1
ప్రమాణ‌ధ‌ర్మమేది

మాన‌వున‌కు సామాన్యముగా నూరు సంవ‌త్సర‌ములు ఆయువ‌ని చెప్పబడుచున్నది. అది మామూలుగా చెప్పు పెద్దల మాట‌గాని, అంత‌కాల‌ము చాలా మంది జీవించ‌క కొద్దివ‌య‌స్సులోనే మ‌ర‌ణించుట మ‌న‌ము ప్రతిదిన‌ము చూచుచున్న విష‌య‌మే. మ‌న‌కు భ‌గ‌వంతుడిచ్చిన ఆయువులో సగ‌ము నిద్రచే పోవుచున్నది. ఆ నిద్రకాల‌ములో మ‌న‌మేమియు ఉప‌యోగ‌మైన కార్యముచేయుట లేద‌నియే చెప్పవ‌ల‌సియున్నది.నిద్రపోను మిగిలిన కాల‌ములో షుమారు 20 సంవ‌త్సర‌ముల వ‌య‌స్సు వ‌చ్చు వ‌ర‌కు ప్రపంచ ప‌రిస్థితులేమియు తెలియ‌క కేవ‌ల‌ము జ్ఞానావ‌స్థలో నుంటున్నాము. ద‌రిమిలా యౌవ‌న కాల‌ములో స్త్రీలోలురై ధ‌ర్మాధ‌ర్మమెరుగ‌క కేవ‌లం సంసార‌లంప‌టుల‌మై కాల‌ము గ‌డుపుచున్నాము. యౌవ‌నావ‌స్థ దాటిన త‌రువాత వృద్ధాప్యము సంభ‌వింప‌గా సంసార బాధ‌చేత‌ను దేహ‌దార్ఢ్యము లేక రోగ‌ముల బాధ‌చేత‌ను, మృత్యువు స‌మీపింప‌నుండుట‌చే యీలోక‌మును వీడి పోవ‌ల‌శి వ‌చ్చునేమో న‌ను భ‌య‌ము చేత‌ను చింతాక్రాంతుల‌మై క్రుంగిపోవుచున్నాము. మ‌న‌జీవిత కాల‌మంత‌ము నీవిధ‌ముగా వృధా అయిపోవుచున్నది. యీ స‌త్యమును వేద‌మీ క్రింది విధ‌ముగా చెప్పుచున్నది.

"అజ్ఞానోప‌హ‌తో బాల్యే యౌవ‌నేవ‌నితాహ‌తః
శేషేక‌ళ‌త్ర చింతార్తః కింక‌రోతి న‌రాధ‌మః"

కాని మ‌నిమీ భూమి మీద యెందువ‌ల‌న జ‌న్మించితిమి? మ‌న‌ము చేయ‌వ‌ల‌సిన క‌ర్తవ్యమేమి? మ‌న జీవిత‌ము లెట్లుగ‌డ‌ప‌వ‌ల‌యును? మ‌న‌ము మ‌ర‌ణించిన పిద‌ప తిరిగి యేమ‌గుదుము? మ‌న‌కు జ‌న్మ మ‌ర‌ల క‌లుగునా? ఇంత‌టితో ఆఖ‌రా ? క‌లిగిచో దేనిని బ‌ట్టి క‌లుగును? మ‌న‌జీవిత‌మున‌కు ప‌ర‌మావ‌ధియేది? జ‌న‌న మ‌ర‌ణ‌రాహిత్యము క‌లుగుటెట్లు ఇత్యాది విష‌య‌ములు మ‌న‌కున్న కాల‌ములో నొక గ‌డియ సేపైన‌ను విచారించము. కాల‌మంత‌యు వృధాగా పాడుచేయు చున్నాము. క‌ర్తవ్య మెరుగ‌క అజ్ఞానాంధ‌కార‌ములో మునిగి యున్నాము. ఇట్టి దుస్థితిలో నుంచి మ‌న‌ల‌ను తొల‌గించ గలిగిన‌ది మ‌త‌విద్య ఒక్కటియే. ఈ కాల‌మందా విద్య స‌న్నగిల్లుట‌చే నిట్టిఅధోగ‌తి త‌ట‌స్థించిన‌ది. ఈ జ‌న్మ యందు మ‌న‌క‌ర్తవ్యమును గుర్తెరుగ‌క మ‌న యిచ్చ వ‌చ్చిన‌ట్లు సంచ‌రించుట‌చే నీ జన్మ వృధాయ‌గుచున్నది. మ‌ర‌ణాంత‌ర‌ము తిరిగి జ‌న్మ క‌లుగున‌ని వేద‌ము ఘోషిల్లుచున్నది. ఆ జ‌న్మ యీజ‌న్మలో మ‌న‌ము చేసిన సుకృత దుష్కృత‌ముల‌ను బ‌ట్టి యుండును. క‌నుక వ‌చ్చే జ‌న్మ కూడ మ‌న‌మే నిజ‌ముగా క‌ల్పించు కొనుచున్నామని చెప్పక త‌ప్పదు. అట్టిచో ఈ జ‌న్మలో మ‌నము సక్రమ ప‌ద్ధతిని జీవిత‌ము గ‌డ‌ప‌నిచో వ‌చ్చే జ‌న్మ కూడా పాడ‌యి పోవును. మ‌న అజ్ఞాన స్థితి వ‌ల‌న నిట్టి ఘోర ఆప‌ద మ‌న‌కు సంభ‌వించుచున్నది. త‌న్ను తానే ఉద్ధరించుకొన వ‌ల‌యున‌నియు, నిత‌రు లెవ్వరివ‌ల‌న‌ను ఆత్మోద్ధర‌ణ శ‌క్యము కాద‌నియు శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు గీతా శాస్త్ర మందు స్పష్టప‌ర‌చి యున్నాడు.

ఉద్ధరే దాత్మనాత్మానం నాత్తా న‌మ‌వ‌సాద‌యేత్‌
"ఆత్మై వ‌హ్మాత్మనో బంధురాత్మైవ‌రి పురాత్మనః !!
బంధురాత్మాత్మన స్తస్యయే నాత్మైవాత్మ నాజితః
అనాత్మన‌స్తుశత్రుత్వె వ‌ర్తేతాత్మైవ శ‌త్రువ‌త్‌".

మ‌న క‌ర్తవ్యమును మ‌న‌కు మంచిద‌ని తోచిన రీతిని నిర్ణయించు కొన‌వ‌చ్చునా దీని కేమైనా ప్రమాణ మున్నదాయ‌ను విష‌య‌ము మ‌న‌ము చూడ‌వ‌ల‌సియున్నది. మ‌న యిచ్చ వ‌చ్చిన‌ట్లు న‌డుచుకొనుట‌కు వీలులేదు. శాస్త్రమునందు చెప్పబ‌డిన రీతిని మ‌న‌ము సంచ‌రించ‌వ‌ల‌యును. శాస్త్రము న‌తిక్రమించుట‌కు వీలులేదు. ఎవ‌డు శాస్త్రోక్త విధిని వ‌ద‌లి యిచ్చ చొప్పున చేయుచున్నాడో వానికి సిద్ధిల‌భింప‌దు. సుఖ‌ములేదు. ఉత్తమ‌గ‌తియు ల‌భింప‌దు. కావున క‌ర్తవ్యాక‌ర్తవ్యముల‌ను నిర్ణయించుట‌కు శాస్త్రము ప్రమాణ‌ముగ గ్రహింప‌వ‌ల‌యును. శాస్త్రమున చెప్పబ‌డిన దాని నెరిగి త‌ద‌నుసార‌ముగ క‌ర్మలంజేయుట యీ లోక‌మున మ‌న‌కు క‌ర్తవ్యము.


"యఃశాస్త్రవిధి ముత్సృజ్యవ‌ర్తతే కామ‌కార‌తః
న‌స‌సిద్ధిమ‌వాప్నోతి న‌సుఖం న‌ప‌రాంగ‌తిం.
త‌స్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవ‌స్థితౌ
జాత్వాశాస్త్ర విధానోక్తం క‌ర్మక‌ర్తు మిహ‌ర్హసి"

శాస్త్రమునందు చెప్పబ‌డిన ధ‌ర్మమునే అవ‌లంభింప‌వ‌లెన‌ని తేలిన‌ది. కాని ఆశాస్త్రమేది ఈ కాల‌ములో ప్రతి సంస్కృత శ్లోక‌మును శాస్త్రముగ‌నే ప‌రిగ‌ణింప‌బ‌డి ప్రమాణ‌ముగ చూప‌బ‌డుచుండుట మ‌న మెరుగ‌ని విష‌య‌ము కాదు. ఏ శాస్త్రము ప్రమాణ‌మైన‌దో మ‌నము గుర్తెరుగ‌క పోవుట‌వ‌ల‌న‌నే మ‌న‌లో అంతఃక‌ల‌హ‌ములు పెరుగుట‌యు నిజ‌మైన ధ‌ర్మము బ‌య‌లుప‌డ‌కుండుట త‌ట‌స్థించుచున్నది. ఎవ‌డికివాడు ప్రమాణ‌మ‌ని యేదో సంస్కృత గ్రంధ‌ము నొక దానిని తీసికొని దానిలోనుంచి ఒక శ్లోక‌మును చ‌దివి త‌న‌వాద‌మును నిలువ‌చెట్టుకొన ప్రయ‌త్నించుచున్నాడు. ఇది ఆంత‌యు మూర్ఖత యొక్కయు అజ్ఞాన‌ము యొక్కయు ఛాంస‌ము యొక్కయు ఫ‌లిత‌ము. ప్రమాణ‌మ‌గు శాస్త్రమొక్కటియే. అదియే వేద‌ము.

"న‌హివేదాత్ ప‌రంశాస్త్రం
ధ‌ర్మంజిజ్ఞా స‌మానానాం ప్రమాణం ప్రధ‌మం శ్రుతిః"  (భార‌త‌ము)

వేద‌మే యీ విష‌య‌మును స్పష్టప‌ర‌చిన‌ది.
"కాబ‌ట్టి వేద‌ముల‌లో ఏది చెప్పబ‌డెనో అదియే స‌త్యము. బుద్ధిమంతులు వేద‌ముల‌లో చెప్పబ‌డిన దానిపై ఆధారప‌డియుందురు. వేద‌ములో లేనిదానిని బ్రాహ్మణుడు చ‌దువ‌రాదు".

శుక్ల య‌జు ర్వేద‌ములో స‌హిత‌ము ఈ విష‌య‌మే వివ‌రింప‌బ‌డిన‌ది. శ్రుతిధ‌ర్మమే శాశ్వత ప‌ద‌వికి మార్గమ‌ని నిరూపింప‌బ‌డిన‌ది. వేదాంతే సుప్రతిష్ఠోహం వేదాంతం స‌ముపాశ్రయ (ముక్తికోప‌నిష‌త్‌) కానివేదమే ప‌ర‌మ ప్రమాణ‌మ‌ని మీరు చెప్పుచుండిరి గ‌దా. స్మృతులు, పురాణ‌ములు, ఇతిహ‌స‌ములు మొద‌ల‌యిన‌వి అనేక గ్రంధ‌ములు దేశ‌ములో క‌ల‌వుగ‌దా, అవి అన్నియు శాస్త్రముల‌నిపించుకొన‌వా వాటిస్థితియేమ‌ని చ‌దువ‌రులు ప్రశ్నింప‌వ‌చ్చును. ఈ విష‌య‌ము చాల‌ముఖ్యమ‌యిన‌ది. దీని య‌దార్ధస్థితి, తెలిసికొనిన‌చో వివాద‌ముల‌కు తావేలేక శాశ్వత‌మైన శాంతి గ‌లుగును. ఏది నిజ‌మైన ధ‌ర్మమో గుర్తెరుగుదుము.


                                                   స్మృతుల స్వరూప‌ము

స్మృతుల యొక్క విలువ‌యు వాటి యదార్ధ స్థితియు వివేకానంద స్వాముల‌వారు బహు స్పష్టముగా చెప్పియున్నారు. "స్మృతులయొక్క ప్రామాణ్యము వేదాంత‌మున‌కు లోబ‌డియే యుండును. ఇత‌ర మ‌త‌గ్రంధ‌మ‌లు మ‌న కెంత‌విలువ‌యో స్మృతులును అంతియే సంబంధ‌ముక‌ల‌వి. స్మృతులు ప‌ర‌మ‌మ ప్రమాణ‌మ‌లు కావు. వేదాంత‌విరుద్ధమైన విష‌య‌మేదియైన‌ను స్మృతియందున్నచో ఆ స్మృతిని విడ‌నాడ‌వ‌ల‌యును. దాని ప్రామాణ్యము పోయిన‌ది. కాలక్రమేణా యీ స్మృతులు మారిపోవుట‌యును మ‌న‌ము చూచుచున్నాము. స‌త్యయుగ‌ములో నొక‌స్మృతియును ద్వాప‌ర‌యుగ‌ములో మ‌రియొక‌టియును త్రేతాయుగ‌ములో నింకొక‌టియును క‌లియుగ‌ములో వేరొక‌టియును స్మృతులు ప్రమాణ‌ముల‌ని చ‌దువుచున్నాము. దేశకాల ప‌రిస్థితుల న‌నుస‌రించి జాతుల‌యొక్క న‌డ‌త‌లును ఆచార‌ములును మారుచున్నవి. కాబ‌ట్టి స‌మ‌యాచార‌ముల శాసించు స్మతులును కాల‌మును బ‌ట్టి మార‌వ‌ల‌సివ‌చ్చెను. ఈ విష‌య‌ము ముఖ్యముగా మీరు జ్ఞాప‌క‌ముంచుకోవ‌లెన‌ని కోరుచున్నాను. వేదాంత‌ములోని మ‌త‌సూత్రములు ఎన్నటికినిమారున‌వి కావు. ఎందువ‌ల‌న? మాన‌వుని యొక్కయు ప్రకృతియొక్కయు శాశ్వత సిద్ధాంత‌ముల పైన నిర్మింప‌బ‌డిన‌వి కాన‌మార‌వు. సాంఘిక ప‌రిస్థితుల‌పై నాధార‌ప‌డిన ఆచార‌ములు సంఘ‌ముల‌తో పాటు మారుచుండును. ఒక కాల‌మంద‌లి ప‌రిస్థితి అప్పటికి మంచిదిగానుండును, మ‌రియెక కాల‌మున‌కు మంచిది కాదు. ఒక‌ప్పుడు మంచియైన ఆహ‌ర‌ము శీతోష్ణప‌రిస్థితుల బ‌ట్టి మ‌రియొక కాల‌మందు కొర‌గాదు. స్మృతులందువ‌ల‌ననే కొన్ని ఆహార‌ముల‌ను మాన్పించెను. క‌నుక యీన‌వీన యుగ‌ములో మ‌న‌సంఘ‌ములో కొన్ని మార్పులు కావ‌ల‌సిన‌చో అవిజ‌రిగి యే తీర‌వ‌లెన‌ని స‌హ‌జ‌ముగ‌నే యేర్పడుచున్నది. ఆ మార్పులెట్లు జ‌రుప‌వ‌ల‌సిన‌దియు శ్రేష్ఠులు (యోగులు) వ‌చ్చి చెప్పుదురు. అంత‌మాత్రముల‌న మ‌నమ‌త‌ములో నొక అణువైన‌ను మార్పు క‌లుగ‌దు. మ‌త‌సిద్ధాంత‌ము ల‌ట్లేయుండును".
స‌మ‌యాచార‌ముల సంగ్రహ‌యే స్మృతియ‌ని స్వాముల‌వారు స్పష్టప‌ర‌చిరి. కొన్ని విష‌య‌ముల‌లో వేద‌ధ‌ర్మమున‌కు స్మృతిధ‌ర్మము విరుద్ధముగా నున్నద‌ని యీ క్రింది శ్లోక‌ము వ‌ల‌న విశ‌ద‌మ‌గుచున్నది.

"శ్రుతిస్మృత్యోర్విరోధేతు శ్రుతిరేవ‌బ‌లీయ‌సీ,
విరోధేత్వన‌పేక్షం స్యాద స‌తిహ్యనుమాన‌తః"

ఈ విచార‌ణ‌ను బ‌ట్టి తేలిన సారాంశ మేమ‌న‌గా :-

శ్రుతిధ‌ర్మము శాశ్వత‌మైన‌ది. మార‌నిది. ప‌ర‌మ ప్రమాణ‌మైన‌ది. స్మృతిధ‌ర్మము స‌మ‌యాచార‌ము. దేశ‌కాల పాత్రముల‌ననుస‌రించి మారును. ప్రమాణ‌మైన‌దికాదు.