|
అని సరజ్జసింగ భూపాలుడు సాగిలపడి చేతులు దులుపుకొన్నాడు. ఇంతకీ లావణ్యమంటే ఉప్పదనం. పచనకళకి సంబంధించిన ఈ పదం రచనకళల ప్రవేశిచింది. ఉప్పులేనిపప్పు ఎంత చప్పగా ఉంటుందో లావణ్యం లేని రచన, చిత్రం అంతేచప్పగా వుంటాయి. భదంత నాగార్జునుడనే భిక్షువు రసవైశేషిక సూత్రం పేర ఒక ఆయుర్వేద గ్రంథం వ్రాసాడు. ఉప్పు పులుపు, కారంలాంటి షడ్రసాలు కొసకు క్షారంతో లీనమై శేషిస్తాయని అతని సిద్ధాంతము, క్షారమంటే ఒక్క ఉప్పుమాత్రమే కాదు. అనేక ధాతువుల సాల్ట్స్ ఈ ధాతుక్షారాలు లోపిస్తే శరీరమోలా ఉంటుందో ఏ డాక్లరుని అడిగినా చెపుతాడు. ఇప్పటి విటమిన్లని, హార్మోనులని కూడా నాగార్జునుడు క్షారాలుగానే నిర్ణయించాడు. కవితలో లావణ్యమెలా వుంటుందో క్షేమేంద్రుడు తన మునిమత మీ మాంసంలోంచి ఒక ఉదాహరణనిచ్చాడు. దాన్ని చూద్దాం.
కర్ణోత్తిలితకుంతలాంత విపతత్తోయక్షణా సంగినా
హారేణీవ వృతస్తనీ పులకిలా సీతేన సీత్కరణీ
నిర్ధేతాంజన శోణకోన నయనా స్నానావసవేంగనా
ప్రస్యందత్కాబరీ భరాణుకురుతే కస్యస్స్రుహార్థ్రం మనః
ఈ శ్లోకంలోని లావణ్య లక్షణాన్ని ఆకళించు కోవటానికి చాలా నెమరు వేయాల్సివుంటుంది. కవి కాబట్టి నెమరు వేసుకోవటానికి తగినట్లుగా వర్ణించ కలిగాడు. చిత్రకళ అలాకాదు. అదిదృశ్యం. నెమరు వేతకు సమయం వుండదు. ఆపాతరమణీయం కనుక లావణ్యం సాధించటం ఎంతకష్టమో ఊహించుకో వచ్చును. ఇంతవరకూ, నాకు తెలిసినంతవరకూ దాన్ని సాధించినవారు ఒక్కరే అడివి బాపిరాజుగారు. బెజవాడలో శరభయ్య గుళ్ళు అంటే తెలియని వారు లేరు. ఆగుళ్ళు కట్టించిన శరభయ్యగారు ములుగు పాపయారాధ్య రచితమైన దేవీభాగవతాన్ని అచ్చు వేయిద్దామను కొన్నారు. ఆ గ్రంధకర్త, అచ్చుభర్తయిద్దరూ వీరశైవారాధ్యులు. కనుక శరభయ్యగారు బాపిరాజుగార్ని పిలిచి పుస్తకం అట్టమీదికి శివుని బొమ్మ ఒకటి గీసి పెట్టమన్నారు. అందుకుముందుగానే వంద రూపాయలిచ్చారు. శరబారాద్యుల వారి దృష్టిలో శివుడు అంటే అచ్చంరవివర్మలో బొమ్మలో లాగ మీసాలు మాత్రమే ఉంచుకొని నిత్యం నున్నగా షేవ్ చేసుకొన్న వాడేశివుడు. అన్యుడుకాదు. పాశ్చాత్య పద్ధతిలో పౌరాణిక చిత్రాలను యింటింటికి పంచి పెట్టిన రవివర్మ అంటే బాపిరాజుగార్కి గౌరవం ఉంది. కానీ ఆయన బొమ్మలంటే నచ్చవు. పైగా బాపిరాజుగారు భావుకుడు, లావణ్య రహస్య మెరిగిన సిద్ధపురుషుడు. మీసాల శివుడు బొమ్మగీయటం ఆయన కిచ్చగించలేదు. కనుక ఆయన చంద్రశేఖరుణ్ణి సృష్టించాడు.. ఆ బొమ్మ విశేషమేమిటంటే చిత్రం అంతా నీలాకాశంలా కన్పిస్తుంది. కాస్త పరకాయించిన తరువాత సన్నని చంద్రవంక గోచరమవుతుంది. అక్కడ నుండి భావనచేస్తే కపిద్దం కన్పిస్తుంది. ఆ మీద గంగ, ముందుసన్నని కొండవాగు లాగ ఆ తరువాత అంబర చుంచి శిరస్సర ఝరిలాగ తోస్తుంది. ఇవన్నీ చూసిన మీదట అదమోడ్పు కనుదోయి, ఫాల బాగంమీదే మూసిన కనుదోయి, మెడలో నాగాభరణం అరుతనురుండ మాల క్రమంగా శివుడు ప్రత్యక్షమవుతాడు. క్రమంగా యోగులు అంచెలంచెలుగా సమాధిలోకి వెళ్ళి అద్వైతాన్ని సాధించినట్లు ద్రష్టకూడా చంద్రవంక సాయంతో శివాద్వైతాన్ని సాదిస్తాడు. ఇది అసలు ఏ కవీ అందుకోలేని లావణ్యానికి మచ్చుతునక. లావణ్యలక్షణ నిర్వచనంలో కవులు చేతులెత్తే సినదాన్ని బాపిరాజుగారు రేఖలో వర్ణాల్లో అందుకో గల్గారు. శరభయ్యాగారు ఛీ, ఇదేం బొమ్మ అని పారేసారు. అలాపారేసినదాన్ని తీసి గూడూరి నమశ్మివాయ భద్రపరిచారు. గొప్ప ఆర్ట్ క్రిటిక్ అయిన డాక్టర్ కజిన్స్ తిరువనంతపురం మ్యూజియం కోసం చిత్రాలను సేకరించటానికి బయలు దేరి బెజవాడ వచ్చాడు. నమశ్మివాయ గారి దగ్గరున్న చిత్రాన్ని చూసి వెంటనే 5000 చెక్కు వ్రాసియిచ్చి దాన్ని కైవసం చేసుకొన్నారు. ఇది ఈ శతాబ్దం మూడవ దశకంనాటి మాట -
కౌతరయ్యకుమాళ్ళు ఖండాతరంబుల గొప్ప గొప్పోళ్ళంచుగోలపుట్టె
అడివిబాపడిపేరు పడలేదదింకను పడుతుంది దొరలలో బడినయపుడు
అని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఒకప్పుడు వ్రాసారు. బాపిరాజు గారితో నాకు పరిచయ మేర్పడిన తరువాత ఈ పద్యాన్ని చిన్న ఎమెండ్‌మెంట్ పెట్టి నేను హాస్య మాడుతూండే వాణ్ని. ఆ ఎమెండ్‌మెంట్ ఏమిటంటే పడుతుంది దొరలు లోబడినయపుడు నిజంగానే అలా జరిగింది. 1951లో మద్రాసు మ్యూజియం క్యూలేటర్ అప్పస్వామి కన్ను బాపిరాజుగారి మీద పడింది. అప్పటికి దొరలు మన దేశం విడిచిపెట్టి వెళ్ళి పోయారు కదా ! సింహళంలో సీగిడియా అన్నపుణ్యక్షేత్రముంది. అక్కడ మూడు వందల అడుగుల ఎత్తువున్న ఏకాండి శిల. ఆ శిలకి మధ్య భాగాన ఒక చిన్న దొన.ఆ దొనలో 14 వందల ఏండ్ల క్రిందట కుడ్య చిత్రాలు రచించారు. అది పడమటి దిక్కున వుంది. అపరాహ్నం నుండి సాయంత్రం వరకు బొమ్మలు ఎండకాకను భరిస్తునే వచ్చాయి. అయినా కగ్గలేదు వన్నె తగ్గలేదు మద్రాసు మ్యూజియం కోసం ఆ బొమ్మల్ని కాపీ చేసుకొని వచ్చే భాద్యత బాపిరాజుగారికి అప్పచెప్పారు. చిత్రకారులైన కొందరి యువకుల సహాయం తీసుకొని బాపిరాజు గారు సీగిడియా వెళ్ళారు. వారిలో నేను కూడా ఉన్నాను. మిగతా సహాయకులు ఆధునిక చిత్రకళ మాత్రమే తెలిసినవారు. కళలో భారతీయాత్మ వారికానాడు బొత్తిగా తెలియదు. ఆ చిత్రాలను కాపీ చెయ్యటంలో వారు మోడ్రన్ టెక్నిక్ వాడి చేతులు దులుపుకున్నారు. ఒక్క బాపిరాజుగారు నేను కాపీ చేసిన వాటికి మాత్రమే రేఖాపుషిని ఆ లేప్య సౌకుమార్యాన్ని చూపించ గలిగాము. వీటి అన్నింటి క్రింద సంతకం పెట్టి బాపిరాజు గారు మ్యూజియంకి వెళ్ళారు. అక్కడ అప్పాస్వామి మా రెండు బొమ్మల్ని తప్ప మిగతా వాటిని తిరస్కరించాడు. అయినా తన సహచరుల మీద మానవ కారుణ్యంతో బాపిరాజుగారు బ్రతిమాలి వారి బొమ్మలను కూడా మ్యూజియంలో పెట్టించారు. ఆధునికులు వేసిన ఆ బొమ్మలు ఈ పాటికి కీటకాలకు ఫలహారమయి యుంటాయి. నేను మళ్ళీ వాటిని చూడలేదు. నాది ఊహ మాత్రమే.
స్వాత్రంత్యం వచ్చిన తరువాత ఆయన ఎన్నో కీర్తి శిఖరాలు అందుకోగల అవకాశం ఉండేది. కానీ షష్ఠి పూర్తి కాకముందే ఆయన అచ్చరలోకపు బొమ్మ గీయటానికి కాబోలు అచ్చోటికి వెళ్ళిపోయారు. బాపిరాజుగారి సాహచర్యంలో వుండగా ఆయన రాయల్ దర్బారులో వుండే ఊహించి నాటి వేషభాషలతో ఒక రేఖాచిత్రాన్ని గీసాను. హాస్యప్రియులైన బాపిరాజు గారు నా కోక్కిరాయి గీతలు చూసి విరగబడి నవ్వారు. పసివాడిలా కేరింతలు కొట్టారు. అది నాదగ్గరే వుండి పోయింది. 53లో ఆయన ఆబిట్యువరీ వ్రాయవలసి వచ్చినప్పుడు అదే బొమ్మ అక్కరకు వచ్చింది. ఏమైన భోజుడు చెప్పినట్లు శాస్త్రకర్మ సమ్యక్ జ్ఞానం కల చిత్రకారులు నేటివరకూ ఎవరూ పుట్టలేరు. ఇక ముందేమో తెలియదు. మనకు కవులకు లోటులేదు. కథాకారులకు లోటులేదు, నవలాకారులకు అంతకన్నా లోటులేదు. కానీ బాపిరాజుగారి లాంటి చిత్రకారుల లోటు మాత్రం శాశ్వితంగా కన్పిస్తోంది.
అడవి బాపిరాజు గారి కవిత
పద్యము సవ్వడియైన
చెదురు నీయోగమని
హృదయదేవళ మూర్తి
ఒదిగి వస్తిని నేను.
పూలపూజించితే
సోలిపోవుదువనుచు
ఆలయపు మోసాల
ఆవలనె ఉంచాను || ప ||
గొంతెత్తి పాడితే
శాంతి దూరమ్మేనొ ?
లోలోనె గుసగుసల
ఆలపించితి పాట
|