24

జ్ఞాన‌యోగాభ్యాస‌ము

జ్ఞాన‌మన‌గా విష‌య‌ముల‌ను గురించి తెలుసుకొనుట మాత్రమేకాదు. జ్ఞాన‌ము యొక్క ప‌రిణామ‌ము దేహ‌స్వభావ‌ముపైన సంఘ‌టిల్లవ‌ల‌యును. కొన్ని స‌ల్లక్షణ‌ములు మాన‌వుడ‌భ్యసింప‌వ‌ల‌యును. అప్పుడే అత‌నికి జ్ఞాన‌ము అల‌వ‌డిన‌ట్లు యెంచ‌వ‌ల‌శియున్నది. శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు జ్ఞాన‌మున నేమో నిర్వచించుచు యీ దిగువ పేర్కొన‌బ‌డిన గుణ‌ములు మ‌నుజుని శ‌రీర‌మందు కాన్పించ‌వ‌ల‌యున‌ని చెప్పియున్నాడు. మాన‌ము లేకుండుట‌, దంభ‌ములేకుండుట‌, అహింస‌, క్షమ‌, స‌ర‌ళ‌త్వము, గురుసేవ‌, శుచిత్వము, స్థైర్యము, మ‌నోనిగ్రహ‌ము, ఇంద్రియ‌ముల విష‌య‌ముల‌యందు విర‌క్తి, అహంకార‌ము లేకుండ‌ట‌, జ‌న్మము, మృత్యువు, ముస‌లిత‌న‌ము, రోగ‌ము, దుఃఖ‌ము, అనున‌వి త‌న‌వెంట త‌గిలిన దోష‌ముల‌ని యెన్నుకొన‌నుట‌, క‌ర్మల‌యంద‌నాస‌క్తి, దారాపుత్రాదులు గృహ‌ము మొద‌ల‌గు వాని యందు లంప‌టుడు కాకుండుట‌, ఇష్టమైన‌ను, అయిష్టమైన‌ను, ప్రాప్తించిన‌ప్పుడు ఒకేరీతిని చిత్తవృత్తినుంచుట‌. భ‌గ‌వంతునియంద‌న‌న్యభ‌క్తి ఏకాంత ప్రదేశ‌మందుండుట‌, సామాన్య జ‌నుల‌యొక్క స‌ముదాయ‌మును కోర‌కుండుట‌, అధ్యాత్మజ్ఞాన‌ము యొక్క సిద్ధాంత‌మును ప‌రిశీలించుట‌, ఈ ల‌క్షణ‌ములు అల‌వ‌డ‌నిచో అజ్ఞాన‌మ‌నియే యెంచ‌వ‌ల‌యును. (గీత‌. 13-7, 11)

జ్ఞాన‌భూమి యేడంత‌స్థులుగ‌ల‌దియ‌నియు దాని నెరిగి అభ్యసించిన‌చో మ‌నుజులు మ‌ర‌ల న‌జ్ఞాన‌మును బుర‌ద‌యందు దిగ‌బ‌డ‌ర‌ని వేద‌ము ఘోషిల్లుచున్నది. ఆజ్ఞాన భూముల‌నేడింటిని చ‌క్కగా మ‌న‌ము విచారించ‌వ‌ల‌శియున్నది.

1. శుభేచ్ఛ 2. విచార‌ణ 3. త‌నుమాన‌సివ 4. స‌త్వాప‌త్తి 5. అసంస‌క్తి 6. ప‌దార్ధాభావ‌ని 7. తుర్యగ‌

ఈ యేడింటికి మీద‌ముక్తి క‌ల‌దు. దీనియందు జొచ్చిన వాడు మ‌ర‌ల దుఃఖ‌ము నొంద‌డు. వ‌న‌శ్చాంచ‌ల్యము తొలిగించుట‌కు సాధ‌క‌మైనందున యీ జ్ఞాన‌భూమి యోగ‌మ‌నియు చెప్పబ‌డుచున్నది.

1.శుభేచ్ఛయ‌న‌నేమో విచారింత‌ము. నేనుమూఢునివ‌లె యేల‌యుంటిని శాస్త్రాభ్యాస‌ము చేత‌ను, స‌జ్జన‌సాంగ‌త్యముచేత‌ను, ఆత్మస్వరూప‌మును తెలుసుకొందునుగాక అనియిట్లు కేవ‌ల‌ము వైరాగ్యపూర్వక‌ముగా గ‌ల్గున‌ట్టి కోరిక శుభేచ్ఛయ‌న‌బ‌డును. ఈ ప్రధ‌మ భూమిక నొందిన వాని ల‌క్షణ‌ముల‌నొకింత‌విచారింత‌ము. ఎప్పుడు వైరాగ్యముచే సంసార సాగ‌ర‌మును దాట‌గ‌ల‌ను, అను విచార‌ణ ప్రారంభించుచున్నాడో అప్పుడాత‌డు వాస‌న‌ల‌యందు విర‌క్తినొందుచున్నాడు. శ్రేష్టములును, ఉదార‌ములునున‌గు కృత్యముల జేయుచు వానినే అనుమోదిచుచున్నాడు.గ్రామ్యంబుల‌గు మూఢ‌కృత్యంబుల‌గు విష‌య‌ముల విడ‌చుచున్నాడు. పుణ్యక‌ర్మల చేయుచున్నాడు. ఇత‌రుల‌కు భ‌య‌ము క‌లుగ జేయ‌న‌ట్టియు, మృదువైన ప‌నుల‌ను చేయుచున్నాడు. పాప‌మును జూచి భ‌య‌పడుచున్నాడు.న భోగ‌ముల నపేక్షింప‌డు. ప్రేమ‌పూరిత‌ములును, దేశ‌కాలానుగుణ‌ముల‌గు మాట‌ల‌ను ప‌లుకును. మ‌నోవాక్కాయ క‌ర్మంబుల‌చేత స‌జ్జనుల సేవించుచున్నాడు.

2. విచార‌ణ వేదాంత‌శాస్త్ర విచారంబును, బ్రహ్మవిధుల‌యొక్క సాంగ‌త్యమును, సంసార‌మునందు లంప‌టుడు కాకుండుట‌కు త‌త్సంబంధ‌ముల‌గు దోష‌ముల నెంచుట‌యును, స‌దాచార‌మునందు ప్రవృత్తియును, ఇవి అన్నియు చేరివిచార‌ణ య‌ని చెప్పబ‌డును. ఈ యోగ‌భూమిక నొందిన వాడెచ్చట నుండియైన‌ను జ్ఞాన‌శాస్త్రముల‌ను తీసుకొనివ‌చ్చి వాటిని చూచుచున్నాడు. శ్రౌత‌స్మార్తధ‌ర్మాచ‌ర‌ణంబును, ధ్యాన‌ధార‌ణాద్యభ్యాసంబును క‌లిగి వేదాంత‌శాస్త్ర ప్రచార‌మునందు శ్రేష్టుల‌గు పండితుల నాశ్రయించుచున్నాడు. నిత్యానిత్యవ‌స్తు వివేక‌ము క‌ల‌వాడు. అధ్యాత్మశాస్త్రము శ్రవ‌ణ‌ము చేయువాడు. కార్యాకార్య నిర్ణయ‌ము నెరిగిన‌వాడు. మ‌ద‌ము, అభిమాన‌ము, మాత్సర్యము, దంభ‌ము, మోహ‌ము వీనిని విడిచిపెట్టచున్నాడు. ఇట్టి మ‌న‌స్సు క‌ల‌వాడై గురువుల యొక్కయు స‌జ్జనుల యొక్కయు సేవ‌చేయుచు శాస్త్రర‌హ‌స్యముల‌న్నియు తెలుసుకొనుచున్నాడు.

3. త‌నుమాన‌స :- మొద‌టి రెండు భూమిక‌ల న‌భ్యసించుట చేత విష‌య‌ముల‌యందు విర‌క్తి క‌లిగి మ‌న‌స్సు పెంపొందుట‌కు కార‌ణ‌మైన రాగ‌ము న‌శించి మ‌న‌స్సు సూక్ష్మరూప‌ము నెందిన‌ట్టి ద‌శ త‌నుమాన‌స మ‌న‌బ‌డును. దీనినే అసంస‌ర్గయ‌ని చెప్పుట క‌ల‌దు. ఈ భూమిక‌నెందిన‌వాడు వేదాంత‌శాస్త్రముల‌యొక్క వాక్యమునందు నిశ్చల‌మ‌గు బుద్ధినినిలుపును. తాప‌సాశ్రమ‌ముల‌యందు విశ్రాంతి నెందియున్న ఆత్మనిష్టుల‌తో గూడి త‌త్వమును మ‌న‌న‌ముచేయును. సంసార నింద‌క‌ముల‌గు వైరాగ్యప్రపంగ‌ముల‌ను వినును. వ‌న‌భూముల యందు విహ‌రించుట చేత‌ను చిత్తోప‌శాంతిచే క‌లిగిన సౌఖ్యముతో నీతిమంతుడై కాల‌ము గ‌డుపును. శాస్త్రాభ్యాస‌ము చేత‌ను పుణ్యక‌ర్మా చ‌ర‌ణ‌ము చేత‌ను ఆత్మజ్ఞాన‌ము తోచును
యోగ‌యుక్తుల‌కు ప్రధ‌మ‌ములో ఆర్యత్వము ఉద‌యించుచున్నది. చేయ‌ద‌గుదానిని చేయుచు, చేయ‌త‌గ‌ని దానిని విడ‌నాడుచు ఆవ‌శ్యక క‌ర్మాచ‌ర‌ణ ప‌రుండై, ఆచార‌ము, శాస్త్రము, స్థితిన‌నుస‌రించి లోక‌వ్యవ‌హ‌ర‌ము నెవ్వడాచ‌రించుచునుండునో వాడు ఆర్యుండ‌ని చెప్పబ‌డును. ఈ ఆర్యత్వము మొద‌టి భూమిక‌యందు అంకురంచి, రెండ‌వ భూమిక‌యందు పుష్పించి మూడ‌వ భూమిక‌యందు ఫ‌లించుచున్నది.

4. స‌త్త్వాప‌త్తి:- మొద‌టి మూడుభూమిక‌ల న‌భ్యసించి నందువ‌ల‌న సంస్కార‌ము న‌శించి మ‌న‌స్సులో విష‌య వాస‌న‌లు పోయి స్వచ్ఛమైన ఆత్మస్వరూప‌మునందు నిలుక‌డ‌నొందియుండుట స‌త్త్వాప‌త్తియ‌ని చెప్పుదురు. చిత్తమునందు జ్ఞాన‌ముద‌యించుట‌చే స‌మ‌స్తజ‌గ‌మును అభిన్నమై స‌మ‌మైన‌దిగా కానుపించును. అద్వైత భావ‌మునందు స్థిర‌త్వముక‌ల్గును. ద్వైత‌భావ‌ము న‌శించును. జ‌గ‌త్తుయొక్క మిధ్యాత్వము గ్రహించి స్వప్నతుల్యమ‌ని యెంచును. ఈ నాల్గవ భూమిక యందు చిత్తము శ‌ర‌త్కాల మేఘ‌మువ‌లె ల‌య‌మొందుచున్నది.

5 అసంస‌క్తి :- స‌త్వగుణ‌ము బాగుగా నాటుకొనినందున దృఢ‌మైన బ్రహ్మ సాక్షాత్కార‌ము క‌లిగి క‌ర్మల యొక్క ఫ‌ల‌ముల‌యందెట్టి స‌క్తియు లేకుండుట అసంస‌క్తి య‌ని చెప్పబ‌డును.ఈ ఐద‌వ భూమిక నొందిన‌వాడు శాంత‌చిత్తుడై జ్ఞానానంద‌ము క‌ల‌వాడై యుండును. బాహ్యవృత్తుల‌యందు తిరుగుచున్నను అంత‌ర్ముఖుడుగా నండుచు శాంతుడ‌గుట‌చేత నిద్రాశీలునివ‌లె క‌న‌బ‌డుచున్నాడు. చిత్తమున‌శించుట‌వ‌ల‌న జ‌గ‌ద్రూప‌మ‌గువిక‌ల్పముద‌యింప‌దు. జ‌గ‌ద్విక‌ల్పోనోదేతి చిత్తాస్యాత్రవిలాప‌నాత్‌.

6. ప‌దార్ధాభావ‌ని మొద‌టివ అయిదు అవ‌స్థల న‌బ్యసించుట‌చే గ‌ట్టి ఆత్మనిష్టక‌ల‌వాడై అభ్యంత‌ర‌ములుగాని, బాహ్యములుగాని య‌గు ప‌దార్ధముల‌ను భావింప‌క ప‌రుల యొక్క ప్రయ‌త్నముచే ప‌నులు నిర్వర్తించు కొనుచుండుట ప‌దార్ధాభావ‌నియ‌ని పిలువ‌బ‌డును.

ఈ అవ‌స్థయందున్న వానికి అహంకార‌ముగాని భేద బుద్ధిగాని యెంత‌మాత్రము లేదు. సందేహ‌ములు లేనివాడు. వాస‌నార‌హితుడు. దేహ‌ధారియైన‌ను బొమ్మలోని దీప‌మువ‌లె చ‌లింప‌క మెలంగుచున్నాడు. బ్రహ్మమే కాని ప్రపంచ‌ప‌దార్ధమెద్ధియు లేద‌ని భావించును. బ్రహ్మదృష్టిచే పూర్ణుడైన‌వాడు.

7.తుర్యగ మొద‌టి ఆరుఅవ‌స్థల న‌భ్యసించుట చేత యెంత‌మాత్రము భేద‌వ్యవ‌హార‌ము క‌లుగ‌క ఆత్మయందే నిష్టక‌లిగియుండుట తుర్యగ‌య‌ని చెప్పబ‌డును.

ఈ తుర్యావ‌స్థ జీవ‌న్ముక్తుల‌యందుండును. ఈ యేడ‌వ భూమిక‌ను ప్రవేశించిన‌వారు ఆత్మయందు క్రీడించున‌ట్టియు మ‌హ‌త్పద‌మును పొందిన‌ట్టియు మ‌హానుభావులు. వీరికి సుఖ‌దుఃఖ‌ములు స‌మాన‌ములు. ఇట్టివారికి బ్రహ్మవ‌స్తువు నిత్యసిద్ధము. విదేహ కైవ‌ల్యము ముక్తియే యేడ‌వ‌భూమిక య‌ని చెప్పబ‌డిన‌ది.

సంపూర్ణము.