22

క‌ర్మవిపాక‌ము పున‌ర్జన్మము

దేహ‌ధారులంద‌రికిని యెప్పటికైన‌ను మ‌ర‌ణ‌ము త‌ప్పదు. నేడుగాని, రేపుగాని, నూరేండ్లకుగాని న‌శించుట‌యనున‌ది నిశ్చయ‌మే. అద్యవాబ్దశ‌తాంతేవా మృత్యుర్యైప్రాణినాంధ్రువః (భాగ‌వ‌త‌ము . 10-1) జాత‌స్యహిధ్రువోమృత్యుః - జ‌న్మించిన ప్రతివారికి మృత్యువు త‌ప్పదు. అని శ్రీ కృష్ణుడు చెప్పియున్నాడు. ఈ విష‌య‌ము మ‌నమంద‌ర‌మును క‌న్నులార చూచుచున్నాము. కాని మ‌ర‌ణించిన పిమ్మట మ‌న‌ము తిరిగి పుట్టుదుము. ఈ విష‌య‌ము మ‌న‌కు గోచ‌రించుట‌లేదు. ధ్రువంజ‌న్మమృత‌స్యచ‌.(గీ.2-13)య‌నియు, ప్రకృతియందుగ‌ల గుణ‌ముల‌యొక్క సంయోగ‌మువ‌ల‌న మంచి యోనుల‌యందుగాని, చెడుయోనుల‌యందుగాని పురుషుడు జ‌న్మించుట‌కు కార‌ణ మగుచున్నద‌నియు, గీత‌ల‌యందు చెప్పబ‌డియున్నది. (గీ.13-21) పురుషఃప్రకృతిస్థోహిభుజ్కై ప్రకృతిజా గుణా కార‌ణం గుణ సంగోస్యస‌ద‌స‌ద్యోనిజ‌న్మసు.

క‌ర్మఫ‌ల‌ము

వారువారు జ‌న్మాంత‌ర‌ములందు చేసిన పుణ్యపాప క‌ర్మము న‌నుస‌రించియు, వారువారు పొందిన విజ్ఞాన‌మున‌నుస‌రించియు, కొంద‌రు జీవులు శ‌రీర గ్రహ‌ణార్ధము గ‌ర్భవాస‌మును పొందుచున్నారు. కొంద‌రు జీవులు వృక్షాదిస్థావ‌ర భావ‌మును పొందుచున్నార‌నియు కృష్ణ య‌జుర్వేదములోని క‌ఠోప‌నిష‌త్తునందు చెప్పబడియున్నది.

"యోనిమ‌న్యేప్రప‌ద్యన్తే శ‌రీర‌త్వా య‌దేహినః
స్థాణుమ‌న్యే నుసంయ‌న్తి య‌ధాక‌ర్మయ‌ధాశ్రుతం" (2-2-7)

"య‌ధాప్రజ్ఞంహిసంభ‌వాః" అను శ్రుతివాక్యము గూడ యీ అర్ధమునే సూచించుచున్నది.

పూర్వజ‌న్మమందు చేసుకొనిన క‌ర్మన‌నుస‌రించియే మాన‌వుడు బ్రహ్మ, క్షత్రియ‌, వైశ్యాదుల యోనుల యందు పుట్టున‌ని సామ‌వేద‌ము చెప్పచున్నది. "తంవిద్యాక‌ర్మణీ స‌మ‌న్వార‌భేతే పూర్వప్రజ్ఞాచ" అనుమంత్రము కూడ యీ విష‌య‌మునే తెలుపుచున్నది. పాప‌క‌ర్మలు, వాచ‌క‌, మాన‌సిక శ‌రీర‌క‌ముల‌ని మూడు ర‌క‌మునియు, శ‌రీర సంబంధ‌మైన పాప‌ముల నెన‌ర్చిన‌చో స్థావ‌ర‌జ‌న్మ క‌లుగున‌నియు, వాచిక పాప‌ముల నెక్కుడు చేసిన‌చో ప‌క్షి, మృగాది జ‌న్మ క‌లుగున‌నియు మాన‌సిక పాపాధిక్యముచేత అంత్యజాతిత్వము క‌లుగున‌నియు మ‌నుస్మృతియందు చెప్పబ‌డిన‌ది. "శ‌రీర జైః క‌ర్మదోషైః యాతిస్థావ‌ర‌తాంన‌రః వాచికైఃప‌క్షిమృగ‌తాంమాన‌సైర‌న్త్యజాతితాం" ( 12- 9)

మాన‌వుడెంత‌వ‌ర‌కు ప‌ర‌మాత్మను తెలుసుకొన‌లేడో అంత‌వ‌ర‌కును వానికీజ‌న్మ ప‌రంప‌ర తప్పద‌నియు, అప్పుడు మాత్రమే జ‌న్మరాహిత్యము క‌లుగున‌నియు,శ్వేతా శ్వత‌ర ఉప‌నిష‌త్తునందు చెప్పబ‌డియున్నది
.
"స‌ర్వాజీవే స‌ర్వంస్థే బృహం తేత‌స్మి హంసోభ్రామ్యతే బ్రహ్మచ‌క్రే ! పృధ‌గాత్మానం ప్రేరితారంచ మ‌త్వాజుష్టస్తత‌స్తేనామృత‌త్వమేతి" (1--6)

"త‌తఃప‌రం బ్రహ్మప‌రం బృహంతం య‌ధానికాయం స‌ర్వభూతేషుగూఢం ! విశ్వస్యైకం ప‌రివేష్టితారం యీశం తం జ్ఞాత్వామృతాభ‌వంతి" (3 - 7)

శ్రీ‌కృష్ణ ప‌ర‌మాత్మ స్వర్గాది ఊర్ద్వలోక‌ము లెన్నిపొందిన‌ను పున‌ర్జన్మ త‌ప్పద‌నియు, త‌న‌ను పొందిన పిద‌ప‌నే అది త‌ప్పున‌నియు గీత 8వ అధ్యాయ‌ము 15-16 శ్లోక‌ముల‌లో స్పష్టీక‌రించి యున్నాడు.

"మాముపేత్యపున‌ర్జన్మ దుఃఖాల‌య‌మ‌శాశ్వతం
నాప్నువంతి మ‌హ‌త్మానః సంసిద్ధిం ప‌ర‌మాంగ‌తాః
అబ్రహ్మభువ‌నాల్లోకాః పున‌రావ‌ర్తినోర్జున‌
మాయుపేత్యతు కౌంతేయ పున‌ర్జన్మన‌విద్యతే."

మూడు విధ‌ముల‌యిన క‌ర్మ

సంసార‌మున‌కు కార‌ణ‌భూత‌మైన క‌ర్మ మూడు ర‌క‌ముల‌ని వేద‌మునందు చెప్పబడిన‌ది. 1. సంచిత‌ము 2.ఆగామి 3.ప్రార‌బ్ధము.
సంచిత‌ము:- మ‌నము చేసిన క‌ర్మ యొక్క ఫ‌లిత‌ము అనుభవించకుండా కొండ‌ల వ‌లె పెరిగియున్నది. అన‌గా ముందు ముందు దాని ఫ‌లితమ‌నుభ‌వించ వ‌ల‌సి యున్నది. ఇట్టి క‌ర్మ స్వప్నములో మ‌న‌ము చూచిన అనేక విష‌య‌ములు మెళుకువ రాగానే న‌శించిన‌ట్లు బ్రహ్మ సాక్షాత్కార‌ము క‌లుగ‌గానే న‌శించును. "అహంబ్రహ్మేతి విజ్ఞానాత్ క‌ల్పకోటి శ‌తార్జితం ! సంచితం విల‌యాయాతి ప్రబోధాత్స్యప్న క‌ర్మవ‌త్" (అధ్యాత్మోప‌నిష‌త్‌)

ఎంత‌టి పాప‌ముల‌ప్రోవు కొండ‌ల‌వ‌లె పెరిగియున్నను దానినంత‌యు ద‌గ్ధము చేసుకొనుట‌కు మ‌న‌కు అవ‌కాశ‌ము క‌ల‌ద‌ని వేద‌ము ఘంటాప‌ధ‌ముగా చాటుచున్నది. క‌నుక అనేక జ‌న్మముల‌యంద‌నేక పాప‌ములు చేసితిమేయ‌ని ఊర‌క చింతింప‌వ‌నిలేదు. దానిని నిశ్శేష‌ముగ పోగొట్టుకొనుట‌కు గ‌ట్టి ప్రయ‌త్నము చేయ‌వ‌లెను.

ఆగామి :- రాబోవు కాల‌ములో మ‌నముచేయు పుణ్య, పాప‌, క‌ర్మల‌వ‌ల‌న సంభ‌వింప‌గ‌ల క‌ర్మ. అన‌గా యిక‌ముందు మ‌నము చేయు క‌ర్మ. ఈ క‌ర్మవ‌ల‌న మ‌న‌ము భ‌య‌ప‌డ‌వ‌ల‌శిన అగ‌త్యములేదు. బ్రహ్మజ్ఞాన‌ము క‌ల‌వానికి యీ క‌ర్మ అంట‌దు. తాను ఆకాశ‌ములె అసంగ‌మును, ఉదాసీన‌మును, అగుబ్రహ్మమ‌ని తెలుసుకొనిన‌చో యీ క‌ర్మ అంట‌ద‌ని వేద‌ము చెప్పుచున్నది.

"స్వమసంగ‌ముదాసీనం ప‌రిజ్ఞాయ‌న‌భోయ‌ధా
నక్లిశ్య తేయ‌తిః కించిత్కదాచిద్భావిక‌ర్మభిః
న‌న‌బోఘ‌ట‌యోగేన సురాంగ‌ధేన‌లిప్యతే!
త‌ధాత్మో పాధియోగేన న‌త‌ద్ధర్మైర్విలిప్యతే. " ( అధ్యాత్మోప‌నిష‌త్‌)

ప్రార‌బ్ధము :- ఇప్పుడు మ‌న‌ము అనుభ‌వించుట‌కు మొద‌లు పెట్టిన క‌ర్మము. ఇది జ్ఞానోత్పత్తియైన‌ను న‌శించ‌దు. అనుభ‌వించి తీర‌వ‌ల‌యును. బాణ‌ముతో కొట్టవ‌లెన‌ని బాణ‌మువేశిన ఆల‌క్ష్యమును త‌గుల‌క మాన‌దుగ‌దా ! మొద‌ట ఆవునే పులియ‌ని భ్రమ‌ప‌డి బాణ‌ము వేశినామ‌నుకొనుడు. కాని వెంట‌నే అది ఆవ‌ని తెలిసిన‌ది. కాని విడిచిపెట్టిన బాణ‌ము త‌గుల‌క మాన‌లేదు. విచారించిన ప్రయెజ‌న‌ములేదు. ఆ రీతిగానే ఎట్టి జ్ఞానియైన‌ను ప్రార‌బ్ధము అనుభ‌వింప‌క త‌ప్పదు. అనుభ‌వించిన పిమ్మట‌నే ఆక‌ర్మ న‌శించును.

"జ్ఞానోద‌యాత్పురార‌బ్ధం క‌ర్మజ్ఞానాన్నప‌శ్యతి
అద‌త్వాస్వఫ‌లం ల‌క్ష్యముద్దిశ్యోత్సృష్ట బాణ‌వ‌త్‌.
వ్యాఘ్రబుద్ధ్యా వినుర్ముక్తోబాణః ప‌శ్చాత్తుగోమ‌తౌ
న‌తిష్టతిభి న‌త్యైవ‌ల‌క్ష్యం వేగేన‌నిర్భరం. " ( అధ్యాత్మోప‌నిష‌త్తు)

ప్రార‌బ్దము యొక్క వేగ‌ము కూడ ప్రస్తుత స‌త్కర్మానుష్టాన‌ము వ‌ల‌న త‌గ్గింప‌వ‌చ్చున‌ని కొన్ని చోట్ల చెప్పబ‌డియున్నది. క‌ర్మబ‌ద్ధులైన జీవులు త‌మ‌నుతామే ఉద్ధరించు కొన‌వ‌ల‌యున‌నియు త‌మ‌కుతామే మిత్రులుగాని శ‌త్రులుగాని య‌నియు ప‌ర‌మాత్మ గీతాశాస్త్రమునందు ఖండిత‌ముగ ప‌లికియున్నాడు.