9.
స్త్రీలు బ్రహ్మచారిణులు కావ‌ల‌యును.

స్త్రీలు చ‌దువుకొన‌రాద‌నియు, వేదము ముట్టకూడ‌ద‌నియు, వారికిప‌తిసేవ శుశ్రూష‌త‌ప్ప వేరే యేమియు అవ‌స‌ర‌ములేద‌నియు, మొద‌లైన విష‌య‌ములు మ‌న‌లోకొంద‌రు చెప్పుచుండుట మ‌న‌ము ప్రతిదిన‌మును జూచుచున్నాము. ఈ విష‌య‌ము స‌త్యవిరుద్ధమైన‌ది. స్వార్ధప‌రుల‌గువారు చెప్పువాక్యములుగాని నిజ‌మెంత‌మాత్రముకాదు. స్త్రీయును ఆత్మ త‌త్వము తెలిసికొన వ‌ల‌సియున్నది. జ‌న్మరాహిత్యమున‌కు పాటుప‌డ‌వ‌ల‌సియున్నది. జ్ఞాన‌ముసంపాదింప వ‌ల‌సియున్నది. అట్టి యెడ‌ల దానికి బ్రహ్మవిద్యయంద‌ధికార‌ము లేద‌ని చెప్పుట‌యే స‌మంజ‌స‌మైన విష‌య‌ము కాదు. స్త్రీస‌హ‌ధ‌ర్మచారిణిగనుండ‌వ‌లెన‌న్నచో స‌త్సంతాన‌ము క‌లుగ‌వ‌లెన‌న్నచో జ్ఞాన‌ము సంపాదించియేతీర‌వ‌ల‌యునుగ‌దా! వేద‌ము స్త్రీల‌కు వేద‌విద్యను తిర‌స్కరించ‌లేదు. పూర్వము స్త్రీలు వేదవిద్యన‌భ్యసించిరి. ఇటీవ‌ల‌న స్మృతికారులు కొంద‌రు యే కార‌ణ‌ముల‌వ‌ల్లనో గాని యీ ఆచార‌ముల విడ‌నావ‌ల‌యున‌ని త‌మ గ్రంధ‌ముల యందు వ్రాసినారు. అధ‌ర్వణ వేద‌యందు

"బ్రహ్మచ‌ర్యేణ క‌న్యాయువానం వింద తేప‌తిం"   అని చెప్పబ‌డియున్నది.

"అధ‌య ఇచ్ఛేద్ధుహితామే పండితాజాయేత స‌ర్వమాయురియాదితి"

దీనికి కొంద‌రు వ్యాఖ్యాన‌క‌ర్తలు గృహ‌తంత్ర లౌకిక‌మే నేర్పన‌గుగాని వేద‌ము కాద‌నివ్రాసిరి. కాని అదిజైమినిపాణినుల సూత్రముల‌కు విరుద్ధముగాన‌, నుత్సర్గాప‌వాద‌న్యాయ‌మును స్వీక‌రించి య‌జ్ఞాదులంజేయు త్రైవ‌ర్ణిక‌ప‌త్నులు న‌ధ్యయ‌న‌ములేనిది ఋత్విగాది స్రోక్తార్దమున‌ర‌య‌లేరుగాన అధ్యయ‌న ప్రతిషేద‌వాక్యము త‌దిత‌ర స్త్రీల‌క‌న్యయింప‌న‌గును. మ‌రియు య‌జ్ఞమందు నాయ‌జ్ఞయా వాచంవ‌దేత్ అని యుండుట‌చే సంస్కృతాతిరిక్తమ‌గు భాష‌ను ప‌త్నులుగూడ య‌జ్ఞమందు చ్చరింప‌గూడ‌దు.

హ‌రీత య‌మ‌స్తృతుల అభిప్రాయ‌ము

పూర్వము క‌న్యల‌కు ఉప‌న‌య‌న‌సంస్కార‌మునుజేసి బ్రహ్మ విద్య న‌భ్యసించిన పిమ్మట వివాహ‌ము చేసెడివారు. బ్రహ్మచ‌ర్యాశ్రమ‌నియ‌మ‌ముల‌న్నియు వారును అవ‌లంభించెడివారు. ఈ విష‌య‌ములు హ‌రీత య‌మ‌స్మృతుల‌ను జూచిన‌చో స్పష్టప‌డ‌గ‌ల‌వు.

"ద్వివిధాస్త్రీయో బ్రహ్మవాదిన్యః స‌ద్యొవ‌ధ్వశ్చ త‌త్ర
బ్రహ్మవాదినీనాముప‌న‌య‌న మ‌గ్నీంధ‌నం వేదాధ్యయ‌
నం స్వగృహేభిక్షా చ‌ర్య ఇతివ‌ధూనాంతూప‌స్థితే వివా
హేక‌ధంచిదుప‌న‌య‌న మాత్రం కృత్వా వివాహఃకార్య" (హ‌రీత‌స్మృతి)

స్త్రీలు రెండువిధ‌ములు బ్రహ్మవాదినులు, స‌ద్యోవ‌ధులు బ్రహ్మవాద‌నుల‌గువారు ఉప‌న‌య‌న సంస్కార‌ముపొంది అగ్నిహోత్రమునొన‌ర్చుచు వేదాధ్యయ‌న‌ము చేయుచు స్వగృహ‌మునందే భుజింతురు. స‌ద్యోవ‌ధుల‌గు వార‌లు వివాహ‌మాడు స‌మ‌య‌మున ఉప‌న‌య‌న‌ము చేసికొన‌వ‌ల‌యును. ఇంతియేకాక స్త్రీలు వివాహ‌ము లేక యావ‌జ్జన్మము నైష్టిక బ్రహ్మచారిణులుగానున్నను త‌ప్పేమియులేద‌నియు, వారికి ఉప‌న‌య‌న వేదాధ్యయ‌న‌ముల‌చేత ఉత్తమ‌లోక‌ప్రాప్తి సంభ‌వించుచున్నద‌నియు హ‌రీతుడు చెప్పుచున్నాడు. ఇదియును స‌హేతుక‌ముగ‌నేయున్నది.

"వివాహ‌ర‌హితానాం బ్రహ్మవాదినీనాముప‌
న‌య‌నాధ్యయ‌నాన‌భిరుత్తమ‌లోక సంభ‌వాత్‌"

య‌మ‌స్మృతియందును పూర్వయుగ‌మున బాలిక‌ల‌కు వేదాభ్యాస‌మును గాయ‌త్రీ మంత్రోచ్ఛార‌ణ‌మును యంగీకృత‌ములైయుండెన‌నియు, తండ్రిగాని, అత‌ని సోద‌రుడుగాని, లేక బాలిక యొక్క సోద‌రుడుగాని, బాలిక‌కు వానినినేర్పించ‌వ‌ల‌యున‌నియు, ఇత‌రులు కూడ‌ద‌నియు, క‌నుక చ‌దువు కొనుట‌కు భుజించుట‌కు యేర్పాటుల‌న్నియు స్వగృహ‌మందు చేయుచుండిర‌నియు మొద‌ల‌గు సంగ‌తున్నియు వ్రాయ‌బ‌డియున్నవి ఈ రీతిని క‌న్యలు బ్రహ్మవిద్య నేర్చుకొనుట వేద‌ధ‌ర్మమున‌కు విరుద్దము కాదు గ‌నుక‌నే అట్టిరీతిని ఆవ‌లంభించిరి.

"పురాక‌ల్పెకుమారీణాం మౌంజీ బంధ‌న‌మిష్యతే
అధ్యాప‌నంచ‌వేదానాం సావిత్రీ వ‌చ‌నంత‌ధా!
పితాపితృన్యో భ్రాతాపానైనామ‌ధ్యాప‌యేత్పరః!
స్వగృహేచ్చైన క‌న్యాయభైక్ష్యాచ‌ర్య విధీయ‌తే!
వ‌ర్జరోద‌జినంచీరం జ‌టాధార‌ణ‌మేవ‌చ‌"!! (య‌మ‌స్మృతి.)

గార్గి యాజ్ఞవ‌ల్క్యునితో వేదాంత విష‌య‌ములు చ‌ర్చించిన‌ట్లు బృహ‌దార‌ణ్యక శ్రుతియందు స్పష్టముగ‌నున్నది. యాజ్ఞవ‌ల్క్యుడు మైత్రేయికి వేదాంత‌ముప‌దేశ‌ము చేసెను.

ఋగ్వేద‌మునుబ‌ట్టిజూడ‌గా ఉత్తమ స్త్రీలు వేద‌ద్రష్టలైన‌ట్లు తేలును.

నిషేధ‌ము సామ‌న్య స్త్రీల‌కు మాత్రమే

గృహ్యసూత్రములు స‌యిత‌ము క‌న్యల కుప‌న‌యాధికార‌మునిచ్చిన‌వి.

"ప్రానృతాం య‌జ్ఞోప‌వీతి నీమ‌భ్యుదాన‌య‌న్ జ‌నేత్ సోమోద‌ద‌ద్గంధ‌ర్వాయేతి" (గో.ప్ర.. 2)

ఏక‌న్య ఉత్తమ వ‌స్త్రాలంకృయై య‌జ్ఞోప‌వీత‌మును దాల్చియుండునో ఆమెను వివాహ‌శాల‌లోనికికొనిరావ‌ల‌యున‌ని సోమోద‌ద‌త్ మొద‌ల‌గు మంత్రముల వ‌రుడు చ‌దువ‌వ‌ల‌యున‌నియున్నది. దీనిని బ‌ట్టి జూడ‌గా వివాహ‌మున‌కు పూర్వము క‌న్య బ్రహ్మవిద్యయందు శిక్షితురాలైయున్నద‌ని తెలియుచున్నది. బ్రహ్మసూత్రముల‌లో అప‌శూద్రాధి క‌ర‌ణ‌మునందు (1-అథ్యా-3 పా-34 37 సూత్రములు.) వ్యాసుల‌వారు శూద్రుల‌కుమాత్రము వేదాధ్యయ‌న‌మునిషేధించిరి. కాని ద్విజ‌స్త్రీల‌కు నిషేదింప‌లేదు. దీనిని బ‌ట్టి వ్యాసుల‌వారి అభిప్రాయ‌మును గ్రహించ‌వ‌చ్చును. ఉత్తమ స్త్రీల‌కు అదికార‌ముక‌ల‌ద‌నియు, అశుచిగానుండుట‌చే శూద్రత్వము ప్రాప్తమ‌గునుగాన శౌచ‌ప‌రిభ్రష్టుల‌గువారు శూద్రులుగాన అట్టి వార‌ల‌కును వారి స్త్రీల‌కును వేదాధ్యయ‌నాధికార‌ము లేద‌నియు వారి తాత్పర్యము. ఈ విష‌య‌మే సూత‌సంహిత‌యందు చెప్పబ‌డిన‌ది. (7-201)

"ద్విజ‌స్త్రీణామ‌ధ‌శ్శ్రౌత జ్ఞాన‌భ్యాసేధికారితా
అస్తిశూద్రస్య శుశ్రూషోః పురాణేనైవ వేద‌నం"

శ్రీ మ‌ధ్వాచార్యుల‌వారు సూత్రభాష్యములో (1-1-1, 1-3-36 సూత్రముల‌కు భాష్యమువ్రాయుచు స్త్రీ శూద్రుల‌కు వేదాధికార‌ములేద‌ని సామాన్య ప్రమాణ‌మును వ్రాయుచు "స‌ప‌త్నీంమేప‌రాధమా" ఇత్యాది మంత్ర ప్రశ్నమంద‌లిశ‌చీ వాక్యానురోధ‌ముగ‌ను "ఆహుర‌త్యుత్తమ స్త్రీణామ‌ధికారాంతువైదికే, య‌ధోర్వశీయ‌మీచైవ‌శ‌చ్యాద్యాశ్చత‌ధా ప‌రాః "అనెడి వ్యోమంస‌హిత వాక్యముల మ‌ద‌హ‌రించి దేవ‌మ‌నుష్యస్త్రీల‌కుగూడ అధికార‌మున్నద‌ని స్పష్టీక‌రించిరి. శ్రీ‌టీకాచార్యుల‌వారును, జ‌గ‌న్నాధ‌య‌తులును, "ఉత్తమ‌స్త్రీణాం" అను పైవాక్యము త‌త్పురుష‌ము,క‌ర్మధార‌య‌ముననిస్థిర‌ప‌ర‌చి ఉత్తముల‌యొక్క భార్యలు, ఉత్తముల‌గు స్త్రీలు అని అర్ధమువ్రాసిరి. శ్రీ‌పూర్ణప్రజ్ఞాచార్యులును, వారి శిష్యులునుగూడ యీ అభిప్రాయ‌మునే వెలిబుచ్చినారు. స్త్రీశూద్ర ద్విజ‌బంధూనాంత్రయీన‌శ్రుతిగోచ‌రా అనెడి స్మృతివాక్యములు సామాన్య స్త్రీ ప‌ర‌మ‌నియు, మ‌ధ్వాచార్యుల‌వారి ప్రమాణ‌ములు విశేష‌విధుల‌నియు వీరి అభిప్రాయ‌ము. ఇది వేద‌ధ‌ర్మమున‌కు అనుకూల‌ముగ‌ను, స‌హేతుక‌ముగ‌నున్నది. క‌నుక యెచ్చట‌నైన‌ను స్త్రీల‌కు వేదాధికార‌ము నిషేధించుచు శ్రుతి స్మృతులు కానుపించిన‌ను ఆవాక్యములుసామాన్య స్త్రీ ప‌ర‌మ‌ని అర్ధము చేసికొన‌వ‌ల‌యును. అట్లు చేసుకొనినిచో శ్రుతి వాక్యముల‌కు వైరుధ్యము చేకూర‌దు.
వాల్మీకి రామాయ‌ణ‌ము సుంద‌ర‌కాండ‌లో 14వ స‌ర్గ 48,49 శ్లోక‌ముల‌లో సీత సంధ్యా వంద‌న‌మాచ‌రించిన‌ట్లు స్పష్టముగ చెప్పబ‌డిన‌ది.

"సంధ్యాకాల‌మ‌నాశ్శ్ర్యా మాధృవ‌మేష్యతిజాన‌కీ !
న‌దీంచేమాంశివ‌జ‌లాం సంధ్యార్ధేవ‌ర‌వ‌ర్ణినీ"

ఎట్టి జీవిత‌ము గ‌డుప‌వ‌ల‌యునో, గృహ‌స్థాశ్రమ ధ‌ర్మమేమో, యెంత మాత్రమును యోరుగ‌క స్త్రీలుండుట యెవ‌రికి శ్రేయ‌స్కరము? స్త్రీల‌కు బ్రహ్మవిద్య, బ్రహ్మచ‌ర్యాశ్రమ‌ము లేనిచో ధీరులును, ఋషులును, పుట్టర‌ని హ‌రీతుడు వ‌గ‌చుచున్నాడు. అదియెంత‌యు స‌త్యము కావున మ‌న బాలిక‌ల‌కు బ్రహ్మవిద్య చెప్పించుట‌కు త‌గుయేర్పాటులుచేయ‌ట మ‌నవిధ్వుక్తధ‌ర్మమైయున్నది. సంసార లంప‌ట‌త్వమును తొల‌గించుట‌కును, దంప‌తుల ఆత్మోద్ధర‌ణ‌మున‌కును యీ ప‌ద్ధతిచాల అవ‌స‌ర‌మ‌ని వేరుగ చెప్పన‌క్కర‌లేదు.