ఈ నవలల్లో అధికం పత్రికాముఖమున ధారావాహికంగా వెలువడి అనంతదళలో గ్రంథరూపమున ప్రకటింపబడినవి. హైదరాబాదు నుండి మూడు భాషల్లో ప్రచురింపబడిన మీజాన్ పత్రికలో హిమబిందు గోనగన్నారెడ్డి వంటి నవలలు వరుసగా వచ్చినవి. బాపిరాజు తెలుగు మీజాన్ పత్రికలో పత్రికా సంపాదకులుగా దాదాపు మూడేండ్లు నిర్వహించటం దాదాపు కత్తిమీద సాము చేసినట్లైనది. హైద్రాబాదు రాష్ట్ర చరిత్రలో అవి గడ్డుదినాలు. బాపిరాజు జాతీయవాది, కాంగ్రెసు జాతీయోద్యమములో పాల్గొని, గాంధేయాభిమానాన్ని అక్షరాలా చాటినవాడు. మీజాన్ పత్రికలో పత్రికాధిపతుల అదేశాలను పాటించటం, సన్నిహితులు, మిత్రులు జాతీయాభిమానులు మొదలైనవారికి కష్టమే కలిగించింది. అవకాశమున్నంత వరకూ, బాపిరాజు తన వ్యక్తిత్వానికి కళంకం రాకుండా వర్తించారు. సంపాదకీయ వ్యాసాలు బాపిరాజు బహుముఖ ప్రజ్ఞను, వివిధ సమస్యల అవగాహనను చురుగ్గా నిరూపించినవి. వచన రచనలో, సంపాదకీయ రచనలో, వివిధాంశాలపై రచించిన వ్యాసాలలో బాపిరాజు మంచి వ్యాసకర్తగా పేరొందినాడు. ఇవి ఇంకా సహృదయలోకానికి వెల్లడి కావలసి ఉన్నవి.
ఆధునికాంధ్ర కవితామందారాన బాపిరాజు భావ కవితా రీతిని. కులపాలికా ప్రణయాన్ని ఆరాధించినారు. ఆయన ఉసాస్యదైవం ఎన్నో కళలతో, ఊహా సుందరిగా కళాధిదేవతగా సాక్షాత్కరించింది. భావకవితారంగంలో ఆయన శశికళ అపూర్వసృష్టి. ఈ కావ్యము ఇతరత్రా అప్పుడప్పుడు వ్రాసిన గేయ ఖండికలు బాపిరాజు కళాత్మక హృదయాన్ని జీర్ణించు కొన్నవి. ఆయనకు గేయకవిగా పట్టము కట్టినవి. లేపాక్షి బసమయ్య లేచి రావయ్యా అని పాడినపుడు భక్తులు హృదయ ద్వారములను తెరిచి బసవయ్య నాశశ్వసించినట్లే ఉన్నది. లేపాక్షి బసమయ్య లేచి వచ్చునట్టి స్థితిలో వున్న విషయము లేపాక్షిలో బసవయ్యను దర్శించినవారికి తెలిసిన విషయమే. ఆగాధమైన హృదయ సముద్రంలో భావతరంగాలు పరవళ్ళు తొక్కుతుంటే ఎదుట ఉప్పొంగిపోతున్న గోదావరిని చూచి, ఉప్పొంగి పోయింది గోదావరీ అని ఆవేశపూరితులై గంతులు వేస్తూ పాడినారు.
బాపిరాజు ప్రణయ చిత్రణలో అందులోనూ కులపాలికా ప్రణయ చిత్రణలో బాపిరాజు ఆధునిక భావ కవులలో భవ్యస్థానాన్ని అలంకరించినారు. బాపిరాజు లఘుకృతులలో గేయనాటికలు, సంగీత రూపకములు, నృత్యగీత సంగీతకళా రహస్యాలకు ప్రతీకలు. ఏమి వ్రాసినా ఎటువంటి ప్రక్రియా చేపట్టినా బాపిరాజు తన కళాత్మక హృదయాన్ని పిండిరమ్యాతిరమ్యంగా దర్శింపజేసినాడు. ఆధునిక గేయ కర్తలలో ఈ విశిష్టగుణం కలవాళ్ళు ఒకరిద్దరు మాత్రమే. వారిలో బాపిరాజుకే అగ్రతాంబూలం ఇవ్వవచ్చు.
పాశ్చాత్య విమర్శకులు కవి విమర్శకుడు కావచ్చా ? విమర్శకుడు కవి కావచ్చా ? అయినచో ఆ స్థితి ఏవిధంగా ఉంటుంది ? అని నానావిధాలుగా తర్జన భర్జనలు చేసినారు. వంట వచ్చినవాడు, వంటరానివాడు పదార్థాలు రుచి చూచినప్పుడు రుచిని గ్రహించి చెప్పడంతో ఎంతో తేడా వుండవచ్చు. కుర్చీచేయడం చేతకాకున్నా, వడ్రంగి చేసిన దానిలోని ఆందాన్ని లేదా వికారాన్ని గుర్తింపవచ్చు. ఇవి అన్నీ అలంకారశాస్త్రంలో, శాస్త్ర మర్యాదలలో పరిశీలనకు వచ్చి చర్చింపబడినది. దానికి ఇప్పుడు చెప్పబోయే విషయానికి పోలిక సామ్యం లేకపోవచ్చుగాని తత్త్వంలో కొంత సాన్నిహిత్యము గోచరిస్తున్నది. చిత్రకారులే రచయితలు కవులు అయితే లేదా రచయితలు కవులే చిత్రకారులైతే ఆ రమణీయమైన సన్నివేశ సమ్మేళనాన్ని ఊహించుకొని ఆ కళా సృష్టి మహాత్వాన్ని వేయినోళ్ళతో ప్రశంసించవలసిందే. రచనలో, గేయంలో చిత్రకారుని రమణీయ రేఖలో, చిత్రముల రేఖలలో రచయిత లేదా కవి ప్రతిభ ఊహల కల్పనలు, ఎన్ని అందాలు సంతరించుకొనునో ఊహాతీతము, వర్ణనాతీతము, ఆధునిక భావుకులలో ఈ అపూర్వ భాగ్యము బాపిరాజుగారికే లభించింది.
గోదావనీ తీరాన రాజమహేద్రవరంలో కూల్డ్రేగారి ఆచార్యకత్వమున, బాపిరాజుగారి శశికళ, షోడశ కళాధర్మాలతో లాస్యమాడింది. పాత్రలను చిత్రించేటప్పుడు చిత్రకళాదృష్టి వాటికి నగిషీలు చెక్కింది. చిత్రానికి అక్షరరూప కల్పనలో ప్రతిభ వన్నెల చిన్నెలు కూర్చింది. ఈ చిత్ర సమ్మేశనము బాపిరాజుగారి భాషకు, వ్యక్తీకరణ విధానానికి రూపకల్పనకుకొత్త ఊపిరిపోసిందనటంలో అతియోశక్తిలేదు. బాపిరాజు గారి సృష్టించిన చిత్రాలు దేశీయ, విదేశీయ కళాకారుల మన్ననలకు పాత్రమై, కళామందిరాలను, కళాక్షేత్రాల నలంకిరంచినవి. ఆయన చిత్రించిన రేఖావర్ణ చిత్రాలలో ఉదాత్తమైన దివ్యమైన భావుకత కళకళలాడును. అవి అన్నీ నవ్యాంధ్ర చిత్రకళకు అందాలు కూర్చినవి. అన్నింటికి మిన్నయైనది శశికళ రూపకల్పనము. శబ్దబ్రహ్మతో వాగనుశాసనుమూర్తి కవి బ్రహ్మలో తిక్కనామాత్యుడి రూపం వాజ్ఞ్మయోపాసకుల ఎదుట సాక్షాత్కరించునట్లున్నవి. వాగ్ధేవి భారతిరూపంలో అవతరించి, ఏడాది వరకు ప్రతినెల భారతి మాసపత్రికకు ముఖచిత్రంగా తిలకప్రాయమైంది. భారతి సంచిక పుటలు విప్పి చదువుతే ముఖ చిత్రమెక్కడ నలగిమాసిపోతుందోఅనే ఆందోళనతో ఆ చిత్రాలను భద్రంగా చాలాకాలం వరకును దాచుకొన్నాను. ఆముద్ర ఇప్పటికీ నా ఎదలో ఉన్నది.
బాపిరాజు చూచిన దృశ్యము లేఖినిని కుంచెను సమంగా కదిలించింది. అది క్షణంలో రేఖాచిత్రాలను, శబ్ద చిత్రాలను, గేయఖండికలను సంతరించుకొన్నది. ఆయన అమృతప్రాయమైన హృదయం అన్నింటియందు స్వచ్ఛమైన సెలయేరువలె ప్రవహిస్తుంది.
బాపిరాజు చూచిన దృశ్యము లేఖినిని కుంచెను సమంగా కదిలించింది. అది క్షణంలో రేఖాచిత్రాలను, శబ్ద చిత్రాలను, గేయఖండికలను సంతరించుకొన్నది. ఆయన అమృతప్రాయమైన హృదయం అన్నింటి యందు స్వచ్ఛమైన సెలయేరువలె ప్రవహిస్తుంది.
వ్యక్తిగా సమకాలిక కవులకు, ఆప్తులు, సహృదయులకు బాపి బావగా ఆయన చిరస్మరణీయుడు. కపటము, దంభము, దర్పము, అహంకారము, స్వోత్కర్ష ఎంత గాలించినా దొరకని హృదయమాతనిది. సౌకుమార్యము, లాలిత్యము, అత్మీయత, ఆర్థ్రత, ఆయన ఎదకు ఎనలేని అలంకారాలు. ఆదాయాన్ని, జీవితాన్ని, కర్పూరంవలెవెలిగించి, ఆప్తులను కళోపాసకులను, కళార్తులను, సరస్వము నర్పించిన త్యాగజీవి బాపిరాజుగారు. అచ్చమైన గాంధేయవాదిగా కులానికి, మతానికి, స్వార్థానికి, సంకుచిత్వానికి అతీతంగా జీవయాత్ర కొనసాగించిన ధన్యాత్ముడాయన.
కొందరు ఎన్ని రంగాలలో కృషి చేసినా చరిత్ర గతిలో ఏ ఒక్కరంగంలోనో ఎక్కటి వీరులుగా నిలిచి పోతారు. కాలగమనంలో అన్ని రంగాల్లోను చెరగని ముద్రవేస్తారు. ఇటువంటివారిలో బాపిరాజు ఒకరు. ఆయనను కవిగా మాత్రమే మన్నిస్తే ఆయన చిత్రకారుడు చిన్నబుచ్చుకుంటాడు. చిత్రకారునిగా ఆరాధిస్తే గేయకవి మనలను మందంగా మందలిస్తాడు. కధానవలా రచయితగా విస్మరిస్తే సాంఘిక చారిత్రక నవలా వికాసవీధులు వెలవెలపోతాయి. శశికళ కళాత్మక హృదయాన్ని, కళోపాసక ధర్మాన్ని నిరంతరం వెన్నెల వీధుల్లో విహరింపచేస్తుంది. వ్యక్తిగా సహృదయుడుగా మిత్రులు ఆప్తులు సాహితీబంధువులు బాపిరాజును ఏ క్షణంలోనైనా మరిచిపోగలరా ? స్వాతంత్ర్య సమరంలోని అజ్ఞాతవీరునిగా నేడున్నూ ఆయన చిరస్మరణీయుడు. ఆయన కులపతి అనీ, మీరాబాయివంటి చిత్రానికి దర్శకత్వం వహించిన విషయమెందరికి తెలుసు ? ఆయన బహుముఖప్రజ్ఞ మనలను ఇంకా వెన్నుతట్టి గత చరిత్ర స్మృతులను మార్గదర్శక సూత్రాలుగా అందిస్తున్నది. విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో ఆధునిక కవులందరిపైన దాదాపు కొన్ని విశిష్టరచనలపైననూ సిద్ధాంత వ్యాసాలు వెలువడినవి. బాపిరాజుపై ఉస్మానియా విశ్వ విద్యాలయ పక్షాన, మిత్రులు తిరుపతయ్యగారు సిద్దాంత వ్యాసాన్ని వ్రాసి, పి.హెచ్.డి. పట్టాని పొందినారు. నారాయణరావు వంటి నవలల పై ఎం.ఫిల్ కై పరిశోధన చేసినారు ఇంత జరిగినా ఇంకా బాపిరాజు ప్రతిభా వ్యుత్పత్తిని, కవితా వ్యక్తిత్వాన్ని సూక్ష్మాతి సూక్ష్మదృష్టితో పరిశీలించి, అధ్యయనం చేసి పరిశోధనలు చేయవలసి వున్నది. బాపిరాజు గారి చిత్రకళ గేయాలు, చారిత్రక నవలల దృక్పధం, అన్నింటికీ శిఖరాయమానంగా బాపిరాజుగారి శశికళ అనే అంశాలపై పరిశోధనలు చేస్తే బాపిరాజు ప్రతిభా వ్యుత్పత్తుల సమ్యగావిష్కరణము జరుగుతుందనే ఆశ వున్నది. బాపిరాజు కాల గర్భంలో కలిసినా సజీవుడే. ఒక్క క్షణం స్మరిస్తే చాలు ఆయన ఆకారం మన ఎదుట చలన్మల్లికగా తీగలు సాగుతుంది. వెన్నెలరాజు షోడశ కళాస్వరూపాన్ని సర్వదా స్మరించి గుర్తించుటలోనే ఆ కవి చంద్రునకు నిజమైన న్యాయం చేసినట్లవుతుంది.
|