23

జీవుని అవ‌స్థలు

జీవుడు త‌న‌స్వరూప‌మును మ‌రచి అవిద్యచే నావ‌రింప‌బ‌డి ప్రకృతి యొక్క విష‌యోప‌భోగ‌ముల‌చే స‌ద‌ప‌ద్యోనుల యందు జ‌న్మించున‌ని లోగ‌డ‌నే తెలిపియుంటిని. జీవున‌కు మూడువ‌స్థలు చెప్పబ‌డిన‌వ‌. మ‌న‌స్సు మొద‌ల‌గు ప‌దునాలుగు

క‌ర‌ణ‌ముల‌చేత స్థూల‌ములైన శ‌బ్దాది విష‌యముల నెప్పుడు గ్రహించుచున్నాడో అది జాగ్రద‌వ‌స్థయ‌న‌బ‌డును. స్వప్నావ‌స్థయందు స్థూల‌శ‌రీర‌మును ప్రాణ‌ము యొక్క అధీన‌ములో నుంచి జీవుడు సంచ‌రించు చున్నాడు. వాస‌నామ‌య‌మైన శ‌బ్ధాదుల‌ను ప‌దునాలుగు క‌ర‌ణ‌ముల‌చేత గ్రహించుచున్నాడు. స్వప్నావ‌స్థయందు క‌నుపించు విష‌య‌ములు య‌దార్ధముగ లేక‌పోయిన‌ను జీవుని యొక్క క‌ర్మవ‌ల‌న వాని యొక్క ఫ‌లిత‌ము న‌నుభ‌వించుచున్నాడు. స్వప్నాంత‌మందు ఆ విష‌య‌ముల‌దృశ్య మ‌గుచున్నవి. సుషుప్తి అవ‌స్థయందు స‌ర్వేంద్రియ‌ముల‌కు యెట్టి ప్రవృత్తియులేదు. శ‌బ్ధాదివిష‌య‌ముల‌ను తెలుసుకొనుట‌లేదు. జీవుడు బ్రహ్మముతో నైక్యమ‌గుచున్నాడు. (చాం.6-8-1) అప్పుడేమి జ‌రుగుచున్నదియు జీవున‌కు తెలియ‌దు. (బృహ 6-3-21, 32, 19) క‌ర్మతో అప్పుడెట్టి సంబంధ‌మునులేదు. అంత‌మాత్రముచే క‌ర్మబంధ‌ము పోయెన‌ని మ‌న‌మూహింప‌గూడ‌దు. క‌ర్మఫ‌లిత మ‌నుభ‌వింప‌క తీర‌దుగాన నిద్రనుంచి మేల్కొనిన వెంట‌నే అంత‌కుముందు తానున్నస్థితినే పొందును (చాం. 6-10-2).

శ‌రీర‌ము పోయిన పిమ్మట జీవుని అవ‌స్థ విచారింత‌ము. ఎవ‌రు ప‌ర‌మాత్మ స్వరూప‌మునుపాసించ‌క య‌జ్ఞ యాగాది క‌ర్మలు వాపీ కూప త‌టాకాది నిర్మాణ‌ములు మొద‌ల‌గు పుణ్యకార్యములు చేయుచున్నారో వారు పితృ లోకాదుల‌ను పొందుట‌కు మార్గమైన ద‌క్షిణాయ‌న మార్గము ద్వారా అగ్ని రూపుడ‌గు చంద్రుని పొందుచున్నారు. త‌ప‌స్సు చేత‌ను, బ్రహ్మచ‌ర్యము చేత‌ను, శ్రద్ధచేత‌ను, ఆత్మను తెలుసుకొనుచున్నారో వారు ఉత్తరాయ‌ణ మార్గము చేత సూర్యుని పొందుచున్నారు. జీవుల‌కు ఆశ్రయ‌మైన‌దిన్ని భ‌య‌ర‌హిత‌మైన‌దిన్ని నాశ‌న‌ర‌హిత మైన‌దియున‌గు మార్గమ‌దియే అట్టివారు తిరిగిపుట్టరు. (1 ప్రశ్న. చాం. 5-10-3) చంద్రలోకాదుల‌లో జీవులు దేవ‌త‌ల‌కు బానిస‌లైయుండి వారి ప్రయోజ‌న‌ము కొర‌కే ఉప‌యోగ‌ప‌డుదురు. (బృహ‌దా. 3-4-10)

ఈ సౌఖ్యమైన‌ను శాశ్వత‌మైన‌దికాదు. క‌ర్మఫ‌లమ‌నుభ‌వించిన పిమ్మట పుణ్యము క్షీణించిన పిమ్మట మ‌ర‌ల వెళ్ళిన మార్గమున‌నే మ‌ర్త్యలోక‌మున‌కు తిరిగివ‌త్తురు. ఎట్లువ‌చ్చున‌దియు చాందోగ్యోప‌నిష‌త్తునందు వ‌ర్ణింప‌బ‌డిన‌ది. (5-10, 5-6).

గాలిలో క‌లిసి క్రమ‌ముగా వ‌ర్షమురూపేణ వ‌చ్చి ధాన్యాధులుగామారి రేతోరూప‌మున చేరి గ‌ర్భమున ప‌డుదురు. వారి వారి ప్రాక్తన‌క‌ర్మల న‌నుస‌రించి శ‌రీర‌ములు క‌లుగును. (చాం. 5-10-7) గ‌ర్భవేద‌నన‌నుభ‌వించి భూమిపైబ‌డును. ఆ విష‌య‌ముల‌న్నియు గ‌ర్భోప‌నిష‌త్తునందు చూడ‌ద‌గును. గ్రంధ విస్తరభీతిచే వ్రాయ‌విర‌మించితిని.

పుణ్యక‌ర్మల నొన‌ర్చిన వారిస్థితి పైన విచారించితిమి. పాప‌క‌ర్మల జేసిన వారిగ‌తియేమి పైన వివ‌రింప‌బ‌డిన రెండు మార్గములును ఇట్టివారికి లేవు. ఇచ్చట‌నే మ‌ర‌ణ‌ము పొంది వెంట‌నేతిరిగి జ‌న్మించుచున్నారు. (చాం. 5-10-8) అశుభ‌క‌ర్మల‌నుజేయుచు ద్వేషించువారును క్రూరులునున‌గు న‌రాధ‌ములు పాప‌యోనుల‌యందే యెప్పుడుచు ప‌డుదుర‌నియు ప‌ర‌మాత్మనెప్పుడును పొంద‌క య‌ధోగ‌తి నొందుదుర‌నియు గీత‌యందు చెప్పబ‌డిన‌ది. (16-19-20) క్రిమి, కీట‌కాదులుగాను వృక్షాదులుగాను పుట్టుచున్నారు. ఈ విధ‌ముగా జ‌న్మ ప‌రంప‌ర‌లోబ‌డి క‌ర్మఫ‌ల‌ముల‌నుభ‌వించుచుజీవుడు చెడిపోవుచున్నాడు. ఎప్పుడు త‌న‌యొక్క నిజ‌స్వరూప‌మును తెలుసుకొని ప‌ర‌మాత్మను పొందుచున్నాడో, అప్పుడు క‌ర్మబంధ‌ము తొల‌గి అమృత‌త్వము ఘ‌టించును. (ఆనంద‌వ‌ల్లి, 1- 2).

ప‌ర‌బ్రహ్మము

జ్ఞేయ‌వ‌స్తువ‌గు ప‌ర‌బ్రహ్మస్వరూప‌మును గుర్తెరుగుట‌త్యవ‌స‌ర‌ము. ఉప‌నిష‌త్తుల‌యందెచ్చట చూచిన‌ను యీ వ‌ర్ణన అత్యంత విపుల‌ముగ చేయ‌బ‌డిన‌ది. కాని మ‌న‌మిట కొన్ని ముఖ్య విష‌య‌ముల‌ను మాత్రము విచారింత‌ము.

"స‌ర్వతః పాణిపాదం త‌త్సర్యతో క్షిశిరోముఖం
స‌ర్వత‌శ్రుతిమ‌ల్లోక స‌ర్వమావృత్య తిష్టతి. " (శ్వేతాశ్వత‌ర ఉ. 3 - 16)

దానికి అన్ని వైపుల‌ను హ‌స్తపాదుములున్నవి. అన్ని వైపుల‌ను నేత్రములును శిర‌స్సుల‌ను, ముఖ‌ములును క‌ల‌వు అదియే యీ లోక‌మునందంత‌ట‌ను వ్యాపించి యున్నది.

పైమంత్రము యొక్క వాక్యార్ధమిది. దీని తాత్పర్యమేమ‌న‌గా ప‌ర‌మాత్మ స‌ర్వత్రవ్యాపించి యున్నాడ‌నియు ఆయ‌న లేని చోటుగాని ఆయ‌న‌కు తెలియ‌ని విష‌య‌ముగాని లేదు. ప్రహ్లాదునిచే చెప్పబ‌డిన రీతిని ఎందుచూచిన‌ను ఆప‌ర‌బ్రహ్మముక‌ల‌డు. "హృధిస‌ర్వస్యధిష్టితం" అన‌గా అంద‌లి హృద‌య‌ముల యందును అదియే అధిష్టించి యున్నదియ‌ని గీత 13-17 శ్లోక‌ములో చెప్పబ‌డియున్నది. "అంగుష్టమాత్రః పురుషో మ‌ధ్య ఆత్మనితిష్టతి". అనాదియు, నిర్గుణ‌ము న‌గుట‌చే నీ య‌వ్యయ‌మ‌గు ప‌ర‌మాత్మ శ‌రీర‌మండుండిన‌ను దేనిని చేయ‌నేర‌దు. దానికి క‌ర్మ సంబంధ‌ముండ‌ద‌ని శ్రీ కృష్ణప‌ర‌మాత్మ గీ. 13-31, 32 శ్లోక‌ముల‌లో ఆత్మత‌త్వమును వ‌ర్ణించివ యున్నాడు.

"అనాదిత్వాన్నిర్గుణ త్వాత్పర‌మాత్మాయ‌మ‌వ్యయః
శ‌రీర‌స్థోపికౌంతేయ‌న‌క‌రోతి న‌లిప్యతే".
"య‌ధాస‌ర్వగ‌తం సౌక్ష్మాదాకాశంనోప‌లివ‌ప్యతే
స‌ర్వత్రావ‌స్థితో దేహేత‌ధాత్మానో ప‌లిప్యతే".
"ఉప‌ద్రష్టానుమంతాచ భ‌ర్తాభోక్తామ‌హేశ్వరః
ప‌ర‌మాత్మేతి చాప్యుక్తోదేహేస్మి పురుషః ప‌రః"

అది స‌ర్వభూత‌ముల‌యొక్క లోప‌ల‌ను వెలుప‌ల‌ను ఉండును. అ చ‌ర‌మును చ‌ర‌మునునైన‌ది. సూక్ష్మమ‌గుట‌చే అవిజ్ఞేయ‌మైన‌ది.

"త‌ద‌న్తర‌స్యస‌ర్వస్యత‌దుస‌ర్వస్యాస్యబాహ్యతః" (ఈశావాస్యోప‌నిష‌త్తు)

2. ఎన్ని సంవ‌త్సర‌ముల కైన‌ను ఈ ఆత్మత‌త్వము అజ్ఞానుల‌కు పొంద‌రానిది కావున దూర‌మందున్నద‌ని వ‌ర్ణింప‌బ‌డిన‌ది. విద్వాంసుల‌కు స‌మీప‌మునందే యున్నద‌ని చెప్పబ‌డిన‌ది.

"త‌ద్దూరేత‌ద్వద‌న్తికే" (ఈశావాస్యము) దూర‌స్థంచాంతికేచ‌త‌త్ (గీత‌. 13-15) ఈ విష‌య‌మే ముండ‌కోప‌నిష‌త్తు ( 3-17) నందును స్పష్టప‌రుపబ‌డిన‌ది.

3. ఆ ప‌ర‌బ్రహ్మము నిర్మలుడును పాప‌ముల‌చేత కొట్టబ‌డ‌నివాడును అయివున్నాడు. సంగ‌ర‌హితుడు. "శుద్ధమ‌పాప‌విద్ధం" (ఈశావాస్యము) 'అసంగోన‌హిస‌జ్జతే' ఎయ్యది వాగాదీంద్రియ‌ముల‌చే యోరుగ‌బ‌డిన‌దై వాగాదీంద్రియ‌ముల‌కు త‌మ త‌మ వ్యాపార‌ములు చేయున‌ట్లు ప్రేరేపించుచున్నదో అదియే ప‌ర‌మాత్మ స్వరూప‌మ‌ని సామ‌వేదాంత‌ర్గత కేనోప‌నిష‌త్తునందు చెప్పబ‌డిన‌ది.

4. అది నిజ‌ముగ అవిభ‌క్తమైన‌ది. అఖండ‌మైన‌ది. కాని స‌ర్వభూత‌ముల యందును నానాత్వముచే వేరైన‌దానివ‌లె క‌నుపించుచున్నది."అవిభ‌క్తంచభూతేషు విభ‌క్తమివ‌చ‌స్థితం". (గీ. 1-316)

5. విజ్ఞాన మానందంబ్రహ్మ జ్ఞాన‌స్వరూప‌మును ఆనంద స్వరూప‌ముగ‌ను వుండున‌దియే బ్రహ్మ జ్ఞాన‌ము చేత‌నే అది తెలియ‌ద‌గిన‌ది గీత‌ల‌యందు చెప్పబ‌డిన‌ది. "జ్ఞాన‌గ‌మ్యం" 'స‌త్యంజ్ఞాన‌మ‌నంతం బ్రహ్మయ‌నియు వ‌ర్ణింప‌బ‌డిన‌ది.

6. బ్రహ్మము ప్రేమ‌మ‌యుడు. (శ్వేతాశ్వత‌రఉప‌నిష‌త్తు 3) ఆత్మానేవ విజానీయాత్ అని వేద‌ము ఆత్మనే తెలుసుకొన‌వ‌ల‌యున‌ని చెప్పుచున్నది గ‌దా ఆత్మత‌త్వ విచార‌ణ‌లోగ‌ల‌కొన్ని సందేహ‌ముల‌ను విచారింత‌ము.

దేహములో అన్నమ‌యాది కోశ‌ముల‌యందు ఆత్మవుంటూవుండ‌గా యెట్లుశుద్ధుడుగాను నిత్యముక్తుడుగా నుండున‌ని కొంద‌రు శంకించుదురు. స్వచ్ఛమైన ప‌టిక‌ము తీసుకొనుడు దాని స‌మీప‌ములో నల్లని, యెర్రని, ప‌చ్చని వ‌స్త్రముల‌ను మ‌న‌ము పుంచిన‌చో ఆయా రంగులు ఆస్ఫటిక‌ము నందు కాన్పించును. కాని కొంచ‌ము విచారించిన‌చో ఆ రంగులు స్ఫటికము యందు లేవ‌ని మ‌న‌కు గోచ‌రించును. ఆ విధ‌మున‌నే ఆత్మ అప‌రిశుద్ధమైన యీ కోశ‌ముల‌యొక్క తాదాత్మ్యాధ్యాస‌వ‌ల్ల ఆ యా స్వరూప‌మును పొందిన‌ట్లు కాన్పించిన‌ను నిజ‌ముగా ఆత్మకు ఆ కోశ‌ముల‌తో సంబంధ‌ములేద‌ని త‌త్వవిచార‌ణ‌వ‌ల్ల తేలును.


7. స‌ర్వదేహ‌ముల యందును ఆత్మ వ్యాపించియున్నాడ‌ని చెప్పుచుండ‌గా యేల అగుప‌డడు ఏవిధ‌మైన మ‌లిన‌ము లేని అద్ధములో ఆకాశ‌ము తోచిన‌రీతిని మ‌లిన‌ముతో కూడిన అద్దమందు ప్రతిబింబు కానుపించ‌దు. ఆరీతిగ‌నే రాగ‌ద్వేషాదుల‌తో మాలిన్యమైన బుద్ధియందు ఆత్మగోచ‌రింప‌దు.

8. దేహ‌మందుండు ఆత్మకు సాక్షి భావ‌ము ఎట్లుక‌లుగును ఇంద్రియ వ్యాపార‌ములో ఆత్మకు యెట్టిసంబంధ‌ము లేదా?
ఒక ప‌ట్టణ‌మందు రాజుగారి ఆజ్ఞ చొప్పున మంత్రులంద‌రు త‌మ‌త‌మ పనులు నెర‌వేర్చుకొనుచుండ‌గా రాజుగారు చూచుచు వున్నట్లు స‌ర్వేంద్రియ‌ములు ఆ ఆత్మ యొక్క స‌న్నిధాన‌ము వ‌ల్ల త‌మ త‌మ వ్యాపార‌ములు చేసుకొనుచున్నవి. ఆత్మమాత్రము వాటితో సంబంధ‌ప‌డ‌క సాక్షిగా చూచుచున్నాడు. మేఘ‌ములు ఆకాశ‌ము మీద ప‌రువెత్తుచుండ‌గా చంద్రుడు కూడా ప‌రుగెత్తుచున్నట్లు మ‌న‌కు తోచుచున్నది. కాని అది యెంత‌మాత్రము నిజ‌ము కాదుగ‌దా ! ఆ ప్రకార‌ముగానే యింద్రియ‌ములు విష‌య‌ముల‌యందు వ్యాపించుచుండ‌గా అవివేకులు ఆత్మకు వ్యాపార‌ముగ‌ల‌ద‌ని త‌లంచుచున్నారు.

"శ‌బ్దాదివిష‌యై స్సంగోనిరింద్రియ త‌యాన‌చ‌"

ఆకాశ‌మున‌కు రూపులేదు. అవ‌య‌వ‌ములులేవు. అయిన‌ను మ‌న‌ము న‌లుపు. తెలుపు మొద‌లైన రంగులు దానియందారోపించుచున్నాము. ఆ విధ‌మున‌నే యింద్రియ వ్యాపార‌ముల‌ను స్వచ్ఛమైన స‌చ్చిదానందాత్మయందు అనుభ‌వ‌ము లేని కార‌ణ‌ముచే మ‌న‌ము ఆరోపించుచున్నాము. ఇనుప‌క‌డ్డీకి స్వయ‌ముగా కాల్చు స్వభావ‌ములేదు. కాని దానిని నిప్పులో పెట్టిన‌చో స‌మీపించు ప‌దార్ధముల‌ను ద‌హించును. అయిన‌ను ఆకార‌మును ద‌హించు గుణ‌మును యినుమున‌కు స్వాభావిక‌మైన‌దికాదు. ఈ విధ‌మున‌నే నిత్యశుద్ధబుద్ధ స‌త్యప‌రిపూర్ణ స్వభావ‌ముగ‌ల బ్రహ్మము అశుద్ధమైన ప‌దార్ధముల‌యొక్క సామీప్యమువ‌ల‌న ఆయా ఆకార‌ములును గుణ‌ములును గ‌లిగిన‌ట్లు తాత్కాలిక‌ముగ క‌నుపించుచున్నది. కాని య‌దార్ధముగ బ్రహ్మమందు క‌ర్తృత్వభోక్తృత్వాదులు లేవు. అట్లున్నవ‌ని త‌లంచుట కేవ‌ల‌ము భ్రమ‌య‌నియు త‌న్నివృత్తిని గురించి అధ‌ర్వణ వేద‌మిట్లు చెప్పుచున్నది. "స్ఫటిక‌లోహిత‌ద‌ర్శ నేన‌పార‌మార్ధిత‌క క‌ర్తృత్వభ్రమోనివృత్తః" (అన్నపూర్ణోప‌నిష‌త్తు)

ఈజ‌గ‌త్తున‌కు బ్రహ్మము కార‌ణ‌ముగా చెప్పబ‌డిన‌ది. కాన‌జ‌గ‌ద్వికార‌స్థితి బ్రహ్మమందే క‌ల‌ద‌ని కొంద‌రు చెప్పుదురు. ఇదియును భ్రమ‌యే. ఈ భ్రమ నివార‌ణ మార్గమును గురించి వేదమిట్లు తెలుపుచున్నది. "క‌న‌క‌రుచ‌క‌ద‌ర్శనేన వికారిత్వభ్రమోనివృత్తః" బంగార‌ముచేత అనేక నామ రూప‌ములు గ‌ల న‌గ‌లు మ‌న‌ము చేయించుచున్నాము. ఆ న‌గ‌లు యొక్క నామ రూప‌ములు న‌శించిన‌ను బంగార‌మున‌కు యేమియు హ‌నిలేదు. ఆ ప్రకార‌ముగానే బ్రహ్మమ‌నేక నామ‌రూప‌ములు గ‌ల‌దిగా ప్రపంచ‌ములో వ్యవ‌హ‌రింప‌బ‌డుచున్నను దానికి యెట్టి బాధ‌క‌మును లేదు. నామ రూప‌ములు న‌శించును. బ్రహ్మ న‌శించున‌ది కాదు. బ్రహ్మము యొక్క నిజ‌త‌త్వము వేదాంత విచార‌ణ‌చే తెలుసుకొనిన‌చో యీ భ్రమ‌నివార‌ణ య‌గుట‌కెట్టి సందేహ‌ములేదు.