11
పంచ మ‌హ‌య‌జ్ఞములు.

గృహ‌స్థుడు బ్రాహ్మణ‌త్వసిద్ధిపొందుట‌కు కొన్ని క‌ర్మల‌ను జేయ‌వ‌ల‌సియున్నది. స‌ద‌రుక‌ర్మల‌ను వేద‌ము విధించుచున్నది. ఆక‌ర్మల‌నుస‌యిత‌ము వానియొక్క అంత‌ర్భావ‌ముల‌ను గ్రహించి నాచ‌రించిన ఉప‌యోగ‌ప‌డునేగాని లేనిచో నిష్ప్రయోజ‌న‌మ‌గును. ఆక‌ర్మల‌యొక్క నిజ‌త‌త్వమును గ్రహించ‌వ‌ల‌యును.

"య‌దేవ విద్యాయాక‌ర‌తి శ్రద్ధయోప‌నిష‌ద‌త‌దేవ వీర్యవ‌త్తరం భ‌వ‌తి "  (సామ‌వేద‌ము)

ఇవియే పంచ‌మ‌హ‌య‌జ్ఞములుగా చెప్పబ‌డుచున్నది.

1. బ్రహ్మయ‌జ్ఞము. 2. పితృయ‌జ్ఞము. 3.దేవ‌య‌జ్ఞము 4.భూత‌య‌జ్ఞము 5.మ‌నుష్యయ‌జ్ఞము. ఈ య‌జ్ఞముల‌ను ప్రతిదిన‌మును జేయ‌వ‌ల‌యును.

బ్రహ్మయ‌జ్ఞము

బ్రహ్మయ‌జ్ఞమ‌న‌గా వేద‌ముచ‌దువుట‌యును, అంద‌లి ధ‌ర్మమును యిత‌రుల‌కు చెప్పుట‌యును. తైత్తిరీయోప‌నిష‌త్తు శిక్షావ‌ల్లిలోని ఉపాస‌క‌ధ‌ర్మముల‌లో యీవిష‌య‌మే ఆదేశింప‌బ‌డిన‌ది. స్వాధ్యాయ ప్రవ‌చ‌నేచ‌. స్వాధ్యాయ‌మ‌న‌గా తానుప‌ఠించుట‌, ప్రవ‌చ‌న‌ముగా యిత‌రుల‌కుభోధించుట‌, ఇవి త‌ప్పక అనుష్టింప‌ద‌గిన‌వి. బ్రహ్మచ‌ర్యాంత‌మున గురువు
స్వాధ్యాయ ప్రవ‌చ‌నాభ్యాం న‌ప్రమ‌దిత‌న్యం (11 అనువాక‌ము. శిక్షావ‌ల్లి) అని శిష్యున‌కు భోధించియిది వేద‌శాస‌న‌మ‌నియు, ఆదేశ‌మ‌నియు, అవ‌శ్యమాచ‌రింప‌వ‌ల‌యున‌నియు, చెప్పియున్నాడు.

"ఏష ఆ దేశః, ఏష ఉప‌దేశః, ఏషా వేదోప‌నిష‌త్‌!
ఏత‌ద‌న‌నుశాస‌నం ఏవ‌ముపాసిత‌వ్యం"

అందువ‌ల‌న‌నే వీనిప‌ట్ల ప్రమాదము పొంద‌రాదు. వేద ధ‌ర్మమును అన‌గా బ్రహ్మవిద్యను దాన‌ముచేయుట‌, దాన‌ములలోకెల్లనుత్కృష్టమైన‌ది. వేద ధ‌ర్మమును తాను తెలెసుకొనుట‌యు, యిత‌రుల‌కు బోధించుట‌యు, నిత్యవిధియైయున్నది.

"స‌ర్వేషామేవ దానానాం బ్రహ్మదానం విశిష్యతే "(మ‌ను. 4-233)

దేవ‌య‌జ్ఞము

దేవ‌య‌జ్ఞమున‌కు కొంద‌రు హొమ‌ముచే దేవ‌త‌లనారాధించుట‌య‌నియ‌ర్ధము చెప్పుచు అట్లాచ‌రించుచున్నారు దేవ‌య‌జ్ఞముయొక్క నిజ‌మ‌గుత‌త్వమ‌దికాద‌నిత‌లంపు.

దేవ‌త‌ల నారాధించుట‌యే వేద‌ము నిషేధించుచున్నది. ఆరాధించ‌వ‌ల‌సిన‌ది ప‌ర‌మేశ్వరునిగాని దేవ‌త‌ల‌నుగాదు.

"అధ‌యోన్యాం దేవ‌తాముపాస‌తే న్యోసావ‌న్యోహ మ‌స్మీతి న‌స‌వేద‌య‌ధాప‌శుః" (బృహ‌దార‌ణ్యక‌ము 1-4-10)

వేర్వేరు దేవ‌త‌ల‌ను పూజించువారు దేవ‌త‌ల‌కు ప‌శువుల‌ని యీమంత్రమునందు చెప్పబడిన‌ది. ఆవు మొద‌ల‌గు ప‌శువుల‌వ‌ల‌న మ‌నుష్యుల‌కు యెట్లులాభ‌మో ఆరీతినే యీ అజ్ఞానుల‌గు భ‌క్తుల‌వ‌ల‌న దేవ‌త‌ల‌కుమాత్రమే లాభముగ‌ల‌ద‌నియు వారికి మోక్షమురాద‌నియు, యీవేద మంత్రము యొక్క భావ‌ము. ప‌ర‌మేశ్వరుని తెలుసుకొన‌లేక సంవ‌త్సర‌ముల‌కొల‌ది యెన్ని హోమ‌ముల చేసిన‌ను ప్రయోజ‌న‌ములేద‌నిన్ని, ఆత‌డే తెలుసుకొన‌ద‌గిన వాడ‌నిన్ని, వేద‌ము ఘంటాప‌ధ‌ముగా చాటుచున్నది.

"యోవాయేత‌ద‌క్షరం గార్గ్యవిదిత్వా అస్మిత్‌లోకేజు హొతియ‌జ‌తేత‌ప‌స్తప్యతే బ‌హూనిద‌ర్ష స‌హ‌స్రాణ్యన్తవ దేవాస్య త‌ద్భవ‌తి" (బృహ‌దార‌ణ్యకం 5-8-10)

దేవ‌త‌ల‌య‌జ‌న‌ము శాస్త్రోక్తమైన‌దిగాద‌ని శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు గీత‌యందు చెప్పుచున్నాడుజ‌(గీత. 9-23, 24, 7-15, 20, 22-25)
యోగ‌క్షేమ‌ముల‌కు హోమ‌య‌జ్ఞాదుల‌ను త్రోవ‌నువిడ‌చిన‌ను భ‌య‌ములేదు. ప‌ర‌బ్రహ్మయొక్క సేవ‌చేత అన‌గాఆయ‌న‌యెడ‌ల ప్రీతియు, ఆయ‌న‌కు ప్రియ‌మైన కార్యములుచేయుట‌వ‌ల్లను ప‌ర‌లోక‌సంబంధ‌మ‌గున‌ట్టియు, యీలోక‌సంబంధ‌మైన‌ట్టియు శుభ‌ముక‌లుగుచున్నద‌ని వేద‌ములఘొషిల్లుచున్నది.

ఏక‌స్యత‌స్యైవోపాస‌న యాపార‌త్రిక మైహికంచ శుభంభ‌వ‌తి (శ్రుతి) త‌స్మిత్ ప్రీతిత‌స్యప్రియ కార్యసాధ‌నంచ త‌దుపాసన‌మేవ (శ్రుది)

ఇంక దేవ‌య‌జ్ఞమ‌న‌నేమి విద్వాంసోహిదేవాః అని శ‌త‌ప‌ధ బ్రహ్మణ‌మునందు చెప్పబ‌డియున్నది. దేవ‌య‌జ్ఞమ‌న‌గా వేద‌విద్యయందారితేరిన‌వారి సేవ‌యును, సాంగ‌త్యమును, పూజ‌యును, స‌త్కార‌మును నైయున్నది. విద్వాంసుల నాద‌రించుట‌య‌న వేద‌విద్యనాద‌రించుట‌యు త‌ద్వ్యప‌క‌మున‌కై కృషిచేయుట‌యును. యోగ్యుల‌గు శిష్యుల‌ను బ్రహ్మచ‌ర్యమునందు ప్రవేశ‌పెట్టి వారికిగ‌దిన విద్యోప‌దేశ‌ము చేయుట గృహ‌స్థుని విదియేగ‌దా! తైత్తిరీయోప‌నిష‌త్తు 4వ అనువాక‌మందే హోమార్దమైన మంత్రముల‌లో గూడ‌నిట్లే చెప్పబ‌డియున్నది.

పితృయ‌జ్ఞము

పితృయ‌జ్ఞమ‌న‌గా పితృదేవ‌త‌ల‌నారాధించు నొక శ్రాద్ధక‌ర్మయ‌నియు, దీనిని ప్రతినిత్యము జేయ‌వ‌ల‌యున‌నియు, మ‌న‌లో కొంద‌రు చెప్పుచుండుట మ‌న‌ము వినుచున్నాము. కాని ఇది స‌త్యమైన‌దికాదు. పితృదేవ‌త‌లెవ్వరు? ఈ వివ‌ర‌ము మ‌నుస్మృతి యందిట్లు చెప్పబ‌డిన‌ది. హిర‌ణ్యగ‌ర్భాప‌త్యమ‌గు, మ‌నువుయొక్క పుత్రుల‌గు, మ‌రీచ్యాదులసుతులు సోమ‌పాదులు పితృగ‌ణ‌ములైరి. విరాట్పుత్రులు సోమ‌స‌దుల‌నువారు సాద్యుల‌కు పిత‌రుల‌గుచున్నారు. మ‌రీచిపుత్రుల‌గు అగ్నిష్వాత్తాఖ్యులు దేవ‌ల‌తుకు పిత‌రులైరి. దైత్యాదుల‌గువారికంద‌రికిని పిత్రులైరి. బ్రాహ్మణుల‌కు సోమపులు క్షత్రియుల‌కు హ‌విర్బుజులు వైశ్యుల కాజ్యపులు శూద్రుల‌కు సుకాలికులు యీపేర్లుక‌ల‌వారు పిత‌రుల‌గుచున్నారు. సోమ‌పులు, భృగుపుత్రులు, హ‌విష్మంతు లంగిర‌స పుత్రులు. ఆజ్యపుటు పుల‌స్త్య పుత్రులు సుకాలులు వ‌సిష్ట పుత్రులు. వీరు పితృ గ‌ణ‌ముల‌లో ముఖ్యులు. అనంత‌ములు పితృగ‌ణ‌ములుండెను. శ్రాద్ధములందు వీరు పూజ‌నీయుల‌గుచున్నారు.

నిత్యమును యీపితృదేవ‌త‌ల నారాధింప‌వ‌ల‌యున‌నుట‌లో యెట్టి లాభ‌మున్నూ లేదు. పితృదేవ‌త‌ల‌వ‌ల్ల యేమిలాభ‌ము మ‌న‌కు క‌లుగును ? భ‌గ‌వ‌ద్గీత‌ల‌లో చెప్పబ‌డిన రీతిని "పితృయాంతి పితృవ్రతాః" పితృలోక‌ము ప్రాప్తము కావ‌చ్చును. సంప్రాప్తమైన‌ను వ‌చ్చెడి ప్రయోజ‌న‌మేమి? మాన‌వుని యొక్క జీవితాద‌ర్శన‌ము ఉత్తమ‌లోక‌మును పొంది సౌఖ్యము ల‌నుభ‌వించుట‌కాదు. జ‌న్మరాహిత్యము క‌లుగుత్రోవ‌వెదుకుకొనుట‌యే.

"అబ్రహ్మభువ‌నాల్లోకాః పురావ‌ర్తినోర్జన‌
మాయుపేత్యతు కౌంతేయ పున‌ర్జన్మ న‌విద్యతే"

అని శ్రీ‌కృష్ణభ‌గ‌వానుడు చెప్పియున్నాడుగ‌దా ! ఈ విష‌య‌మే వేద‌మును చెప్పుచున్నది.

పితృదేవ‌త‌ల‌ను ప్రతిదిన‌మును సంతృప్తి ప‌రిచిపొందెడిలాభ‌ము యించుక‌యులేదు. భ‌గవంతుని ఆరాధించిన‌చో లాభ‌ముగాని యీ పితృగ‌ణ‌ముల వెంట‌బ‌డిన ప్రయోజ‌న‌ములేదు. "అనిత్యమ‌సుఖం లోక‌మిమం ప్రాప్య భ‌జ‌స్వమాం" (9-33) అనిత్యమును, ప్రయోజ‌న ర‌హిత‌మునున‌గు పితృగణ‌ముల శ్రాద్ధమును ఒక య‌జ్ఞముగా ప‌రిగ‌ణింప‌త‌గ‌దు.

ఇక నిజ‌మ‌గు పితృయ‌జ్ఞమేది త‌న శ‌రీర‌మున‌కు కార‌ణ భూతులును, త‌న‌కు విద్యచెప్పించి అన్నపానాదుల‌చే అనేక విధ‌ముల ర‌క్షించిన‌వారును, త‌న‌కై యెంత‌యో క‌ష్టప‌డిన‌వారును అయిన త‌ల్లితండ్రులు మొద‌లైన‌వారి శుశ్రూష‌యే పితృయ‌జ్ఞము. "పితృదోవోభవ మాతృదేవోభ‌వ" అని వేద‌ము శాసించుచున్నది. వారిని నిత్యమును దైవ స‌మానులుగా పూజించి వారికి వ‌ల‌యు ఉప‌చారాదుల‌ను చేయుట‌యే య‌జ్ఞము. త‌ల్లితండ్రి గురువు యీ ముగ్గురే మూడులోక‌ముల‌గుచున్నార‌నియు, మూడగ్నుల‌చే సంపాద్యమ‌గు య‌జ్ఞఫ‌ల‌దాత‌లుగావున‌త్రేతాగ్నుల‌నియు మ‌నువు చెప్పియున్నాడు.

భూత‌య‌జ్ఞము

స‌ర్వభూత‌ముల‌యొక్క హిత‌మునందును త‌త్పరుడైయుండుట మాన‌వునియొక్క విధియైయున్నది. అట్టివాడు భ‌గ‌వంతుని పొంద‌న‌ని శ్రీ‌కృష్ణుడు చెప్పియున్నాడు.

"తేప్రాప్నువంతి మామేవ స‌ర్వభూత‌హితేర‌తాః" స‌ర్వ భూత‌ముల‌యొక్క హిత‌ముచేయుటయ‌ను క్రియ‌యే నిత్యయ‌జ్ఞముల‌లో చేర్పబడిన‌ది. విశ్వముల‌లోని భూత‌ముల‌క‌న్నిటికిని బ‌లి యిచ్చుట‌చే యిది గొప్పక్రతువైన‌ది. స‌క‌ల దేవ‌త‌ల‌కొర‌కు అయిన‌దిగాన వైశ్వదేవ‌మ‌నిరి. ఆయా దేవ‌త‌ల‌కాయా క్రమ‌ప్రకారం బలి యివ్వబ‌డును. త‌దుప‌రి మిగిలిన అన్నమును శ్వప‌తిత‌, శ్వప‌చ‌, పాప‌, రోగి, వాయుస‌క్రిమ్యాదుల‌కు భూమి శుభ్రముచేసి వుంచ‌వ‌ల‌యును. అన‌గా నిస్సహ‌యులై గృహ‌స్థుల‌పై ఆధార‌ప‌డు అన్ని భూత‌ముల‌కు ప్రాణి వ‌ర్గమున‌కు అన్నపానీయాది అవ‌స‌ర‌మైన వ‌స్తువులిచ్చి తృప్తి చేయుట‌యే మ‌హ‌య‌జ్ఞమ‌న‌బ‌డును. ఈ మ‌హ‌య‌జ్ఞమును త‌మ శ‌క్తి కొల‌ది ప్రతిదిన‌మును చేయ‌వారు ప‌ర‌మ స్థాన‌మును అర్చిరాది మార్గము ద్వారా పొందున‌ని మ‌నువు చెప్పుచున్నాడు.

మ‌నుష్య య‌జ్ఞము

ఈ య‌జ్ఞము మ‌హొత్కృష్టమైన‌ది. మాన‌వ‌కోటి యొక్క క‌ళ్యాణ‌మున‌కై త‌న స్వార్ధప‌రాయ‌ణ‌త్వమునువీడి ప‌రార్ధమై జీవించుట‌యే యింద‌లిర‌హ‌స్యము. మాన‌వుల‌కు హిత‌క‌ర‌మైన‌టువంటి స‌ర్వవిష‌య‌ముల‌యందును ఐహికాయుష్మిక సౌఖ్యమునుచేకూర్చు స‌ర్వకార్యములుచేయుట‌యే ఒక య‌జ్ఞముగా ప‌రిగ‌ణింప‌బడుచున్నది. ఇట్టి క‌ళ్యాణ‌కార‌క‌ముల‌గు పనుల‌యందు నిమ‌గ్నుడ‌గుల‌చే ఉదార‌చ‌రితుడ‌గును. వేద‌ములో చెప్పబ‌డిన‌రీతిని వ‌సుధ‌యావ‌త్తును వానికి త‌న‌కుటుంబ‌ముగ‌నే తోచును. మ‌న‌వారు మ‌నుష్య య‌జ్ఞములో అతిధి స‌త్కార‌మున‌కు యెక్కువ విలువ‌ను యిచ్చియున్నారు. అనిత్యముగ‌నుండుట‌వ‌ల‌న రెండ‌వ‌తిధి లేనివాడు కావున అతిధియ‌ని పేరువ‌చ్చిన‌ది.

"అనిత్యంహి స్థితో య‌స్మాత్తస్మాద‌తిధ రుచ్యతే" (మ‌ను.3-102)

అతిధికి ఆస‌న పాద్యాదులొసంగి అన్నమిడి స‌త్కరించ‌వ‌లెను.

ఋగ్వేద‌మునందు ఎవ‌డు ఆర్యమునిగాని, స్నేహితునిగాని, పోషింప‌డో యేకాకిగానే భుజించుచున్నాడో వాడు పాపియ‌ని యెరుంగ‌వ‌ల‌యున‌ని చెప్పబ‌డియున్నది.

"నార్యమ‌ణం పుష్యతినో స‌ఖాయం కేవ‌లాఘొ భ‌వ‌తి కేవ‌లాదీ," (10-117-9)