8
బ్రహ్మచారి జీవితము

బ్రహ్మచారి అవ‌లంభింప‌వ‌ల‌సిన విదుల నీ క్రింద వ్రాయుచున్నాను.

1. బ్రహ్మభావ‌న పొంద‌వ‌ల‌యునుగాన న‌త‌డు బ్రహ్మ విద్య స‌మ‌గ్రముగ న‌భ్యసింప‌వ‌ల‌యును.

ప్రధమం బ్రహ్మచ‌ర్యేణ బ్రహ్మత‌త్వనిరీక్షణం
సాంగోపాంగ‌స్తధాథ్యేయో బ్రహ్మవేద‌చ‌తుర్విధః

2. బ్రహ్మచారి ఇంద్రియ‌నిగ్రహ‌ము క‌లిగియుండ‌వ‌ల‌యును. అరిష‌డ్వర్గమును జ‌యించ‌వ‌లెను. కామ‌క్రోధ‌లోభ‌ములు మూడును న‌ర‌క‌ద్వార‌ముల‌ని గీత (16-21,22) యందు చెప్పబ‌డెను. సాధ‌న‌మార్గములు ముందు విపుల‌ముగ తెలుప‌బ‌డును.

శౌచ‌ము

3. బ్రహ్మచారి శుచిత్వమునుక‌లిగి యుండ‌వ‌ల‌యును. శుచిరెండువిధ‌ములు. అంత‌శ్శౌచ‌ము, బ‌హిశ్శౌచ‌ము. అవ‌య‌వ‌ములు చెమ‌ట మొద‌ల‌గు వానిచే మ‌లిన‌మ‌గును. శ‌రీర‌జ‌ముల‌గు మ‌ల‌ములు పండ్రెండ‌ని మ‌నుస్మృతి (5-135) యందు చెప్పబ‌డిన‌ది. జ‌ల‌ప్రక్షాళ‌న‌ముచే శ‌రీర‌ము శుధ్ధమ‌గును. దుష్ట మ‌న‌సు స‌త్యవ్రత‌ముచే శుద్దమ‌గును. బుద్ధినిశ్చయాత్మక‌మ‌గు జ్ఞాన‌ముచేత శుద్ధమ‌గును. ఇంద్రియ‌ముల‌ను జ‌యించుట‌యే శౌచ‌ము.మ‌స‌స్సును మ‌లిన భావ‌ముల‌నుండి తొల‌గించుట‌యే స్నాన‌ము వాస‌నాత్రయ‌మును న‌శింపుజేసి జ్ఞాన‌వైరాగ్యముల‌వ‌ల‌న చిత్తమును శుద్ధిప‌ర‌చ‌వ‌ల‌యును.
స్నానం మ‌నోమ‌ల‌త్యాగ‌శ్శౌచ‌మింద్రియ‌నిగ్రహః
చిత్తశుద్ధిక‌రం శౌచం వాస‌నాత్రయానాశ‌నం
జ్ఞాన‌వైరాగ్యమృల్తోయైః క్షాళ‌నాచ్చౌచ‌ముచ్యతే (సామ‌వేద‌ము)

ఆహ‌ర శుద్ధి

ఆహ‌ర‌శుద్ధి త‌ప్పక గ‌మ‌నింప‌వ‌ల‌యును. ఇట్లున్న అంతఃక‌ర‌ణ‌శుద్ధిక‌లుగున‌నియు, అందువ‌ల‌న స్మర‌ణ‌శ‌క్తి క‌లుగున‌నియు, దానివ‌ల‌న సంశ‌య‌నివృత్తి క‌లుగున‌నియు, సామ‌వేదాంత‌ర్గత ఛాందోగ్య ఉప‌నిష‌త్తు 26వ ఖండ‌ము 2వ మంత్రమందు చెప్పబ‌డియున్నది.

"ఆహ‌ర‌శుద్ధౌస‌త్వశుద్ధి స్సత్వశుద్ధౌధృవా స్మృతిః
స్మృతిల‌మ్భేస‌ర్వగ్రంధీనాం విప్రమోక్షః
అభ‌క్షస్యనివృత్యాతు విశుద్ధంహృద‌యంభ‌వేత్‌
ఆహ‌ర‌శుద్ధౌచిత్తస్య విశుద్ధిర్భవ‌తి స్వతః
చిత్తశుద్ధౌక్రమాత్ జ్ఞానంతృట్యంతే గ్రంధ‌యఃస్ఫుటం"
(అధ‌ర్వణ వేద‌ము - పాశుప‌త‌బ్రహ్మోప‌నిష‌త్తు)

అభ‌క్ష్యాభ‌క్ష్యము అధ‌ర్వణ‌వేద‌మందు పంచ‌మ‌హ‌పాత‌క‌ముల‌లో నొక‌టిగా చెప్పబ‌డిన‌ది. ఆహ‌ర‌ము సాత్విక‌రాజ‌సిక తామ‌సిక‌ముల‌ని మూడు విధ‌ములు. స్వాతిక పురుషుల‌కు రుచించు ఆహ‌ర‌ము ఆయుష్యమును, సాత్విక‌వృత్తిని, బ‌ల‌మును, ఆరోగ్యమును, సుఖ‌మును, ప్రీతిని, వృద్ధిపొందించును. ర‌స‌యుక్తమును స్నిగ్ధమునునై శ‌రీర‌మందు ప్రవేశించి చిర‌కాల‌ముండి మ‌న‌స్సున‌కు ఆనంద‌దాయ‌క‌మ‌గును. రాజ‌స పురుషుల‌కు ఇష్టమైన ఆహ‌ర‌ము కార‌ముగ‌ను, పులుపుగ‌ను, ఉప్పగ‌ను, మిక్కిలి వేడియైన‌దిగ‌ను, మండున‌దిగాను, రూక్షమైన‌దిగాను, దాహ‌మును క‌లుగ‌జేయున‌దిగాను, దుఃఖ‌మునుశోక‌మును రోగ‌మును పుట్టించున‌దిగ‌నుండును. తామ‌స పురుషుట‌కు యిష్టమ‌గు ఆహ‌ర‌ము చాల‌సేప‌టిక్రింద వండ‌బ‌డిన‌దిగ‌ను, ర‌స శూన్యమైన‌దిగ‌ను, దుర్గంధ‌ముగ‌ల‌దియును, చ‌ద్దిదిగ‌ను, ఉచ్ఛిష్టమైన‌దియుఅప‌విత్రమైన‌దియునైయున్నది. ఈ సూత్రముల‌న‌నుస‌రించి యేయేప‌దార్ధములు యోగ్యములో మ‌న‌మువిచారించుకొన‌వ‌ల‌యును. ఎట్టి ఆహ‌ర‌ము భుజింప‌రాదో మ‌నుస్మతి నాల్గువ అధ్యాయ‌మునందు చెప్పబ‌డిన‌ది.

4. ప్రతిదిన‌మును భ‌గ‌వంతునిభ‌జింప‌వ‌ల‌యును.

5. మ‌న‌స్సున‌కు విక్షేప‌ము క‌లుగ‌జేయున‌నియు, అప‌రిశుద్ధము చేకూర్చున‌వియున‌గు జూద‌ము, జ‌నుత‌లోనిర‌ర్ధక వాక్కల‌హ‌ము, ప‌రుల‌పై దోష‌నిరూప‌ణ‌ము,అనృత‌ములాడుట‌, కామాపేక్షచే స్త్రీల‌నుచూచుట‌, ఆలింగ‌న‌ముచేయుట మొద‌ల‌గున‌వి బ్రహ్మచారివ‌ర్జింప‌వ‌ల‌యును.

"ద్యూతంచ జ‌న‌వాదంచ ప‌రివాదం త‌ధానృతం!
స్త్రీణాంచప్రేక్షణాలంభ‌ముప‌ఘూతం ప‌ర‌స్యచ" !! (మ‌నుస్మృతి 2-179.)


                                                 సంధ్యోపాస‌నావ‌శ్య‌క‌త‌


6. బ్రహ్మచారి ప్రతిదిన‌మును ఉభ‌య‌సంధ్యల‌నాచ‌మించిస‌మాహితుడై శుచియ‌గు దేశ‌మందు నియ‌మ‌వంతుడ‌గుచు జ‌ప‌ముచేయుచు య‌ధావిధిగ సంధ్యోపాస‌న‌మొన‌ర్పవ‌ల‌యును.

"త‌స్మాత్ బ్రామ్మణోహోరాత్రస్య సంయోగే
సంధ్యాముపాస్తే" (ష‌డ్వింశ బ్రాహ్మణ‌ము. 5,)

సంధ్యోపాస‌న‌విధిని వేద‌మిట సూచించుచున్నది.

సూర్యభ‌గ‌వానుని ర‌థ‌ము ఆకాశ‌మార్గమందు బోవుచుండ‌గా, "మందేహాది" రాక్షసులు ఆమార్గమున‌కు అడ్డమువ‌త్తుర‌ట‌. సంధ్యావంద‌న‌మాచ‌రించు బ్రహ్మవాదులుచేయు అర్ఘ్యప్రదాన‌మువ‌ల‌న పుట్టిన జ‌ల‌బిందువులు ఆయుధ‌ములై ఆరాక్షసుల‌ను దూర‌ముగా త‌రుమును. "మందేహ‌నాం వినాశాయ‌నిక్షిపేత్తు జ‌లాంజ‌లీ" ఇది సంథ్యావంద‌న‌మును గురించి చెప్పబ‌డిన‌గాథ‌. ఇందు ర‌హ‌స్యార్థమున్నది. సూర్యభ‌గ‌వానుడు అన‌గా జీవాత్మ. "హృదాకాశేచిదాభానుఃస్సదాకాల ప్రవ‌ర్తకః". మంద‌ము+ఈహ‌- అనున‌వి త‌మోగుణ‌ర‌జోగుణ‌ముల యొక్క గురుతులు. జీవాత్మను త‌మో ర‌జోగుణ‌ములు అడ్డగించుచున్నవి. వాటినిజ‌యించుట‌కు ప్రతిదిన‌మును ప‌ర‌మాత్మనుపాసించుచున్నాము. అదియే సంధ్యావంద‌నము. స‌ర్వేంద్రియ‌ముల‌చే చేయ‌బ‌డిన పాప‌ముల‌ను న‌శింపుజేయుమ‌ని ప‌ర‌మాత్మకు విన్నవంచుకొనుచున్నాము.

త్రిగుణ‌ముల స్వరూప‌ము

స‌త్వర‌జ‌స్తమోగుణ‌ములు దేహ‌మందున్న అవ్యయ‌మ‌గు ఆత్మను దేహ‌మందు బంధించి వేయుచున్నవ‌నియు, మాన‌వుడు త్రిగుణాతీతుడు కావ‌ల‌యున‌నియు, శ్రీ‌కృష్ణభ‌గ‌వానుడు గీత‌యందుబోధించుచున్నాడు. నిర్మల‌మైన‌దియు, ప్రకాశింప‌జేయున‌దియు, ఏ దోష‌ములేనిదియు న‌గు స‌త్వగుణ‌ము సుఖ‌ము యొక్కయు, జ్ఞాన‌ముయొక్కయు, సంగ‌మ‌ముచే ప్రాణుల‌ను బంధించుచున్నది. (14-8,9)

ర‌జోగుణ‌ముయొక్క స్వభావ‌ము అనురాగ‌స్వరూప‌మైన‌ది. తృష్ణచేత‌ను, ఆస‌క్తిచేత‌ను, పుట్టును. అది ప్రాణుల‌ను క‌ర్మసంగ‌ముచే బంధించుచున్నది.

త‌మోగుణ‌ము జ్ఞాన‌మువ‌ల‌న పుట్టిన‌ది. ప్రాణుల‌ను మోహింప‌జేయును. ఇది జ్ఞాన‌మునావ‌రించి ప్రమాద‌మును, క‌ర్తవ్య మూఢ‌త‌యందాస‌క్తిని క‌లుగ‌జేయును.

"స‌త్వంసుఖే సంజ‌య‌తిర‌జః క‌ర్మణిభార‌త‌
జ్ఞాన‌మావృత్యతు త‌మః ప్రమాదే సంజ‌య‌త్యుత‌"

త్రిగుణాతీతుని ఆచార‌ము

గీత‌లో 14 అధ్యాయ‌ము 22 మొద‌లు 25 శ్లోక‌ముల‌లో వ‌ర్ణింప‌బ‌డిన‌ది. అట్టి జీవిత‌మును, ల‌క్షణ‌ముల‌ను, మ‌న‌మ‌ల‌వాటు చేసుకొన‌వ‌ల‌యును.

1. ప్రకాశ‌ము, ప్రవృత్తియు, మోహ‌ముప్రాప్తములైన‌ను వానిని ద్వేషింప‌డు. ప్రాప్తములు కాక‌పోయిన‌ను వానిన‌భ‌ల‌షింప‌డు.

2. క‌ర్మఫ‌ల‌ముల విష‌య‌మై ఉదాసీనుడైయుండును.

3. త్రిగుణ‌ముల వ‌ల‌న చ‌లింప‌క‌స్థిరుడుగానుండును. వికార‌మును పొంద‌డు.

4. సుఖ‌దుఃఖ‌ములు స‌మాన‌ముగ జూచుకొనును.

5. మ‌ట్టి, రాయి, బంగార‌ము స‌మ‌దృష్టిలో జూచును.

6. ప్రియ‌ము, అప్రియ‌ము, నింద‌, దుస్థితి, మాన‌ము, అవమాన‌ము, స‌మాన‌ముగ జూచును. మిత్రుని శత్రుని స‌మాన‌ముగ జూచును.

7. కామ్యోద్యోగ‌ముల‌ను విడ‌చును.

ఏక‌నిష్టగ‌లిగిన భ‌క్తియోగ‌ముచే ప‌ర‌మాత్మనుసేవింపువాడు త్రిగుణ‌ముల‌న‌తిక్రమించి బ్రహ్మభూతావ‌స్థను సంపాదించుకొనుట‌కు స‌మ‌ర్ధుడ‌గును.

త‌ల్లిదండ్రుల‌కును, ఆచార్యున‌కును త‌గిన‌రీతిని నిత్యము ప‌రిచ‌ర్య, శుశ్రూష‌చేసి వార‌ల‌ను సంతుష్టుల‌ను జేయ‌వ‌ల‌యును.

"మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్యదేవోభవ" (తైత్తిరీయోప‌నిష‌త్తు. శిక్షావ‌ల్లి)

నియ‌మ‌బ‌ద్ధమైన జీవిత‌మునుగ‌డుపుచు బ్రహ్మవిద్యన‌భ్యసించి బ్రహ్మభావ‌ల‌న పొందుట‌యే బ్రహ్మచ‌ర్యాశ్రమ‌ము యొక్క ప‌ర‌మావ‌ధి. ఇక్కాల ప‌రిస్థితుల‌న‌నుస‌రించి బ్రహ్మచ‌ర్యాశ్రమ త‌త్వమున‌కు భంగ‌మురాకుండ ప‌ద్ధతుల‌నేర్పర‌చుట‌యే మ‌న‌ముఖ్యవిధి.