తొలి ప‌లుకు

విశ్వ‌నాధ‌వారి న‌వ‌ల‌లో ఆధ్యాత్మిక‌, ధార్మిక‌, నైతిక‌, సాస్కృతిక దృక్ప‌థాల్లో గ‌ల విభ‌న్న ధ‌ర్మాల‌ను, నిశిత‌దృష్టితో పరిశీలించి, స్త్రీ పాత్ర‌ల‌లో ప్ర‌తీక‌ల రూప‌మున వ్య‌క్త‌మ‌వుతూ ఉన్న ధ‌ర్మ‌ముల విశ్లేష‌ణ‌ను అతి ప్ర‌శంస‌నీయంగా నిర్వ‌ర్తించి, శ్రీమ‌తి దిట్ట‌క‌వి శ్యామలాదేవి, విశ్వ‌నాధ వారి న‌వ‌ల‌ల్లో ముఖ్య స్త్రీ పాత్ర చిత్ర‌ణ‌ము అనే సిద్ధాంత వ్యాసాన్ని వ్రాసి, ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం నుండి, పిహెచ్‌.డి డిగ్రీని పొందినారు.

ర‌ఘునాధ‌నాయ‌కుడు తంజావూరు రాజు, వీరుడు బ‌హుభాషా కోవిదుడు, మ‌ధుర‌క‌వి, నాట్య సంగీత శాస్త్రాల‌లో ద్ర‌ష్ట మ‌ధుర‌వాణి, ఈత‌ని ఆస్థాన క‌వ‌యిత్రి, క‌న‌కాభిషేక‌ము చేయించుకొన్న దిట్ట‌, సంస్కృత‌, ప్రాకృతం, తెలుగు మున్న‌గు ఎనిమిది భాష‌ల‌లో ప్ర‌వీణురాలు, నాట్య‌ము, సంగీత‌ము క్షుణ్ణంగా ఎరిగిన క‌ళావేత్త్రి. ఇవీ చరిత్ర‌కారులు సేక‌రించిన విష‌యాలు. ఆమో పుట్టుపూర్వోత్త‌రాల విశేషాలు ఏమీ తెలియ‌వు.

ర‌ఘ‌నాథ‌నాయ‌కుని మేన‌మామ మూర్త‌ప్ప నాయ‌కుడు. ఈత‌ని భోగ‌ప‌త్ని మ‌ర‌క‌త‌వల్లి. వీరి పుత్రిక‌యే మ‌ధుర‌వాణి. ఈ బావామ‌ర‌దళ్ళ విద్యావిజ్ఞాన‌ము క‌ళ‌ల్లో ప్రావీణ్య‌ము, అంద‌చందాలు ఒకరిని మించిన‌వి ఒక‌రివి. వీరిరువురి ప్ర‌ణ‌యానికి, ప‌రిణ‌యానికి అనువైన ముచ్చ‌టైన రంగం సిద్ధం చేశారు, శ్రీ అడ‌వి బాపిరాజు. ఇంత‌లో వారి మ‌ర‌ణంతో వారి ర‌చ‌న‌కు శాశ్వ‌తంగా అంత‌రాయం క‌లిగింది.

ర‌ఘునాథ‌నాయ‌కుడు మధుర‌వాణిని శాస్త్ర‌రీత్యా, ధ‌ర్మ‌బ‌ద్ధంగా పెళ్ళాడ‌టానికి గాని, భోగ‌ప‌త్న‌గా స్వీక‌రించ‌డానికిగాని, సంఘంగాని ఆచారంగాని అడ్డు చెప్ప‌వు. వారి ప‌రిణ‌యం ఆగిపోయింది. ప్ర‌ణ‌యం మ‌న‌స్సుల‌కూ, హృద‌యాల‌కూ సంబంధించిన‌ది, వారిరువురిలో అణువ‌ణువునా నిండి వున్న‌ది. ఇది కేవ‌లం శ‌రీర లావ‌ణ్య జ‌నితం కాదు, మిక్కిలి స్వ‌చ్ఛ‌మైన‌ది. లోతైన‌ది, నిరంత‌రాయంగా సాగిన‌ది. ప్ర‌ణ‌య‌మూ, క‌విత్వ‌మూ, క‌ళ‌లూ వారి బ్ర‌తుక‌లే అయ్యాయి. ఇలాగ‌. డాక్ట‌రు శ్యామాలాదేవి మ‌ధుర‌వాణి ర‌ఘునాధుల పాత్ర‌ల‌ని మ‌ల‌చి పోషించిన‌ విధం అబ్బురం, అన‌న్యం. క్లిష్ట‌మైన ఈ న‌వ‌లాపూర‌ణ నేర్పుతో, సొంపుగా నిర్వ‌హించారెమె.

దాదాపు ముప్ప‌దియేడు వ‌త్స‌రాల క్రితం శ్రీ అడివి బాపిరాజు ఆరంభించిన చ‌రిత్రాత్మ‌క న‌వ‌ల‌, మ‌ధుర‌వాణి ఇప్పుడు డాక్ట‌రు శ్యామాలాదేవి పూర‌ణ‌తో చ‌రితార్ధిక  న‌వ‌ల అయింది.

7 జూలై 1987 బుద్ధ‌వ‌ర‌పు కామ‌రాజు
హైద్రాబాదు.