా ప్రావీణ్య‌ములేన‌ట్టి ఆస‌క్తికాంధ్ర‌ప్ర‌జ‌ల‌ను దృష్టియందుంచుకొని గురుభ‌క్తి ప్ర‌పూర్ణ‌య‌గు శ్రీ‌మ‌తి దిట్ట‌క‌వి శ్యామ‌లాదేవి ఎం.ఎ.,
పి.హెచ్‌.డి. గారు మాధ‌వీయ శంక‌ర‌విజ‌య‌మునంద‌లి చాలా విష‌య‌ముల న‌త్యంత సుల‌భ‌శైలితో కైలాసం నుండి కైలాసందాకా అనే పేరుతో భ‌గ‌వ‌త్పాద చ‌రిత్ర‌ను న‌వ‌లా రూపంలో ర‌చించుటేకాక ఈ గ్రంథ‌మును శ్రీ‌శృంగేరీ జ‌గ‌ద్గురు శ్రీ భార‌తీతీర్ధ మ‌హాస్వామి చ‌ర‌ణ స‌రోజ స‌న్నిధియందు స‌మ‌ర్పించుకొని ధ‌న్యులైరి.

శ్రీ‌మ‌తి శ్యామ‌లాదేవిగారి వ్రాత‌ప్ర‌తి నేను చూచిన‌పుడు గ్రంథ‌శీర్షిక కైలాసం నుండి కైలాసం దాకా అని ఉండ‌టం గ‌మ‌నించి ఔత్సుక్యంతో ఆసాంత‌ము ప‌రిశీలించితిని. ఆస్తికుల‌నుకొంద‌రు శంక‌రులు చాలా మేధావి. కాని అవ‌తార‌పురుషుల‌నుట అతిశ‌యోక్తి అని వితంత‌వాద‌మొన‌ర్చు ఈ క‌లికాలంలో శ్రుతి - పురాణ వాక్య ప‌ర్యాలోచ‌న చేసిన పెద్ద‌లంద‌రూ భ‌గ‌వ‌త్పాదులు సాక్షాచ్ఛివావ‌తార‌మేన‌ని నిశ్చ‌యించిన విష‌య‌మును గ్రంథ శీర్షిక ద్వారా విక‌ల్ప‌ర‌హిత‌ముగా చెప్పుటే గాక త‌మ‌దైన మృదుశైలితో పాఠ‌కుల‌కు భ‌గ‌వ‌త్పాద చ‌రిత్ర క‌న్నుల‌కు క‌ట్టిన‌ట్లు శ్రీ‌మ‌తి శ్యామాలాదేవిగారు వ్రాయ‌గ‌లుగుట‌కు జ‌గ‌ద్గుర్వ‌నుగ్ర‌హ‌మే కార‌ణ‌మ‌ని తోచుచున్న‌ది.

ర‌చ‌యిత్రి యొక్క కొన్ని మ‌నోజ్ఞ భావ‌ముల‌ను స్థాలీపులాక న్యాయానుసార‌ము చూపుచుంటిని. ఆయా స్థ‌ల‌ముల‌ను శ్ర‌ద్ధ‌గా ప‌ఠించండి. శ్రీ శంక‌రులు త‌ల్లి యొక్క పూర్ణాన‌దీ గ‌మ‌నాగ‌మ‌న శ్ర‌మ‌ను తగ్గించుట‌కుగాను స్వ‌గృహ స‌మీప‌మున‌కు మ‌హాన‌ద్యాక‌ర్ష‌ణ చేసిన సంద‌ర్భంలో మాతా పుత్ర సంభాష‌ణ అత్యంత స‌హ‌జ‌ముగ వ్రాయ‌బ‌డిన‌ది.

ఇట్లే కుమారుడ‌ల్పాయుష్కుడ‌ను విష‌య‌మును ఆర్యాంబ మ‌హార్షుల వల్ల విన్న ఘ‌ట్ట‌ము నావిష్క‌రించిన ప‌ద్ధ‌తి మిక్కిలి హృద్య‌ముగ‌నున్న‌ది.

భ‌గ‌వ‌త్పాదులు తురీయాశ్ర‌మానుజ్ఞ‌ను త‌ల్లి నుండి పొందిన విధ‌ము - మొస‌లి గ్ర‌హించుట‌లోని అంత‌రార్థ వివ‌ర‌ణ‌, ర‌చయిత్రి ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌న‌ము.

ఆర్యాంబ విష్ణులోక ప్రాప్తి, జ్ఞాతుల‌తో భ‌గ‌వ‌త్పాదులు ప‌లికిన నిష్ఠురోక్తులే వార‌ల‌కు శాప‌ముల‌గుట‌ను (ఇట్టి తీవ్ర విష‌య‌ముల‌నుగూడ‌) ల‌లిత‌ముగ నిరూపించిరి.

ప‌ర‌మ‌త ఖండ‌న ఘ‌ట్ట‌ముల నాయా మ‌త‌స్థులు చ‌విన‌పుడు ద్వేగ ద్వేష‌ములు క‌లుగ‌క - వార‌ల న‌ద్వైత మార్గ‌గాములుగా చేయున‌ట్లు యుక్తి యుక్త‌ముగ వ్రాయ‌బ‌డిన‌ది.

ఇక చివ‌ర భ‌గ‌వ‌త్సాదుల కైలాస గ‌మ‌న వ‌ర్ణ‌న మ‌కుటాయ‌మాన‌మైన‌ది.

ఇందు మాధ‌మీయ శంక‌ర విజ‌య‌మంద‌లి మండ‌న‌మిశ్ర శాస్త్రార్థ‌ము కొంత భాగ‌ము, భ‌ట్ట - భాస్క‌ర శాస్త్రార్థ‌ము సంపూర్ణ‌గ‌ను, ప‌ర‌కాయ ప్ర‌వేశ ఘ‌ట్ట‌ము సంపూర్ణ‌ముగ‌ను వ‌ద‌లివేయ‌బ‌డినప్ప‌టికీ ఆచార్య‌చ‌రిత్ర పాఠ‌కుల‌కుల‌కు సుగ‌మంగా ఉండ‌వ‌లెన‌ను భావ‌ముతో ఆయా ఘ‌ట్ట‌ముల వ‌ద‌లిన‌ట్లు నాకు తోచిన‌ది.

విజ్ఞానావ‌తారుల‌గు భ‌గ‌వ‌త్పాదుల చ‌రిత్ర‌ను సామాన్య ఆస్తిక జ‌నుల కందించాల‌నే ర‌చయిత్రిగారి సంక‌ల్ప‌ము సంపూర్ణ‌ముగా నెర‌వేరిన‌ది. ఈ గ్రంథ‌ము న‌శేష ప్ర‌జ‌లు ప‌ఠించి చ‌రిత్రను గ్ర‌హించి గురు దైవ‌భ‌క్తి ప్ర‌పూర్ణులు కాగ‌ల‌ర‌నియు శ్రీ‌మ‌తి శ్యామ‌లాదేవిగారిట్లే విద్యార‌ణ్యాది మ‌హాత్ముల చ‌రిత్ర‌ల‌ను గూడ వ్రాసి పాఠ‌కులకుప‌కార‌మొన‌ర్చ‌గ‌ల‌ర‌ని యాశించుచూ ప్ర‌వేశిక‌నింత‌టితో ముగించు చుంటిని.

ఇట్లు
శ్రీ శృంగేరి జ‌గ‌ద్గురు భ‌క్త ప‌ర‌మాణువు
ముదిగొండ శంక‌ర‌శ‌ర్మ‌
15.08.2006