వేంకటపతికంటే ముందు అతడు వేసిన బాణము దొంగలనాయకుని గుండెకు తాకి రక్తసిక్తమై క్రిందికి రాలినది. ఊహించని పరిణామానికి అతడు దిగ్భ్రాంతి చెందినాడు. బంధనమంత్రము అప్పుడే విడిపోవులకు లేదు ! మహామంత్రాన్నే త్రిప్పికొట్టగలిగినాడంటే, ఈతడు సామాన్యుడు కాడు! చిన్న దెబ్బయినా వేయకుండానే సంపద తనవెంట నడచి వస్తున్నదిని తాను సంబరపడుతున్నాడు, తనకు దక్కిన మహాగజాన్ని చూసుకొని మురిసిపోతున్నాడు. ఒక్క ఈ దిగ్గజం అన్నమాటేమిటి, మిగిలిన ఏనుగులు గుర్రాలు తమ భావిరాజ్య విస్తరణ యుధ్ధాల్లో ఉపయెగపడతవనుకున్నాడు. ఇంతకూ తన నాయకుడు చెప్పినదే నిజం. సంపద అంతా నీ చేతికి అందిచ్చి ప్రాణాలకొరకు కాళ్ళమీద పడినా, దయతలచవద్దు. మగవారిని ముక్కలుగా నరకి పొదలలోకి ఈడ్చిపారెయ్యి. వయసులో ఉన్న ఆడవారిని బంధించి తీసుకురా అని ఆదేశించి ఉన్నాడు తన నాయకుడు. తానే పోనీలెమ్మని దయతలచి కేవలం సంపదను దోచుకొని వారిని ప్రాణాలతో వదిలివేశాడు. వీడి మొహం, ఈ కుర్రడు యుద్ధమేం చేయగలడు ? ఆడపిల్లలా సున్నితంగా ఉన్నాడు. వీడికి ఒక్కవేటు చాలదూ ? నాయకుడు ఒరలోంచి కత్తిని తీయబోతుంగానే చెయ్య తెగి నేలమీద పడింది.
వేంకటపతి తనకత్తి కనపడకుండ చేసిన చక్ర సంక్రమణంలో నాయకుడు తనకు కలుగబోయే అపాయాన్ని గ్రహించుకోలేకపోయినాడు.
దొంగలనాయకుని చేయి తెగి క్రిందికి పడగానే అనుచరులందరూ భయంతో హాహాకారాలు చేసినారు. కొందరు, ఏమి జరిగిందో తెలియక అటూ ఇటూ పరుగులు తీశారు. వేంకటపతిరాజూ అన్నమరాజూ విజృంభించి దగ్గరగా ఉన్న వాళ్ళను కత్తులతోనూ దూరంగా ఉన్నవాళ్ళను బాణాలతోనూ గాయపరుస్తున్నారు. చికాకు పరుస్తున్నారు. నాయకుడు ఒక్క ఎడమ చేతితోనే మహాయుద్ధం చేస్తున్నాడు. ఒక ప్రక్కన ఒక చెయ్యి పోటుతో సలుపు పెడుతోంది. రక్తం మడుగులు కడుతోంది. అతడు క్రూరుడే, దారులు దోచే బందిపోటే, కాని మహావీరుడు అని అతని శౌర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు వేంకటపతి.
ఈ బక్కచిక్కిన చిన్ని కుర్రలను సంహరించలేకపోతే ఈ భుజబలమూ , ఈ శౌర్యమూ ఈ గుంపు నాయకత్వమూ ఎందుకన్నట్లుగా మహా పట్టుదలతో పోరాడుతున్నాడు, నాయకుడు. ఇలా మాటున ఉండి, మూకుమ్మడిగా వచ్చిపడి, దారులు దోస్తూ, అమాయకులైన యాత్రికులను హీంస పెట్టే ఈ గుంపుని నావనం చేయకపోతే, నాయనగారి దగ్గర నేర్చుకొన్న విద్యంతా వృథానే అనుకొని మరింత మెరుపు వేగంతో ఖడ్గ చంక్రమణం చేస్తున్నాడు వేంకటపతి. ఇరువురి ఖడ్గాలు ఖంగుఖంగున మ్రోగుతూ మెరుపుల్ని సృష్టిస్తున్నాయి. ఒకరికన్న ఒకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పెరవాడిని చిత్తు చేయాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
నాయకునిలో శక్తి క్షీణిస్తున్నట్లు అగుపడుతున్నది. అతడు తనకు తగిలే దెబ్బ నుండి తప్పించుకొంటున్నాడే తప్ప ఎదురుదెబ్బ తీయడానికి ప్రయత్నించలేకపోతున్నాడు. అతని దృష్టి నేలమీద తెగిపడిన తన కుడిచేతి మీద పడిందివ. అది రక్తంతో తడిసిపోయి, దుమ్ము ధూళి కమ్ముకొని ఉంది. వ్రేళ్ళకున్న వజ్రపుటుంగరాలు మట్టి కొట్టుకున్నా మెరవాలా వద్దా అన్నట్లుగా మిణుకుమిణుకు మంటున్నాయి. సరిగా అదే క్షణంలో వేంకటపతి చూపులు కూడా ఈ చేతిమీదికే మళ్ళినాయి. హు ! ఈ చెయ్యి ఎన్ని దోపిడీలు చేసిందో, ఎందరు అమాయకుల్ని హింసించిందో, ఎన్ని ఘోరకృత్యాల్ని చేసిందో ! ఆ రెండో చెయ్యికూడా మిగలకూడదు. దాన్ని భుజంవరకూ ఖండి స్తేనే కాని నాకు శాంతి కలగలదు అనే నిశ్ఛయంతో ఒక్క ఉదుటున ముందుకు పోబోయినాడు.
చెట్లచాటు నుండి బంతివంటి గుండ్రని వస్తువు రివ్వున దూసుకువచ్చి, పిడుగులాగ శబ్దం చేస్తూ విచ్చిపోయినది. బాబోయ్, అగ్ని పక్షులు ! అన్నయ్యా, వెనక్కి తిరుగు, అని అన్నమరాజు వెర్రికేక పెట్టినాడు. చెట్లమీద పక్షులు ప్రాణభయంతో ఒక్కసారి రెక్కలు టపటపలాడించుకొంటూ ఎగిరిపోయినవి. వెంటనే వాతావరణ మంతా నిశ్శబ్దంగా అయిపోయింది. దట్టంగా కమ్ముకొన్న పొగ కొద్దికొద్దిగా పలుచబడుతోంది. వేంకటపతి కనులు చించుకొని చూచాడు. ఎదుట దొంగలు లేరు. ఇంద్రద్యుమ్నుడు దూరంగా చెట్టుకింద నిలబడి చూస్తున్నాడు. అన్నమరాజు కూడా తేరుకున్నాడు. బండ్లలో ఉన్న స్త్రీలు బిగుసుకుపొయి ఉన్నారు. బండ్లవాళ్ళూ, సేవకులూ అటు ఇటూ పారిపోయి చెట్లచాటున నక్కి కూర్చున్నారు. అందరూ ఒకచోట చేరినారు.
వేంకటపతి మొదటగా నాయకుడి మొండిచేతికోసం వెదికాడు, ఇంత క్రితం అదిపడి ఉన్నచోట చూసాడు. లేదు. వాళ్ళు పట్టుకొనిపోయినారు. అక్కడికి కొద్ది మెల్లగా వొంగీ తీసి చూశాడు. ఒక ఉంగరం మీద ఏదో గుర్తు చెక్కబడి ఉంది. బహుశా ఆ ఉంగరం ముద్రగా ఉపయోగించేవారేమో ? గుర్తు ఏమిటో సరిగా తెలియకుండా రక్తంలో తడిసిన మట్టితో గడ్డకట్టుకొనిపోయి ఉంది. తమనుండి దొంగలించిన ధనమూ నగలూ అక్కడక్కడ చెల్లాచెదురుగా పడి ఉంటే సేవకులు ఏరి మూటలు కట్టుకొని వచ్చారు. |