అనేకమంది నిపుణుల్ని వివిధాలైన మారువేషాల్లో నానాదేశాల పలుమూలలకూ పంపించి వెదికిస్తే నేడో రేపో వారు మావన్మందీ దొరకుతారు అన్నాడు కర్ణుడు. దుశ్శాసనుడా మాటలు లెక్కచేయలేదు. కాగా పెడ నువ్వు నవ్వి.
ఆ ! వాళ్ళకోసం ఇంకా వెదకడమెందుకు ! దుఃఖభూయిష్టమైన త్రిప్పుటతో, బలం కోల్పోయి, చిక్కి శల్యాలై ఏ అడవి జంతువు నోటనో పడి చచ్చిపోయి ఉంటారు. చచ్చినచోట ఈ పాటికి నిలువెత్తున గడ్డి మొలచి ఆనవాళ్ళు కూడా పోయిఉంటాయి. చీకూచింతా లేకుండా హాయిగా విచ్చలవిడిగా మనం రాజ్యం పాలించుకోవచ్చు అన్నాడు గర్వంగా.
శుద్ధ పొరబాటు. పాండువులకు బలం, సంఘీభావం, క్షాత్రం దైవబలం అన్నీ ఉన్నాయి. వారికి విపత్తులు రావు. అందుచేత వారిని ఎలాగ వెదకాలో చేతనైతే చెప్పండి అని ద్రోణుడు చిరునవ్వుతో అన్నాడు.
ద్రోణుడు నిజం గ్రహించాడు. వారికి బాహుబలం, బుద్ధి బలం, దైవబలం ఉన్నాయి. వారికి అరిష్టాలు రావు. వారి ఉనికి కుగొనడమే మహాకష్టం. వారూ మీరూ నాకు ఒక్కటే. అయినా, దుర్యోధనుడు కర్తవ్యం చెప్పమని అడుగుతున్నాడు కనుక నాకు తోచిన సంగతి చెపుతున్నాను. నామాటలు విని ఆప్రకారంగా చేయడం సమంజసం.
బ్రాహ్మణ భక్తి, పరోపకార శక్తి, నిర్మలమైన మనస్సు, నీతి యందు అనురక్తి, సత్యము, పలుకుట, సాధుపోషణ, దానగుణము, ధర్మగుణము, కరుణ, స్నేహము ఆదిగాగల శుభలక్షణాలు కలిగిన ప్రజలు ఏదేశంలో ఉన్నారో, ధనధాన్యాదులతో, పాడి పంటలతో ఏ దేశం సమృద్ధిగా ఉన్నదో ఆ దేశంలో ధర్మరాజు ఉన్నాడనుకోవచ్చు. కనుక అటువంటి దేశం ఇప్పుడేదో గమనించి ఆ దేశంలో వెదకుతే పాండవులు దొరకవచ్చు. అని భీష్ముడు ద్రోణుడి అభిప్రాయాన్ని బలపర్చాడు.
వారిని సర్వవిధాలా వెదకడం ముఖ్యం. అయితే, ఇది మాత్రం త్వరగా కొనసాగించాలి. వెదకవలసిన విధాన వెదకుతే దొరక్కపోరు. అది అలా ఉండనీయండి. మరొక ముఖ్యాంశం ఏమంటే, వారు ఒప్పుదల ప్రకారం వనవాసం పూర్తిచేశారు. చేయవలసిన అజ్ఞాతవాసం కూడా కొంచెం హెచ్చు తగ్గుగా పూర్తి కావచ్చింద. వీరియందు మిక్కిలి ద్వేషంవహించి ఉన్నారు. ఇట్టి పరిస్థితుల్లో ఊరుకొని ఉండడం మంచిదికాదు.
అలుసైన శత్రువు యందైనా అలసత్వం కూడదని పెద్దలు చెబుతారు కదా మహాబల సంపన్నులైన పాండవులయందు ఏమరు ఉండడం శ్రేయస్సు అవుతుందా ? మన బలగాన్నీ, మనకు తోడ్పడే సైన్యాన్నీ కూడగట్టుకుని సిద్ధంగా ఉండడం తక్షణ కర్తవ్యం. పాండవుల శపథ ప్రకారం నడుచుకొన్నాక కయ్యానికి కాలు దువ్వకపోతే మంచిదే. సంధి చేసుకోవచ్చు. అలాగకాక యుద్ధానికి సిద్ధపడితే అప్పుడు మన పని క్లిష్టమవుతుంది. నష్టాలను భరించవలసి వస్తుంది. అది అలా ఉండనీయండి. మనం మహాబల సంపన్నులమై ఉండబట్టే వారు మనకు వశ్యులయారని అనిపించుకోడం నా అభిమతం అని కృపాచార్యుడు అభిప్రాయం వెలిబుచ్చాడు.
ఈ విధంగా అందరూ వారి వారికి తోచిన అభిప్రాయాలు చెప్పగా వినిచ దుర్యోధనుడు తీవ్రంగా ఆలోచించి ప్రస్తుత కార్యాచరణను నిర్ధారించాడు.
సింహబలుడు, భీముడు, శల్యుడు, పరశురాముడు సమానబలం కలవాళ్ళు. ఈ నలుగురు బాహుబలాలతో పోల్చదగిన భుజబలం కలవాడు ఇంకెక్కడాలేడు. కనుక వీళ్ళలో వీళ్ళే ఒకళ్ళనొకళ్ళు ఓడించగలరు. సింహబలుణ్ణి బాహుబల ప్రయోగంతో చంపగలిగిన వాడు, తక్కిన వారందరు అతనికి బహుదూరాన ఉన్నారు కనుక, భీముడు అయి ఉండవచ్చు. అందుచేత భీముడు మత్స్యదేశంలో ఉండి ఉండవచ్చు.
పైగా కీచకుడు ఒకానొక వనిత కారణాన చంపబడ్డాడని చెపుతున్నారు. ఆ వనిత ద్రౌపది కావచ్చు. గంధర్వులనే నెపంతో అంధకారంలో, అతి నిగూఢంగా, కీచకుణ్ణి అతని తమ్ముళ్ళనూ ఒకే రాత్రిలో చంపగల బలశాలి భీముడు కాక మరొకడు కాగలడా.
తాతయ్య చెప్పిన లక్షణాలన్నీ ఆ దేశంలో కనిపిస్తున్నాయని వింటున్నాము. పాండవులు ప్రచ్ఛన్నవేషాలలో విరాటరాజు కొలువులో చేరారేమో అని గట్టి అనుమానం గా ఉంది. విరాటరాజు మనకు శత్రువు కనుక అతనిపై దండెత్తి వెళ్ళి అతని గోగణాన్ని వశం చేసుకుంటే ధర్మరాజు, అతని తమ్ముళ్ళు అడ్డుపడతారు. అప్పుడు శపథం భంగం చేశారని చెప్పి వాళ్ళను తిరిగి పన్నెండేళ్ళు వనవాసం చేయమని పంపుదాము. అలాగైతే సులువుగా సామ్రాజ్యం యావత్తు ఆక్రమించుకొని సుఖంగా ఉండవచ్చు. ఒకవేళ పాండవులు అక్కడ లేకపోయినా మత్స్యదేశాన్ని కొల్లగొట్టవచ్చు. అదీ లాభమే. సర్వవిధాలా ఇదే ఇప్పుడు చేయవలసినపని. మీకు ఇది నచ్చితే దానికి తగిన ప్రయత్నాలు కావించండి అన్నాడు దుర్యోధనుడు.
అప్పుడు త్రిగర్తరాజైన సుశర్మ. కర్ణ, దుశ్శాసనులతో ఏమేమో గుసగుసలాడాడు.
ఒకప్పుడు ఆ కీచకుడు నన్ను ఓడించాడు. నేను అవమానంతో కుళ్ళుతున్నాను. నన్ను విరాటుని మీదకు పంపండి. నా రాజ్యం మీద దండెత్తి విరాటుడు అనేక బాధలు పెట్టాడు వాడి మీద పగ తీర్చుకుంటాను . వాడి పొగరు కుదురుస్తాను. పశువులను పట్టుకొంటాను. అతడు అడ్డు తగిలితే పాండవులున్నారేమో వెదకుతాను. అందుచేత సర్వ విధాలా ఈ పనికి నేనే తగినవాణ్ణి అని సుశర్మ మనవి చేసికొన్నాడు.
సుశర్మ చెప్పినది బాగానే ఉండి. ఇంక మహారాజు శెలవివ్వాలి. అన్నాడు కర్ణుడు. దుర్యోధనుడు యావన్మందినీ కలయచూసాడు.
ముందుగా, సుశర్మ, సైన్యంతోపాటు పోయి పశువులను పట్టుకుంటాడు. అతనిని ఎదిర్చే మత్య్ససైన్యాన్ని తుదముట్టిస్తాడు. వేరొకచోట కౌరవులు కొన్ని పశువులను పట్టుకొంటారు. అప్పడు పాండవులు యుద్ధానికి వస్తారు. ఒకచోట సుశర్మ సైన్యాలు దాడికి సన్నద్ధమవుతాయి.
ఈ ప్రకారంగా హస్తినాపురంలో గోగ్రహణ సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పుడు అజ్ఞాతవాస దుష్కర సంవత్సరం తుది దినాలు జరగబోతున్నాయి. హస్తినాపురంలో ఈ విషయాన్ని ఎవరూ అంతగా గమనించలేదు.
సుశర్మ సర్వసైన్యాన్ని సమకూర్చుకుని ఉత్సాహంతో దండయాత్రకు బయల్దేరాడు. మధ్యమధ్య బసచేసి ప్రయాణం బడలిక తీర్చుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాడు. తన సైన్యాలని ఉత్తేజపరుస్తున్నాడు. వేగులవారివల్ల విరాటరాజు పశువులు ఉన్న ప్రదేశం తెలుసుకొని, కాంతారాన్ని పొదివే కార్చిచ్చులా మత్స్య పట్టణానికి దక్షిణ దిక్కులో పశువుల్ని పొదివి పట్టుకున్నాడు. అతని ఆశ్వికులు విరాటుని గొల్లవాళ్ళను వేటాడారు. నెత్తురు వరదలై కారుతున్న ఈ స్థితిలో కొందరు ఊళ్ళోకి పరుగెత్తి విరాటరాజు మ్రోల నిలబడ్డారు. వారి దురవస్థ చూచి విరాటరాజు విస్తుపోయాడు.
ప్రభూ ! త్రిగర్తరాజు ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో నేల ఈనినట్లుగా వచ్చిపడి మన గోగణాన్ని చుట్టుముట్టాడు. మన గోరక్షకులు పోరాడారుగాని ప్రయోజనం లేకపోయింది. మన పశువుల్ని తోలుకుపోతున్నారు. వాళ్ళు చెయ్యి దాటిపోకమునుపే అడ్డు పడాలి అన్నాడొకడు నీరసంగా.
విరాటుడు అదిరిపడ్డాడు.
ఏమిటీ ! నిజమే ! సుశర్మ నా గోవులను తీసుకుపోయేటంత తెగించాడా ? బాగానే ఉంది. తక్షణం యుద్ధానికి సన్నధ్ధం కండి. ఆలస్యమైతే పశువులు దక్కవు. ఊ ! త్వరగా ! అంటూ సైన్యాధిపతుల్ని హెచ్చరించాడు.
మత్స్యరాజ్యంలో రణభేరి ధణధణమని మ్రోగినది.
త్వరత్వరగా గుర్రాలను కట్టు ! రథం తీసుకురా ! నువ్వు చాలా వీరాలాపాలు ఆడుతున్నావుగా ఇన్నాళ్ళునుంచిన్నీ ! ఇప్పుడు కయ్యం వచ్చింది కాసుకో ! అంటూ సారధిని హెచ్చరించినాడు.
మీరందరూ మరొకచోట ఆయత్తపర్చండి. ప్రతివారూ తమ తను సైన్యాన్ని తీసుకువెళ్ళి హఠాత్తుగా గోగ్రహణం సాగించాలి. సుశర్మ బహుళ అష్టమినాడు పశువులను పట్టుకుంటాడు. నవమినాడు మన గోగ్రహణం అని కార్యవిధానం నిశ్చయించినాడు, దుర్యోధనుడు.
తాను సత్వరంగా యోధులకు ఉచితమైన సింగారం చేసుకొన్నాడు. రథమెక్కి, గోవుల దొంగతనం జరిగిన ప్రదేశం గొల్లవాళ్ళవల్ల తెలుసుకొని బయలుదేరాడు. అతని తమ్ముళ్ళు శతానీకుడు, మదిరాశ్వుడు, సూర్యదత్తు, తమతమ సైన్యాలతో వచ్చి అతనిని కలుసుకొన్నారు. అతని పెద్ద కుమారుడు, శంఖుడు తీవ్రవేగంతో వచ్చాడు. ఇంకా అనేకమంది యోధులు తమతమ సైన్యాలతో వచ్చారు. తన బలములన్నిటినీ సమకూర్చుకొనే తలపుతో ఊరి వెలుపల మైదానంలో నిలబడ్డాడు విరాటరాజు.
|