20

భ‌క్తియోగ‌ము

భ‌క్తియే రాజ‌మార్గము

మాన‌వుడు భ‌క్తియోగ‌మునాశ్రయించి అన‌న్యభ‌క్తిచే స‌ర్వేశ్వరునారాధింప‌వ‌ల‌యును. ఇదియే మోక్షమున‌కు సుల‌భ‌మైన రాజ‌మార్గము. భ‌క్తి మార్గముయొక్క ప్రాశుస్త్యము వేద‌మునందేన‌క చోట్లచెప్పబ‌డియున్నది. భ‌క్తి యోగ‌ము నిరుప‌ద్రవ‌క‌ర‌మైన‌ద‌నియు, అందువ‌ల‌న అచిర‌కాల‌ములో త‌త్వజ్ఞాన‌ముక‌లుగున‌నియు, భక్తాభీష్టప్రదుడ‌గు స‌ర్వేశ్వరుడనుగ్రహించి ప‌రిపాలించున‌నియు, భ‌క్తిలేనిదే బ్రహ్మజ్ఞాన‌ము పుట్టద‌నియు భ‌క్తివ‌ల‌న సాధ్యముకానిదేదియు లేద‌నియు అధ‌ర్వణ వేద‌మందు వ్రాయ‌బ‌డియున్నది.

త‌స్మాత్ స‌ర్వేషామ‌ధికారిణా మ‌న‌ధికారిణాం భ‌క్తియోగ‌యేవ‌ప్రశ‌స్త్యతే ! భ‌క్తియోగోనిరుప‌ద్రవః ! భ‌క్తియోగోన్ముక్తిః ! బుద్ధిమ‌తా మ‌నాయాసేనాచిరా దేవ‌త‌త్వజ్ఞానం భ‌వ‌తి ! త‌త్కధ‌మితి ! భ‌క్తవ‌త్సల స్వయ‌మేవ స‌ర్వేభ్యో మోక్షవిఘ్నేభ్యో భ‌క్తినిష్టా స‌ర్వా ప‌రిపాల‌యేతి ! స‌ర్వాభీష్టా ప్రయ‌చ్చతి ! మోక్షంచాప‌య‌తి చ‌తుర్ముఖాదీనాం స‌ర్వేషామ‌విపినా విష్ణుభక్త్యాక‌ల్పకోటిభిర్మోక్షోన‌విద్యతే ! కార‌ణేన‌వినా కార్యంనోదెతి ! భక్త్యావినాబ్రహ్మజ్ఞానం క‌దాపిన‌జాయ‌తె ! త‌స్మాత్వమ‌పి స‌ర్వోపాయాన్ ప‌రిత్యజ్యభ‌క్తిమాశ్రయె ! భ‌క్తినిష్టోభ‌వ‌భక్తినిష్టోభ‌వ ! భ‌క్త్యాస‌ర్వసిద్దయ‌స్సిధ్యంతి ! భ‌క్తేర‌సాధ్యంన‌కించిద‌స్తి (మ‌హ‌నార‌య‌ణోప‌నిష‌త్తు) కృష్ణ య‌జుర్వేద‌మందు పూర‌జ్ఞాన‌మును ప్రమిద‌యందు వైరాగ్యమనెడి తైల‌మునుపోసి భ‌క్తియ‌నెడి వ‌త్తివేసి జ్ఞాన‌మ‌ను దీప‌మును వెలిగించి చూడ‌వ‌ల‌యున‌నియు అప్పుడు మోహాంధ‌కార‌ము నివృత్తియై శివుడు త‌నంత‌ట‌తాను ప్రత్యక్షమ‌గున‌నియు చెప్పబ‌డియున్నది. ఈశ్వరుడొక్కడేయ‌నిమున్ముందు మ‌నము గ్రహించ‌వ‌ల‌యును వేద‌మునందెచ్చట చూచిన‌ను యీశ్వరుడొక్కడేన‌ని చెప్పబ‌డియున్నది.

ఏకంస‌త్ (ఋగ్వేద‌ము.. 1 - 164 - 45 )
త‌దేకం (ఋగ్వేద‌ము.. 10 - 129 - 2 )
దేవ ఏకోనార‌య‌ణః (సుబాలుఉప‌నిష‌త్తు)
ఏక‌మేవాద్వితీయం (సామ‌వేద‌ము. చాందోగ్యము)

స‌గుణ‌నిర్గుణ‌ధ్యాన‌ము

సాకార‌నిరాకార‌ముల‌ని భ‌క్తి రెండువిధ‌ములు.

"ద్వేవావ బ్రహ్మణోరూపే మూర్తంచైవామూర్తంచ మ‌ర్త్యంచామృతంచ స్థితంచ‌య‌చ్చస‌చ్చత్యచ్ఛ"
(బృహ‌దార‌ణ్యక‌ము. 2 అధ్యా. బ్రాహ్మణ‌ము)

ఈవిష‌య‌మే భ‌గ‌వ‌ద్గీత 12 వ అధ్యాయ‌మందు వ్యక్తోపాస‌న‌, అవ్యక్తోపాస‌న య‌ని చెప్పబ‌డిన‌ది. అవ్యక్తోపాస‌న మిక్కిలి క్లేశ‌ప్రద‌యైన‌ద‌నియు వ్యక్తోపాస‌న సుల‌భ‌మైన‌ద‌నియు దాని న‌వ‌లంభింపుడ‌నియు శ్రీ‌కృష్ణుడు చెప్పియున్నాడు. (గీత 12-1-8) అమానిత్వాది ల‌క్షణ‌ములు క‌లిగిన‌వాడే నిరాలంబ‌యోగ‌మున‌క‌ధికారియ‌ని వేదాంత‌ము చాటుచున్నది.

విగ్రహారాధ‌న‌

విగ్రహ‌యే దైవ‌మ‌ని పూజించుట కేవ‌ల‌మ‌జ్ఞాన‌మ‌ని చెప్పక‌త్పద‌పు. స‌ర్వాంత‌ర్యామియ‌గు ప‌ర‌మేశ్వరుడు విగ్రహ‌మునందును క‌ల‌డ‌నుభావ‌ముతో నారాధించుట‌మంచి విష‌య‌మే. విగ్రహ‌ము చూచిన‌వెంట‌నే భగ‌వంతుడు జ్ఞప్తికిరావ‌ల‌యును. అట్లుకానిచో విగ్రహారాధ‌న కేవ‌ల‌ము వేద‌నింద్యమైయున్నది. మోక్షముకోరువానికి రాతితోను లోహ‌ముల‌తోను చేయ‌బ‌డిన విగ్రహ‌ముల‌నారాధించుట కేవ‌ల‌ము నిరుప‌యోగ‌మ‌నియు, పున‌ర్జన్మమున‌కు కార‌ణ‌మ‌నియు, హృద‌యాంత‌ర్గతుడ‌గు ప‌ర‌మాత్మనే ఆరాధించ‌వ‌ల‌యున‌నియు సామ‌వేద‌ము చెప్పుచున్నది.

"పాషాణ‌లోహ‌మ‌ణిమృణ్మయ‌విగ్రహేషు పూజాపున‌ర్జన‌న భోగ‌క‌రీముముక్షోః ! త‌స్మాద్యతిస్స్వహృద‌యార్చన‌మేవ‌కుర్యాద్బాహ్యార్చనం ప‌రిహ‌రే ద‌పున‌ర్ఛవాయ" (మైత్రేయోప‌నిష‌త్తు).

దేహ‌మే దేవాల‌య‌ము

"దేహోదేవాల‌యః ప్రోక్తస్సజీవః కేవ‌ల‌శ్శివః" (సామ‌వేద‌ము)

స‌ర్వభూత‌ముల‌యొక్క హృద‌య‌ముల యందును ప‌ర‌మాత్మ క‌ల‌డు. ఈశ్వర‌స్సర్వభూతానాం హృద్ధేశార్జన‌తిష్టతి (గీత‌.) అధ‌య‌దిద‌మాస్మిన్ బ్రహ్మపురేద‌హ‌రం పుండ‌రీకం వేశ్మద‌హ‌రోస్మిన్ అంత‌రాకాశ‌స్తస్మిన్ యదంత‌ర‌స్తద‌న్వేష్టవ్యం త‌ద్వార విజిజ్ఞాసీత‌వ్యమితి.

(చాందోగ్యము) మ‌నము దేవాల‌య‌మన అతిప‌విత్రమైన స్థల‌ముగా చూచుకొందుము. దేవాల‌య‌ములో దేవుడున్నాడ‌నుకొనుట‌చే మ‌న‌మ‌చ్చట యెట్టిపాప‌కార్యముల‌జేయ సాహ‌సింప‌ము పాప‌చింత‌లురావు. కాని యీ దేహ‌యే దేవాల‌యమ‌ను విష‌య‌ము మ‌న‌ము కొంచ‌ము శ్రమ‌చేసి గ్రహించిన‌చో యెట్టి పాప‌మును మ‌న‌ము చేయుట‌కు ప్రయ‌త్నించ‌ము. స‌ర్వకాల‌స‌ర్వావ‌స్థల‌యందును మ‌న‌ము ప‌ర‌మాత్మస‌న్నిధాన‌మందే యున్నామ‌ను విష‌య‌ము మ‌న‌కుతోచును. య‌జుర్వేదాంత‌ర్గత‌మ‌గు బ్రహ్మవిద్యోప‌నిషత్తునందు స‌ర్వభూత‌ముల‌యందున్న ప‌ర‌మాత్మను నిత్యమును అర్చించ‌వ‌ల‌యున‌ని చెప్పబ‌డియున్నది.

"స‌ర్వభూత‌స్థితం దేవంస‌ర్వేశం నిత్యమ‌ర్చయేత్‌"

అద్వితీయ‌మైన బ్రహ్మముయొక్క ఉపాస‌న‌వ‌ల‌న‌నే ఐహికాముష్మిక సుఖ‌ములేర్పడున‌ని వేద‌ము ఘోషిల్లుచున్నది. ఆ బ్రహ్మము యెడ‌ల ప్రీతియు దానికి ప్రియ‌మైన కార్యములు చేయుట‌యుకూడ దాని ఉపాస‌న‌యేయ‌గును.

"ఏక‌స్యత‌స్యైవోపాస‌న యాపారత్రిక మైహికంచ‌శుభం భ‌వ‌తి
త‌స్మిన్ ప్రీతి త‌స్యప్రియ‌కార్య సాధ‌నంచ త‌దుపాస‌న‌మేవ‌"

ఆత్మపూజ‌యేనిజ‌మ‌గుపూజ

బ్రహ్యైక్యము యొక్క నిశ్చింత‌యే ధ్యాన‌ము. స‌ర్వక‌ర్మల‌ఫ‌ల‌త్యాగ‌మే ఆవాహ‌న‌ము నిశ్చయ‌జ్ఞాన‌మే ఆస‌న‌ము. ఉన్మనీభావ‌మేపాద్యము. స‌దా ఆమ‌న‌స్కమే అర్ఘ్యము, స‌దా ప్రకాశ‌మేఆచ‌మ‌న‌ము. అపారామృత‌వృత్తియే స్నాన‌ము. స‌ర్వాత్మభావ‌న‌యేగంధ‌ము. దృష్టి యొక్క స్వరూప‌స్థితియే అక్షత‌లు. చిత్ర్పాప్తియేపుష్పము,చిద‌గ్నిస్వరూప‌మే ధూప‌ము, చిదాత్మస్వరూప‌మే దీప‌ము, ప‌రిపూర్ణచంద్రామృత‌ము యొక్క ఏకీక‌ర‌ణ‌మే నైవేద్యము, నిశ్చల‌త్వమే ప్రద‌క్షిణ‌ము సోహంభావ‌న‌యే న‌మ‌స్కార‌ము. మౌన‌మే స్తుతి స‌ర్వసంతోష‌మే విస‌ర్జన‌ము.
(శుక్ల య‌జుర్వేద‌ము. మండ‌ల బ్రాహ్మణోప‌నిష‌త్తు)

మౌన‌ముగానుండుట‌యే ముద్రయ‌నియు, అతడే నేను అను స్థితియేదిక‌ల‌దో అదియే నిష్టయ‌నియు, మ‌న‌స్సును యేకాగ్రముచేసి భ‌గ‌వంతునియందు నిలుపుట‌యే ప‌రిక‌ర‌మ‌నియు, స‌క‌ల‌క‌ర‌ణ‌క‌ళేబ‌ర‌ముల కార్యముల‌ను భ‌గ‌వ‌దార్పణ‌ముచేయుట‌యే బ‌లియ‌నియు, కృష్ణయ‌జుర్వేదాంత‌ర్గత ద‌క్షిణామార్త్యుపనిష‌త్తునందు చెప్పబ‌డియున్నది.

"మౌనంముద్రా సోహ‌మితియావ‌దాస్థితి స్సానిష్టాభ‌వ‌తి చిత్తేద‌దేక‌తాన‌తాప‌రిక‌రః, అంగచేష్టార్పణంబ‌లిః"

మంత్రజ‌ప‌ము

భ‌క్తియోగ‌మందు మంత్రజ‌ప‌మొక ప్రధానాంగ‌మైయున్నది. సంసార‌మునుండి త‌రింప‌జేయు మంత్ర మొక‌టి య‌జుర్వేద‌మునందు చెప్పబ‌డిన‌ది. అది జ‌పించుట అంద‌రికి సుల‌భ‌మున్ను అయియున్నది.

"హ‌రే రామ హ‌రే రామ రామ రామ హ‌రే హ‌రే
హ‌రే కృష్ణ హ‌రే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హ‌రే హ‌రే "

16 నామ‌ములుగ‌ల యీమంత్రము క‌లిక‌ల్మష‌మును న‌శింప‌జేయున‌ని ఉప‌నిష‌త్తు చెప్పుచున్నది. మ‌హ‌పాప‌ముల‌ను స‌యిత‌ము పోగొట్టున‌ని చెప్పబ‌డిన‌ది.

ఈమంత్రమును జ‌పించుట కెట్టి ప్రత్యేక‌విధులునులేవు శుచిగానున్నను అశుచిగానున్నను యీమంత్రమును జ‌పించ‌వ‌చ్చును.

"నాస్యవిధిరితి స‌ర్వదా శుచిర‌శుచిర్వాప‌ఠ బ్రహ్మణ‌స్సలోక‌తాం స‌మీప‌ప‌తాంస రూప‌తాం సాయుజ్యతామేతి"

మంత్రముల‌లోకెల్ల అతిసుల‌భ‌మ‌గు నీ మంత్రరాజ‌మును ఎల్లవారును నిత్యము జ‌పింప‌వ‌ల‌యున‌ని నామ‌న‌వి.

భ‌క్తి యోగ‌మ‌భ్యసించు విధాన‌ము మ‌న‌ము తెలుసుకొన‌వ‌ల‌సియున్నది. భ‌గ‌వంతుని ధ్యానించుట యందును, ఆయ‌న‌నుగురించి సంభాషించుట‌యందును, ప‌ర‌మేశ్వరుడ‌ని అయ‌న‌యందు ప్రప‌త్తి చేయుట‌యందును కాలము గ‌డుప‌వ‌లెన‌ని వరాహ ఉప‌నిష‌త్తునందున్నది.

భ‌క్తుని ల‌క్షణ‌ములు

భ‌క్తుడేవిధ‌ముగా లోక‌ములో సంచ‌రించ‌వ‌ల‌శిన‌దియు, భ‌క్తునికి యేయేల‌క్షణ‌ము లుండ‌వ‌ల‌శిన‌దియు, గీత 12 అధ్యాయ‌మునందు వివరింప బ‌డియున్నది. భ‌క్తుడెవ‌రిని ద్వేషింప‌డు. స‌ర్వభూత‌ముల‌యందును మిత్రభావ‌ముతో సంచ‌రించును. ద‌య‌గ‌ల‌వాడు మ‌మ‌త్వము అహంకార‌ము లేనివాడు. సుఖ‌దుఃఖములు స‌మాన‌ముగ చూచువాడు. ఓర్పుగ‌ల‌వాడు. ఎల్లప్పుడు సంతోష‌ముగ‌నుండును. సంయ‌మ‌ముగ‌ల‌వాడు. దృఢినిశ్చయ‌ము గ‌ల‌వాడు. భ‌గ‌వంతునికి అర్పింప‌బ‌డిన మ‌నోబుద్ధులుగ‌ల‌వాడు. లోకుల‌ను యేమాత్రము వ్యాకుల‌పెట్టడు. హ‌ర్షము, క్రోధ‌ము, భ‌యము, విషాద‌ము, అనువాటిచే యెట్టివికార‌మును పొంద‌డు. అపేక్షలేనివాడు, శుచిగ‌ల‌వాడు. ద‌క్షుడు. ఫ‌ల‌మెటులైన‌ను వ్యధ చెంద‌నివాడు. కామ్యక‌ర్మల‌ను విడ‌నాడిన‌వాడు. ద్వందాతీతుడు. సంప్రాప్తమైన దానిచే సంతుష్టుడు. స్థిర‌చిత్తముగ‌ల‌వాడు.

మ‌ర‌ణ‌కాల‌ము - స్మర‌ణ‌

మ‌ర‌ణ‌కాల‌మందేభావ‌మును స్మరించుచు దేహ‌మును చాలించునో ఆభావ‌మునే పిమ్మట‌పొందున‌ని వేద‌ము చెప్పుచున్నది.

"య‌ధాక్రతుర‌స్మి లోకేపురుషోభ‌వ‌లతి"

"త‌ధేతః ప్రేత్యభ‌వ‌తి." (ఛాందోగ్యము. 3-14-1) ప్రశ్న 3-10. మైత్రేయోప‌నిష‌త్తు. 4-6లో గూడ నీవిష‌య‌ము స్పష్టప‌రుప‌బ‌డిన‌ది. శ్రీ‌కృష్ణభ‌గ‌వానుడు గీత‌ల‌లో 8-5, 6 శ్లోక‌ముల‌లో యీ విష‌య‌మే వివ‌రించియున్నాడు. కావున ఉత్తమ‌గ‌తి గ‌లుగుట‌కు అంత్యకాల‌మందు భ‌గ‌వంతుని స్మర‌ణ‌చాల అగ‌త్యము. ఓం అని యేకాక్షర బ్రహ్మను జ‌పించుచు దేహ‌మును వ‌ద‌లివేయువాడు ప‌ర‌మ‌గ‌తిని పొందును. కాని జీవిత‌మంత‌యు అన్యధాగ‌డిపిన‌వానికి అంత్యకాల‌మందు భ‌క్తియెట్లుక‌లుగును క‌లుగ‌దు. కావున ప్రతిదిన‌మును ప‌ర‌మేశ్వరుని అన‌న్యభ‌క్తిచే స్మరించుట న‌ల‌వాటుచేసుకొన‌వ‌ల‌యును.