4
బ్రాహ్మణుడెట్టివాడు

బ్రాహ్మణుని ల‌క్షణ‌ములు

ప్రపంచములోని స‌మ‌స్త మాన‌వులును బ్రాహ్మణులు కావ‌ల‌యున‌ని చెప్పితిరిగ‌దా బ్రాహ్మణుడ‌న నెవ‌డు? ఎట్టి ల‌క్షణ‌ము లుండ‌వ‌లెను. ఎట్టి జీవిత‌ము గ‌డుప‌వ‌ల‌యును? ఇది విచారింత‌ము. వేద‌ము బ్రాహ్మణుడెవ్వరు? అని ప్రశ్నించుకొని ఇట్లు స‌మాధాన‌ము చెప్పుచున్నది.

"యఃక‌శ్చిదాత్మాన మ‌ద్వితీయం జాతి గుణ‌క్రియాహీనం ష‌డ్మూర్తి ష‌డ్భావేత్యాది స‌ర్వదోష‌ర‌హితం స‌త్యజ్ఞానానందానంత స్వరూపం స్వయంనిర్విక‌ల్ప మ‌శేష‌క‌ల్పాధార మ‌శేష‌భూతాంత‌ర్యామిత్వేన‌వ‌ర్తమాన మంత‌ర్భహిశ్చాకాశ వ‌ద‌నున్యూత మ‌ఖండానంద స్వభావ మ‌ప్రమేయ‌మ‌నుభ‌వైక వేద్యమప‌రోక్షత‌యాభాస‌మానం, క‌ర‌త‌లామ‌ల‌క‌వ‌త్సాక్షాద ప‌రోక్షీకృత్య కృతార్ధత‌యా, కామ‌రాగాది దోష‌ర‌హిత‌, శ‌మాదిగుణ‌సంప‌న్నో భావ‌మాత్సర్య తృష్ణాశామోహ‌దిర‌హితో దంభాహంకారాదిభిర సంస్సృష్టచేతావ‌ర్తతే ఏవ ముక్త ల‌క్షణోయ‌స్సఏవ బ్రాహ్మణ ఇతి శ్రుతిస్మతి పురాణేతిహ‌సానా మ‌భిప్రాయః అన్యధా బ్రాహ్మణ‌త్వసిద్ధిర్నాస్త్యేవ" (సామ‌వేద‌ము)
ఈ మంత్రమునందు ప‌ర‌బ్రహ్మస్వరూప‌ము చ‌క్కగా వ‌ర్ణింప‌బ‌డిన‌ది. అట్టి భ‌గ‌వంతుని అర‌చేతిలోని ఉసిరిక కాయ‌వ‌లె చ‌క్కగ ప్రత్యక్షము చేసికొని కృతార్ధుడై ఆశ‌మున్నగు దోష‌ముల‌ను వ‌ద‌లి శాంతి మొద‌లుగు గుణ‌ములుగైకొని, మోహ‌ము మాత్సర్యము మొద‌ల‌గు దుర్గుణ‌ములు లేనివాడై అహంకార‌ము, డంబ‌ము మొద‌ల‌గువానిని మ‌న‌స్సునందు జొర‌నీయ‌క యండునో అట్టిల‌క్షణ‌ములు గ‌ల‌వాడే బ్రాహ్మణుడ‌ని వేద‌మంత్రము యొక్క తాత్పర్యము. అట్లు కాదేని బ్రాహ్మణునిబ్రాహ్మణ‌త్వ సిద్ధియేలేదు. బృహ‌దార‌ణ్యక శ్రుతియందు బ్రాహ్మణుని ల‌క్షణ‌ములును క‌ర్తవ్యమును చెప్పబ‌డియున్నది. ఏతంవైత‌మాత్మానం విదిత్వా బ్రాహ్మణాః పుత్రైష‌ణాయాశ్చ లోకైష‌ణాయాశ్చ వ్యుత్ధాయ‌ధాభిక్షాచ‌ర్యం చ‌రంతి. త‌స్మాత్ బ్రాహ్మణాః పాండిత్యం నిర్విద్య బాల్యేన‌తిష్టాసీత్‌, బాల్యంచ పాండిత్యంచ నిర్విద్యాధ‌మునిః అమౌనంచ మౌనంచ నిర్విద్యాధ బ్రాహ్మణః స‌బ్రాహ్మణ‌కేన‌స్యాత్ యేన‌స్యాత్తేనేదృశ ఏవ‌. ఆత్మయుండుట‌ను తెలుసుకొని బ్రాహ్మణులు పుత్రవిత్తలోక‌ముల‌కు సంబంధించిన అపేక్షల‌ను విడిచి ఆత్మ విద్యకై భిక్షాచ‌ర‌ణ చేయుదురు. త‌రువాత బ్రాహ్మణుడు ఆత్మవిద్యను స‌మ‌గ్రముగా సంపాదించి విద్యను బ‌ల‌ప‌ర‌చు కొనుచున్నాడు. విద్యను దానిబ‌ల‌మును పూర్ణముగ సంపాదించి మ‌న‌న‌ము చేయును. త‌రువాత విద్యా బ‌ల‌మన‌న‌ముల‌ను స‌మ‌గ్రముగ సంపాదించి ముఖ్యబ్రాహ్మణుడ‌గుచున్నాడు. అట్టి బ్రాహ్మణుడు బ్రహ్మనిష్టక‌నుకూల‌మైన ఆచ‌ర‌ణ‌లోనుండును.

బ్రహ్మవాదియే బ్రాహ్మణుడు

బ్రాహ్మణుడ‌న‌గా కేవ‌ల జాతి మాత్రుడు కాడ‌నియు బ్రహ్మవాదియే బ్రాహ్మణుడ‌నియు ష‌డ్వింశ బ్రాహ్మణ‌మువ‌ల‌న‌ను తైత్తిరీయార‌ణ్యక‌ము వ‌ల్లను కూడ స్పష్టప‌డుచున్నది. త‌స్మాత్ బ్రాహ్మణోహో రాత్రస్య సంయోగేసంధ్యాముపాస్తే. (ష‌డ్వింశ బ్రాహ్మణ‌ము.5) క‌నుక బ్రాహ్మణుడు అహోరాత్రుల సంధియందు సంధ్యనుపాసింప వ‌ల‌యును.

అన‌గా సంధ్యావంద‌న మాచ‌రింప‌వ‌ల‌యును. తదుహ‌వాఏతే బ్రహ్మవాదినః సంధ్యాయాం ఆపఊర్ధ్యంవిక్షిపంతి ఉద్యంత‌మ‌స్తయంత మాదిత్య మ‌భిధ్యాయ‌న్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ స‌క‌లం భ‌ద్రమ‌శ్నుతే (తైత్తిరీయార‌ణ్యక‌ము 2) అందువ‌ల్లనే ఇప్పటి బ్రహ్మవాదులు సంధ్యలో పైకి ఉద‌క‌మును జల్లుచున్నారు. ఆదిత్యుని ఉద‌యించు న‌ప్పుడును, అస్తమించు న‌ప్పుడును ధ్యాన‌ముంజేసి క్రియ‌ల‌ను స‌ల్పు బ్రాహ్మణుడు స‌క‌ల శ్రేయ‌స్సుల‌ను పొందుచున్నాడు. బ్రాహ్మణుడు ల‌ను శ‌బ్దమును, బ్రహ్మవాదియ‌ను శ‌బ్ధమును, సంధ్యను జేయువానికి వేద‌ము పేరు పెట్టిన‌ది. బ్రాహ్మణుడ‌న‌గా బ్రహ్మవాది య‌నియే అర్ధము. బ్రహ్మవాది య‌న‌గా బ్రహ్మను పొందుట‌యే ప‌ర‌మ పురుషార్ధమ‌నియెంచి అందుకు త‌గిని రీతిని ప్రయ‌త్నములు చేయుచు జీవిత‌ము గ‌డుపువాడు.

దీక్షితుడే బ్రాహ్మణుడు

దీక్షితుడైన‌వ‌డే బ్రాహ్మణుడ‌నియు, బ్రాహ్మణేత‌రులు స‌యిత‌ము దీక్షవ‌హించి బ్రాహ్మణ‌త్వము పొందువ‌చ్చున‌నియు వేదము చెప్పుచున్నది.

"దీక్షితోయం బ్రాహ్మణః" "అదీక్షిష్టాయం బ్రాహ్మణః ల‌ను శ్రుతివాక్యముల‌చే ఋత్విక్కులు దేవ‌త‌ల‌కును, మ‌నుష్యుల‌కును దీక్షితుడు బ్రాహ్మణ‌త్వము పొందెన‌ని తెలియ‌జేయుదురు. ఇత‌డు దీక్షవ‌హించి బ్రాహ్మణుడ‌య్యెన‌ని అర్ధము. దీక్షయ‌న‌నేమి ఏమిచేయుట‌కు దీక్షవ‌హించి బ్రాహ్మణుడాయెను ఋగ్వేద‌మునందిట్లున్నది అకూత్యైప్రయుజె అగ్నయేస్వాహ‌, మేధాయై మ‌న‌సే అగ్నయే స్వాహ‌, దీక్షాయై త‌ప‌సే అగ్నయే స్వాహ‌, స‌స్వత్సైపూష్ణే.

"ఆపోదేవీర్బృహ‌తావిశ్వంబు వోద్యావాపృధివీ ఉర్వం
త‌రిక్షం బృహ‌స్సతినోహ విషావృధాతుస్వాహా!
విశ్వేదేవ‌స్యనే తుర్మర్తోవురీత స‌ఖ్యం ! విశ్వోరాయ‌
ఇషుద్యతిద్యుమ్నం వృణీత పుష్యసేస్వాహా !
(అగ్నిష్టోమ ప్రక‌ర‌ణ‌ము) అకూతి మ‌గ్నింప్రయుజం
స్వాహ ! మ‌నోమేధామ‌గ్నిం ప్రయుజం స్వాహ !
చిత్తం విజ్ఞాత‌మ‌గ్నింప్రయుజం స్వాహ !
వాచోవిదృతిమ‌గ్నిం ప్రయుజం స్వాహ !
ప్రజాప‌త‌యే మ‌న‌వేస్వాహ !
అగ్నయే వైశ్వాన‌రా య‌స్వాహ !
విశ్వోదేవ‌స్య (పూర్వమువ‌లెనే) (అగ్నిచ‌య‌న ప్రక‌ర‌ణ‌ము)

నాయొక్క బుద్ధియును, త‌ల‌న‌పులును, మ‌న‌స్సు దీక్షయున్నూ, జ్ఞాన‌మును, త‌ప‌స్సును, వాక్కును, స‌ర్వమున్ను, ప‌ర‌మేశ్వరార్పణ‌ము చేయుచున్నాను. నాశ్తుల‌న‌న్నిటిని ప‌ర‌మేశ్వరుడు త‌న‌యొక్క ప‌నుల‌కై విన‌యోగించుగాక‌. ప్రతిమాన‌వుడు ప‌ర‌మేశ్వరుని స‌ఖ్యమును కోరుగాక పొందుట‌కు ప్రయ‌త్నించునుగాక‌. పై మంత్రముల యొక్క ముఖ్యతాత్పర్యమిదియైయున్నది.
యావ‌జ్జీవిత‌మును, త‌న‌స‌ర్వశ‌క్తుల‌ను శ‌మ‌ద‌మాది గుణ‌సంప‌త్తి న‌ల‌వాడు చేసికొని భ‌గ‌వ‌త్కైంక‌ర్యమున‌కు స‌మ‌ర్పించున‌త‌డు యాగ‌దీక్షితుడు. అదియే అత‌ను వ‌హించుదీక్ష.

ఇట్టి దీక్ష వ‌హించువాడే య‌దార్ధ బ్రాహ్మణుడ‌ని శ్రుతి చెప్పుచున్నది.
శ‌త‌ప‌ధ‌బ్రాహ్మణ శ్రుతి యందు (3-2-1-40) యెట్లు దీక్షితుడ‌గువాడు నిశ్చయ‌మ‌గు బ్రాహ్మణు డ‌గుచున్నాడో వివ‌రింప‌బ‌డిన‌ది.

అధ‌య‌ద్ర్భాహ్మణ యిత్యాహ‌, అన‌ద్ధేవ‌వా అస్యాతః
పురాజానం భ‌వ‌తి, ఇదంహ్యహుః ర‌క్షాంసియోషి
త‌మ‌ను సచంతె త‌దుత‌ర‌క్షాంస్యేవ రేత ఆద‌ధాతీతి
అధాత్రార్ధాజాయ‌తేయో బ్రహ్మణోయో య‌జ్ఞా
జ్జాయ‌తే, త‌స్మాద‌పిరాజ‌న్యం వావైశ్యంవా బ్రాహ్మణ‌
ఇత్యేక బ్రూయాత్‌, బ్రహ్మణో హిజాయ‌తేయో య‌జ్జాజ్ఞాయ‌తే."

ఈదీక్షకు పూర్వముండిన బ్రాహ్మణ‌త్వము ప్రత్యక్షము కాదు. ఏల‌న‌న‌గా రాక్షసులు స్త్రీల‌వెంబడివెళ్లుచు రాక్షసులే రేత‌స్పేక‌ము జేయుదుర‌ని చెప్పుదురు అయితే యిక్కడ మాత్రము బ్రహ్మనుండి అన‌గా య‌జ్ఞమునుండి జ‌న్మించువాడు (య‌జ్ఞదీక్షితుడు) ప్రత్యక్షముగ‌నే బ్రహ్మణుడై పుట్టుచున్నాడు. కాబ‌ట్టియే క్షత్రియ వైశ్యులు కూడా బ్రాహ్మణుల‌నియే చెప్పవ‌ల‌యును. య‌జ్ఞమునుండి పుట్టిన‌వాడు బ్రహ్మనుండియే పుట్టిన‌వాడు.

భృగుమ‌హ‌ర్షి బ్రాహ్మణుని జీవిత‌ము

బ్రాహ్మణుని యొక్క ల‌క్షణ‌ములు భృగు మ‌హ‌ర్షి భ‌ర‌ద్వాజునితో (మ‌హ‌భార‌త శాంతి ప‌ర్వమునందు) బ‌హు చ‌క్కని శ్లోక‌ముల‌లో చెప్పియున్నాడు. గ్రంధ విస్తర‌భీతిచే నాశ్లోక‌ములనిట నుదాహ‌రింప‌క వానిభావ‌యును మాత్రము క్లుప్తముగా వ్రాయుచున్నాను. చ‌దువ‌రులాశ్లోక‌ముల‌ను మూల‌మందు గ‌మ‌నింప‌వ‌లెన‌ని నా ప్రార్ధన‌.

ఎవ‌డు జాత‌క‌ర్మాదిసంస్కార‌ముల నందునో శుచిగ‌ల‌వాడై వేదాధ్యయ‌న సంప‌న్నుడ‌గునో, ష‌ట్కర్మల నాచ‌రించునో, అంత‌ర్బాహ్య శౌచ‌ముల న‌నుష్టించునో, అతిధుల నాద‌రించిన మీద‌ట మిగిలిన ఆహ‌ర‌మును భుజించునో, పెద్దల‌యెడ భ‌క్తిగ‌లిగియుండునో, స‌ద్వ్రత‌ముల‌యందు నిమ‌గ్నుడ‌గునో, స‌త్యమునే ప‌లుకునో, అట్టివానినే బ్రాహ్మణుడందురు. స‌త్యము, దాన‌ము, జితేంద్రియ‌త్వము, ద్రోహ‌బుద్ధిలేకుండుట‌, అహింస‌, ద‌య‌, స్థిర‌మైన‌బుద్ధి ఈ ల‌క్షణ‌ము లెవ‌నికి గ‌ల‌వో వాడే బ్రాహ్మణుడ‌న బ‌డును.బ్రాహ్మణుడు క్రోధ‌లోభ‌ములు స‌ర్వోపాయ‌ముల వ‌ల‌న‌ను జ‌యింప వ‌ల‌యును. ఆత్మనిగ్రహ‌మువ‌ల‌యును. ఇదియొక ప‌విత్ర కార్యము. క్రోధ‌లోభ‌ములు మంచిని చెడ‌గొట్టున‌వి గాన వాటిని ప్రతిఘ‌టించ‌వ‌ల‌యును. సౌఖ్యమును మ‌హ‌బ‌ల‌మును పొందుట‌కు క్రోధ‌మును బ్రాహ్మణుడు విడ‌నాడ‌వ‌ల‌యును.

జ్ఞాన‌మును సంపాదించుట‌కు మానావ మాన‌ముల‌ను ల‌క్ష్యము చేయ‌రాదు. ఆత్మను తెలిసికొనుట‌కు మ‌న‌స్సును దానినుంచి త్రిప్పరాదు. బ్రాహ్మణుడు తాను స‌ర్వకార్యముల‌లోను స్వార్ధప‌ర‌త్వమును వీడ‌వ‌ల‌యును. క‌ర్మఫ‌ల‌ముల‌ను విడ‌నాడి క‌ర్మ చేయ‌వ‌ల‌యును. అప్పుడాత‌డు తెలివిగ‌ల వాడ‌గును. అత‌డే భూత‌మున‌కు హ‌నిచేయ‌రాదు. అంద‌రితోను స‌ఖ్యముగా నుండ‌వ‌ల‌యును. ఇంద్రియ‌ముల‌ను నిగ్రహించు కొన‌వ‌ల‌యును. ప‌ర‌మాత్మను వెతుక‌వ‌ల‌యును. స్థిర‌బుద్ధిక‌లిగి జితేంద్రియుడై ధ్యానింప‌వ‌ల‌యును. సంగ‌ర‌హితుడై చ‌రింప‌వ‌ల‌యును. బ్రహ్మత‌త్వము తెలిసికొని దానియందు స్థిరుడైయుండ‌వ‌ల‌యును. అన్యమునుకోర‌త‌గ‌దు. ఈ విధ‌ముగా నుండుట‌వ‌ల‌న బ్రహ్మసాక్షాత్కార‌మును బ్రాహ్మణుడు పొందును. శుచియైన మార్గమును యెన్నడు విడువ‌కుము. ఎల్లప్పుడు స‌ద్వర్తన‌ము న‌నుస‌రించుము. స‌ర్వ భూత‌ముల య‌డ‌ల‌ను ద‌య‌గ‌లిగి యుండుము. బ్రాహ్మణునికివియే ముఖ్య చిహ్నములు.

పై క్రమ‌మంత‌యు వేదము చెప్పిన దానినే అనుసంరించియున్నది. య‌దార్ధ బ్రాహ్మణుడ‌న‌గా యిట్టి విధ‌ముగా జీవిత‌ము గ‌డుపువాడు. ఈ ల‌క్షణ‌ములు జాతి బ్రాహ్మణునియందు కాన్పింప‌నిచో న‌త‌డు బ్రాహ్మణుడు కాడ‌ని భృగు మ‌హ‌ర్షి చెప్పుచున్నాడు.

బుద్ధదేవుడు పుట్టుక‌వ‌ల‌న బ్రాహ్మణుడెవ్వడు కాడ‌నియు, స‌త్యము స‌ద్వృత్తి గ‌లిగిన వాడే బ్రాహ్మణుడ‌నియు చేయు ప‌నిని బ‌ట్టి చండాల‌త్వము ప్రాప్తించున‌నియు చెప్పియున్నాప‌డు. పుట్టుక‌లవ‌ల్ల నెవ‌డు బ్రాహ్మణుడు కాడు. చేయు ప‌నుల‌ను బ‌ట్టి బ్రాహ్మణుడ‌గును. ఏవంశ‌మందు జ‌నించెన‌ని అడుగ‌వ‌ద్దు. న‌డ‌త‌ను గురించి అడుగుము. కొయ్యలోనుంచి నిప్పుఏలాగున పుట్టెనో అటుల‌నే హీన కుంటుంబ‌ములోని వాడ‌య్యును పాప కార్యముల‌నుండి విముక్తుడైన‌చో గొప్పవాడై మునియ‌గును.