85
 

శుక‌వాణి చేతులు జోడించి, ర‌ఘునాథ‌కుమారుల వంక చూచిన‌ది. ప్ర‌భువుల క‌నుల‌లోనేదో భావ‌ము క‌ద‌లాడిన‌ది. ఈ చిన్ని బాలిక పోతూపోతూ త‌న కాత్మీయ‌మైన దానిని దేనినో కొనిపోతూ ఉన్న‌ది. ఇద‌మిద్ధ‌మ‌ని తెలియ‌రాన‌ట్లుగా హృద‌య‌ము వేద‌న‌కు లోన‌వుతూ ఉన్న‌దే ! ఆ క‌నుస‌న్న‌ల వెంట తానూ అనుస‌రించిపోవాల‌ని మ‌న‌సు ఉర‌కలు వేస్తున్న‌ది. ఈమెకు వ‌శీక‌ర‌ణ విద్య తెలియున‌ట్లే ఉన్న‌ది ! ర‌థ‌ము చెంత‌కు వెళ్ళుచున్న‌ది. క్ష‌ణ‌ములో క‌నుమ‌రుగు కావ‌చ్చును. ర‌థ‌మును పంపించివేసి ఆ బాల‌ను హృద‌యంలో దాచివేసుకొంటే ! ఈ స‌మ‌స్య‌లు, బాధ్య‌త‌లు, రాజ‌కీయాలు, యుద్ధాలు లేని మ‌రే తావుల‌కో రెక్క‌లు క‌ట్టుకొని తామిద్ద‌రూ ఎగిరిపోతే ? అని భావించినాడు యువ‌రాజు.

మూర్తెప్ప‌నాయ‌కులు అశ్వారోహ‌ణ‌మున‌కు సిధ్ధ‌ముగా నుండి కుమార్తె రాక‌కై ఎదురుచూచుచున్నారు. వారి చెంత‌న ఇరువురు సేనా నాయ‌కులు నిల‌బ‌డి చోళ‌గుడు అనే దేవికోట ద్వీపాధిప‌తిచేసే ఘోర‌కృత్య‌ముల‌ను గురించి ముచ్చ‌టించు చున్నారు. వాని క‌ర‌కుగుండెకు మేవాడ వాసుడెవ్వ‌డో ప‌ర‌మాక్రూరుడైన వాడొక‌డు త‌న తెలివిని సాయ‌ప‌రుస్తున్నాడ‌ట ! చోళ‌గున‌కు క్రౌర్య‌మేగాని బుద్ధిబ‌ల‌ము లేదు. వాని హీంసాత్మ‌క ప్ర‌వృత్తికి ఈ ఉత్త‌రాదివాని యుక్తులు తోడ‌గున‌ప్ప‌టికి ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతులై, రాత్రింబ‌వ‌ళ్ళు గ‌జ‌గ‌జ‌లాడి పోవుచున్నార‌ట !

మూర్తెప్పనాయ‌ని వారికీ మాట‌లు లీల‌గా విన్పించుచున్న‌వి. యుద్ధ‌మెట్లునూ త‌ప్పున‌ట్లు లేదు. ఈ మారు యుధ్ధ‌మే వ‌చ్చిన‌చో స్వ‌ల్ప‌మాంత్ర‌ముతో పోయేదిగా క‌న్పించుట లేదుజ శ‌త్రుకూట‌మంతా ఏక‌మ‌య్యేలా ఉంది. ఎక్క‌డే అన్యాయం జ‌రిగినా యువరాజుల‌కే కావాలి ! వారి హృద‌య‌ము చూస్తూ ఊరుకోలేదు. ఈ రాచ‌రికం యుద్ధాలు జ‌రుగ‌నంత‌కాల‌మూ ప‌ర‌మాహ్లాద‌క‌రంగానూ, ప‌ర‌మ ర‌మ‌ణీయంగానూ, మ‌హా విలాస‌పూరితంగానూ ఉంటుంది. ఎక్క‌డ ఏ చిన్న అశాంతిరేగినా, యుధ్దం త‌ప్ప‌ని పరిస్థితి ఏర్ప‌డినా చాలు, పాల‌కుల ప్రాణాల‌కు ముప్పు త‌ప్ప‌నిస‌రై తీరుతుంది. కాగా, రాజుల జీవితాలు స‌త‌త‌మూ దైవాధినాలు ! ఇంత‌కూ, త‌న క‌న్న‌బిడ్డ రాజ‌కుమారుల‌పై మ‌మ‌కారం పెంచుకొన్న‌ద‌నేగా త‌న‌కింత విచికిత్స ! తాను స్వ‌యంగా ఎన్ని యుద్ధాల్లో పాల్గొన‌లేదు ! ఎంద‌రు శ‌త్రువీరుల‌కు య‌మ‌తుల్యుడు కాలేదు !

ఎన్నిమారులు యువ‌రాజుల‌వారి ప్రాణాల‌కు త‌న ఖ‌డ్గ‌మ‌డ్డువేయ‌లేదు ! ఈనాడు ఈనాడు ఈ పాల‌కుడు త‌న కుమ‌ర్తె ప్రేమ‌కు పాత్రుడై నాడ‌ని తానెంతో భ‌య‌భ్రాంతుడ‌వుతున్నాడు ! అయినప్ప‌టికీ ర‌ఘునాథుల‌కు ప‌రాజ‌య‌మ‌న్న‌ది క‌ల‌గ‌ద‌ని దైవ‌జ్ఞుల వాక్కు.

మ‌హారాజు అచ్యుత నాయ‌నిం వారితోనూ, సోద‌రితోనూ చెంచుల‌క్ష్మి ర‌ఘునాథుల వివాహ‌ము గురించిన నిర్ణ‌యాల‌ను తీసుకోడానికి తాను విప్రుల‌తో క‌లిసి వ‌స్తున్నాన‌ని చెప్పినప్పుడు, అత‌ని సోద‌రి మూర్తిమాంబ ఎంతో సంబ‌ర‌ప‌డిన‌ది. అచ్యుతుల‌వారు బెదిరింపుగా, ఏమ‌య్యా, బావా ! నీ కొమ‌రిత‌తో బాటు ఏ సంస్థానాన్ని కానుక చేస్తావు ! అని మేల‌మాడినారు.

మీ రాచ‌బుద్ధిని ప్ర‌ద‌ర్శించుకున్నారుక‌దా ! అమ్మాయి త‌న హృద‌య సామ్రాజ్యాన్నే అబ్బాయికి అర్పించుకొన్న‌ద‌ని త‌మ్ముడు గారు చెప్తున్న‌దంతా వినికూడా ఏమి ప్ర‌శ్న వేశారు, స్వామీ ! అన్నారు మ‌హారాణీవారు.

దేవీ మీవంటిదే కాదూ, మీ మేన‌కోడ‌లు ! త‌న హృద‌యాన్న‌ర్పించిన‌దో లేదో కాని కుమార‌రాజావారి గుండెను మాత్రం కొల్ల‌గొట్టివేసిన‌ది నిజ‌ము. అమాత్యులు చెప్పారుక‌దా ! కేవ‌ల‌ము శుక‌వాణీ దేవిని రావించి ఆమెచేత క‌ళాసాధ‌న చేయించ‌డానికి మాత్ర‌మే ఇందిరామందిర నిర్మాణాన్ని సంక‌ల్పించానార‌ట‌, మీ పుత్ర‌ర‌త్న‌ము ! ఈ భ‌వ‌న నిర్మాణానికి ల‌క్ష‌లాది స్వ‌ర్ణ‌నిష్కాల‌ను వెచ్చించినార‌నిన్నీ మాకు కోశాధికారులు విన్న‌ప‌ములు చేసి యున్నారు. ఇక రాజ్య‌ము గ‌తి ఏమి కానున్న‌దో ! అచ్యుత నాయ‌నింవారి హాస్యోక్తుల‌కు మ‌హారాణీవారికి మ‌హ‌దానంద‌మైన‌ది మూర్తెప్ప నాయ‌నిం వారికి క‌డుపు నిండిపోయిన‌ది ర‌ఘునాధ యువ‌రాజుల హృద‌యాన చెంచుల‌క్ష్మికి ఇంత మ‌హోన్న‌త స్థాన‌ము ల‌భించినందుల‌కు అత‌డు పొంగిపోయినాడు.

శుక‌వాణి ర‌ధ‌ము సాగగానే మూర్తెప్ప నాయ‌నితోబాటు మ‌రి ప‌దిమంది అశ్వికులు ర‌ధ‌మున‌కు వెనుక‌ల‌ముందులుగా అనుస‌రించినారు.

అంతఃపుర బ‌హిర్ప్రాకార గ‌వాక్ష‌ము నుండి శుక‌వాణిని గొంపోవుచున్న ర‌ధ‌మును శూన్య‌దృక్కుల‌తో చూచుచు నిల‌బ‌డిన శ్రీ ర‌ఘునాథ‌నాయ‌క‌లు రెండు క్ష‌ణ‌ముల త‌రువాత త‌న తెల్ల‌గుఱ్ఱ‌మునెక్కి చంప‌క‌వ‌నాన‌కు బ‌య‌లుదేరినారు.