ఆత్మ వాదము
ఈ ప్రకరణముననున్న స్త్రీమూర్తులు సంస్కార విషయమున ఆత్మస్థాయినందుకొనగల్గినవారు. మధుర భక్తి మార్గము ననుసరించిన గిరికయు, యోగమున కపాలవిచ్ఛేదనమును గావించుకొనిన గణాచారియును పాతివ్రత్యముననుసరించిన అరుంధతి, భక్తిమార్గమున పయనించిన యశోవతి, స్వయంప్రభ మొదలైనవారును గతజన్మ స్మృతులనందజాలిన జానికి మొదలైన వారు ఆత్మ పర్యంతముపయనించగల్గిన ఉన్నతమైన వ్యక్తిత్వముగలవారగుటచే ఇచ్చట స్థానము కల్పింపబడినది.
హృదయ వాదము
ఈ ప్రకరణముననున్న స్త్రీలు కూడ ఉన్నతమైన వ్యక్తిత్వముగలవారే కాని వీరి గమనము హృదయపర్యంతము మాత్రమగుటచే హృదయ వాదమున చేర్పబడిరి. బాల, భట్టిదేవి పతివ్రతలేయైనప్పటికి తమలోనున్న ఒకొనొక ఆధిక్యభావముకు వీరు లోబడియుండిరి. త్వగింద్రియ స్పర్శాను భూతిని హృదయదఘ్నముగ ననుభవింపగల్గిన ఏకవీర, మీనాక్షి, వాసంతుల సంస్కారము జీవునిలోనున్న ఔన్నత్యము సామన్యమైనవికావు. అందువలన వీరికి హృదయవాదమున స్థానము కల్గినది.
బుద్ధి వాదము
బుద్ధి, వివేకము, శాస్త్రపాండిత్యాదులు పూర్వజన్మ పుణ్యవశమున లభించు సంస్కార విషయములు జ్యోతిశాస్త్రవేత్తులయిన నీలమ్మ, నివేదిత, సంగీత శాస్త్ర ప్రవీణయైన అచ్చర మొదలైనవారలీవాదమున స్థానమును పొందగలిగిరి.
దేహేంద్రియ వాదము
మాతృదేవోభవ యన్నది భారతీయ తత్త్వశాస్త్రమునకు మూలాధార విషయము. మాతృప్రేమను పలురకములుగ చూపిన కాళింది, పిన్నమ్మ, సోదర ప్రేమగల విమల మొదలైనవారలీప్రకరణమున విశ్లేషింపబడిరి.
|