కళింగసీమల నుండి కొంకణ తీరమువరకూ గల సమస్త దక్షిణ భారతదేశ శబరకుటుంబాల వారందరూ నీలమ్మదేవి జాతరకు వచ్చి మ్రొక్కులను తీరుస్తారు. కొందరికి అమ్మవారిని సేవించుకోడానికేమైనా ఇబ్బందులు సంభవించినా నాయకులు మాత్రము విధిగ తీర్చవలసినదే !
ఈలాగున నిషాద నాయకులందర్నూ సంవత్సరమున కొక్కసారి సంబరాల మధ్యన సంతోషాతిరేకాన పరమమిత్రులై సంచరిస్తూ ఉంటారు. అందరూ ఒక తల్లికన్న అనుంగు బిడ్డలవలె ప్రేమాతిశయాలతో మసలుకొంటూ ఉంటారు. ఎక్కుక తక్కువ భావాలు వారికి కలుగవు. కష్టసుఖాలను కలబోనుకుంటారు. సమస్యలను విప్పి చెప్పుకొంటారు.
ఆనాడు నీలాలపున్నమి కానప్పటికినీ కప్పలదొర పిలుపునందుకొని దక్షిణావనినికల భిల్లనాయకులందరూ, వేటగాడు విసిరిన ఈటెలవలె, శీఘ్రగమనాన వచ్చిచేరినారు. నీలికొండలవలె కండలుదేరిన నల్లని దేహాలతో, కోరమీసాలతో, రంగురంగుల పక్షి ఈకలతో, తలపాగలతో, ఎర్రని కటివస్త్రంమీద చుట్టిన మృగచర్మాలతో, నొసటిపై మృగమదముగాని పచ్చివసుపుగాని మెత్తిదానిపై సూర్యబింబము వలె దిద్దిన కుంకుమతో, దీర్ఘబాహువులతో ధృఢకాయులై, పెద్దమానుల వలె నుండి భీతిని పుట్టిస్తూ ఉన్న ఆ కిరాతకులు స్వామిభక్తి పరాయణులు, తాము నమ్మిన ప్రభువునకు దాసానుదాసులు. దైవం కోసం కనులు సైతం పెరకి ఈయగల తిన్నళ్ళు. అంగుష్టాన్ని ఖండించి గురుదక్షిణగా సమర్పించగల ఏకలవ్యులు. ఎంగిలి పళ్ళను మహాభక్తితో భగవంతునకు నివేదనం చేయగల శబరీపుత్రులు, పులులు, సింహాలు, ఖడ్గమృగాలు. కాలకూట విషాలుగ్రక్కే సర్పాలు ఇట్టి వాటి మధ్య నిత్యమూ నిర్భయంగా జీవనాన్ని సాగించే వీరి బహిరాకృతులు, ఆ భయంకర జంతువుల లాగుననే మహాభీకరాలు కానివారి అంతరంగాలు అమృతభాండాలు !
అత్యంత విశ్వాసపాత్రులైన వీరిని చూస్తూ ఉంటే రఘునాధనాయనిం వారికి సముద్రాల కావల తన విజయకేతనం రెపరెపలాడుతూ ఉన్నట్లు మనో గోచరమైనది. భారతదేశానకు కేవలం వ్యాపారము కొఱకు వచ్చినవారు తమ పని తాము చూసుకొనిపోక, దేశీయ జీవనాలలో జోక్యం కలిగించుకుంటూ, రాజ్యాలకూ రాజ్యాలకూ మధ్య, చివరకు గ్రామాలకూ గ్రామాలకూ మధ్య కూడా విరోధం పెంచి పోరు కల్పిస్తూ, దొంగల దోపిడీకాండ్రతో చేతులు కలిపి ప్రజలనున హింసించి ధనధాన్యాదులను, పశువులను అపహరించుకొనిపోతూ, అడవులలోని వృక్ష జంతు సంపత్తులను నాశనం చేస్తూ, మొత్తం సమాజాన్నే కలుషితం చేస్తూ దేశవినాశనానికి పూనుకున్న విదేశీలయు రాక్షస చర్యలను అరికట్టవల్సిన సమయం అసన్నమైనదని నాయకులందరు ముక్త కంఠాన వ్యక్తపరిచినారు.
విదేశీయుల దురాగతాలు కుగ్రామాలలోనూ, కొండ చరియలలోని శబర గ్రామాలలోనూ మరింత భరించ శక్యంగాకుండా అవుతూ ఉన్నవి. వేగాన పరుగిడిపోయే లేళ్ళనూ పులులనూ వెంటాడి వేటాడి అలసిపోయి చెమటలు కారుస్తూ తాము బల్లేలతోనో, బాణాలతోనో, ఈటెలతోనో, కోలలతోనో వేటాడి చంపగలిగితే, ఈ విదేశీయులు అతి తేలికగా చిన్న తుపాకి గుండు దెబ్బతో మృగాలను మట్టుపెడుతున్నారు. ఇది మా అడవి, ఇది మా మెకము అని వారికి అడ్డుపడడం శక్యంకాదు. వారి తుపాకి గుండు ఈ మనుష్యుల గుండెలలో మాత్రము చొచ్చుకుపోదన్న నమ్మకము లేదు.
మన దేవతలను మనము పూజలు చేసుకొనరాదు, వారి దేవతలను కొలిస్తే ధనరాసులు ఇస్తాము అంటారు.లేకుంటే ప్రాణాలు తీస్తాము అంటారు. దిండివన నాయకుని మాటలకు అందరి మనసులలో నీలమ్మతల్లి దీనవదనంతో ఉన్నట్లు గోచరించినది.
ఈ ఏడు నీలమ్మ పండగ జరిగేనా ? అందరి మదిలోనూ ఒకే ప్రశ్న !
కప్పలదొర ఉరము కోపశౌర్యాలతో పొంగి రుధిరం కన్నులలోనికి తన్నుకొచ్చినది. క్రూరముగా నవ్వినాడు.
ఈ ఏడు తల్లి జంతువుల రక్తంతో స్నానమాడదు. ఆ క్రూర మానవుల తలల నుండి పాతాళగంగ పైకి ఉబికినట్లు, రక్తం చివ్వుమని ఉరకలెత్తుకు రావాలి. అప్పుడు అమ్మ నాలుక ఆ రక్తంతో తృప్తిపడాలి. అతని కంఠాన ప్రళయ గర్జనలు ప్రతిధ్వనించినవి. |