13

స‌న్యాస‌ము

సంపూర్ణ స‌ర్వసంగ‌ప‌రిత్యాగ‌ముతో గూడిన‌దీ ఆశ్రమ‌ము. త‌న‌ది య‌నున‌ది యేదియునులేదు. స‌న్యాస‌మ‌న‌గా కాషాయ‌వ‌స్త్రములు ధ‌రించుట‌లోను, దండ క‌మండ‌ల‌ముల‌నుప‌యోగించుట‌లోను, నిష్ర్కియుడుగా దేశాట‌న‌ము చేయుట‌లోను, వున్నద‌ని సాదార‌ణ‌ముగా మ‌న‌మ‌నుకొనుచున్నాము. నిజ‌మ‌గు స‌న్యాస‌ము బుద్ధియందున్నదిగాని బాహ్యవేష‌ముల‌యందులేదు. బాహ్యవేష‌ములు ఆశ్రమ‌మున‌కొక గుర్తగా చెప్పబ‌డిన‌ది. అందువ‌ల‌న‌నే గీత‌యందు క‌ర్మఫ‌ల‌ము నాశ్రయింప‌క అన‌గా ఫ‌లాశ‌ను మ‌న‌స్సునందు స్థిర‌ప‌డ‌నీయ‌క ఎవ‌డు క‌ర్తవ్య క‌ర్మల‌చేయుచున్నాడో వాడేస‌న్యాసియ‌నియు, క‌ర్మయోగియ‌నియు చెప్పబ‌డిన‌ది. అగ్నిహోత్రాది క‌ర్మల‌ను విడిచిన‌వాడుగాని, నిష్ర్కియుడుగాని, నిజ‌మ‌గుస‌న్యాసిగాడు. దేనిని స‌న్యాస‌మ‌ని చెప్పుచున్నారో అదియే క‌ర్మయోగ‌మ‌నిగూడ గీత‌యందు స్పష్టప‌రుప‌బ‌డిన‌ది, (గీత‌. 6-1,2)
నార‌ద ప‌రివ్రాజ‌కోప‌నిష‌త్తునందును ఈ విష‌య‌మే చెప్పబ‌డిన‌ది.

"తితిక్షాజ్ఞాన‌వైరాగ్య శ‌మాది గుణ‌వ‌ర్జితః ! భిక్షామా త్రేణ జీవ‌స్యాత్సయ‌తిర్యతివృత్తిహ న‌దండ‌ధార‌ణేన‌ న‌ముండ‌నేన న‌వేషేణ న‌డంభా చారేణ‌ముక్తిః ! జ్ఞాన‌ దండో ధృతోయేన ఏక‌దండీసఉచ్యతే ! కాష్టదండో ధృతోయేన ! స‌ర్వాసీజ్ఞాన‌వ‌ర్జితః ! స‌యాతిన‌రాంఘోరాం మ‌హ‌రౌర‌వ సంజ్ఞితాం"

"వాగ్దండ క‌ర్మదండ‌శ్చ మ‌నోదండ‌శ్చతేత్రయః
య‌స్యైతే నియ‌తాదండాస్సత్రిదండీ మ‌హ‌య‌తిః"

సామ‌వేద‌ము క‌ర్మల‌నువ‌ల‌ద‌లిన మాత్రమున‌గాని, స‌న్యాసాశ్రమ‌ము స్వీక‌రించునప్పుడు చ‌దువుమంత్రముల‌వ‌ల్లగాని, నిజ‌మ‌గు స‌న్యాసిగాడ‌నియు, జీవాత్మప‌ర‌మాత్మల నైక్యము చేయుట‌యే నిజ‌మ‌గు స‌న్యాస‌మ‌నియు, ధ‌న‌ము, తిండి, బ‌ట్టలు కీర్తి కొర‌కు స‌న్యసించిన‌చో న‌త‌డు ప‌తితుడ‌నియు ఘోషిల్లుచున్నది. (మైత్రేయ ఉప‌నిష‌త్తు. 2వ అధ్యాయ‌ము)

స‌న్యాసియొక్క స్వధ‌ర్మములు నార‌ద ప‌రివ్రాజ‌కోప‌నిష‌త్తునందు చ‌క్కగా చెప్పబ‌డియున్నది.

"అహింసా స‌త్యమ‌స్తేయం బ్రహ్మచ‌ర్యా ప‌రిగ్రహః !
అనౌద్ధత్యమ‌దీన‌త్వం ! ప‌సాద‌స్ధైర్యమార్జవం !!

అస్నేహో గురుశిశ్రూషాశ్రద్ధాక్షాంతిర్దమ‌శ్శమః!
ఉపేక్షాస్థైర్య మాధుర్యేతితిక్షాక‌రుణాత‌ధా!!

హీస్తధాజ్ఞాన విజ్ఞానే యోగోల‌ఘ్వశ నంధృతిః !
ఏష‌స్వధ‌ర్మో విఖ్యాతో య‌తీనాం నియ‌తాత్మనాం" !!

అధ‌ర్వవేదీమ ఆరుణేయ్యుప‌నిష‌త్తునందు స‌న్యాసి అన్నమును ఔష‌ధ‌మువ‌లె భుజింప‌వ‌ల‌యున‌నియు, ప్రాత‌ర్మధ్యాహ్న సాయం సంధ్యా కాల‌ముల‌యందు స్నాన‌ముచేసి సంధ్యావంద‌ను మాచ‌రింప వ‌ల‌యున‌నియు, ఉప‌నిష‌త్తుల‌ను ప‌ఠింప‌వ‌ల‌యున‌నియు, బ్రహ్మచ‌ర్యమును, మ‌నోవాక్కాయ క‌ర్మల‌చేత భూత‌ముల‌కు అహింస‌ను, ఆశ్రమ‌మున‌కునిషేధింప‌బ‌డిన ద్రవ్యముల‌ను ప‌రిగ్రహింప‌కుండుట‌యును, స‌త్యమును మిక్కిలి ప్రయ‌త్నముతో సంర‌క్షించుకొనుట‌యు, చెప్పబ‌డియున్నవి.

స‌న్యాసి శ్రేష్టుడును, జ్ఞానియ‌నున‌గుట‌చే ఫ‌లాపేక్షలేనివాడై లోక‌సంగ్రహ‌ర్ధమై నిష్ర్కియుడుగానుండ‌క క‌ర్మ చేయ‌వ‌ల‌యును.