అన్నయ్యా ! ఇప్పుడు నువ్వొక బాధలో కొట్టుకుని పోతున్నావు, అంతే వీని కులమేమిటో మనకు తెలియదు, సరికదా మతం కూడా మనది కాదు. ఇలాంటివాడికి అంత్య సంస్కారం చేస్తానంటావేమిటి ? నీకు మతి పోలేదు కదా !
నాయనా, నాకు మతిపోలేదు. ఆరోగ్యమూ బాగానే ఉంది. నాలో ఏవేవో కొత్త భావాలు వచ్చిపడ్తున్నాయి. ప్రాణమున్నట్లయితే కులమతాలుగాని ప్రాణంలేని కట్టెకు కులమతాలేమిటి ? మనిషిని మనిషిగా గౌరవించడం కంటె మించిన ధర్మం ఇంకొకటి ఉంటుందనుకోను. మానవుడిగా జన్మించాలంటే పూర్వజన్మ పుణ్యమెంతో కావాలంటారు. అలాంటి పుణ్య సంపాదనతోనే కదా ఇతడూ మనో బుద్ధ్యంతఃకరణాలు కల్గిన మనుష్య జన్మమెత్తినాడు. ఇతడిని కాకులకూ గ్రద్దలకూ ఆహారం కాకుండా చరమ సంస్కారం చెయ్యడం ఇతన్ని గౌనవించడం అవదు, ఇతడని సృష్టించిన భగవత్సంకల్పాన్ని గౌరవించడమే అవుతుందని నాకు గట్టిగా అనిపిస్తోంది.
అన్నయ్యా ! నువ్వు బాగా ఆలోచించుకో. ఇతడు అప్రాచ్యుడు. ఇంతసేపు మనం ఇక్కడ ఉండటమే చాలా తప్పు. ఇంక నువ్వు చెప్పినట్లు సంస్కారాదులు చేశావో మరింతగా మైలపడటం తప్ప కలిసి వచ్చేదేమీ ఉండదు.
వేంకటపతికి నవ్వు పొర్లుకొని పొర్లుకొని వచ్చింది.
అన్నమరాజూ ! నీలో నూటికి నూరుపాళ్ళూ బ్రాహ్మణరక్తమే ప్రవహిస్తోంది కాబట్టి నీకు మైలా మడీ ఉండవచ్చునుగాక ! కాని నాలో బ్రాహ్మణరక్తంలో పాటు ఇంకొక రక్తం కూడా ప్రవహిస్తోంది. నాకు కులం లేదు. ఇతడికి మతం లేదు. మేమిద్దరమూ ఒక్క మార్గంలో పయనిస్తున్న పక్షులమే. ఇతడు రక్తం పంచుకోకపోయినా ఏ క్షణాన ఆర్తిగా నా చేతిని అందుకొన్నాడో ఆ క్షణాన నాకు సోదరుడైనాడు. నా సోదరుని నేనిలా దిక్కులేనివానిలా చేసిపోలేను. ఇతనికి నేను సంస్కారం చేయడం నాకు నేను సంస్కారం చేసికొవడమే. నువ్వు ఈ తావు నుండి తప్పుకో. అమ్మ చూస్తే ఇబ్బందులు కలుగుతాయి.
అన్నమరాజు అన్న మాటలకు విన్నబోయినాడు.
నీకు సోదరుడైతే నాకు కాకుండా పోడుకదా ! నాన్నగారి రక్తం...కాదు ఆత్మ నీలోనూ నాలోనూ సమంగా ప్రకాశిస్తున్నా, నిన్ను నీవు ఎప్పుడూ కులం లేనివాడిని అని కించపరుచుకుంటావు. అందుకు నీది దోషం కాదు నీకు జరిగిన అవమానాలకు నువ్వు గనక తట్టుకున్నావు. అన్నయ్యా, నిన్నేగాక నీలోని సరస్వతిని కూడా గుర్తించలేని మూర్ఖుల చర్యలనున నువ్వు పట్టించుకోరాదని ఎన్ని మారులు చెప్పాను కానూ ?
తమ్ముడూ ! నేనంటే నీకింత ఆపేక్ష ఎందుకయ్యా ! చిన్నవాడివైనా నిన్ను చూస్తుంటే నాకు తండ్రిగారిని చూస్తున్నట్లే ఉంటుంది.
అన్నయ్యా ! నీవు మాత్రం ముమ్మూర్తులా నాన్నగారిలా ఉండవూ ? నీ పోలిక అంతా నాన్నగారిదే. నీలో క్షణం కోపం క్షణం ఆనందం, నీ స్వభావం కూడా నాన్నగారిదే. అంతెందుకు నీవు కౌగలించుకుంటే నాన్నగారు స్వర్గంనించి దిగి వచ్చారనిపిస్తూంటుంది, నాకు. మనం ఈ అనాధ ప్రేత సంస్కారాన్ని శివార్చనలాగా నిర్వర్తించాలి, మరి ! లే , అన్నయ్యా !
అన్నమరాజు మృతిని వెన్నుకు గ్రుచ్చుకొని ఉన్న కత్తిని బలవంతంగా లాగివేశాడు. వేంకటపతి అతడు కట్టుకొని ఉన్న తోలు పాదరక్షలనూ, నడుము పట్టకానీ తీసినాడు. అతని ఒరలో కత్తిక్రింద ఒక రహస్యపత్రం దొరికినది. ఇదేమిభాష ! అని వారు తబ్బిబ్బుపడినారు. సంస్కృత, ప్రాకృత, పాళీ, ఆంధ్ర భాషలలో ఇది ఏదీకాదని తెలుస్తూనే ఉంది, వారికి, మరేమిటయి ఉంటుంది ? సముద్రాల కావలనుండి, దూరప్రయాణాలు చేసి, మనదేశంలో వ్యాపారం చేసికొంటూ ధనార్జన చేసికొంటున్న పోర్చుగీసు వారి భాషో, డచ్చివారి భాషో, ఫ్రెంచివారి భాషో అయి వుంటుంది. రాజ్యాలకూ, రాజకీయాలకూ సంబంధించిన రహస్యవార్తలేమైనా కూడా దీనిలో నిక్షిప్తపరచి ఉంటారు. ఈతడు గూఢచారి కాడుకదా ! దీనిని తీసుకొని వెళ్ళి పరమ భద్రంగా దాచు. పూజా కుంకుమ పోసికొనే భరణికి క్రింద ఒక అర ఉంది. ఆ అరలో దీనిని దాచు, సందర్భము వచ్చినపుడు తీయవచ్చు. ఆ ఇవిగో ! ఈ ఉంగరాల్ని కూడా అక్కడే ఉంచు. అని వేంకటపతి అన్నమారాజుకు పత్రము ఉంగరములు ఇచ్చినాడు.
ఈనాడు వారి ప్రయాణములో ఒక భక్తబృందము వచ్చి చేరినది. వారి భాషను విన్న వేంకటపతి బృందమునకు హాస్యరసము కడుపారా త్రాగినంతగా అయింది. ఏమిటీ, మీరు నగళ్ళోకి పోవుచున్నారో ? అని వారు ప్రశ్నించేసరికి అన్నమరాజు, మాకు నగళ్ళూ లేవు తెగుళ్ళూ లేవు అన్నాడు నవ్వుకుంటూ. |