2
 

శ‌రీర‌మా నానావిధ జీవుల‌మ‌యం. మ‌న‌స్సా మాన‌వుడికి సాధ్యం ?...స‌రే ! అది అలాగ ఉండ‌నీయండి. నేను ద్విజుణ్ణి. కురుదేశంలో పుట్టాను. ధ‌ర్మారాజు స్నేహితుణ్ణి. స‌న్యాసిని. వినోదాలంటే ప్రీతి. కిట్ట‌నివారు క‌ప‌ట‌జూదంలో నా సొమ్ము అప‌హ‌రించి, న‌న్ను ప‌రాభ‌వించారు. విర‌క్తి పుట్టి తిరుగుతున్నాను. రాజ్య పరిపాల‌నా విధానం కొంచెం కొంచెం తెలుసు. ధ‌ర్మ‌ప‌రుల‌తో సాంగ‌త్యం ఇష్టం. పేరు కంకుడు. దుష్టాత్మ‌ల కొలువంటే ఏవ‌గింపు నాకు, రాజుల్లో నువ్వు స‌న్మార్గుడ‌వ‌ని విని నీ కొలువు చేద్దామ‌ని వ‌చ్చాను. ఒక సంవ‌త్స‌రం గ‌డ‌వ‌గానే వెళ్లిపొయే వ్ర‌తం నాది, ఆ వ్ర‌తం నీవ‌ద్ద చేసుకొని, తిరిగి పోయి, పూర్వం నాకు అప‌కారం చేసిన కృత‌జ్ఞున్ని జ‌యించ‌డానికి వెళ్లిపోతాను అన్నాడ‌య‌తి.


ఎంత‌మాట ! నీ చిత్తం వ‌చ్చిన‌ట్లు, చేయ‌వ‌చ్చు. ఉన్న‌తాస‌న‌లు, వాహ‌నాలు, భోజ‌నాలు, వ‌స్త్రాలు భోగాలు నాకు ఎలాగ ఉన్నాయో అన్నీ నీకు ఇలాగే ఏర్పాటు చేయిస్తాను. నా రాజ్యంలో ఎవ‌డైనా స‌రే, ఎంత ప్ర‌సిద్ధి కెక్కిన‌వాడైనా స‌రే,  మీ యందు భ‌య‌భ‌క్తులు లేకుండా అవిధేయ‌త చూపించాడా, ఆ అధ‌ముణ్ణి నిర్థ‌య‌తో శిక్షిస్తాను. నీవు ఈ మ‌త్స్య రాజ్యాన్ని పాలించాలని ప్రార్థిస్తున్నాను. నేనూ, నా త‌మ్ముళ్ళు, పుత్రులు, బంధువులు, ప్ర‌ధానులు ఒక‌టేమిటి స‌ర్వ‌సైన్యాల‌తో స‌హా నీపాద సేవ చేసుకుంటూ కృత‌కృత్యుడ‌న‌వుతాను అని విరాటుడు ప్రార్థించాడు.

విరాట‌రాజు మాట‌లు విని ఆ స‌న్యాసి న‌వ్వి.

వెర్రివాడ‌వ‌య్యా నువ్వు ! అగ్నిహోత్రాల్లో హోమంచేసే అత్తిస‌రు అన్నం తినేవాణ్ణి నేను ! నేల‌మీద నిద్రించేవాణ్ణి. ఈ విధంగా వ్ర‌తాలు చేసేనాకు ఇవ‌న్నీ ఎందుకు  చెప్పూ !! ? అన్నాడు య‌తి.

నీకు ఏది ఇష్ట‌మో అదే చేయ‌వ‌చ్చు. ఇక్క‌డ ఎన్నాళ్లు ఉండాల‌ని ఉంటే అన్నాళ్లు ఉండు మాక‌దే శుభ‌మూ, సంతోష‌మూను. నీకు జూదం అంటే ప్రీతి అయితే అలాగే కానీయండి మీరు పెద్ద‌లు. నీకు ఏది ఆనంద‌మో అది చేయ‌వచ్చు అన్నాడా రాజు.

 ఈ ప్ర‌కారంగా ధ‌ర్మ‌ర‌జు విరాట‌రాజు కొలువులో చేరాడు. విరాటుడు, ధ‌ర్మ‌రాజు, త‌దిత‌ర స‌భాస‌దులు త‌మ‌త‌మ స్థాన‌ల్లో ఆశీనుల‌యారు.

త‌న అన్న వెళ్లిన మార్గాన గాక వేరొక త్రోవ‌ను, విరాట‌రాజు స‌భ‌వైపు భీముడు న‌డుస్తున్నాడు. ఒక‌చేత నొక పెద్ద తెడ్డు పుచ్చుకొన్నాడు. ఒక ఖ‌డ్గ‌ము, చుర‌కత్తి, దిండూ క‌లిపి క‌ట్టిన చేత పెద్ద‌వంట క‌ట్టెల మోపు పుచ్చుకొన్నాడు. రంగురంగుల వ‌స్త్రం ధ‌రించాడు. అత‌ని విచిత్ర‌రూపాన్ని అంతా విస్తుపోతూ చూస్తున్నారు. విరాట‌రాజు అత‌న్ని అంత దూరంలో చూచి ఆలోచ‌న‌లోప‌డినాడు. త‌న‌వైపే వ‌స్తూన్న ఆ ఆపూర్వ వ్య‌క్తి కేవ‌లం మాన‌వ‌మాత్రుడు కాడు. ఈ లోకంలో విహారార్థం మాన‌వాకారంలో దిగివ‌చ్చిన సూర్యుడో, చంద్రుడో, ఇంద్రుడో ! ఇంత‌లో భీముడాత‌ని ద‌రిచేరి జ‌య‌ధ్వానంతో అత‌ని ఆలోచ‌న‌ల‌కు అంత‌రాయం క‌లిగించాడు.

అయ్యా ! నేను శూద్రుణ్ణి. నీ సేవ‌చేసుకుందామ‌ని వ‌చ్చాను. సేవ చేయ‌డం త‌ప్ప రెండోది ఏదీ నాకు చేత‌కాదు. మిక్కిలి రుచిగా, నీవు మెచ్చుకొనేంత బాగుగా వంట‌చేయ‌గ‌ల‌ను. పాక‌శాస్త్రంలో, ఇక్క‌డేకాదు, ఎక్క‌డా న‌న్ను మించిన వాడులేడు. నా పేరు వ‌లలుడు అంటారు. కూడు,గుడ్డ ఇచ్చి పోషిస్తే చాలు, నీవు కోరిన‌వ‌న్నీ వండుతాను. నీ సేవ చేసుకుంటాను అన్నాడా రాజుతో.

 

నువ్వేం చెప్పు, శూద్రుడ‌వ‌ని మాత్రం నేను న‌మ్మలేదు. స‌రి, దానికేంగాని, నీకు ఇచ్చ‌వ‌చ్చిన ఏనుగునిస్తాను. హాయిగా ఏనుగెక్కి తిరుగుతూ మా గ‌జ‌శాలాధికారిగా ఉండు, విరాటుడు కోరినాడు.

మోటుమనిషిలా తల అడ్డంగా ఊపాడు, వ‌ల‌లుడు.

వంట నేర్చిన‌వాడికి ఏనుగు ఎందుకు ?  నా వంట రుచిమ‌రిగాక ధ‌ర్మ‌రాజు న‌న్ను చాలాకాలం త‌న వంట‌ల వాడిగా పెట్టుకొన్నాడు. అత‌ని వ‌ద్ద ఎలా ప‌నిచేశావో నీవ‌ద్ద అలా ప‌ని చేస్తాను. కావ‌లిస్తే చేయించుకో. మ‌రో విష‌యం నాకు చాలా బ‌లం ఉంది. కారుదున్న‌పోతుతోను, మ‌దపుటేనుగుతోను, బెబ్బిలితోను, సింహంతోను పోరాడ‌గ‌ల‌ను. జ‌గ‌జ్జెట్టి అనిపించుకున్న ముల్లుల్ని కూడా గ‌డియ‌లో విరిచేస్తాను. ఇష్ట‌మైతే నాచేత సేవ చేయించుకోవ‌చ్చు. లేదంటావా, పొమ్మ‌న్నా సంతోష‌మే. ఎవ‌రికి కావ‌లిస్తే వారివ‌ద్ద ప‌నిచేస్తాను. నీ అభిప్రాయం ఏమిటో తేల్చు ! అన్నాడు, వ‌ల‌లుడు.

అదేమిటోయ్‌, వ‌ల‌లుడూ అలా తొంద‌ర‌ప‌డ‌తావ్ ! నీకు యోగ్య‌మైన ఉద్యోగం ఇద్దామ‌ని నాకు తోచింది చెప్పాను. పోనీ నీకు న‌చ్చ‌క‌పోతే నువ్వు మా ఇంట్లో వంట‌చేస్తూనే ఉండు. ఇప్పుడు ఉన్న వంట‌వాళ్లు నీచేతి క్రింద ప‌నిచేస్తారు అని రాజు భీముణ్ణి త‌న‌కు వంట‌మ‌నిషిగా నియ‌మించుకొన్నాడు.

అప్పుడు విరాట‌రాజు స‌భ‌వైపు అర్జునుడు వ‌స్తూన్నాడు. అత‌ని  న‌డ‌క‌లో నృత్య‌భంగిమ‌లు తొణికిస‌లాడుతున్న‌వి.  ర‌విక‌మాటున బాహువుల సౌంద‌ర్యం క‌ప్ప‌బ‌డిన‌ది. మెడ‌లో బంగారు ప‌ట్టెడ మెరుస్తున్న‌ది. పాపట‌, త‌ల‌కట్టు, నుదుటిపై నాట్య‌మాడుతున్న ముంగురులు, చెవుల దుద్దులు అత‌ని ముఖానికి వింత‌శోభ‌ను ఇస్తున్న‌వి. మ‌బ్బుక‌ప్పిన సూర్యునిలాగ‌, నివురుక‌ప్పిన నిప్పులాగ‌, వేష‌ధారియైన విష్ణువులాగ పేడిత‌న‌ముచ వ‌నితారూప‌ములో ఉన్న అర్జునుడు విరాట‌రాజుకు, స‌భాస‌దుల‌కు అగుప‌డేటంత స‌మీపంలో అల్ల‌న‌ల్ల‌న తార‌ట్లాడుతున్నాడు.

వేష‌ము, వాల‌క‌ము చూస్తే ఆడ‌దానిలాగ‌నే ఉంది గాని ఆడుదేనని నిశ్చ‌యంగా చెప్ప‌డానికి వీల్లేకుండా ఉంది ! మ‌నిషిలో మ‌హానుభావ‌త్వం, రాజ‌సం క‌నిసిస్తోంది. ఎవ‌రో ఒక మ‌హానుభావ‌త్వం, రాజ‌సం క‌నిపిస్తోంది. ఎవ‌రో ఒక మ‌హానుభావుడు వేడుక‌కోసం ఆడ‌వేషం వేసుకొన్నాడా అని నాసందేహం, మీకేమ‌నిపిస్తోంది అని విరాట‌రాజు త‌న చేరువనున్న వారితో గుస‌గుస‌లాడాడు. వారు అబ్బుర‌ప‌డుతూ ఇత‌మిద్ద‌మ‌ని చెప్ప‌లేక‌పోయారు. ఇంత‌లో

అర్జునుడా స‌భ‌లో ప్ర‌వేశించాడు.