అరుంధతి
వేయిపడగలు నవలయందు నాయకుడైన ధర్మారావు యొక్క ధర్మపత్ని అరుంధతి. ఈ పాత్రలో భారతీయ స్త్రీమూర్తి యొక్క స్వభావ చిత్రణము సహనశీలము, తృప్తి, భర్తపై యపార ప్రేమ, విజ్ఞానము, తార్కిక శక్తి మొదలైన లక్షణములన్నియు పొందుపరచియున్నారు శ్రీ విశ్వనాథ.
పాతివ్రత్యమనగా పతిని భగవంతునిగ నెంచి పూజించుచు నతనికి ఛాయవలె సంచరించుచు ధర్మార్థ కామమోక్షములనెడి నాలుగు పురుషార్థముల సాధనమునందు పతికి సహాయ సహకారముల నందించుట వినోబాభావే, పతిచేయు వ్రతములకు తోడ్పడునట్టిది పతివ్రతయనిరి. అరుంధతి భర్తకిట్టిది. భర్తయన్నచో ప్రేమ, యభిమానము భగవంతునికన్న నెక్కువ. ఆమెకు మనసు భర్తమీదినుంచి వేణుగోపాలస్వామిపైన కూడ ప్రసరింపదు. దారిద్ర్యములోకూడ భర్త సంతోషమునకై పాటుపడినది. అరుంధతి పాతివ్రత్య సిద్ధాంతమునకు పరమోదాహారణము.
అరుంధతి ముగ్ధగనున్నపుడు ధర్మారావుతో మూర్ఖముగ ప్రవర్తించినది. ధర్మారావునకు అరుంధతి మేనమామ కుమార్తె. వీరి వివాహము బాల్యముననే జరిగినది. అరుంధతికి వివాహమగు కాలమున కయిదు సంవత్సరుములు. ధర్మరావునకు పదకొండు సంవత్సరములు. వివాహమైన తరువాత ధర్మారావు యొక్క యార్థిక పరిస్థితి క్షీణించింది. ధర్మారావు వైపు వారనిననచో అరుంధతి తల్లిదండ్రులకు చులకనభావమేర్పడినది. తల్లిదండ్రులిరువురును తన భర్తను హీనముగ చూచుట, మామగారిని పరుషముగ మాటలాడుట వినిన అరుంధతికూడ భర్తయన్ననొక నిర్లక్ష్యభావ మేర్పడినది. చిన్నపిల్లల విషయమున సహజముగ నిట్లే జరుగును. వారికి స్వతంత్రభావములు కలుగు సమయమున తల్లిదండ్రులేరకముగ మాటలాడిన వీరి మనోదర్పణమును నట్టి భావమే ప్రతిబింబించును. పెద్దలు చెప్పినదే సత్యమని పిన్నలు నమ్ముట జరుగును. అరుంధతికూడ నిందుకు భిన్నముకాదు. ధర్మారావామెను కాపురమునకు తీసికొనివెళ్ళుటకై శుభముహూర్తమును చూచుకొని వెళ్ళెను. పెద్దలు పేరంటాండ్రు వేడుకలు చేయబోయిరి. కాని అరుంధతికి వేడుకలు చేయుటకు మనసురాలేదు. తమలపాకులు చుట్టి ధర్మారావు చేత గొరికించి అరుంధతిని గొరకుమనిరి. ఆమె కొరకలేదు. పెంకితనము పనికిరాదని వారు వీరు కోపపడిరి. అరుంధతి యేడ్వనారంభించెను. బంతులాడించిరి. అరుంధతి సరిగా కాసుల పేరు మరల ధర్మారావు చేతిలోకి విసరలేదు. పెండ్లికూతురు పెండ్లి కొడుకు యొక్క ఎముకలు కొరికినది అని పేరంట్రాండ్రు మేలమాడిరి. అరుంధతి ప్రవర్తన ధర్మారావునందామెకుగల నిర్లక్ష్యభావమును వెల్లడించునదిగనుండెను. ధర్మారావామె విముఖతకు చింతించి
చతుర్విధోపాయములను ప్రయోగించినను ప్రయోజనము లేకపోయినది. అతడు ఆమెపై గల తన ప్రేమనంతయు వెళ్ళబోసికొనెను. నా ధర్మపత్ని నా యిల్లాలు, నా భాగ్యదేవతవు అనుచు అరుంధతి యొక్క స్థాన మతని గృహములోను హృదయములోను నెంత ఉన్నతమైనదియా వెల్లడించియు భంగపడెను. అయినప్పటికిని ధర్మారావు బోధనలవలన అరుంధతికొక నూత్న విషయము తెలిసినది. ధర్మారావు తన తల్లితండ్రులల్పులనుచున్నాడు. తమవారు అతనిని దూషించుదుందురు. ఆమెలోనొక కదలిక ప్రారంభమైనది. ధర్మారావు నిష్ప్రయోజకుడను మాటలో సత్యము లేదేమోయని భావించి ధర్మారావు మాటలకు మెత్తబడినది. అయినప్పటికిని బెట్టు సడలలేదు. రెండునాళ్ళిట్లు ఎడమొగము పెడమొగముగనే గడిచిపోయినవి. మూడువనాడు రాజ్యలక్ష్మమ్మయను పెద్దముత్తెదువ అరుంధతికి మొగలి పూరేకులజడ కుట్టుటకువచ్చి అరుంధతి మనసు భర్తకనుకూలముగ తిరుగునట్లుగ సరససల్లాపమును చేసినది. జడ కుట్టినంతసేపామెతో ప్రేమశాస్త్రమును గురించిన ప్రసంగము చేసినది. అంతకుముందు కొలదిమాత్రపు అనుకూల వాతావరణమును ధర్మారావు అరుంధతిలో కల్గింపగల్గెను. పతి మీదనున్న చులకనభావము తొలగిన అరుంధతిలో శృంగారభావములు అలవోకగా జొప్పించి మంత్రించినట్లుగాచేసి వెళ్ళినదాయిల్లాలు.అరుంధతి హృదయకవాటము తెరచి ప్రేమతో పతినాహ్వానించినది. అతడచట సుస్థిరుడై ప్రేమసామ్రట్టె రసరాజ్యమునేలెను. అరుంధతి సుబ్బన్నపేటకు వచ్చినది. ఈ యూరిలో నందరును భర్తను పొగడెడివారె. తమ యూరిలో ధర్మారావనినచో నందరికిని చిన్న చూపే. ఇచటి పరిస్థితి వేరు. అతడు నలుగురమ్మల ముద్దుబిడ్డ. అందరికినతడన్న మురిపెమే. తండ్రి, రతనాల మొలకయనువారే. అరుంధతి తనువు పులకించినది. తన భర్తను పొగడుటతో నామెలో కించిద్గర్వముకూడ మెరిసినది. పూర్వజన్మ సుకృతమువలన తనకిట్టి భర్త లభించెననుకొన్నది. సామాన్య స్త్రీ లేగాక రాణి రుక్మిణమ్మారావువంటివారు తన యింటికి వచ్చిరన్నచో భర్తయన్ననేమో గ్రహించుకొన్నది. రాణిగారు ఖరీదయిన అయిదుపేటల చంద్రహారమును అరుంధతికి బహూకరించినది. రాణి రుక్మిణమ్మారావు ధర్మారావును పొగడుచు ధర్మారావు బంగారపు తండ్రి ఆయన నీవు నోచుకున్న నోముపంట. నీవరుంధతి వాయన వసిస్ఠుడుగా మెలగవలయును. అపుడు గిరికకన్న నీవేయదృష్టవంతురావుకావచ్చును అన్నది. ఈ మాటలు అరుంధతిపై తమ ప్రభావము చూపినవి. అంతటివాడు లభించుట తన భాగ్యమనినది. తన నామము సార్ధకము చేసికొనవలెనన్న తలంపునకు రుక్మిణమ్మారావు మాటలతో బీజములను నాటినట్లైనది. తాను నిజమైన అరుంధతి కావలయుననుకొనినది. గిరిక మహాభక్తురాలు. ఆమెనట్టిదానిని చేసినది తన పతియా ? ఆమెకన్న తానదృష్టవంతురాలగుటయా ? ఎట్లో అరుంధతికి తెలియలేదుకాని అట్లు కావలెనని యవ్యక్తమయిన తలంపు అరుంధతికింకను బాలప్రాయమే. పదునాలుగు, పదునైదు వత్సరములున్నవేమో అంతకుముందు గిరికయన్నచో నొక స్వల్పభావ మరుంధతిలోనుండెడిది. రాణిగారు గిరికను పొగడుటతోనా తేలిక భావవముపోయి గిరికనెప్పుడు చూతునాయనునుద్వేగమును పొందినది. తండ్రి మరల తనను పుట్టింటికి తీసికొనిపోవును. ఈలోపులననే దేవదాసిని చూడవలెనని యువ్విళ్ళూరినది. భర్తనువదలి వెళ్ళినచో ప్రాణములు నిలుచునాయని బెంగపడినది. అరుంధతి ప్రవృత్తి యుద్వేగపూరితమైనదని చెప్పవచ్చును. మొదట భర్తయన్నచో నిష్టములేనినాడతనిని స్పృశించుటకు కూడ నిష్టపడలేదు. అతనినిష్టపడుటకు మొదలు పెట్టిన తరువాత వదలి క్షణమైన ప్రాణములు నిలువవనుకొనినది. భర్తతోగూడి యాతని బంధువులీమె కాత్మీయులైరి. అరుంధతిలో సత్యము నారయగలశక్తి యిప్పట్టున సువిదితము.
అరుంధతి మనస్సులోని పరిణామము క్రమక్రమ విలసితము. మొదట బాల్యావస్థలోనున్నపుడు తల్లిదండ్రుల భావములవైపు మ్రొగ్గి భర్త నగలు చేయింపలేదని చింతించెడిది. బాహ్యాడంబరములపైన నలంకారములపైన మోజును ప్రదర్శించెడిది. కొలదికాలమునకే భ్రమతీరిపోగా పతి ప్రేమనుమించిన అభరణములుగాని, ఐశ్వర్యలుగానిలేవని గ్రహించినది. రాణిబహూ్కరించిన చంద్రహారమును అరుంధతి రాణి యొక్క అభిమాన చిహ్నముగ భావించినదేగాని దాని విలువకు సంతసింపలేదు. అరుంధతి స్త్రీజాతిలో మేలుబంతివంటిది. ఈ నవలలోని స్త్రీపాత్రలన్నింటిలో అరుంధతి పాత్ర శిరోమణివంటిదనియు ఆమెలో సహనశీలత్వము పతి భక్తి పరాయణత్వము మానవీయత నెలకొన్నవనియు నర్థముగల హిందీ విమర్శకవాక్యము లీసందర్భమున ప్రస్తావింపదగియున్నవి. అరుంధతీ కాపాత్ర్ ఉపన్యాస్కా శిరోమణి పాత్రాహై ! అరుంధతీకే పాత్రమే భారతీయ నారీకేగుణ్మూర్తి మాన్దేభ్పధ్తేహై ! సహన్శీల్తా, పతిపరాయణ్తా, పాతివ్రత్య్, మానవీయతా అరుంధతీపాత్ర్కీ రూపరేఖావిలాస్హై భారతీయనారీమణి యొక్క సుగుణములీమెలో రూపుదాల్చియున్నవన్న రచయిత పలుకులు సమంజసములు. వసిష్ఠుని యర్ధాంగియైన అరుంధతివలెనీయరుంధతికూడ ధర్మారావునకు సహభాగయైనది. ఈమె లేకున్న ధర్మారావు పాత్రకు సంపూర్ణత్వములేదు అతని హృదయ చైతన్యమునకు అరుంధతి దీప్తినిచ్చినది. అరుంధతీ ధర్మారావ్కే హృదయ్ జ్యోతిహై అరుంధతి ధర్మారావు యొక్క రూపరేఖా విలాసాదులు దేవతామూర్తిని తలపింపచేయుననియు ఆదర్శభారతమహిళగ అరుంధతివంటి స్త్రీ మూర్తిని సమకాలీన సాహిత్యమున నెవ్వరును సృష్టింపలేదనియు హిందీ గ్రంధమున అరుంధతీపాత్ర ప్రాధాన్య ముగ్గడింపబడినది.
ధర్మారావు విద్యాభ్యాసమునకు పట్టణమునకు వెళ్ళిన సమయమున అరుంధతి తల్లియు పినతల్లియు మేనమామ కుమారుడును ఆమెను పలుకరముల బాధించిరి. అంతకన్న, వారు తన భర్తను దూషించుట ఆమెకు మరింత దుర్భరమైనది. ఒకనాడు మేనమామ కొడుకు మోటుసరసమాడగ అరుంధతి వానిని గరిటకొడతో పొడిచినది. అతడు కక్షతో రాణి యిచ్చిన చంద్రహారమును కాజేసి అరుంధతికి విషముపెట్టుటకు ప్రయత్నముచేసెను. ఇన్ని కష్టములు పడుచున్నను భర్త కొరకు తపస్సుచేసినది. భర్తకనుపించగనే దుఃఖముతో కదలిపోయినది. ధర్మారావు అరుంధతి యొక్క ప్రేమాభిమానములకు ఆశ్చర్యపడెను. ఆనాడు వారిరువురును ఎనిమిది నెలల యెడబాటు తరువాత మరల సన్నిహితులైరి. ధర్మారావుకానా డరుంధతి వట్టి స్త్రీ వలె గోచరించలేదు. పూర్వజన్మమున దానుచేసిన సుకృతము మనోజ్ఞాకృతి దాల్చి పంటచేనివలె తనవైపునకొరిగెను. వేలయేండ్లు తపస్సుచేసినది. భగీరధుడు...మందాకిని వచ్చితాండవించినది, తన శిరస్సున...ధర్మారావునకు దనకరుంధతీ ప్రాప్తియట్లు తోచినది. అరుంధతీ ధర్మారావుల దాంపత్యమీ మాటలచే సువిదితమగుచున్నది. ఇవి సువర్ణాక్షరములనవచ్చును దాంపత్యసౌఖ్యమంతయు శరీరమును అధిగమించి మనసునుమించి ఆత్మానుగతమై బ్రహ్మానంద సబ్రహ్మచారియైనది. ధర్మబద్ధయైన వారి కలయిక శివశక్తుల కలయికవలె ఆనందదాయకమని రచయిత వర్ణించిరి. ఇచట స్త్రీ పురుషుల సమానత్వము వ్యక్తమయినది. ఆక్రమణలోనెంత తృప్తియున్నదో యొదుగుటలోనంత తృప్తి యున్నది. ఒకటి పురుషుడు, ఒకటి ప్రకృతి. జ్యోత్స్నాంధకారములవలె సూర్యచంద్రులవలె భూమ్యాకాశములవలె నొకదానికొకటి పరిపోషకము ఇట్లు అరుంధతియు తానును ఒకటేయనుభావము ధర్మారావులో కలిగి నూత్నానుభవము నందించినది. అరుంధతి సహృదయురాలు. అందుచేతనే గిరికతో సఖ్యమునెరపి ఆమెకు చేదోడు వాదోడుగానున్నది. గిరికను దేవతాస్త్రీని చూచునట్లుగా చూచెడిది. ఇరువురును ధర్మారావునొద్ద సహపాఠినులైరి. గిరికను అరుంధతి యందుకొనలేకపోయెడిది. గిరికపాఠములో తన్మయురాలైనప్పుడు కనుదోయి విప్పార దివ్యరోచిస్సులు వెలుగుచుండెడివి. ఆమెతన్మయత్వమును చూచుచు అరుంధతి వెరగుపడి యిట్లు తలచెడిది. కర్మలు చేసిచేసి యొడలెల్ల చెమటపట్టిన వారివంక గోపాలదేవుడు తొంగిచూచుటలేదు. ఈ భోగమువారిపిల్ల మనసులో వచ్చినిలుచుండెను అని అరుంధతికి గిరికయన్నచో మాత్సర్యములేదు. అరుంధతి స్వచ్ఛమైన హృదయము కలది గావుననే కృష్ణభగవానునియునికి గిరిక యందుండెనని గ్రహింపగల్గినది.
అరుంధతి ధర్మారావుతోడ ననుభవించిన దారిద్ర్యమునకుగూడ చలింపలేదు. కడుపునిండ భోజనములేక దేహముకృశించినను వదనమున చిరునవ్వు వీడలేదు. భర్త ధనమును సంపాదింపలేని యసమర్ధుడనినిందింపలేదు. అతనిని కష్టపెట్టకుండ పరిస్థితులకుతగినట్లుగ సంసారమును గడిపెడిది. అరుంధతి యీ మూడు నెలలుగా దిండి నసిలేక కృశించిపోయెను. ఆమె యెఱ్ఱని శరీరము కప్పువేసిపోయెను. ఆమె దేహమున లావణ్యముపోయెను. చిక్కిసగమునకు సగమైపోయెను. శరీరము క్షీణించినను అరుంధతి మనసు మనోవేదనమును నువ్వుచుపోగొట్టెడిది. వ్యక్తియొక్క స్వభావము కష్టకాలములో వ్యక్తమైనంతగ సంతోషకాలమునకాదు. ధర్మారావునకరుంధతిమెడలోని చంద్రహారము చూచిన మనసు చలించెడిది. దారిద్ర్యభావ భరింపలేక దాని నమ్ముటకాతడు మనసునతలచెడివాడు. కానియతనిబుద్ధియందులకంగీకరింపక అదిరాణిగారి యభిమాన చిహ్నమనియు అమ్ముటతగదనియుమందలించెడిది. అందువలన అతడు అరుంధతిని తాకినచోనాచంద్రహారముపైగూడ నతని స్పర్శపడవచ్చునని తలచి యామెను స్పృశించుటయేమానెను. అరుంధతికీ సంగతి తెలిసి చంద్రహారమును తృణప్రాయముగ తలచి నేలపై విసరికొట్టినది. అరుంధతి ధర్మారావుకన్న గంభీరమైన హృదయము కలదనియు మనసును నియమింపగలశక్తి యరుంధతికి మిక్కుటముగ నున్నదనియు వెల్లడియగుచున్నది.
ఒకనాడు ధర్మారావు అరుంధతి నిట్లు ప్రశ్నించెను. నీవు నా యెడల బతివ్రతవని నమ్మకమేమిటి సర్వజనులును గామమునే వాంఛింతురు. మనస్సు చంచలమైనది. చంచలముగాని మనస్సుగల మానుష జన్మములేదు. నీవు సదా నన్నే ధ్యానించితివని యేమి నమ్మకము అనెను. అనగా ధర్మారావు తన భార్య యొక్క మానసిక స్వచ్ఛతను అనుమానించుచున్నాడనవలయును. ఈ మాట భార్యతో హాస్యమునకుగాని యలవోకగగాని యనలేదు. అంతకుముందు తీవ్రముగ నాలోచించుచుండెను. భార్య పిలిచినను పలుకక కదలక మెదలకయుండెను. కావున ధర్మారావునకీ యనుమానము నిజముగ కలిగినదునుట కవకాశమున్నది. అరుంధతి యతని ప్రశ్నకు రిచ్చవడలేదు. అభిమానపడలేదు. తన మనస్సునే శంకించుచున్నందులకు కన్నీరు మున్నీరుగునట్లుగ రోదింపలేదు. ధైర్యముగ ఇట్లు చెప్పినది. మనుజులు వేషములలో, ముఖలక్షణములలో, నాచారములలో దెలివితేటలలో నెట్లు భిన్నులో మనస్సులో గూడనట్లే భిన్నుల...తక్కిన యన్నిరకములైన మనస్సులును నున్నవనుట యందరు నొప్పుకొందురు. పాపము నూహించనే యూహించనివాడుండునటులే యొప్పుకొనరు. అది (మనసు) నిజముగా బ్రత్యక్షముగా జూపించదగినదికాదు అన్నది. ప్రపంచమున సౌందర్యవంతులు, సౌందర్యవిహీనులునుందురు. మంచివాడు చెడ్డవారునుందురు. అట్లే మనసులోకూడ పాపపుటూహలను చేయనివారుందురని యేల తలచెదరని ప్రశ్నించినది. మనసనగా దోసకాయవంటిదికాదు. రుచిచూచి చేదుదోసకాయయో తియని దోసకాయయో చెప్పుటకు మనసు బ్రత్యక్షముకాదని ధర్మారావునకు నిష్కర్షగ చెప్పినది. ధర్మారావచ్చెరువువంది సంభాషణమును దాటవేసినాడు. రాధాపతియనువాడు ధర్మారావునిట్టి ప్రశ్ననే అడుగగా, ధర్మారావు బుద్ధి వేరు మనసు వేరు మనసు చలించినచో బుద్ధి మందలించునని సమాధానము చెప్పెను. మనస్సు వేరు. బుద్ధి వేరు. మనస్సు చంచలమైనది. బుద్ధి సిద్ధాంతరూపమైనది. పరస్త్రీ సంగమము దోషముకాదను బుద్ధి నాకు లేదు. మనస్సు ప్రసరింపవచ్చును. మనస్సు నిత్యము చంచలమైనది. దానిని బ్రయత్నముచే నియమించవలయును. ఈ చర్చవలన తెల్లమయినదేమి యనగా, తానెంతయో నీతిమంతుడననియు ధర్మరక్షకుడననియు స్వామికి బావమరిదిననియు దలచెడి ధర్మారావంతటి బుద్ధిమంతుడు మనస్సు ప్రసరింపవచ్చుననెను. గాని యరుంధతి పరపురుష సంబంధమైన యోచనకూడ కలుగదన్నది. ఈమెకు మనసు చలించుటయు బుద్ధి మందలించుటయు నక్కరలేదు. ధర్మారావుకన్న నరుంధతియే నిశ్చల మనస్కయనియు స్థిరభావన కలదనియు తెలియుచున్నది. అరుంధతి నింత యున్నతముగ వర్ణించుటలో విశ్వనాథవారికి స్త్రీలపట్లయున్న విశ్వాసము గౌరమును వ్యక్తమగుచున్నవి. పురుషులలోని బలహీనతకూడ వారొప్పికొనినట్లైనది.
అరుంధతి తాను గిరికవలె కాలేకపోతినని విచారించినది. వేణుగోపాలునికై గిరిక తపించినట్లుగ తానేల తపింపలేకపోవుచున్నదోయని ఆత్మ విమర్శ చేసికొన్నది. అందులకు కారణముగ నామె పతిదేవుడు మదిలో చిద్విలాసముగ నవ్వుచునగపడెను. నా మనస్సు మీమీదనే యున్నది. మిమ్ములను వదలిపోవుటలేదు అనినది. ఈ మాట యనాదిగ వచ్చుచున్న పాతివ్రత్యమన్న మహావ్రతమునకు మహాభాష్యము వంటిది. పతికి పతియే ప్రత్యక్షదైవము. మనసును నలువైపులకు ప్రసరింపజేసి యలియుటకంటె నొక్కరిపై నిడి యేకాగ్రత సాధించుట యుత్తమమని యరుంధతి భావించినది.
గిరిక యెంతయో సాధనచేసి తపించి, కృశించి యాత్మార్పణము గావించుకొనినది. భక్తికిని నాట్యమునకు నభేదము సాధించి తరించినది. అరుంధతి ప్రేమకును పాతివ్రత్యమునకును నభేదత్వము సాధించి ధన్యయైనది. అందువలననే రాణి రుక్మిణమ్మారావు అరుంధతి మార్గము సులభమనియు గిరికకన్న నరుంధతియే యదృష్టవంతురాలనియు ప్రశంసించినది.
సుబ్రహ్మణ్యస్వామి యొక్క చ్యుతినందని పడగలు రెండు అవియే దాంపత్య చిహ్నములు. శివశక్తుల చిహ్నములు. ప్రకృతి పురుషుల చిహ్నములు. అద్వైతముచే నావరింపబడిన ద్వైతచిహ్నములు. దాంపత్య ధర్మము చ్యుతికానంతవరకా పడగలట్లే చిరస్థాయిగనుండును. దేశముననెన్ని యవినీతులు ప్రబలినను ఎంత శీలము క్షీణించినను దాంపత్య జీవితము మాత్రము ఆదర్శప్రాయముగనున్నది. మిగిలిన దేశముల దాంపత్య జీవితముననున్న అస్థిరత్వములు విడాకులు ఈ దేశమున పెచ్చుపెరిగిపోలేదు. మన దేశమున నిటీవల అచ్చటచ్చట కానవచ్చుచున్న యస్థిర దాంపత్య జీవితములు నవ్యపాశ్చాత్య నాగరికతాసంజనితములని గ్రహింపవలయును.
వేయి పడగలు నవలలో విశ్వనాథవారు మూడు రకములగు దాంపత్య జీవితములను వర్ణించియున్నారు. అవి క్రమముగ అరుంధతీ ధర్మారావుల శశిరేఖా కిరీటుల, శ్యామలా కుమారస్వాముల దాంపత్య జీవితములు వీరు మువ్వురు విహపరసాధనము ఆదర్శదాంపత్య జీవితము ద్వారా పొందుటకే ప్రయత్నము చేసియున్నారు. బాహ్య విషయములలో వీరి మువ్వురి యందు భేదమున్నను ఆదర్శమొక్కటియే. శశి కిరీటుల వివాహములో ఆర్ధికాంతరమున్నది. కిరీటి శశికన్న నార్థికముగ తక్కువవాడు. అయినను శశి ప్రత్యేకముగ నొక వ్రతమాచరించి తత్ఫలముగ వలచిన వానిని పొందినది. శ్యామలా కూమారస్వాములలో కుల వ్యత్యాసమున్నది. అయినను వీరి యానందమునకేదియును నడ్డురాలేకపోయినది. అరుంధతి ధర్మారావులది మరింత యాధ్యాత్మికతను జోడు చేసికొని బ్రహ్మానంద సంధాయకమగు శ్రేష్ఠతమ జీవితము కాగల్గినది.
అరుంధతికి రాజయక్ష్మ వ్యాధి వచ్చినది. ఈ వ్యాధికి సగము వరా దారిద్ర్యమే కారణము. చేతిసాయమునకు వచ్చువారుకూడలేక విశ్రాంతి లేకపోయినది. భర్త ధనమునకై పరుల యెదుట చేయిజూచి యర్ధింపడు. అభిమానమున మేరుసమానధీరుడు. ఇన్ని కారణములచేత నామె వ్యాధి యౌషధములేక ముదిరినది. అరుంధతికి వైద్యము చేయించు విషయమున నిర్లిప్తవైఖరి నవలంభించెను. శ్రీ సుదర్శనంగారు ధర్మారావు యొక్క యశ్రధ్ధను విసుర్శించుచు నిట్లు వ్రాసిరి. ధర్మారావు చరిత్రలో అర్ధంకాని విషయం అతను భార్య ఆరోగ్యంపట్ల చూపిన అశ్రధ్ధ. పదేళ్ళు ముందుగా ఈ జ్ఞానికి గణాచారి హెచ్చరించినా ఆ విషయమై పట్టించుకోడు. ఇది కాకమానదు అన్న మిధ్యావేదాంతమును ధర్మారావిచట ప్రదర్శిచెనన రాదుకాని నిర్లక్ష్యము చూపినదిమాత్రము సత్యము. ఒకనాడు గణాచారి సుబ్రహ్మణ్యేశ్వరాయముననుండగా ధర్మారావచటికి వెళ్ళుట తటస్థించినది. గణాచారి మిగిలిన పడగలెన్నియని ధర్మారావు నడిగినది. రెండని యతడు చెప్పగా అందులో ఒకటి మాసిపోయినది. దానికి మరల నాకృతి తేవలయును అన్నది ధర్మారావు మహాదుఃఖమును కంఠమున నదిమి పెట్టెను. గణాచారి మరల పదేండ్ల మాటయన్నది. ఇట్లు పది సంవత్సరముల తరువాత జరుగబోవు అరుంధతీ మరణవార్త ధర్మారావునకు తెలిసియేయున్నది. కానియతడు తానుకష్టసుఖములకతీతుడననిభావించువాడు. అరుంధతి యొడలిలోవ్యాధి ప్రారంభమయిన తరువాతకూడ నతడు సకాలమునకు గృహమునకువచ్చి భోజనముచేయడు. అంతవరకరుంధతి కూడ భోజనము చేయకుండ నతని కైవేచియిండెడిది. ఆమెకుశక్తి క్షీణించిన కొలదివిసువేర్పడినది. ఈ ఆవేశ భోజనములతో నాకేదేని పెద్దవ్యాధిపుట్టి నేను బ్రతుకనులెండు. అదియును దగ్గరకువచ్చినట్లేయన్నది అనినది. ధర్మారావునకరుంధతియొక్క మరణవిషయము ముందేతెలియుటచేత నిర్లక్ష్యము చేయకపోయనను, అరుంధతితో సుఖించినప్పుడున్నంతగనాతని భావములో తీవ్రతలేదనవలెను. ఎచ్పటికైనను తీసికొనిపోయియామెకు మందిప్పంపవలయునన్న ధర్మారావుయొక్క యూహయూహగనుండగనే పరిస్థితిచేజారిపోయింది.
|