అన్నమరాజు వ్రాయుట నలిపివేసినాడు. మాటిమాటికీ అతని కన్నులు కన్నీటితో మసకలు గమ్ముతున్నాయి. ఉత్తరీయముతో తుడుచుకొంటుండగా ముమ్మారు వ్రాయుట ఆగిపోయినది. వేంకటపతి తన ధోరణిలో తాను కవనము అల్లుకొంటూ పోతున్నా, తాను మూడుసారులు ఆగిపోయినది అన్న గ్రహించలేదనీ, అతనికి పందెము మాట రవ్వంతైనా మదిలోలేదనీ తెలిసికొన్నాడు. ఇది నాల్గవసారి. ఈ సంగతి చెప్పి అన్న కవితా ప్రవాహాన్ని ఆపడానికి ఇష్టపడక మరల వ్రామ ప్రారంభించినాడు. వ్రాయలేకపోయిన తావులను పూరించడం తరువాత చూచుకోవచ్చును. మధ్యలో ఆటంకమవరాదు.
సారంగధరుని కాలుచేతులు ఖండించగా కూలిపోయినాడు.
తలవరులేగ లేగపులితండు ననెత్తుటి గౌలుకై హళీ
హళిమెయి రాగరాసిలయినట్టి వృకంబులు క్రొందొదల్ రొదల్
చిలుకుచు నీగ నీగలును జీమలదొంతరగాగబై పయిని
బిలపిలమూగ మూగవలె బెగ్గలిపల్కగలేక వేదనన్
తలారులు కూడ పారజాత కుసుమముల ప్రోవువలె సుకుమారుడైన ఆ రాజకుమారుని లేలేత బాహువులను ఖండించుటకు చేతులు రానప్పటికిని వలవల ఏడ్చుచు, రాజాజ్ఞను దాటలేక, కనులు మూసికొని, తెరచి, మూసికొని, మరల తెరచి ఏట్లో రక్తపుటేరులు పారునట్లుగ సారంగధరుని కాలుచేతులు ఖండించి, మరి వానిని చూచుటకు మనసురాక, పూర్వజన్మలోని దుష్కర్మంబున రాజకుమారునకీ దురవస్థ వాటిల్లినదని దుఃఖించుచు వెనుకకు మరలిరి.
తెగిన కాలు చేతులు నుండి రక్తము చివ్వుమని చిరుసవ్వడి చేయుచు వరదలై పారుచుండగా బాధనోర్చుకొనుటకు ప్రయత్నించుచు, సారంగధరుడు కొలది సేవు తండ్రిచిత్తమింత వివేకరహితముగా నున్నదేమని విచారించినాడు. కొంతసేపు స్త్రీలను నమ్మరాదనుకొన్నాడు. మరికొంత సేపు గతజన్మమున ఏమి చేసినానో ఇప్పటికీ యనుభవము అనుకొన్నాడు. కొంతసేపు తాళలేక భోరుమని ఏడ్చినాడు. కొంతసేపు శివుని ప్రార్ధించనాడు.
ఈ విధముగ మొండెమై రక్తపుబురదలో దొర్లు సారంగుధరుని ఒక సిద్ధుడు చూచి జాలిచెంది తన మహిమచేత పోయిన కాలు చేతులు యధాస్థికి వచ్చునట్లు చేసినాడు.
రాజనరేంద్రునకు కాలము మించిపోయిన తరువాత జ్ఞానప్రకాశమైనది. చింతించుచు వగచుచు వధ్యభూమికి వడివడిగ పోయినాడు. చిత్రాంగికి మరణశిక్ష విధించినాడు. వధ్యభూమిలో పుత్రుడు కానరాలేదు. కొంతకాలంమునకు సిద్ధుని మహిమవలన సంపూర్ణాంగుడై వచ్చిన పుత్రుని ఆనందముతో ఆలింగనము చేసికొననాడు.
అతనికి రాజ్యమన్నను ఇహ భోగములన్నను రోత కల్గినది. కాని, తండ్రినే ఏలుకొమ్మని చెప్పి, గురుపాదములను పూజించుకొనుటకుగాను వనములకు పోయినాడు, సారంగధరుడు.
సారంగధర చరిత్రము పూర్తియైనది. ఇరువురును మాట పలుక లేకుండ ఎవరి పనులనువారు అనాసక్తముగ పూర్తి గావించుకొన్నారు. మరల మరల ఆశోక
సాగరముననే మునకలెత్తుతున్నవి వారి మనస్సులు. ఇదేమి సృష్టి ! ఇవేమి కష్టములు !
మంచివారికి ఇన్ని కష్టములు కలుగుటేల ? దోషగుణములు ఉన్నప్పటికిని కొందరు సంతోషముగ కాలము గడపగల రెందుచేత ! సారంగధరుని వంటి
కల్మషరహితులిట్లు కష్టాల కడలిలో ఓలలాడవలసి వచ్చినదిదెందుచేత !
వేంకటపతి అన్నమరాజు చెరి ఒక చెట్టునీడన కూర్చొని యోచించు కొనుచున్నారు. వారి కనులు చూస్తున్నని, కాని ఎదుట ఏమి జరుగుచున్నదీ గమనించుటలేదు. వారి చెవులు వింటున్నవి, కాని వారికా సమీపమున వినవస్తున్న అశ్వపద ఘట్టనము వినరాలేదు. వారి కనులకు రక్తపుటేరులలో పొర్లు సుందర సుకుమార శరీరుడు సారంగ కుమారుడే గోచరిస్తున్నాడు. వారి చెవులకు పుత్రశోకముతో గోడుగోడున విలపించు రత్నాంగి దీనాలాపములే వినిపించుచున్నవి.
ఏమి ఈనాడు సోదరులిరువురకూ పొరపొచ్చములేమైన వచ్చినవా ? సైనికుని మాటలకు ఇరువురూ తటాలున లేచి నిలబడ్డారు.
సైనికా !ఇవ్వాళ ముందే వచ్చావు ? అనినాడు, వేంకటపతి. |