18

క‌ర్మయోగాభ్యాస‌ము

మాన‌వుడు యోగ‌స్థుడై క‌ర్మల‌ను చేయ‌వ‌ల‌యున‌ని వేద‌ము శాసించుచున్నది.

"యోగ‌స్థః కురుక‌ర్మాణి" (అక్ష్యుప‌నిష‌త్. య‌జుర్వేద‌ము)

ఈ క‌ర్మయోగ సిద్ధాంత‌మునే శ్రీ‌కృష్ణభ‌గావానుడు గీతాశాస్త్రమంద‌త్యంత విపుల‌ముగా అర్జునుని వ్యాజ‌ముగా నుంచుకొని లోక‌మున‌కు బోధించియున్నాడు. శ్రీ‌కృష్ణుడు క‌ర్మనుచేయుట‌కు మాత్రమే మాన‌వున‌కు అధికార‌ము క‌ల‌ద‌నియు, ఫ‌ల‌ము ల‌భించుట‌గాని ల‌భింప‌క‌పోవుట‌గాని యెప్పుడును అత‌ని ఆధీన‌ముకాద‌నియు క‌నుక క‌ర్మల‌కీవిధ‌మ‌గు ఫ‌ల‌ము కావ‌లెన‌ని అభిలాష‌చే క‌ర్మచేయ‌కూడ‌ద‌నియు, క‌ర్మల‌ను చేయ‌క‌పోవుట యందుస‌యిత‌ము ఆగ్రహమును చెంద‌త‌గ‌ద‌నియు, స్పష్టముగా చెప్పియున్నాడు.

"క‌ర్మణ్యే వాధికార‌స్తే మాఫ‌లేషుక‌దాచ‌న‌
మాక‌ర్మఫ‌ల‌హేతుర్ఛూర్మాతే సంగోస్త్వక‌ర్మణి" (గీ. 2 -- 47)

క‌ర్మసిద్ధించిన‌ను సిద్ధించ‌క‌పోయిన‌ను యోగ‌స్థుడ‌వై క‌ర్మల‌ను చ‌యుమ‌ని చెప్పబ‌డిన‌ది. క‌ర్మసిద్ధించుట నిష్పల‌మ‌గుట‌య‌ను విష‌య‌ములో స‌మాన‌మ‌గు మ‌నోవృత్తియే యోగ మ‌ని సృష్టీక‌రింప‌బ‌డిన‌ది.

"యోగ‌స్థః కురుక‌ర్మాణి సంగంత్యక్త్యాధ‌నంజ‌య‌
సిద్ధసిద్ధ్యొస్సమో భూత్వాస‌మ‌త్వం యోగ ఉచ్యతే"


త్యాగ‌మే శ‌ర‌ణ్యము

ఈ ప్రపంచ‌మును త్యాగ‌ముచేత అనుభ‌వింపుమ‌ని శుక్లయ‌జుర్వేద‌ము చెప్పుచున్నది. త్యక్తేన‌భుంజీధా ఈశావాశ్యోప‌నిష‌త్తు 1. త్యాగ‌మ‌న‌గా క‌ర్మఫ‌ల‌త్యాగ‌మ‌ని శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు సెల‌విచ్చియున్నాడు.

"స‌ర్వక‌ర్మఫ‌ల‌త్యాగంవిచ‌క్షణాః"

క‌ర్మఫ‌ల‌మునందిచ్ఛలేనివారికి క‌ర్మలు బంధింప‌వు. అందువ‌ల‌న‌నే యావ‌జ్జీవ‌మును నిష్కామ‌క‌ర్మప‌రుడ‌వై యుండుమ‌ని వేద‌ము చెప్పుచున్నది.

"కుర్వన్నే వేహ‌క‌ర్మాణి జిజీవ‌షేచ్ఛత‌గ్ంస‌మాః
ఏవంత్వయినాన్యధేతో స్తిన‌క‌ర్మ లిప్యతేన‌రే" (శుక్ల య‌జుర్వేద‌ము. ఈశావాశ్యము . 2)

వేదాంత‌ము త్యాగ‌మును, నిష్కామ‌క‌ర్మను బోధించుచున్నదేగాని క‌ర్మ స‌న్యాస‌మును బోధించుట‌లేదు. నిజ‌ముగా స‌న్యాస‌మ‌న‌గా యోగ మ‌నియే శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు స్పష్టప‌ర‌చినాడు.

"యంస‌న్యాస‌మితి ప్రాహూర్యోగంతంవిద్ధి పాండ‌వన‌హ్యస‌న్యస్త సంక‌ల్పోయోగీభ‌వ‌తి క‌శ్చన" (గీ. 6 -- 2)

క‌ర్మఫ‌ల‌ము నాశ్రయింప‌క యెవ‌డు క‌ర్తవ్యక‌ర్మల చేయుచున్నాడో అత‌నిచే స‌న్యాసియ‌నియు, క‌ర్మయోగి య‌నియు చెప్పవ‌ల‌యును. అక్రియుడు నిజ‌మ‌గు స‌న్యాసికాడు.

"అనాశ్రితః క‌ర్మఫ‌లం కార్యం క‌ర్మక‌రోతియః
స‌స‌న్యాసీచ యోగీచ న‌నిర‌గ్నిర్నచాక్రియః"

క‌ర్మఠుల వైదిక క‌ర్మ నింద్యము

క‌ర్మచేయుట‌య‌న‌గా వేద‌మునందు చెప్పబ‌డిన స‌మ‌స్తయ‌జ్ఞయాగాది కామ్యక‌ర్మల నాచ‌రించుట‌య‌ని కొంద‌రు భావించుచున్నారు. ఇది గొప్పత‌ప్పు అభిప్రాయ‌ము. వేదాంత‌మీ క‌ర్మల‌ను నిందించుచున్నది. వేద‌ధ‌ర్మమును ప్రతిపాదించుగీత యీ శ్రౌత‌క‌ర్మల‌ను తుచ్ఛముగానెంచి విడ‌నాడ‌వ‌ల‌యున‌ని శాసించుచున్నది. ముండ‌కోప‌నిష‌త్తునందు యీ య‌జ్ఞయాగాది కామ్యక‌ర్మల‌న్నియు కేవ‌ల‌ము నిష్ర్పయోజ‌న‌మ‌నియు వానివెంట‌బ‌డుట వ‌ట్టి భ్రమ‌య‌నియు జ‌న్మహేతువనియు స్పష్టీక‌రింప‌బ‌డిన‌ది. పూర్వక‌ర్మచే వ‌చ్చిన యిహ‌లోక మెట్లున‌శించునో పుణ్యక‌ర్మల‌వ‌ల‌న‌వ‌చ్చిన ప‌ర‌లోక‌ముకూడ అట్లేన‌శించున‌నియు, యీ విధ‌ముగా క‌ర్మసాధ్యముల‌గు ఉభ‌య లోక‌ముల‌యెక్క అనిత్యత్వమునెరింగి బ్రాహ్మణుడు క‌ర్మఫ‌ల‌ముల‌యందు వైరాగ్యమునొంద‌వ‌ల‌యున‌ని వేద‌ము చెప్పుచున్నది.

"త‌ద్యదేహ‌క‌ర్మచితోలోకః క్షీయ‌తే ఏవ‌మేవాముత్ర పుణ్యచితోలోకః క్షీయ‌తే, ప‌రీక్ష్యలోకా క‌ర్మచితా బ్రాహ్మాణో నిర్వేద‌మాయాత్‌"

క‌ర్మయోగాభ్యాస‌మున‌కు వ్యవ‌సాయాత్మికా బుద్ధిచాల అవ‌స‌ర‌ము. అన‌గా కార్యాకార్యముల నిశ్చయించుబుద్ధి ఏకాగ్రముగ‌నుండ‌వ‌ల‌యును. జ్ఞాన‌ర‌హిత‌మైన "క‌ర్మ నిష్ర్పయోజ‌న‌మ‌ని సామ‌వేద‌ము చాటుచున్నది.

"య‌దేవ‌విద్యయా క‌ర‌తి శ్రద్ధయోప‌నిష‌ద‌త‌దేవ‌వీర్యవ‌త్తరంభ‌వ‌తి " ( చాందోగ్యోప‌నిష‌త్తు)

య‌జ్ఞార్ధమైచేయ‌బ‌డిన క‌ర్మలుద‌ప్ప నిత‌ర‌ముల‌గు క‌ర్మల‌చే నీలోక‌ము బంధింప‌బడుచున్నది. కావున య‌జ్ఞార్ధమై చేయు క‌ర్మల‌ను ఫ‌లాశ‌ను విడిచిచేయ‌వ‌లెను.

"య‌జ్ఞార్ధాత్ క‌ర్మణోఅన్యత్రలోకోయం క‌ర్మబంధ‌నః త‌ద‌ర్దంక‌ర్మకౌంతేయ ముక్తసంగ‌స్సమాచ‌ర" (గీ. 3 -- 9)

య‌జ్ఞమ‌న‌గా విష్ణువ‌ని అర్ధము అన‌గా ప‌ర‌మేశ్వర ప్రీత్యర్ధమై క‌ర్మలు చేయ‌వ‌ల‌యును. ప‌ర‌మేశ్వరార్పణ‌పూర్వక‌ముగా క‌ర్మ ఆచ‌రింప‌వ‌ల‌యున‌ని దీని తాత్పర్యము. "య‌జ్ఞోవైవిష్ణుః" అని శ్రుతి.

లోక సంగ్రహ‌దృష్టితో క‌ర్మచేయ‌వ‌ల‌యున‌ని శ్రీ‌కృష్ణుడుప‌దేశించినాడు. లోకసంగ్రహ‌మేవాపి సంప‌శ్యన్ క‌ర్తుమ‌ర్హపి. (గీ. 3 -- 20) లోక సంగ్రహ మ‌న‌గా లోకుల‌ను బుద్దిమంతులుగా చేయుట‌. స‌ర్వజ‌గ‌త్తును స‌న్మార్గమును పోష‌ణ‌మును పాల‌న‌మును చేయుట‌య‌ను స‌ర్వవిష‌య‌ములు దానిలో చేరియున్నవ‌ని లోక‌మాన్య బాల‌గంగాధ‌ర‌తిల‌క్ మ‌హ‌శ‌యుడు త‌న‌గీతార‌హ‌స్యమందు వ్రాసియున్నాడు.