ముగ్గురు గల గల నవ్విరి.
అబ్బాయీ, చంద్రుడు కూడ గ్రుంకుతున్నాడు. మీకింకా నిద్దర్లు రావటం లేదా ? సూరమాంబ గుడామర నుండి చిన్న కేకవై చినది.
సైనికుడు : మిత్రమా, మరల రేపిదే సమయమునకు దర్శనము. అప్పుడు తప్పక సారంగధరమును వినిపించవలయును. మరి సెలవు.
వెంకటపతి : మిత్రమా, దర్శనము నీవు మాకిత్తువా మేము నీకీయవలెనా ? సెలవు లోని ధ్వనికూడ ఉభయార్ధకముగ ఉన్నది. నీవు కూడా కవివి కావుగాదా !
రామ ! రామ ! నాకు క్షణము తీరిక ఉండదు. రాజ్యమునకూ రాజులకూ సేవచేయుసరికీ కాలమగును. ఇక కవనము ---
మరి నీవు చర్చించిన దంతయు --
ఓ, ఆదా ! సజ్జన సహవాసము వలన కల్గినది.
సైనికుడు అశ్వము నెక్కువరకు ఉండి, అన్నదమ్ములు వెనుకకు తిరిగి వచ్చిరి. అన్నయ్యా, ఆ చోరులను ఈ సైనికుడు కనుగొన్నాడో లేదో చెప్పనేలేదు.
అవును. నాకూ తెలిసికోవలెననిపించినది. కాని ఈ సైనికుడు ఘటికుడు. ఇందులో ఏదో రాజరహస్యము ఉండియే తీరును. అందువలన మనకు చెప్పడు. మనమీతనికి నూతనులము కదా ?
మరి అంత ఆత్మీయంగా మాటాడుచున్నాడు గదా, మనపై నమ్మిక లేదా ?
ఇతడు చాల గుంభనకలవాడు. ఎట్టివాడైన మనకేమి ? ఆ దైవము పంపినట్లు వచ్చినాడు. రేపు మరలవత్తునన్నాడు కదా ? అప్పుడు మనుము ఏ నగరమున స్థిరపడవలయునో అతనితో చర్చించవలెనని అనుకొంటున్నాను. అతనిది మంచిమనసు. తప్పకుండ నాకు చక్కని తెరువు చూపగలడు.
రేపు మనం ఇదే తావున నిలువము కదా ?
లేదు లేదు, రేపు ఇందే ఉండవలెనని కుప్పన్న చెప్పినాడు. పశువులకు కొంత విశ్రాంతి కావలయునట.
సోదరులిరువురు సైనికుని కొఱకు ఎదురు చూస్తున్నారు. అల్లంత దూరంలో తెలివెన్నెలలో శ్వేతాశ్వము అగుపడుతున్నది. ఈనాడు సైనికుడు తెల్లగుఱ్ఱ మెక్కినట్లున్నాడు.
అన్నయ్యా, నాకీతనని చూస్తుంటే సైన్యంలో చేరి నేను కూడా మంచి గొప్ప వీరుడనవ్వాలని కోరిక పుడుతోంది.
రాజూ, మన తండ్రి నిన్ను మంచి వేదవేదాంగ వేత్తను చేయవలెనను కొన్నారు. నీవేమో క్షాత్ర ధర్మమవలంబించవలెనను కొనుచున్నావు.
వేదములు నేను పఠింపవలసినదే. కాదనను ఇంతవరకు చదివిన వేదముల వల్ల ప్రయోజనమేమిటో తెలియటంలేదు. మొన్న దొంగల గుంపు చుట్టుముట్టి మన సర్వస్వము దోచుకొని పోతున్నప్పుడు నేను నాకొచ్చిన మంత్రములన్నిటినీ పఠించినాను. అనేక దైవములను మనోవీధిలో నిలిపి కొని ప్రార్ధనలను చేసినాను. కాని ఒక్క మంత్రమూ ఫలితము నీయలేదు, ఒక్క దైవయూ కనికరించి మనలను రక్షించలేదు. నీవు నీ భుజశక్తి చూపి వారిని నిలువరించి వారి నాయకుని చేతిని ఖండించావు.
తమ్మూడూ, నీవు నాస్తికుడవు కాబోవుట లేదుకాదా ! ప్రతికార్యము దైవేచ్ఛతోనే జరుగుతుందను కోవాలి. నిజానికి నిర్విణ్ణుడనై, నిశ్చేష్ఠితుడనై నిలిచిపోయిన నేను, ఆదిత్య స్మరణము చేసిన తరువాతనే చలనవంతుడనైనాను, ధైర్యవంతుడనై నాను. దొంగల నాయకుడు సామాన్యుడు కాడు. వాని ఖడ్గ వేగమునకు కనులు బైర్లు కమ్మినవి. నాకున్న ఖడ్గ విద్య నిశ్చయముగ అతని విద్యకంటె తక్కువదే. అయినప్పటికి విజయలక్ష్మి మననే వరించినది. లేకపోయినచో నేను ఈ అరణ్యంలో భిక్షమడుగు కొన్నను గుప్పెడు మెతుకులు పెట్టే నాధుడుండేవాడుకాదు. ఇటువంటి జాబాలి మాటలు మరల నా చెవిని సోకనీయకు.
***** |