శంఖములో పోసినగాని తీర్ధముకాదన్నుటుల పాశ్చాత్య విజ్ఞానవేత్త లంగీకరించినగాని నాగరకులే విషయమునొప్పికొనరు. పాశ్చాత్యులుకూడ కొందరికి కొన్ని యసాధారణ శక్తులుండునన్న నిర్ణయమునకు వచ్చిరి. ఈ శక్తిని టెలిపతి యనియు ఇన్ట్యూషన్ అనియు క్లేర్వాయిన్స్ అనియుకూడనందురు. ఇట్టి సద్యస్స్ఫురణకు పాశ్చాత్యులు కారణమును చెప్పరు. మనవారు పూర్వజన్మలో చేసిన యోగాది సంస్కారములచేగాని భక్తి ప్రపత్తులచేతగాని నిట్టిశక్తిగల్గునందురు. ఇట్టి స్ఫురణము సామాన్యమానవులనకు కూడనెప్పుడో యొకప్పుడనుభవమునకు రాకమానదు. పేరాసైకాలజి ని నమ్మనటువంటి ఎడ్మండ్ ఫ్రాయిడ్ తన చివరిదశలోనిట్లు భావించెను. తనయుత్తర జన్మమునందు అతీంద్రియ విజ్ఞానము మీద పరిశోధన చేతునని మిత్రులతో చెప్పుచుండెడివాడట.
గణాచారి పాత్రవలనగలుగు ప్రయోజనమును చర్చించుటకు ముందొక విషయమునవగతము చేసికొనవలెను. ఈ నవలలోని పాత్రలు ప్రకాత్మకమైనవి. ప్రతీక అంటే తాను తానుకాదు మరొకదానికిసంకేతం అదే ఆత్మపదార్థం. వ్యావహారిక సంఘమంటే తాను తానే పదార్థరూపుడు. కన్పిస్తున్నవాడు అని అర్థం. అనగా గణాచారి బాహ్యమునకెట్లు కన్పించుచున్నదో లోనట్లుకాదనియు తాత్త్వికార్థము వేరుగనున్నదనియు భావింపవలెను. గణాచారి వంటి నిస్స్వార్థ మూర్తులు మన దేశమున కొలదికాలము క్రింద ప్రకాశించిరని తెలియజేయుటయే విశ్వనాథవారి ముఖ్యోద్దేశముగాని గణాచారిదర్శముగ జేసికొని యట్టి వ్యక్తులు మరల రూపొందవలయునని వారిమతముకాదు. గతించి పోవుచున్న సాంప్రదాయి కరోచిస్సులో తుది మెరపుగ గణాచారి పాత్ర సృష్టింపబడినది.
.
గణాచారి యొక కాపు కుటుంబములో తరతరములుగ నవతరించుచున్న శక్తి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తురాలు. వ్యాఖ్యాత్రి సుబ్బన్న పేట యేర్పడక పూర్వమచ్చట ఆరణ్యముండెడిది. ఆయరణ్యమున నొక పల్లె. ఆ పల్లెలోనొక పేదకాపు. ఆకాపునకొక నందినివంటి ధేనువు. ఈ ధేనువు శ్రీ లక్ష్మినివెలె నతడు సేవించుకొనుచుండెడివాడు. ఒకనాడాయావు పాలు పిండుటకు మనిషిని దగ్గరకు రానీయలేదు. వారాశ్చర్యపడిరి. నాల్గునాళ్ళట్లే జరిగినది. తరువాత నతడా యావు వెంట వెడలి కారణమును కనుగొనెను. ఆయావొక పుట్ట దగ్గరకు వెడలి యొక సర్పమునకు పాలధార వదలి వచ్చుచున్నది. ఆవు యింటి దగ్గర పాలనీయకుండుటకుగల కారణమును కనుగొని యతడు రిత్తవోయెను. ఆ పాలను త్రాగుచున్న ఫణికి రెండు ఫణములన్నవి. ఆనాడతినికి వేయి ఫణములతో సుబ్రహ్మణ్య స్వామి కలలో కానుపించి తాను పాలు త్రాగిన తావున తనకు గుడి కట్టింపుమని చెప్పెను. అతనికొక్కతయే కుమర్తె గలదు. ఆమెను సుబ్రహ్మణ్యస్వామి యావహించుచుండెడివాడు. ఏ యావు పాలు స్వామి త్రాగుచుండెనో యా యావుగల కాపుకకొక్కతయే కూతురు. ఆమెకప్పటికి బదునారు బదునేడేండ్లుండును. వివాహము కాలేదు. స్వామి యామె నావేశించుచుండును ఆమెయే గణాచారి. ఆమె పెండ్లి ప్రయత్నము చేసినప్పుడెల్ల విరుచుకొనిపడిపోయెడిది. స్త్రీలకుగాని పురుషులకుగాని బ్రహ్మచర్య మధిక శక్తిదాయకమని వివేకానందులు ప్రవచించిరి. గణాచారికూడ బ్రహ్మచారిణిగ నుండుటచే నామెయొక్క శక్తులు సమాజమున కుపయోగపడుచుండెడివి. ఇట్లు సుబ్బన్న పేటయన్న గ్రామమేర్పడక పూర్వమే స్వామి తన యునికిని బహిర్గతమొనర్చుకొని తన మహిమలను వెల్లడి జేయుటకొక కన్యనుకూడ మీదుకట్టుకొని యుంచుకొనినాడు. ఆ కన్యయే గణాచారి. వీరి వంశములో నొక్కతెయే కూమార్తె జనించుటయు నామె పెరిగి గణాచారియగుటయు పరంపరానుగత విషయమైనది. ఆ వంశ మూలపురుషుడు చేసిన పుణ్యమట్టిది. అతని పూర్వపుణ్యవశముననే సుబ్రహ్మణ్యస్వామిని సేవింపగల పుణ్యమూర్తులా యింట పుట్టుట జరిగినది. స్వామి యాన ప్రకారము దేవాలయమచట నిలచినది.
అచటికొక నాగేశ్వరశాస్త్రియను నిష్ఠాగిరష్ఠుడైన బ్రాహ్మణుడు వచ్చి యిల్లు కట్టుకొనియు వీరన్ననాయడను నొకడు కోట గట్టుకొనియును స్వామి కిఱుభుజములవలెనైరి. సుబ్బన్నపేట యనబడు నా చిన్న గ్రామము పూర్వ సంప్రదాయములకు కాణిచియైనది. అదియొక ధర్మ మహామంటపమైనది. నాల్గువందల సవంత్సరములక్రిందట నాంధ్రదేశమున నొక గ్రామమెట్లుండునో తలపింపజేయుటకై వెలసినదీ సుబ్బన్నపేట గ్రామము.దీని మహత్త్వమిట్లు పొగడబడినది. అదివరకు చిన్నపల్లెయైన యా చోటు నేడు దేవతలకు నిలువ నీడయయ్యెను. ముక్తికి మార్గమయ్యెను. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పిలిచిన పలుకు దైవము.గణాచారి ముఖమున రానున్న యాపదలు చెప్పును. పరిహారములుపస్యసించును సుబ్రహ్మణ్యుడు సహస్ర ఫణులతో గణాచారి తండ్రికి స్వప్నమున కనుపించెననుటలో నా గ్రామమున ధర్మము రక్షింపడుచున్నదని ధ్వనించుచున్నది. వర్ణాశ్రమ ధర్మములు సురక్షితములై యున్నవి. ఎవని విధిని వారు పాటించుచుండగా స్వామి వారిని చల్లగా గాచుచుండెను. గ్రామము నిత్యకళ్యాణము పచ్చతోరణమై యొకే కుటుంబమువలెనై ధర్మమొక్షముల మధ్యనూగుచున్నది. దైవభక్తియును పాపభీతియును సుబ్బన్నపేట వాసులలో పుష్కలముగనున్నవి. దీనినొక యాదర్శ గ్రామము అనవచ్చును. రాజును బ్రాహ్మణుడును గణాచారియను దైవమైన సుబ్రహ్మణ్యస్వామియును కలసి నాల్గుస్తంభముల ధర్మ మహామంటపమై యొప్పారుచుండెను. పైన భగవంతుడును క్రింద రాజును బ్రాహ్మణుడును ఈ రెండు మహాసంస్థలకును మధ్య త్రెంచరాని లంకె గణాచారి. జమీందారు స్వామికి ప్రతినిధి. బ్రాహ్మణ వంశము ప్రచారమునకు ఉపయోగింపగా కాపువంశపు టాడబడుచులు వాఖ్యాతలైరి. ఈ తిరీగా భూమ్యాకాశముల మధ్య స్వర్గమర్త్య లోకముల మధ్య బ్రత్యక్షాప్రత్యక్షముల మధ్య నొక స్ఠిరమైన సంబంధమేర్పడెను. గణాచారి స్వర్గమర్త్యములకును ప్రత్యక్షాప్రత్యక్షములకును నడుమ నిలచి మానవునకును దైవమునకును నడుమ సంధానకర్తయైనదునుట. గణాచారి యీ ప్రకారముగ జాతి జీవనమునకు వారి సన్మార్గమునకును ప్రతగికిని మార్గదర్శకత్వము వహించినది. |