కుముద్వతి
ఆశ్వమేధము నవలలోని కుముద్వతి కులీనురాలుకాదు. కల్లు తయారుచేసి యమ్ముకొనెడి గౌడులపిల్ల. అయినప్పటికిని లోకోత్తర సౌందర్యవతి. తల్లిదండ్రులకా సౌందర్యమును వ్యాపారముగమార్చవలె నన్నకోరికగలదు. ఒక జమిందారుతోనామెకు పొత్తుకుదిర్చి ధరమార్జింపవలెనని యనేకవిధముగ నామెబంధువులు ప్రయత్నించిరి. ఆమెశతవిధములుగ నాప్రయత్నములను వమ్ముచేసినది.
కుముద్వతి తల్లిదండ్రులు చివరికామెను బృహద్రధమహారాజునకిచ్చి పెండ్లిచేయుటలో కృతకృత్యులైరి. ఆమెమహారాజునకు ధర్మపత్నియైనది. ఆమెతల్లితండ్రులు, క్రూరుడైన సోదరుడు, దుర్మార్గులైనపోదరుని మిత్రులు, బంధువులు కోటలోనివసించుట మొదలుపెట్టిరి. కుముద్వతిని రాజుతోకలువకుండ వారుకట్టుదిట్టమలుచేసిరి.
కుముద్వతి దురదృష్టవశమున నాభర్తకూడ నామెక్షేమమును కోరెడివాడుకాదు. అతనికి కుముద్వతియన్నచో ప్రాణమునకన్నమిన్న. కానియామె యెట్లుజీవించుచున్నదో పట్టించుకొను వివేకమతనికిలేదు. అతడహరహము మధుపానమత్తు చిత్తుడగుట శత్రువులకే లాభదాయకమైనది.
కుముద్వతి శత్రువులామె బంధువులేయగుట విశేషము. కన్నతల్లి తండ్రి, సోదరుడు ఆమెను నిత్యము రాజుతో చెప్పి ధనమును తెప్పింపుమని వేధింపసాగిరి. అన్న ఆమె యొడలు కందెలు కట్టునట్లుగ కొట్టినను కుముద్వతి వారిమాటలను వినెడిదికాదు.
బృహద్రధుడు ముసలివాడైనప్పటికిని కుముద్వతి యతనిని మనస్ఫూర్తిగ ప్రేమించి, యతనిక్షేమమునకై యహర్నిశలుపాటుపడుచుండెడిది. తనవారు భర్తకుకీడు చేయదలచి ప్రమాదకరములైన వివిధ సురలనుచేసి త్రాగించుటకు ప్రయత్నించు చుండగా నామెవారు కొట్టు దెబ్బలనూ సహించికూడ భర్తచేతనాసురను త్రాగనీక యవతలపారబోసెడిది. ఆ రాత్రి కామెనరకమనుభవించెడిది. బృహద్రధునికున్న సురపానవ్యసనముచేత కుముద్వతి జీవితమునాశనమైనది. ఈమెను పతివ్రతయనవలెను.
బృహద్రధునకు కుముద్వతి యన్నచో ప్రమేలేకపోలేదు. అందుచేత నామెకు భావిరాజెవ్వరగుదురోచెప్పి రాజ్యాంగవిషయములుచెప్పి యామెకు రాజనీతి నవగతముగావించినాడు. అతడు వృద్ధుడై దుర్వ్యసనములలో కొట్టుకొని జీర్ణదేహుడై మరణోన్ముఖుని వలెనుండి కుముద్వతికి రాజ్యమును కట్టబెట్టుటకు సంశయింపడు. కానియామెకు రాజ్యమక్కరలేదు. రాజేకావలయును. ఆ వృద్ధునామె యంతగ ప్రేమించినది. అతని ప్రాణములను కాపాడుట కహోరాత్రములు శ్రమపడినది.
కుముద్వతికి రాజ్ఞీత్వమనుభూతమైనను గర్విష్టురాలుకాలేదు. అన్నయగు శతానీకుని దౌష్ట్యమును వారింపవలెననుకొనెడిది. కాని యనుభవములేనిదగుటచే, విద్యావిహీనురాలగుటచే, సామాన్య సంసారములో పుట్టి రాచరికమునకు వచ్చినదగుటచే పరిస్థితులామెకు కొరకుడుపడలేదు. అయినను తనకుచేతయినంతగ చేసినది.
భర్తచే సురాపానమును చేయింపుమన్న అన్నమాటను లెక్కచేయక భర్తచే సురాపానమును మాన్పించుటకు కృషిచేసినది. కాలముగడుచు కొలది వారి దౌష్ట్యము పెచ్చుపెరిగి రాజును పుష్యమిత్రుడను మహాసేనానిని చంపవలెనని యుక్తిపన్నుట జరిగినది.
బృహద్రధుడు పుష్యమిత్రుని పున్నమినాడు రమ్మనియాహ్వానించెను. ఆనాడు పుష్యమిత్రునకు వివిధసురలను చూపించి తయారుచేయుట మొదలైనవి చెప్పెదననెను. పుష్యమిత్రుడు వచ్చుసమయమునకు శతానీకుడనేకమంది కఠారికాండ్రను సురలుంచు గదిలోపెట్టి తాళమువేసి, రాజును, పుష్యమిత్రుడు నచ్చటికివచ్చుసమయమున వారిరువురిని వధింపుమని చెప్పెను.
కుముద్వతికీ కుట్ర తెలిసినది. రాజును సేనానియును అన్నిగదులును చూచి కఠారికాండ్రున్న గదిదగ్గరకు వచ్చినప్పుడామె వారినాగదిలోకి పోనీకుండ వారించినది. శతానీకుడామె మెడపిసుకబోగా పుష్యమిత్రుడాతనిని వధించెను. ఆసమయమున జరిగిన చిరుపోరాటమున రాజు పుష్యమిత్రునిపై లంఘించెను. పుష్యమిత్రుడాత్మరక్షణార్థము కత్తి యడ్డుకొనగ నాకత్తి రాజుగుండెను చీల్చినది. కుముద్వతి భర్తృహీనయైనది. ఆమెకున్న యొకేయొక్కయాశ అడుగంటినది. తల్లిదండ్రులామెను బ్రతుకనీయరు, దుష్టుడైన నశతానీకుడు మరణించినను, అతనికంటె దుష్టులాతని స్నేహితులు, వారుకొలదిమంది సేనాధిపతులను తమవైపునకు త్రిప్పుకొనిరి. కుముద్వతి పరిస్థితి కత్తుల బోనులో పెట్టినట్లున్నది. భర్తగతించెనన్న విచారమెంతయున్నప్పటికిని కొలదికాలమైన నంతఃపురములో నుండుటచేతను రాజామెకపుడపుడు రాజ్య పరిస్థితులు బోధపరచుటచేతను ఆమెయాక్లిష్టపరిస్థితిలో చాలవివేకముగ ప్రవర్తించినది. ఆమెమిన్నకుండినచో నంతర్యుద్ధము చెలరేగికొన్ని ప్రాణములు పోయెడివి.
ఆసమయమున కుముద్వతి పుష్యమిత్రుని అందరు సేనానులుండగా మహారాజా యని సంబోధించినది. ఆసంబోదనమా సేనానాయకులనేగాక పుష్యమిత్రుని కూడ చకితుని గావించినది. కుముద్వతి తనసంబోధనమును సమర్ధించుకొనుచు వారందరికి ననేకములైన సత్యములను చెప్పినది. పుష్యమిత్రునిపై రాజునకెంత గౌరము నమ్మకముగలదో చెప్పినది. అతని శౌర్య, వివేకాదులపై నమ్మకముగల రాజు తనతరువాత రాజ్యాధికారము పుష్యమిత్రునిదేయని తనతోచెప్పుట తెలిపినది. మహాసేనానులందరియెదుట తల్లిదండ్రులు మోసముచేసి రాజునకు తననిచ్చి వివాహము చేయుట తెలిపినది. జీవకుడను మంత్రికొన్ని యూళ్ళకాశపడి యట్లు చేసెనన్నది. అంతవరకు వారికామెపైనున్న హేయమైనభావము తొలగిపోయినది. వారందరికామెపై సదిభిప్రాయముందెడిదికాదు. నీచకుల సంజాతయనియు సౌందర్యముతో రాజును మోహింపచేయు కులటయనియువారు భావించెడివారు. ఆమెచెప్పిన విషయములకు వారు తెల్లబోయిరి. సోదరుడు, తండ్రితనచేత నెన్నియకార్యములను చేయింపదలచిరో చెప్పినది.
రాజుపై కుముద్వతికిగల శ్రద్ధ ప్రేమ భర్త అతనియారోగ్యమును గూర్చి యామెపడినబాధను తెలిసికొనిన సేనానులు నివ్వెరబోయిరి. తనవాడు తననెంత హింసించిరో వస్త్రమును తొలగించిచూపినది. ఆమెయొడలంతయు కండెలుగట్టియున్నది. వారెంతహింసించినను నేలమీదపడవేసి యీడ్చినను రాజునకిచ్చిన మద్యమును తొలుతతాను రుచిచూడకుండనిచ్చెడిదికాదు. భర్త ప్రాణములకై శ్రమయంతయు నతనిమరణముతో వృధయైనది.
కుముద్వతి రాజు యొక్క కోరిక తెలిపి పుష్యమిత్రుడే రాజు కావలెనని మిగతవారి నోళ్ళను మూయించి అంతఃకలహములకు తావీయకుండజేసినది. రాజ్యమునకు సమర్ధుడైన రాజుండవలెనని భావించుచు తనకు రాజ్యాధికారమక్కరలేదనినది. పుష్యమిత్రుని కత్తివలననే రాజుమరణించినను కుముద్వతియాతనిపై పగబూనలేదు. రాజుఅసమర్థుడనియు, ఎన్నినాళ్ళో అతనిని బ్రతుకనీయరనియు యామెకువిదితమే. అందుచేతనే రాజ్యమును సమర్ధుడైన పుష్యమిత్రుని చేతిలో పెట్టదలచినది.
తాళికట్టినందుననే వ్యసనపరుడైనరాజును నిర్వ్యాజముగ ప్రాణములను సహితము లెక్కచేయక ప్రేమతోకాపాడదలచుటలో నామెసౌశీల్యము వ్యక్తమగుచున్నది.
ఇచట విశ్వనాథవారు పాతివ్రత్యముగాని సౌశీల్యముగాని యొక వర్ణమునకో వర్గమునకో పరిమితముకాదనియు సర్వకులసంజాతలైన స్త్రీల సహజగుణమనియు చెప్పదలచిరి. అలంకారములపైగాని ఆడంబరములపై గాని మోజులేని కుముద్వతికి ఆమె సుగుణములే వెలలేనిరత్నములు కుముద్వతిలోనొక్క నీచగుణములేదు. అద్దమువంటి నిష్కల్మషమైన హృదయముతో భాసించినది. తనరక్త బంధువులందరును, నీచులు, దుర్మార్గులు, క్రూరులుకాగా నీమెవారికి శతవిధముల వ్యతిరేకతను సంతరించుకిన గంజాయివనమున తులసిమొక్కవలె పవిత్రురాలైనది. కడకురాజ్యమును పుష్యమిత్రునకప్పగించి బౌద్ధబిక్షుకియైనది. ఇదియామె స్వభావమున కెంతయోతగియున్నది. కుముద్వతి సహృదయురాలు. సహజ వైరాగ్యభావముతో ప్రవర్తిల్లిన నిరాడంబర నారీతిలకం.
|