కోపల్లి హనుమంతరావు బాపిరాజును బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాల ప్రిన్సిపాల్ పదవికి ఆహ్వానించారు. డాక్టర్ భోగరాజు పట్టాహిసీతారామయ్య ఆనందించారు. ముట్నూరి కృష్ణారావు ఆశీర్వదించారు. బాపిరాజు 1935-38 సంవత్సరాల్లో ఆంధ్ర జాతీయ కళాశాలను గురకులంలాగ నిర్వహించారు. కాటూరి వెంకటేశ్వరరావు ఆయనతో కలిసి కళాశాలలో పని చేశారు. వారిద్దరకు కృష్ణార్జునుల వంటి స్నేహం. కాటూరి బాపిరాజుకు పొగాకు చుట్టలు నేర్పారు, బాపిరాజు కాటూరికి సిగరెట్లు నేర్పలేకపోయారు.
1938లో బందరులో పెద్ద తుఫాను వచ్చింది. బాపిరాజు కళాశాల భవనాన్నీ, ఆవరణను తుఫాను బాధితుల శిబిరం చేశారు. ఒ నెల్లాళ్లపాటు మనుషులూ, మేకలూ ఆ శిబిరంలోనే సుఖనివాసం. ఇంత కారుణ్యం కూడదన్నారు కొందరు.
బాపిరాజు చిరువోలు వెంకట కృష్ణయ్యగారు ఫామిలీ ఫ్రెండ్స్. బాపిరాజు కుమార్తెలు రాధావసంత, ప్రేమకుమారి వారి పెంపుడు చిలకా కృష్ణయ్యగారి కుమార్తెలు కమలాదేవి, విమలాదేవి తరుచుగా కృష్ణయ్యగారింట కాలక్షేపం కబుర్లాడుకొనేవారు. కృష్ణయ్య గారి పెద్ద కూతురు కమలాదేవి, నా శ్రీమతి. మామయ్యా మామగారూ లంక పొగాకు చుట్టల చుట్టాలుకూడానూ ! బాపిరాజుకు మమతలను పెంపొందించడం తెలుసు.
ముట్నూరి కృష్ణారావు కృష్ణాపత్రిక నడిపేవారు. ఆయన ఆఫీసులో దర్బారు తీర్చేవారు. ఇందులో బాపిరాజు ప్రముఖులు. సాహిత్యము. కళలు, సమాజము, రాజకీయము, ఒక టేమిటి ఏన్నో విషయాలమీద, దర్బారు లో గోష్ఠులు, చర్చలు జరిగేవి. యే సభకైనా ప్రేక్షకులు ముఖ్యావసరం దర్బారు లో నేనూ ఒక ప్రేక్షకుణ్ణి.
1935లో సి.పుల్లయ్య పిల్లలచేత వేషాలు వేయించి, సతీ అనసూయ ధృవవిజయం అనే కవల సినీమా, కలకత్తాలో తీశారు. ఇది బాల బాలికల తొలిచిత్రం. దీనికి బాపిరాజు ఆర్టు డైరెక్టరు. తెలుగు సినీమాల్లో ప్రధమ అర్ట్ డైరెక్టరు ఆయనే. సతీ అనసూయ ధృవవిజయం లో కైలాసం సెట్టు ఉత్కృష్టమైన కళాఖండం. ఇట్టిది న భూతో న భవిష్యతి. కైలాసం సెట్టుకట్టారు. కప్పుకి కొయ్య జల్లెడ వేలగట్టారు. దాంట్లో ఫ్రెంచి చాక్‌పౌడరు బస్తాలకొద్దీ అద్దారు. ఘూటింగు ఆరంభంకాగానే జల్లెడను అటూ ఇటూ నెమ్మదిగా కదిపి, పౌడరు జారిపటేట్లా చేశారు. కైలాసం మీద మంచుడుతున్నట్లు చూపడానికి ఫ్రెంచి చాక్‌పౌడర్ సహజంగా ఉంటుందని బాపిరాజు కనుగొన్నారు. ఆ సెట్టులో పాత్రలు నడుస్తూంటే, నిజంగా కైలాసం నుండే దిగివస్తున్నారా అన్నట్లున్నది.
ఇదే సినిమాలో ఒక సీను. అనసూయ సతీత్వానికి పరీక్ష జరుగుతుంది. పరీక్షకులు త్రిమూర్తులు. ఆమెను పూర్తిగా వివస్త్ర అయి అన్నం వడ్డించమని కోరారు. అనసూయ పాత్రధారిణి పూర్తి నగ్నంగానే నటించాలన్నారు. బాపిరాజు ఉపామున్నూ చెప్పారు. కథలో చెప్పినట్లు, త్రిమూర్తులు మూడేళ్ళ పసిపిల్లలుగా మారినారు. అనసేయ పూర్తిగా నగ్నం అయి, తన బారెడు జుట్టు విరబోసుకుని, మోకాళ్ళ వరకు శరీరాన్ని కప్పుకొని పసివాళ్ళకు అన్నం తినిపించింది. ఈ సీనులో అసహజతలేదు. అసభ్యతలేదు. అనసూయ సతీత్వ పరీక్ష నెగ్గింది. ఈ సీను బాపిరాజు ప్రజ్ఞకు మచ్చుతునక.
1939-40 ప్రాంతంలో చిత్రపు నరసింహరావు. మద్రాసులో మీరాబాయి సినీమా తాశారు. దీనికి బాపిరాజు ఆర్టు డైరక్టరుగా పనిచేశారు. ఈ సినీమాలో వైష్ణవాలయం సెట్టు, రాజగురువు గండకత్తెర వేసుకొనే శివాలయం సెట్టు ఇవి కూడా న భూతో న భవిష్యతి.
ఆర్టు డైరెక్టన్ అంటే ఏమిటో అడివి బాపిరాజు చేసి చూపించారు. అయితే, ఆ అర్టుకు అయ్యే అర్థ బలం చాలక ప్రొడ్యూసర్లు ఇబ్బందిపడ్డారు. భయపడ్డారు. కమర్షియల్ ఆర్టుతో కాస్త రంగరించి, కళను కల్తీ చేయడానికి బాపిరాజు ఒప్పలేదు కమర్షియల్ ఆర్టుతో కలిస్తే కళ కళంకమవుతుందని ఆయన భావించారు. వ్యధపడ్డారు. అసలు సినీమా రంగానికే గుడ్‌బై చెప్పేశారు.
మా మామయ్యకు అక్క క్రొవ్విడి శేషమ్మ, పెద్ద చెల్లెలు బుద్ధవరపు శేషమ్మ, రెండో చెల్లెలు కత్తివెంటి శేషమ్మ తమ్ముడు సత్యనారాయణ, మూడవ చెల్లెలు కామర్సు భోగావతి, నాలుగో చెల్లెలు తాడికొండ అచ్చమాంబ. తండ్రి కృష్ణయ్యగారు తెగ సంపాదించారు. పిల్లలకు చదువులు చెప్పించారు. పెళ్ళిళ్ళు చేశారు. ఇద్దరు కొడుకులకు 40 ఎకరాల మాగాణి, 50 సెంట్లలో పెద్దమండువా పెంకుటిల్లు ఇచ్చారు. ఏ పండక్కో ఫంక్షన్ కో మామయ్య, ఇంట్లో మేము యావన్మందిమీ చేరినప్పుడు, చిన్న రైలుస్టేషనులో ఉన్నట్లనిపించేది. మామయ్య మహోత్సాహం, కేరింతలు, అల్లరి, హాస్యాలు, ఆప్యాయతలు, అనురాగాలు, పాటల వెల్లువలు, ఇడియట్ విత్ డబుల్ డి అంటూ సరదా మందలింపులు, ఎంతో హడావిడి, వరలక్ష్మీ, వినాయకుడూ ఇంటోనే వెలిసినట్లు కలౄమూర్తులను తయారు చేసేవాడు. పూజలకు చిన్న సైజు సినీమా సెట్లు వేసేవాడు. మా నాన్నగారు పాతికేళ్ళ వయసులో యూనిఫారమ్ వేసుకొని ఉన్నప్పుడు, మా అమ్మ ఇరవై సంవత్సరాల వయస్సప్పుడు నాకు అయిదు మా తమ్ముడికి మూడుళ్ళు వయస్సప్పుడు, మావి జల వర్ణ చిత్రాలు వేశాడు. అద్దంలో చూచుకొంటూ తన చిత్రం తానే వేసుకొన్నాడు. ఈ చిత్రం మామయ్య ఇంట్లో ఉంది.
మామయ్య చిన్నప్పుడు ఎర్రగా, సన్నగా, పొడుగ్గా ఉన్నాడు పెద్దప్పుడు చామన చాయగా, కొంచెం బొద్దుగా, కుదిమట్టంగా ఉన్నాడు. వెనక్కి దువ్విన జుట్టు కాంతివంతమైన చిన్నకళ్ళు, మందహాసం, మహోల్లాసం, ఇవి ఏవీ మారలేదు. ఆయన బోళామనిషి. అమాయకుడు ఆయన డబ్బు పుస్తకాలు, గేయాలు, కధలు చిత్రాలు, అబద్ధాలు చెప్పి ఊరికే కొట్టేసిన వాళ్ళున్నారు. ఇచ్చి, తిరిగి పుచ్చుకొని లేదన్న ప్రబుద్ధలున్నారు. ఇవ్వందే ఇచ్చామని చెప్పిన తుచ్ఛులున్నారు. బాపిరాజు వీరందరినీ బాగా ఎరుగును. ఆయన అలవాటు చిరునవ్వునవ్వి ఊరుకునే వారు. అందుకే ఆయనకు శత్రువులు లేరు. అందరూ మిత్రులే. ఆయన ఒక్కొక్కరికి అన్న, తమ్ముడు, బావ, మామయ్య.
బాపిరాజుకు పిల్లలంటే మహామహా ఇష్టం. ఆయన ఆడదానికన్నా బాగా లాలించేవారు. జోలపాటలు పాడేవాడు. బట్టలు పాడుచేసుకుంటే మార్చేవాడు. చీమిడి తీసేవాడు. ఎత్తుకు మోసేవాడు. ఏ వయసు పిల్లలైనా ఫర్వాలేదు, ఎవరి పిల్లలైనా ఫర్వాలేదు.
బాపిరాజు ముగ్గురు మగపిల్లలు శిశుదశలోనే దక్కకుండా పోయారు. పెద్దకూతురు, రాధావసంత పసి వయసులోనే పోలియో మైలయిటిస్ వచ్చి, రెండు కాళ్ళూ పడిపోయాయి. ఆయన భార్య సుభద్ర నెర్వస్ డెబిలిటి పాల్పడి, చచ్చిపోతాననే ఫియర్ కాంప్లెక్సుతో ఆయనకు భరించరాని వ్యధ కలిగించింది. ఆయన కుటుంబం చిన్నదే అయినా, పరిస్థితులు మాత్రం పెద్ద వ్యధనే జీవితాంతం, తెచ్చిపెట్టాయి. అయినా ఆయన ఎప్పుడూ క్రుంగిపోలేదు. ధైర్యాన్ని ఉల్లాసాన్ని వదల్లేదు. కాగా, ఆయన భార్య బిడ్డలకు కొంత ధైర్యాన్ని గోదావరంత ఉత్సాహాన్నీ కల్పించారు.
బాపిరాజు వస్తూంటే ఆనందోత్సోహ పరిమళాలు తెరలు తెరలుగా ముందు వచ్చేవి. ఎంత పెద్ద సభ అయినా, ఎంత చిన్న సమావేశమైనా ఆయన సమాన ఉత్సాహంతో పాల్గొనేవారు. ఏ అంశం మీదనైనా వినేవాళ్ళకు విసుగు పుట్టకుండా, ఛలోక్తులతో, పాటలతో, గంటల తరబడి, పుష్టిగల ఉపన్యాసం ఇవ్వగల వక్త ఆయన.
గట్టుమీదపోయే చిన్నాదానా
కాలు కురచా పడుచూదానా
కమ్మలిస్తా వస్తావంటోలే,
కాళింది కిణి కిణి ఠుణక ఠుణకని
కమ్మిలస్తావంటావోలే అంటూ ఆయన పాతపాట విసిరితే, అది సభమీద సమ్మోహనాస్త్రమేఅయ్యేది.
పల్నాడూ కలకంటావా, పారకిస్తూ పడమటి దిక్కూ
బోనులోనే కుంగేవకొడకా, పుచ్చేవానిట్టూరొప్పకటీ
ఓ పలనాటి పలామందా కలవరిస్తావా జైలుకోటల్లో అంటూంటే,
పరాయి పాలకులమీద ఒళ్ళుమండి పోయేది.
హుంకరించిన, దెశలు ఊగపోయేను
ఖురముతో దువ్వితే కులగిరులు వణికేను
లేపాక్షి బసవయ్య లేచిరావయ్య !
కైలాస శిఖరిలా కదిలిరావయ్యా ! అంటూంటే బసవయ్య ప్రక్కకు వచ్చినట్లు దడపుట్టేది.
నరమానవుని పనులు శిరమొగ్గివణికాయి
తరమెత్తి దీవించి కడలికే నడిచింది
ఉప్పొంగిపోయింది గోదావరీ, తాను
తెప్పున్న ఏగిసింది గోదావరీ,
అంటూంటే, గోదావరి తల్లి ఆశీస్సులిస్తున్నట్లనిపించేది.
ఆయన గొంతు ఇంపుగా ఉండేది. పాటసొంపుగా ఉండేది. మధ్య మధ్య ముఖం మీద పడే జట్టు పైకి ఎగదోసుకుంటూ ఉండడం ఆయన అలవాటుగా ఉండేది సభికులు ముగ్ధులై చిత్తరువులే అయ్యేవారు.
|