65
 

అన్న‌య్యా ! ఇది ప‌దిహేడ‌వ శ‌తాబ్ద‌ము. విక్ర‌మార్కుని కాలం కాదు.

రాజూ ! విక్ర‌మార్కుడిదాకా ఎందుకు ? మ‌న కృష్ణ‌దేవ‌రాయ‌ల‌వారిట్లే చేసినార‌ని మ‌న‌ము చ‌దివాము కామా ?

అవి క‌ట్టుక‌ధ‌లు. య‌దార్ధ‌ము వేరు వ్రాత‌లు వేరు. వ్రాసే స‌మ‌య‌ము వ‌చ్చేప్ప‌టికి అలంకారాలు అతిశ‌యోక్తులు త‌ప్ప‌వు. వాటంత‌ట అవే దొర్లుకుని పొర్లిపోయి వ‌స్తాయి. అన్న‌య్యా ! ఈ దిన‌ము నీకు ప‌ర‌ధ్యాన మెక్కువ‌గా ఉన్న‌ది. భోజ‌నానంత‌ర‌ము ర‌చ‌నా వ్యాసంగ‌ము ఉండేట‌ట్లా, లేన‌ట్లా ?

ఈనాటికి మ‌రిసాగేది లేదు. మ‌న‌ము గమ్య‌స్థాన‌ము చేరేలోపున సాంరంగ‌ధ‌ర‌ము పూర్తికాక మాన‌దు.

అవును. మ‌న ప్ర‌యాణం ప్రారంభించిన‌వాడు, శ్రీ‌కార‌ము చుట్టినప్పుడే ప్ర‌తిన ప‌ట్టావు క‌దా ! అప్పుడు ఇద‌మిద‌మ‌ని మ‌న‌గ‌మ్య‌ము నిర్ణింప‌క‌పోయినా ప్ర‌యాణం పూర్తి అయ్యేలోపుగా ఈ కావ్య‌ము పూర్తి చేస్తాన‌న్నావు.

పునఃప్ర‌తిన పూనుతున్నాను. మ‌న‌ము గ‌మ్య‌ము చేరువ‌లోపున యెన్ని అవాంత‌ర‌ములు వ‌చ్చినా కావ్య‌ము పూర్తి కాకుండ న‌గ‌ర‌మున అడుగు పెట్ట‌ను.

ఏన‌గ‌ర‌మున ?

ఏ న‌గ‌ర ల‌క్ష్మి మ‌న‌ల్ని ఆహ్వానించునో ఆ న‌గ‌ర‌మున‌.

రాత్రి భోజ‌నాది కాలు పూర్తి చేసికొని విశ్ర‌మించినాడు, వేంక‌ట‌ప‌తి త‌మ్ముడు ప్ర‌క్క‌నే చేరినాడు. పనివాళ్లు బండ్ల‌వాళ్ళు గడ్డి ప‌రుచుకొని గొంగ‌ళ్లు క‌ప్పుకొని ప‌డుకొన్నారు. స్త్రీల కొఱ‌కు మాత్ర‌ము, రెండు బండ్ల‌ను ఒక‌చోట చేర్చి, పైన తాటి ఆకుల‌తో అల్లిన వ‌ల‌ను ప‌ర‌చి, ఆ పైన ద‌ట్ట‌మైన దుప్ప‌ట్ట‌ముల‌ను క‌ప్పి, చిన్న గుడార‌మును ఏర్పాటు చేసినారు. సూర‌మాంబ పెద్ద‌వ‌య‌సైన స్త్రీ. ఆమె శరీరానికి మంచుగాలి, చ‌ల్ల‌ని గాలిగాని ప‌డ‌దు.

ఏనుగుల‌ను, గుఱ్ఱాల‌ను, ఎడ్ల‌ను దూరంగా క‌ట్టివేసినారు. న‌లుగు రైదుగురు కూర్చొని ఏరుకొచ్చిన ఎండుపుల్ల‌ల‌తో, ఆకుల‌తో మంటలు వేసికొంటున్నా. ఒక‌డు పాడ‌టం మొద‌లు పెట్టాడు. కొండ దీర్ఘాలు తీస్తూ పాడుతున్నాడు.

అయ్యో ఏమిసెప్పేన‌మ్మ మాయ‌మ్మా
రాములో రోరిది - ర‌త‌నాల గుండె
ర‌త‌నాల గుండేటి వ‌జిరాల మ‌న‌సు
పొడిసినా ఇర‌గ‌దు క‌రిసినా క‌రగ‌దు
ఎంత బాదొచ్చినా క‌న్నీరు రాదు || అయ్యో, అయ్య‌యో ||
బంగారు బొమ్మ మార‌మ‌ణి సీత‌మ్మ‌
నిండు బొజ్జాతోడ న‌డ‌లేని తల్లి
ఎండ‌లో చ‌న‌ముంటె కందిపోతాది || అయ్యో, అయ్య‌యో ||
ఏటి ఒడ్డూనున్న అడ‌వివ తానాకీ
అంపించినాడ‌మ్మ అయ్యె రామూడు
అమ్మ సీత‌మ్మ‌నీ అపించినాడు
నిండుమ‌ణిసిని అడ‌వి కంపించినాడు || అయ్యో, అయ్య‌యో ||

అన్న‌మారాజు : అన్న‌య్యా ! ఈ కుప్ప‌న్న పాట‌పాడ‌టం ఏలా ఉన్నా అయ్యో అని కొంద‌దీర్ఘం తీస్తూ శోక‌ర‌సాన్ని ఒలికిస్తూ ఉంటే గుండెకేదో చెప్ప‌లేని బాధ‌క‌లుగుతుంది. ఈ సీతారాముల క‌థ ఎన్ని మాట్లు విన్నా, విన్న‌ప్పుడ‌ల్లా నా హృద‌యం మెలిపెట్టిన‌ట్లు అనంత‌మైన వేద‌న క‌లుగుతుంది. అలా అని మ‌నం రామాయ‌ణాన్ని విన‌డం మానం, ఆనందంగా వింటాం, ఎందుచేత ?

వేంక‌ట‌ప‌తి : రాజూ ! ఇందుకు చాలా కార‌ణాలున్నాయి. మొద‌టిది, సృష్టిలో దుఃఖ‌మే ఎక్కువ‌గా ఉండ‌టం. రెండోది, అస‌లు రామాయ‌ణ ప్రారంభ‌మే శోకంకావ‌డం.

ఈ శోకం శ్లోకంగా మారింది క‌దా, ఇక‌ను, ఎవ‌రో దుఃఖించార‌ని మ‌నం వింటున్నాం అనుకో, వారి దుఃఖాన్ని మ‌న‌మూ అనుభ‌విస్తాము. సీతాదేవి ఎంతో దుఃఖ‌ప‌డింది. ఎలాగో జీవితాన్ని ముగింపు చేసుకుంది. అలాగే రాముడు కూడా ఆమె కోసం శోకిస్తూనే కాలం గ‌డిపాడు క‌దా. ఆ సీతారాముల దుఃఖాన్ని మ‌న‌మూ ఎందుక‌నుభ‌విస్తున్నామూ ? మ‌నం కావ్యాన్ని చ‌దువుతూనో నాట‌కం చూస్తూనో ఆ పాత్ర‌ల‌లో లీన‌మైపోతాం, వారే మ‌న‌మైపోతాం, వారి దుఃఖాన్నే మ‌న‌మూ అనుభ‌విస్తాం.

మ‌రి వారి సుఖాన్ని కూడా మ‌నం అనుభ‌వించ‌గ‌ల‌మా ? గంభీర‌మైన నూత‌న కంఠ‌ధ్వ‌ని తమ ప్ర‌క్క‌నుండే విన్న వెంక‌ట‌ప‌తీ అన్న‌మరాజూ ఉలిక్కిప‌డ్డారు. ఎవ‌రు ?