విరట పర్వం --- అయిదో అశ్వాసం
గోగ్రహణం దాని పూర్వాపరాలు
వైశం పాయనుడు చెప్పసాగాడు
అప్పుడు కురువీరులు మూడువేల రథాలతోనూ, భీష్మకర్ణులు, ఒక్కొక్కరు వెయ్యిరథాలతో నూరయానవచ్చి రారాజును ఆదుకొన్నారు. ఆలమందలు చేయి జారిపోయినందుకు వేడి నిట్టూర్పులు విడస్తూ దుర్యోధనుడు వెయ్యిరథాలతో, తన తమ్ముళ్లతో కురుసేన వెనుకనిలిచాడు.
ఈ ప్రకారంగా మోహరించిన కౌరవసేనను చూచేసరికి అర్జునుడిలోని వీరత్వం పెల్లుబికింది. చిరునవ్వు నవ్వినాడు. ఉత్తరుడికి కురుయోధులను విడివిడిగా చూసాడు.
మాగురువుకు ప్రదిక్షిణగా రథాన్ని పోనిద్దాము. ఆ మహాపురుషుడి యందు తిరస్కారభావం కూడదు. అతడు కౌరవ రాజకుమారులకు అధ్యాసకుడు తెలుసా ? అస్త్రశస్త్రకోవిదుడు. ధనుశ్శాస్త్ర పండితుడు. ఆయనతో సమానులు లేరు. ఆతనితో యుద్ధం చేయతగదు. మెసపుజూదంలో జయంపొంది కళ్లుకానని దుర్యోధనుణ్ణి పరిమార్చడానికి నేను పోయేటప్పుడు ఈతడు ఆడ్డుపడి నాపై బాణాలు వేస్తాడో లేదో చూడాలి.
ముందుగా ఆయనే కయ్యానికి వస్తే మనమూ పోరాడుదాం...మా గురుపుత్రుడు ఆశ్వత్థామ ఉన్నాడే అతడు కౌరవసేనలో మేటి. కడుధైర్యశాలి. ధనుర్విద్యలో తండ్రికి తీసిపోడు... కృపాచార్యుడు మానాన్న స్నేహితుడు. మాకు చిన్నానాటి గురవు. వీరిద్దరూ కూడా మాన్యులు, అందుచేత వీరితో కయ్యానికి ఇప్పుడు మనం అంతగా కాలు దువ్వవద్దు. వారు మనకు ఎదురు పడ్డప్పుడల్లా రథాన్ని అల్లవల్లనపోనిస్తూండు.
కర్ణుడు మహాయోధుడు. యుద్ధ ప్రియుడు. పరశురాముడి శిష్యుడు. రణభూమిలో ఎంతమంది వీరులైన్నా లెక్కచేయడు. శౌర్య, అస్త్రశస్త్రనైపుణ్యాలలో, నాపై అతనికి మాత్సర్యం మహాఉంది. పేరు మోసిన వీరుడు. ఈనాడు అతనికీ నాకూ యుద్ధం అవుతుంది. మనస్సు కలత పడకుండా, ధైర్యంతో ఉండి మా ఇద్దరి తార తమ్యాలు పరికిస్తూండు. ఇవేళ నాకు అడ్డం వచ్చాడా చిచ్చురపిడుగైపోయి అతనిపై బడతాను...మా దుర్యోధనుడున్నాడే, మహాకోపిష్టి, పరాక్రమశాలి. అస్త్రాలు వేయడంలో హస్తలాఘనం కలవాడు. మేమంటే అమితమైన ఆగ్రహం. కార్యసాధనకు ఉచితానుచితాలు పాటించడు. ఉత్తరా ! ఇతనితో పోరాటమే నాకు పండుగ. అతని రథం మనకు కనపడేమార్గంలో వెడుతూ ఎవరు అడ్డువచ్చినాసరే, మెరపు మెరసినట్లు అతని దరికిచొరబడు.
మా తాతయ్య భీష్ములవారు ప్రతాపానికి బడబాగ్ని వంటివాడు. బుద్ధికి ప్రథమగణ్యుడు. ఆయుధ విద్యారహస్యాలు సంపూర్ణంగా తెలిసినవాడు. ధార రాష్ట్రులకు మాకూ సమాన హితుడు. కాని తాను వాళ్లవద్ద ఉంటూండడంవల్ల వారికి సహాయపడుతుంటాడు. వివిధాలైన లక్యాలను గురిచూచి అవలీలగా కొట్టగలడు. పరశురాముడంతవాణ్ణి ఓడించిన మేటి, భీష్ముడి రథం పొంతకు పోవద్దు. అతడాగ్రహిస్తే, దుర్యోధనుడి దరికిగాని, అతని సేన చెంతకుగాని మనల్ని చేరనీయక చిక్కులు పెట్టగలడు.
ఈ ప్రకారంగా అర్జునుడు అందరమూ వేరువేరుగా ఉత్తరుడికి చూపిస్తూ వారిని గురించి వివరిస్తున్నాడు.
అక్కడ అశ్వత్థామ చిరునవ్వుతో కర్ణుణ్ణి చూస్తున్నాడు.
నిన్ను నువ్వే పొగడుకుంటూ చెప్పుకొన్న గొప్పలు, కొట్టిన ప్రగల్బాలు కొల్లలుగా ఉన్నాయి. అర్జునుడడుగో, రణోత్సాహంతో వచ్చే పులిలాగ వచ్చాడు. నువ్వెళ్లి అతణ్ణి ఎదుర్కోరాదూ ? ఎందుకైనా మంచిది, శకునితో సంప్రదించు ? రారాజ తన రాజ కార్యాల భారాన్ని నీ తలపైకి ఎక్కించాడుగా ! నువ్వు ఊరుకోవచ్చా ? అన్నాడు వెటకారంగా.
కర్ణుడికి ఒళ్లు మండింది. కోపంతో అతని నయనాలు ఎర్రబారినవి.
ఓహో ! అతడే రణశూరుడా ? నన్ను నిర్జిస్తాడని, పిరికిపందలా మాట్లాడకు. నా శౌర్యం చూచుకొనే నేను యుద్ధానికి వచ్చాను. అర్జునుడైతేయేం, దేవేంద్రుడైతేయేం ? నా ధైర్యం శౌర్యం, చాతుర్యం అన్నీ నువ్వే చూద్దువుగాని అన్నాడు, కోపంతో.
ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, భీష్ముడు ముందుగా అర్జునుడితో యుద్ధానికి తలపడడం చూచి దుర్యోధనుడు కూడా తలపడ్డాడు. ఈ విధంగా ఆ అయిదుగురూ అర్జునుడూ యుద్ధానికి పూనుకోడం చూచి శకుని దుశ్శాననాది ప్రముఖులంతా సైన్యంగా కలబడ్డాడు. భూమి కంపించింది. రేగిన ధూళితో గగనం కప్పడి సూర్యుడు కానరాకుండా పోయాడు. భటుల కేకలతో, భేరీ నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి.
అర్జునుడి గాంఢీవంనుడి ఆశేషంగా వెలువడే బాణాలు, ఒక్కొక్కటి పది పదిహేనుమంది భటుల చంపుతున్నది. శవాలు కుప్పలు తిప్పలుగా పడుతున్నవి. అతని రథం ఒకపరి కౌరవ సైన్యంలోకి నిలువునా చొచ్చుకుపోయి దానిని రెండురూపాలుగా చేసింది. తదుపరి అడ్డంగా నడచి నాలుగు పాయలుగా విడదీసింది. యదేచ్చను వీరవిహారం గావించే చిందరవందర చేసింది. మహాసముద్రంలో విహరించే తిమింగలం వలె విహరిస్తోంది.
అడ్డం వచ్చిన పదాతులు, రథాలు, అశ్వాలు, ఏనుగులు, తుత్తునియలవుతున్నవి. కొందరు యుద్ధభూమిని వదలి పారిపోయారు. అతన్ని ఒకేసారి ఎదిర్చిన వాడు తిరిగి రెండవ సారి ఎదుటికి రావడంలేదు. కాలంతీరిన వారిని యముడు చంపేట్లా తరిమి తరిమి చంపుతున్నాడాతడు. కొందరు అర్జునుడు ఇటు వస్తే అటూ, అటు వెడితే ఇటూపరుగిడుతున్నారు. నల్లుల్లాగా రాలిపోతున్న తోటి సైనికుల్ని చూచి, కొందరు గుండెబ్రధ్దలైపడిపోతున్నారు.
అర్జునుడు ద్రోణునిపై డెబ్బయి అమ్మలు, అశ్వత్థామపై ఏడు బాణాలు, కృపాచార్యుని మీదపది శరములు, భీష్ముడిపై అరవై అమ్ములు వేసాడు. కర్ణుడి రథసారథినీ గుర్రాలనూ గాయపర్చాడు. ఈ ప్రకారంగా కౌరవ సైన్యాన్ని నానా భీభత్సం చేసి దేవదత్తం దూరించే సరికి కౌరవ సైన్యాలు భీతిల్లి పారిపోయి భీష్ముడి మరుగుచొచ్చాయి. భీష్ముడా సైన్యాన్ని ఉత్సాహపరచి, కూడ గట్టుకొని వ్యూహం పన్ని నిలబడ్డాడు.
ఉత్తరకుమారా ! రథాన్ని క్షణం ఆపు. శత్రుసైన్యంలో ఎక్కడెక్కడ ఎవరెవరున్నారో తెలుసుకుందాం. ఆ సైన్యం నిలబడ్డ తీరుచూచావా ? అదుగో ! అది కర్ణుడి పతాకం. అతడు రణకుతూహలంతో వచ్చి ఉంటాడు. మనం ముందుగా అతనితో పోరాడాలి. ఇతడు అసాధ్యుడు నమ్ముకున్నాడా దుర్యోధనుడు. ఇప్పుడు ఇతణ్ణి నిర్జించి అతని ఆశ వమ్ముచేద్దాం. రథాన్ని అటుపోనియ్యి. అన్నాడర్జునుడు, ఉత్సాహంతో.
అతని సాహపం నైపుణ్యం చూచి ఉన్న కారణాన ఉత్తరుడు నిర్భయంగా కర్ణుడికి తిన్నగా రథాన్ని పోనిచ్చాడు. ఆ బోతును ఎదుర్కొనే బెబ్బులిలా కర్ణుణ్ణి ఎదుర్కోడానికి వెడుతున్న అర్జునుణ్ణి దుశ్శాసనుడు, వికర్ణుడు మున్నగు కౌరవకుమారులు అందరూ ఒక్కుమ్మడిగా అతనిపై బడ్డారు. కాని గాంఢీవంధాటికి ఆగలేక పారిపోయారు ! ఛీ ! పారిపోవడానికా ఇక్కడికొచ్చింది ! అంటూ చీదరించుకొని కర్ణుని తమ్ముడు సంగ్రామ జిత్తు అర్జునుణ్ణి ఎదరుర్కోబోయేసరికి అతని తలతెగిపడింది. అప్పుడు కర్ణుడు అర్జునుడిపై బాణవర్షం కురిపించాడు. అతని రథాశ్వాములను, ఉత్తరుణ్ణి బాణాలతో కొట్టాడు. అర్జునుడిపై పన్నెండు బాణాలు వేసాడు. పాముపై బడే గరుడునిలాగ అయాడు, అర్జునుడు.
కర్ణార్జునుల యుద్ధం ఘోరమైంది. అచ్చెరువుతో, ఉత్సాహంతో చూస్తూ, కౌరవసేనలు కొయ్యబొమ్మల్లాగ నిలబడిపోయాయి. కర్ణుడి బాణాలు అర్జునిడికి తగిలినప్పుడు ఆనంద పడుతున్నాడు. అర్జునుడి బాణాలు కర్ణుడికి తగిలినప్పుడు విషాదపడుతున్నాడు. పోరు తీవ్రంగా సాగుతోంది.
నాకెవరూ సరిరారని నువ్వు సభల్లో ప్రగల్భాలు కొడుతూంటావుగా ! ఇప్పుడు యుద్ధం వచ్చింది గనుక అందరి పస తేలిపోతుంది. ఇక్కడ వ్యర్థ ప్రలాపాలు పనికిరావు. అబ్బో ! చాలాప్రేలావు నువ్వు పారిపోడం తగదు.పైగా నీ తమ్ముడి పాటు కళ్లారా చూశావుగా. నోటికి వచ్చినట్లు గొప్ప చెప్పుకోవచ్చు కాని చెప్పినట్లల్లా చేయడం సాధ్యపడుతుందా ? వాళ్లు, ఆనాడు, ఆవిధంగా ద్రౌపదిని అవమానించి నప్పుడు నువ్వు నవ్విన దానికి ఫలం అనుభవిద్దువుగాని. అప్పుడు నేను ధర్మానికి కట్టుబడి, కోపాగ్నిని చల్లార్చుకోవలసి వచ్చింది గనుక చెల్లిపోయింది గాని, ఇక ఇప్పుడు ఎలాగ తప్పించుకుంటావో చూస్తాను, అన్నాడర్జునుడు.
|