14

జ్ఞాన‌యుక్తయోగ‌ము

మాన‌వుడు జ్ఞాన‌యుక్త య‌మాద్యష్టాంగ‌యోగ‌ముభ్యసింప‌వ‌ల‌యును.

మోక్షమునుగోరువాడు జ్ఞాన‌మును యోగ‌మును చ‌క్కగా న‌భ్యసింప‌వ‌ల‌యును.

"యోగ‌హీనం క‌ధం జ్ఞానం మోక్షదం భ‌వ‌తిధృవం
యోగోపి జ్ఞాన‌హీన‌స్తు న‌క్షమోమోక్షక‌ర్మణి
త‌స్మాద్ధ్యానంచ యోగంచ‌ముముక్షుర్దృఢ‌మ‌భ్యసేత్" (య‌జుర్వేద‌ము, యోగ‌త‌త్వోప‌నిష‌త్తు)

య‌మ‌ము, నియ‌మ‌ము, ఆస‌న‌ము, ప్రాణాయామ‌ము, ప్రత్యాహ‌ర‌ము, ధ్యాన‌ము, ధార‌ణ‌, స‌మాధి ఈ యెనిమిది అంగ‌ములుగ‌ల‌ది యోగ‌మ‌న‌బ‌డును. వీనిని తెలుసుకొనినచో ముక్తినొందుట‌కు యోగ్యుడ‌గును.

"ఏవం సూక్ష్మాంగానియ ఏవం వేద‌స‌ముక్తిబాగ్భవ‌తి"


                                                     య‌మ‌మ‌న‌నేమి?

కృష్ణయ‌జుర్వేద‌ములోని తేజోబిందు ఉప‌నిష‌త్తులో య‌మ‌మ‌ననిట్లు చెప్పబ‌డిన‌ది.

"స‌ర్వంబ్రహ్మేతి విజ్ఞానాదింద్రియాగ్రామ సంయ‌మః
య‌మోయ‌మితి సంప్రోక్తో అభ్యస‌నీయో ముహుర్ముహుః"

స‌ర్వమును బ్రహ్మమ‌య‌మ‌ను విజ్ఞాన‌ముతో యింద్రియ‌ముల నిగ్రహించుట యున‌న‌ది య‌మ‌మ‌న‌బ‌డును. బ్రహ్మభావ‌న‌యును నింద్రియ‌నిగ్రహ‌మును యింద‌లి ప్రధానాంశ‌ములు. శుక్లయ‌జుర్వేద‌ములోనిద‌గు మండ‌ల బ్రాహ్మణోప‌నిష‌త్తునందు య‌మ‌మ‌న‌గా, చ‌లిని, ఎండ‌ను, ఆక‌లిద‌ప్పుల‌ను, నిద్రను జ‌యించుట‌యును, ఎల్లప్పుడు శాంతియును, నిశ్చల‌త‌త్వమును, విష‌య‌ముల‌యందు యింద్రియ‌ముల‌ను నిగ్రహించుట‌యును న‌నిచెప్పబడిన‌ది.

"శీతోష్ణాహ‌ర నిద్రావిజ‌యః, స‌ర్వదాశాన్తిః. నిశ్చ
ల‌త్వం, విష‌యేంద్రియ నిగ్రహ‌శ్చ, ఏతేయ‌మాః"

ఇంతేకాక య‌మ‌మ‌నునది ప‌దివిధ‌ముల‌ని వేద‌ము చెప్పుచున్నది.

"అహింసా స‌త్యమ‌స్తేయం బ్రహ్మచ‌ర్యం ద‌యార్జవం !
క్షమాధృతిర్మితాహ‌రః శౌచంచైవ‌య‌మాద‌శ‌".

అహింస , స‌త్యము - ముందు వీనినిగురించి వ్రాయ‌బ‌డును.

అస్తేయ‌ము - మ‌నోవాక్కాయ‌ముల‌చే ప‌రద్రవ్యాసేక్షలేకుండుట‌.

బ్రహ్మచ‌ర్యము - (లోగ‌డ‌నే తెలిపితిని)

ఆర్జవ‌ము - స‌ర‌ళ‌త్వము (గీత‌. 13-7)

క్షమ - ఓర్పు

ధృతి - ధైర్యము

మితాహ‌ర‌ము - "ల‌ఘ్వూహ‌రోయ‌మేష్వేకో ముఖ్యో భ‌వ‌తినేత‌రః"    (యోగ‌త‌త్వోప‌నిష‌త్తు)

శౌచ‌ము - (లోగ‌డ‌నే తెలుప‌బ‌డెను)

నియ‌మ‌ము

"స‌జాతీయ‌ప్రవాహ‌శ్చ విజాతీయ‌తిర‌స్కృతః
నియ‌మోహిప‌రానందో నియ‌మాత్ర్కియ‌తేబుధైః"

ప్రతివ‌స్తువునందున యేక‌త్వమే జూడ‌వ‌ల‌యున‌ని భావ‌ము. మండ‌ల బ్రాహ్మణోప‌నిష‌త్తునందు గురుభ‌క్తియు, త‌త్వమార్గమునందు ప్రీతియును, మోక్షసంబంధ విష‌య‌ముల‌యందు నుభ‌వ‌మును, ఆ వ‌స్తువుల యొక్క అనుభ‌వ‌ముచేత గ‌లిగిన సంతుష్టియును, సంగ‌ర‌హిత‌త్వమును, ఏకాంత‌వాస‌ముచే గ‌ల్గిన మ‌నోనివృత్తియు, ఫ‌లాభిలాష లేకుండుట‌యు, వైరాగ్యమును, అనున‌వి నియ‌మ‌మ‌ని చెప్పబ‌డిన‌వి.

"గురుభ‌క్తిః, త‌త్వమార్గానురక్తిః, సుఖానుగ‌త‌
వ‌స్త్వనుభ‌వ‌శ్చ, త‌ద‌స్త్వనుభ‌వేన‌తుష్టిః, నిస్సం
గతా, ఏకాంత‌వాసేన మ‌నోనివృత్తిః, ఫ‌లా
న‌భిలాషో, వైరాగ్యభావ‌శ్చ నియ‌మాః"

నియ‌మ‌ముగూడ ప‌ది విధ‌ముల‌ని యోగ‌శాస్త్ర విశార చెప్పియుండిరి.

"త‌ప‌స్సంతోష మాస్తిక్యం దాన‌మిశ్వర‌పూజ‌నం
సిద్ధాంత‌శ్రవ‌ణ‌చ్చైవ‌హ్రీర్మతిశ్చజ‌పోవ్రతం, ద శైతేని
య‌మాః ప్రోక్తాః యోగ‌శాస్త్రవిశార‌దైః"

ఆస‌న‌ము

"సుఖేనైవ భ‌వేద్యస్మి న‌జ‌స్రంబ్రహ్మచింత‌నం
ఆస‌నం త‌ద్విజానీయాత్ నేత‌రత్పుఖ‌నాశ‌నం"

బ్రహ్మచింత‌కు వీలుగాగూర్చుండుట‌కు యేదివీలో అదియే ఆస‌న‌ము.

"సుఖాస‌న‌వృత్తిః చిర‌వాస‌శ్చ ఏవ‌మాస‌న నియ‌మోభ‌వ‌తి"   (మండ‌ల బ్రాహ్మణోప‌నిష‌త్తు)

ఏకాంత‌ప్రదేశ‌మున సుఖాస‌న‌స్థుడై ప‌రిశుద్ధమ‌న‌స్కుడై కంఠ‌ము, శిర‌స్సు, దేహ‌ము అను నీమూటిని స‌మ‌ముగా నుంచుకొన్నవాడై, స‌క‌లేంద్రియ‌ముల‌ను నిగ్రహించిన‌వాడై హృద‌య‌క‌మ‌ల మ‌ధ్యమందుండు ప‌ర‌మాత్మను ధ్యానించ‌వ‌ల‌యున‌ని కైవ‌ల్యోప‌నిష‌త్తులో చెప్పబ‌డిన‌ది.

"వివిక్తదేశేచ సుఖాస‌న‌స్థః శుచిస్సమ‌గ్రీవ శిర‌
శ్శరీరః.... స‌క‌లేంద్రియాణి నిరుధ్యభ‌క్త్యా......
హృత్పుండ‌రీకం.......ధ్యాత్యా......"

మిక్కిలి అంద‌మైన‌దియు, స్వల్పమైన ద్వార‌ముక‌ల‌దియు గోమ‌య‌ముచే చక్కగా అలికిగాని. లేక సున్నముకొట్టిన‌దియు, న‌ల్లులు దోమ‌లు వ‌గైరాపురుగులు లేనిదియు, బాగుగా ప్రతిదిన‌ము చిమ్మిశుభ్రప‌ర‌చున‌దియు, సాంబ్రాణి మొద‌ల‌గు వ‌స్తువులు పొగ‌వేయ‌బ‌డున‌దియున‌గు ఒక మ‌ఠ‌మును నిర్మించ‌వ‌ల‌యున‌నియు, మిక్కిలి యెత్తును, మిక్కిలి ప‌ల్లమునులేనిదిగ‌ను, వ‌స్త్రము, కృష్ణాజిన‌ము, ద‌ర్భ ఇవిప‌ర‌చున‌ట్టిదియున‌గు ఆస‌న‌ముమీద గూర్చుండి శ‌రీర‌ము చంక‌ర లేక నిక్కి యుండున‌ట్లుంచుకొని దైవ‌మును న‌మ‌స్కరింప‌వ‌ల‌యున‌ని యోగ‌త‌త్త్వోప‌నిషత్తునందు చెప్పబ‌డిన‌ది.

"సుశోభ‌నం మ‌ఠంకుర్యాత్సూక్ష్మ ద్వారంతునిర్ర్వణం
సుష్ఠులిప్తం గోమ‌యేన సుధ‌యాహి ప్రయ‌త్నతః
మ‌త్కుణైర్మశ‌కైర్లూతైర్వర్జితంచ ప్రయ‌త్నతః
దినేదినేచ స‌మ్మృష్టం స‌మ్మార్జన్యా విశేష‌తః
వాసితంచ సుద‌గ్ధేన‌ధూపితం గుగ్గులాదిభిః
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజిన కుశోత్తరం
త‌త్రోప‌విశ్యమేధావీ ప‌ద్మాస‌న స‌మ‌న్వితః
ఋజుకాయః ప్రాజ్ఞవిశ్చ ప్రణ‌మేదిష్టదేవ‌తాం"

ప్రాణాయామ‌ము

"చిత్తాదిస‌ర్వభావేషు బ్రహ్మత్వేనైవ‌భావ‌నో
నిరోధ‌స్సర్వ వృత్తీనాంప్రాణాయామ స్సఉచ్యతే"

చిత్తవృత్తుల‌న్నిటియందు బ్రహ్మభావ‌న‌త‌ప్ప మ‌రొండులేకుండున‌ట్లు నిరోధించుట‌యే ప్రాణాయామ‌ము.

శ్లో!! నిషేధ‌నం ప్రపంచ‌స్యరేచ‌కాఖ్యస్సమిర‌ణః
బ్రహ్మైవాస్మీతియా వృత్తిః పూర‌కోవాయురీరితః
త‌త‌స్తద్వృత్తి నైశ్చల్యం కుంభ‌కః ప్రాణ‌సంయమః

ప్రత్యాహ‌ర‌ము

"విష‌యేస్వాత్మ తాందృష్ట్యా మ‌న‌స‌శ్చితిమ‌జ్జనం
ప్రత్యాహార‌స్స విజ్ఞేయోఅభ్యస‌నీ యోముముక్షుభిః"

మండ‌ల బ్రాహ్మణోపనిష‌త్తునందు ఇంద్రియ‌ముల యొక్క, ప్రయోజ‌న‌మైన విష‌య‌ముల‌యందుండి మ‌న‌స్సును నిగ్రహించుట‌యే ప్రత్యాహార‌మ‌ని చెప్పబ‌డిన‌ది.

"విష‌యేభ్య ఇంద్రియార్థేభ్యో మ‌నోనిరోధ‌నం ప్రత్యాహ‌రః"

ధార‌ణ

"య‌త్రమ‌త్ర మ‌నోయాతి బ్రహ్మణ స్తత్రద‌ర్శనాత్ !
మ‌న‌సో ధార‌ణం చైవ‌ద్ధార‌ణా సాప‌రామ‌తా "!!

మ‌న‌స్సు యెచ్చట‌కేగిన న‌చ్చట బ్రహ్మమునేజూచుట ధార‌ణ‌య‌న‌బ‌డును. చిత్తమును చైత‌న్యమునందు విష‌య‌వ్యావ‌ర్తన పూర్వక‌ముగా స్థాపించుట‌యే ధార‌ణ‌య‌ని శుక్ల య‌జుర్వేద‌ము చెప్పుచున్నది.

"విష‌య‌చ్యావ‌ర్తక పూర్వకంచైత‌న్యే చేత‌స్థాపనం ధార‌ణాభ‌వ‌తి"

బాహ్యాభ్యంత‌ర సంబంధ‌మ‌గు త‌త్వముల‌నుజూచెడి చిత్తవృత్తియేధార‌ణ‌.

ధ్యాన‌ము

"బ్రహ్మైవాస్మీతి స‌ద్వృత్త్యా నిరాలంబ‌త‌యాస్థితిః
ధ్యాన‌శ‌బ్దేన విఖ్యాతా ప‌ర‌మానంద‌దాయినీ"

నేను బ్రహ్మను అని భావించుకొనుస్థితియే ధ్యాన‌ము. ఇట్టి ధ్యాన‌ము మ‌హ‌దానంద‌మును గలుగ‌జేయును. స‌క‌ల శ‌రీర‌ముల‌యందును చైత‌న్యమొక్కటియేయ‌ని, అన‌గా ప‌ర‌మాత్మయొక్కడే స‌ర్వత్ర ప్రకాశించుచున్నాడ‌ని భావించియుండుట ధ్యాన‌మ‌ని మండ‌ల బ్రాహ్మణోప‌నిష‌త్తునందు చెప్పబ‌డిన‌ది.

"స‌ర్వశ‌రీరేషు చైత‌న్యేక‌తాన‌తాధ్యానం"

ధ్యాన‌ము రెండు విధ‌ములు - స‌గుణ‌ధ్యాన‌ము, నిర్గుణ ధ్యాన‌ము. స‌గుణ‌మ‌న‌గా మూర్తినారాధించుట‌. నిర్గుణ ధ్యాన‌మ‌న‌గా ఆత్మనారాధించుట‌.

స‌మాధి

"న‌ర్వికార‌త‌యావృత్వా బ్రహ్మకార‌త‌యాపునః
వృత్తివిస్మర‌ణం స‌మ్యక్ స‌మాధిర్జాన‌సంజ్ఞకః"

ధ్యాన‌మును మ‌ర‌చియుండుట‌యే స‌మాధియ‌ని చెప్పబడిన‌ది.

"ధ్యాన విస్మృతిస్సమాధిః" (మండ‌ల బ్రాహ్మణోప‌నిష‌త్తు)

జీవాత్మ ప‌ర‌మాత్మల నైక్యసంధాన‌యే స‌మాధియ‌ని అధ‌ర్వణ‌వేద‌ము చెప్పుచున్నది.

ఈ అష్టాంగ‌యోగ‌వివ‌ర‌ణ‌ము అమృత‌నాదోప‌నిష‌త్తునందును, ద‌ర్శనోప‌నిష‌త్తునందునుగూడ కానుపించును. చ‌దువ‌రులు వానిని ప‌ఠింతురుగాక‌. స‌మాధిన‌భ్యసించున‌పుడు అనేక అంత‌రాయ‌ములుగ‌లుగును.
భ‌వ‌వృత్తుల‌వ‌ల్లను, శూన్యవృత్తుల‌వ‌ల్లను, యీక‌ష్టములు సంభ‌వించును. బ్రహ్మవృత్తుల‌వ‌ల‌న ప‌రిశుధ్దుడ‌గును. కాబ‌ట్టి బ్రహ్మవృత్తు న‌ల‌వాటుచేసికొనినచో ముక్తికిమంచి మార్గమేర్పడును.