నాన్యః పంధా

విద్ అనే ప్రాతిప‌దిక‌కు య చేరిస్తే విద్య అయింది. విద్ అనే మాట‌కు తెలిసికొనుట అనియు య దేనిని అనే అర్థం చెప్పుకొంటే మ‌న‌కి తెలియ‌ని సంగతినైనా తెలియ‌జేసేది విద్య అని స్ఫురింప‌క‌మాన‌దు. ద్రోలి కాంతినిచ్చేదే విద్య. చీక‌టి ఆజ్ఞానానికీ, ఆవిద్యకీ ప్రతీక‌. కాంతి విద్యకీ విజ్ఞానినికీ నిద‌ర్శనం. అజ్ఞాన మ‌హాతిమిరాన్ని పార‌దోలే బ్రహ్మస్త్రమే విద్య.

ఆదిలో ఋషి సంప్రదాయంలో విద్యార్ధులు అనేక విద్యలు నేర్చుకునేవారు. వారివారి అభిరుచిని బ‌ట్టి అప్పుడు విద్య 18 బోగ‌ములుగా విభ‌జింప‌బ‌డిన‌ది. 4 వేదాలు 6 వేదాంగాలు, పురాణ‌, న్యాయ మీమాంస ధ‌ర్మ శాస్త్రాదులు, ఉప‌వేదాలు నాలుగు, ఆయుర్వేద ధ‌నుర్వేద గాంధ‌ర్వవేద అర్థవేదాలు. వెర‌సి అష్టాద‌శ మ‌హా విద్యలుండేవి. వీటిలో నేడు మ‌న ప్రపంచంలో క‌ళాశాల‌ల్లో నేర్చే చదువుల‌న్నీ నిబిడీకృత‌మై ఉన్నాయి. మ‌నిషిని అస‌త్యంలోంచి స‌త్యంలోకి, మృత్యువు నుండి అమృత‌మార్గంలోకి, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, దుఃఖం నుంచి సంతోషానికీ, చీక‌టి నుండి వెలుగులోకి న‌డిచేది, న‌డిపే మార్గం చూపేది విద్య. ఈ విద్య రెండు రకాలు. బాహ్య విద్య, బ్రహ్మ విద్య మాన‌వుని ఆత్మోన్నతికి దారిచూపుతుంది. బాహ్య విద్య ఘ‌నం అయితే అదే బ్రమ్మ విద్యలోకి దారితీస్తుంది. భార‌తీయ‌దృక్పథంలో బ్రహ్మ విద్యకు ఎన‌లేని గౌర‌వ‌ముంది. ఎందుకంటే ఇది ల‌భించ‌డం చాలా క‌ష్టం కాబ‌ట్టి. ప్రహ్లాదుడు, న‌చికేతుడు, ధృవుడు మొద‌లైన ప‌సిబాలురు త‌మ విజ్ఞానంతో త‌పోనిష్టులైన మ‌హ‌ర్షుల సైతం ఆశ్చర్యచ‌కితుల‌ను చేయ‌ట‌మే కాదు, వారిచేత మ‌న్నన‌లుకూడా పొంద‌గ‌లిగారు, అయితే ఇట్టి జ్ఞానులు జ‌స‌సంఖ్యలో పోలిస్తే చాలా త‌క్కువే అని చెప్పాలి !

ఎక్క‌వమంది బాహ్య‌విద్య‌కే ప్రాధాన్య‌తినిచ్చారు. ఆదిక‌వియైన వాల్మీకి విద్య‌నే గురువు ద‌గ్గ‌రే నేర్చుకోలేదు. అతడికి తెలిసిందొక్క విలువిద్యే. ఆ విలువిద్యే అత‌డికి జీవనాధార‌మైన‌ది. దేశ ర‌క్ష‌ణకికూడా విలువిద్యే మూలాధారం. అంద‌కే స్త్రీ పురుషులు విలువిద్య న‌భ్య‌సించారు. కైక‌, సత్య‌భామ‌వంటి వీర‌నారీమ‌ణుల నీతావున గుర్తుతెచ్చుకోవాలి. ఆకాలానికి అవ‌స‌ర‌మైన రాజ‌నీతి అస్త్ర‌శ‌స్త్ర ఆర్థిక శాస్త్రాది విద్య‌లానాడు అభ్య‌సించేవారు.

భార‌త‌కాలంనాటికి తాను నేర్చుకోద‌ల‌చిన విద్య‌ను ఏదోవిధంగా చేర్చుకునేందుకు పాటుప‌డ్డ వ్య‌క్తులు మ‌న‌కు గోచ‌రిస్తారు. మృత‌సంజీవి విద్య‌ను నేర్చుకోటానికి క‌చుడు పడ్డ‌పాట్లు, ప‌ర‌శురాముడివ‌ద్ద‌కు క‌ర్ణుడు, అస్త్ర విద్య‌ను నేర్చుకోవ‌టానికి ప‌డ్డ అగ‌చాట్లు, గురుద‌క్షిణంగా త‌న బొట‌న‌వ్రేలునే కోసి ఇచ్చిన ఏక‌ల‌వ్యుడు, మ‌న‌కెన్నో లోతైన విష‌యాల‌ను తెలియ‌జేస్తారు. ఏక‌ల‌వ్యుడి విష‌యాన్ని బ‌ట్టి చూస్తే గురువు ప‌క్ష‌పాతం చూప‌డం ఆనాడే ప్రారంభ‌మైందా అన్న అనుమానం క‌లుగ‌క‌పోదు.

ఇందువ‌ల‌న తేలిందేమిటంటే అనాది నుండి మాన‌వుడు స‌న్మార్గానికి చేసే మ‌హాయాత్ర‌త‌తో విద్య అనే క‌ఱ్ఱ‌ని ఊతం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్న‌ద‌న్న‌మాట వ్య‌క్తం అవుతోంది.

ఆనాడు గురుకులాలు ఉండేవి. రాజుబిడ్డ అయినా గ‌ర్భ ద‌రిద్రుడి బిడ్డ అయినా గురువు ద‌గ్గ‌ర‌కి పోయి 13 సంవత్స‌రాలు విద్య‌న‌భ్య‌సించి తిరిగి ఇంటికి రావ‌ల్సిందే. శిష్యుడికి విద్యాభ‌ర్ధ‌న‌తోపాటు అత‌డి పోష‌ణ‌కూడా గురువుదే బాధ్య‌త‌. గురువు ధ‌న‌వంతుడై అంత భారాన్ని మెసేవాడా ?  కాదు. మ‌రునాటికి కొంత ధాన్యం మిగుల్చుకుంటే పాపం అనివారు భావించేవారు. శిష్యుడు యాచ‌న‌చేసి క‌డుపు నింపుకోవ‌డం కూడ‌క‌ద్దు. ఇందుచేత శిష్యుడికి బాధ్య‌త‌తెలియ‌టమేకాక అహంకారం న‌శించ‌టానికి అవ‌కాశం కూడ ఉండేది. ఇలా బాలుర‌కు విద్య నేర్ప‌డంలోని బాధ్య‌త‌ను స‌మాజ‌ము ప్ర‌భుత్వ‌ము, గురువూ స‌మానంగా భ‌రించేవారు.

ఈనాటి చ‌దువులు ఏవో రెండు అక్ష‌రాలు నేర్పుతున్నాయి. జీవ‌నాధారానికి డిగ్రీల‌నివ్వ‌గ‌ల్గుతున్నాయి. ఏదో చ‌దువుతున్నారు. ఎలాగో బ్ర‌తుకుతున్నారు. ఈ చ‌దువు మ‌నుసుదాకా వెళ్ళ‌టంలేదు. ఈ చెవితో విని ఆ చెవితో వ‌దిలేస్తున్నారు. ముక్కున బ‌ట్టుకొని ప‌రీక్ష‌లో వ‌దిలేస్తున్నారు. మార్కులు ఎక్కువ వ‌చ్చిన‌వారూ, త‌క్కువ వ‌చ్చిన‌వారూ నేర్చుకొన్న‌దేమిటో చెప్ప‌లేరు. ఎక్క‌డ చూసినా విద్యార్థుల ఆవేశాలు, ఆందోళ‌న‌లు, ఆగ్ర‌హాలు, అల్ల‌ర్లు, ఆరాచ‌కాలు, అన్యాయాలు, ఆక్రంద‌న‌లు, హింసాత్మ‌క‌చ‌ర్య‌లు, హీన‌మైన ప‌నులు ఇవ‌న్ని ఎందుచేత ?  యువ‌త‌లో ఇంత‌గా అశాంతి పెర‌గ‌టానికి కార‌ణ‌మేమిటి ?  నీతిబాహ్య‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌టాన్కి ల‌జ్జించ‌టం లేదు. ఎందుచేత ?  శాంతియుతంగా స‌మస్య‌ల‌ను ప‌రిష్కారం చేసుకొనే ఓరిమి కొర‌వ‌డుతోందెందుక‌ని ?  ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికీ కార‌ణాలు ర‌క‌ర‌కాలుగా ఉంటాయి. కాని మందు మాత్ర‌మొక‌టే. అదే మంచి విద్య . ఈ మంచి విద్య‌ను ఎలా సాధించుకోగ‌లుగుతాం ?  పిల్ల‌ల‌కు బుద్ధుల నేర్ప‌వ‌ల‌సిన ఆచార్యుల ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటోంది ?  త‌ల్లిదండ్రుల బాధ్య‌త ఎంత‌వ‌ర‌కు ?  కాపీలు కొట్ట‌డానికి, ప్ర‌శ్న‌ప‌త్రాలు సంపాదించుకోటానికి, మార్కులు వేయించుకోటానికి, ఏర్పాట్లు పెద్ద‌లు, గురువులూ క‌లిసే చేస్తున్నారే !!

ఎలాగోలాగ ధ‌న సంపాద‌న‌మే ముఖ్యంగా అన్యాయ మ‌హాప్ర‌వాహంలో కొట్టుకుపోతున్నారే ! ఆధునిక సౌక‌ర్యాల‌కోసం, ఆడంబ‌రాల‌కోసం విచ‌క్ష‌ణ‌లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారే ! ఈ ర‌క‌మైన ఉప్పెన‌ను సంఘం త‌ట్టుకునేదెలా !  స‌న్మార్గం గ‌ల‌వాడు పూచిక‌పుల్ల‌లాగా చూడ‌బ‌డుతున్నాడు. మంచికి గుర్తింపు ల‌భించేదెలా ?  అన్ని చెడుగుల‌కీ విరుగుడు మంచి విద్య‌.

ఇలాటిస్థితి మ‌న‌దేశానికి ప‌రాయిపాల‌న‌వ‌ల్ల వ‌చ్చిపడింది. నిశ్చ‌లంగా పారే భార‌తీయ సంస్కృతీ వాహినికి అన్య‌పాల‌న‌వ‌ల‌న ఇసుక‌మేట‌లు ఏర్ప‌డినాయి. ప్ర‌వాహ‌గ‌తి మారింది. కొన్నాళ్ళు మ‌నింట్లో ఎవ‌రో కాపురం చేసి ఇల్లంతా ఛండాలంచేసి పోయారు. మ‌ళ్ళీ ఇంటిని శుభ్రం చేసుకొవాలి. కొంత‌కాలం ప‌డుతుంది. త‌ప్ప‌దు. విసిగిపోకూడ‌దు. ఓర్పుగా నేర్పుగా మ‌నింటిని మ‌నం శుభ్ర‌ప‌రచుకోవాల్సిందే. వాళ్ళు చేసిపోయిన మార్పులేవైనా మంచివిగా అన్పిస్తే ఉంచుకోవ‌టంలో త‌ప్పులేదు.

ఈ కార్య‌క్ర‌మం చిన్న‌పిల్ల‌ల నుంచి ప్రారంభంచేయ‌టం అన్ని విధాలా మంచిది. అంటే ప్రాథ‌మిక విద్య నుంచీ విద్యార్థుల‌లో మార్పుతేవాలి. చిన్న‌చిన్న పాపాయిలు ఈనాడు ఎన్ని పుస్త‌కాలు మోసుకొనిపోతున్నారో అని స‌ర‌స్వ‌తీదేవి క‌ళ్ళు చెమ‌ర్చుకొని చూస్తోంది. చిన్న పిల్ల‌ల‌కు ముందు నేర్ప‌వ‌ల‌సింది స‌బ్జ‌క్ట్ కాదు. దేశ‌భ‌క్తి. స‌త్యం, శౌచం, ద‌య, విన‌యం వంటి ఉన్న‌త గుణాల‌ని నేర్పించాలి. ఈ విష‌యాలు కూడా పిల్ల‌ల‌స్థాయికి దిగివచ్చి వారితోపాటు ఆడుతూ పాడుతూ వారి హృద‌యాల‌లో నాటుకునేలాగా చెప్పాలి. ఇలా చేస్తే మంచిది. ఇలా చేయ‌టం త‌ప్పు అని నేర్పితే చిల‌క‌ప‌లుకుల‌లాగా వ‌ల్లిస్తారు కాని మ‌న‌సుకు ప‌ట్టించుకోరు. హితోప‌దేశం వంటి చిన్న క‌థ‌ల‌తోనే మొద్దుబుర్ర వంటి వారిని పండితుల‌ని చేయ‌వ‌చ్చున‌ని మ‌న పూర్వీకులు నిరూపించారు. పావులూరి మ‌ల్ల‌న్న గ‌ణితం చక్క‌గా సుల‌భ‌ప‌ద్ధ‌తిలో చెప్పారు. గ‌ణితం కూడా పొడుపు క‌థ‌లు. చెమ‌త్కార క‌థ‌ల‌తో జోడించి చెపితే పిల్ల‌లు మేధ‌స్సు ప‌దునెక్కె అవకాశం ఉండి, వారికి నేర్పుకోటానికి స‌ర‌దాగా ఉంటుంది. ఎక్కాలు బ‌ట్టీప‌ట్టాలంటే మొహం చిట్టించుకుంటారు.

దేశ‌భ‌క్తి లేని చ‌దువు ఎన్ని డిగ్రీల‌ను సంపాదించి పెట్టినా వ్య‌ర్థ‌మే. ఇక్క‌డొక చిన్న‌మాట‌. ఏమిటంటే రావ‌ణాసురుణ్ణి సంహ‌రించాక ల‌క్ష్మ‌ణుడికి లంక ఎంతో అందంగా అనిపించింది. అన్నీ బంగారు భ‌వ‌నాలు, మ‌ణిమ‌య‌రత్న‌రాసుల‌తో తుల‌తూగుతోంది దేశం. ఎక్క‌డ చూసినా సంప‌దే. అప్పుడంటాడు రాముడితో, భ‌ర‌తుడెలాగా అయోధ్య‌ను పాలిస్తూనే ఉన్నాడు. మ‌హాసుంద‌రుడైన నువ్వు ఈ సుంద‌ర న‌గరానికి రాజుగా ఉండిపోకూడ‌దా అన్నాడు. అప్పుడు రాముడు న‌వ్వాడు. మ‌న అమ్మ కురూపి. ఎదురింటావిడ అందంగా ఉంది క‌దాఅని మ‌న మాతృప్రేమ‌ని ఆవిడ మీద స్ర‌వింప‌చేయ‌గ‌ల‌మా త‌మ్ముడూ ?  జ‌న్మ నిచ్చిన త‌ల్లికీ, ఏదేశంలో జ‌న్మించారో ఆ దేశానికీ సేవ‌చేయ‌ని త‌నువులెందుకు ?  ప్రాణ‌ముండీ లేన‌ట్లే. ఈ శ‌రీరానికి విలువ ఉండ‌దు అన్నాడు. అలాగే దేశ‌భ‌క్తి నేర్ప‌ని చ‌దువు చ‌దువేకాదు.

దేశ‌భ‌క్తి త‌ర్వాత ముఖ్యంగా నేర్ప‌వ‌ల‌సిన‌ది సేవాభావం. సేవాభావంలేని విద్య ప‌రిమ‌ళం లేని పుష్పంలాంటిది. స‌మ‌స్త ప్ర‌కృతీ స్వార్థ‌ర‌హితంగా ప‌రోప‌కారం కోసం మ‌నుగ‌డ‌ను సాగిస్తోంది. ఉదా - న‌ది నిండుగా ప్ర‌వ‌హిస్తుంది. త‌న నీటిని తాను తాగ‌దు. ఇత‌రుల ద‌ప్పిక‌ను తీరుస్తుంది. చెట్టు త‌న ఫ‌లాన్ని తానే తిన‌దు. ప‌రుల క్షుధార్తిని బాపుతుంది. మ‌నిషి మాత్ర‌మే తాను చేసే ప్ర‌తి ప‌నియొక్క ఫ‌లితాన్ని తాన పొందాల‌నుకుంటాడు. ఎప్పుడైతే ప్ర‌వ‌ర్త‌న‌ను పిల్ల‌ల‌లో ఆదినుండి స‌క్ర‌మంగా పెంపొందేలా చూడ‌వ‌ల‌సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌తో బాటు గురువుల‌కి కూడా ఎంతో ఉంది.

గురు అనే ప‌ద‌మే గొప్ప‌. పెద్ద అనే అర్థాన్ని తెలియ‌జేస్తుంది. ఈ గురువు బాహ్య‌విద్య‌, బ్ర‌హ్మ‌విద్య తెలియ‌చేయ‌గ‌ల‌శ‌క్తి క‌లిగిఉండాల‌న్న‌ది మ‌న వారి ధ్యేయం. అంటే గురువును రెండు విద్య‌లూ తెలిసి ఉండాలి. అత‌డు ఆచార్యుడ‌ని కూడా పిలువ‌బ‌డ‌తాడు. తాను చెప్ప‌బోయే విష‌యాన్ని ఆచ‌రించి చూపేవాడుగా ఉండాలి. ఆచార్యుడు తానుమురికిబ‌ట్ట‌లు ధ‌రించి పిల్ల‌ల‌కు శుభ్ర‌మైన వ‌స్త్ర‌ముల‌ను ధ‌రిపంవ‌లెను అని చెప్పినందువ‌ల‌న ప్ర‌యెజ‌నం ఏమైనా ఉంటుందా ?  తాను అబ‌ద్ధాలు త‌ప్ప నిజం చెప్ప‌డు. పిల్ల‌ల‌కు స‌త్య‌మునే పలుకుము అని చెబితే వారి మ‌న‌సుల్లో గురువుప‌ట్ల త‌క్కువ‌భావం అట్లా ఉంచి స‌త్యానికి ఎలాంటి గౌర‌వం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది ?

నా ఉద్ధేశంలో పిల్ల‌లకి కాదు చ‌దువు చెప్పాల్సింది. ముందు ఉపాధ్యాయుల‌కే గట్టి చ‌దువు చెప్పాల్సిఉంటుంది. ఉపాధ్యాయుల‌కిచ్చే శిక్ష‌ణ ఈ పైవిష‌యాల నాధ‌రం చేసుక‌ని స‌క్ర‌మంగా ఉండేట‌ట్ల‌యితే ఉపాధ్యాయ వృత్తి న‌వ‌లంబిచేముందు ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల‌లో స‌రియైన జాగ్ర‌త్త‌లు తీసికొని, ఏవిధ‌మైన రిజ‌ర్వేష‌న్సూ లేకుండా ఉండేలా చూడాలి. మ‌త‌, జాలివిచ‌క్ష‌ణ లేకుండా కేవ‌లం మంచి విద్యార్థుల‌ను, త‌యారుచేయ‌గ‌ల నేర్పు, ఓర్పు ఆస‌క్తి, క‌ల‌వారిని మాత్ర‌మే ఉపాధ్యాయ‌శిక్ష‌ణ పొంద‌టానికి అర్హులుగా స్వీక‌రించాలి. ఇలాట‌ప్పుడు మాత్ర‌మే మ‌నం మ‌న పిల్ల‌ల‌కు స‌ద్గురువును నేర్పాటు చేయ‌గ‌ల్గుతాం ! ఈ విష‌యంలో ఎట్టి వ‌త్తిడుల‌కూ లోను కాకుండా ఏ ప్ర‌స‌క్తిలోనూ రాజీప‌డ‌కుండా ఉండేలా గ‌ట్టి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు కొంత కాల‌మే చ‌దువుతారు. ఉపాధ్యాయులు ఉద్యోగ‌విర‌మ‌ణ ప‌ర్యంతం చ‌దువుకోవాలి. అంచేత‌, ఈ నిత్య‌విద్యార్థుల ఎన్నిక‌లో ఎంతో జాగ‌రూగ‌త అవ‌స‌రం. ఈనాడు సైన్స్ కొంత వ‌ర‌కూ అభివృద్ధి చెందుతోంది. అవ‌స‌రాన్ని బట్టి పెర‌గాల్సిందే ప్ర‌పంచంతోపాటే మ‌న‌మూను. మ‌న‌దైన మ‌న స్వ‌త్యాన్ని మ‌నం నిలుపుకుంటూ స్వీక‌రించాల్సిన ఇత‌రాన్ని అవ‌స‌రంవ‌స్తే అనుస‌రించాల్సిందే. ఇది అనుస‌ర‌ణ‌గానే ఉండాలిత‌ప్ప అనుక‌ర‌ణ‌గా ఉండ‌రాదు.

సైన్స్ అనేది పాశ్చాత్య‌దేశాల‌కే ప‌రిమితం కాదు. భార‌త‌దేశంలో వేల సంవ‌త్స‌రాల క్రిత‌మే విజ్ఞానం ప‌రాకాష్ట‌ద‌శ‌కు చేరుకుంది. మ‌ధ్య‌లో మ‌రుగున ప‌డింది. ఈనాడు ఆధునిక ప‌రిక‌రాల‌నుకుంటున్న వెన్నో మ‌న పూర్వులు క‌నుగొనే ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌గా చిన్న సంగ‌తి. శంక‌ర‌భ‌గ‌వ‌త్పాదుల గురువుల‌కు గురువులైన గౌడ‌పాదాచార్యులొక యంత్రాన్ని క‌నుగొన్నారు. ఆది మ‌హాప‌ద్మ‌యంత్ర‌ము. ఈ మ‌హాప‌ద్మ‌యంత్ర‌ము వేయి మంది శిష్యుల‌కు మ‌హాభాష్యాన్ని బోధించేది. అంటే ఈ యంత్రాన్ని నేటి ఏ యంత్రంతో పోల్చ‌వ‌చ్చో  ఊహింప‌వ‌చ్చు. నేటి టేప్‌రికార్డ్స్ వంటిదా ?  టెలివిజ‌న్ వంటిదా ?  కంప్యూట‌ర్ వంటిదా ?  ఈ మూడిటిక‌న్నా కూడా శ‌క్తివంత‌మై ఉండ‌వ‌చ్చున‌న్న‌ది నా ఊహ‌.

 అర్జునుడు పాశుప‌తాస్త్రాన్ని త‌ప‌స్సు చేసి సంసాదించాడు. ఆనాటి త‌ప‌స్సే నేటి ప‌రిశోధ‌న విద్య ఎలా బోధిస్తే మంచిఫ‌లితాలొస్తాయో ప‌రిశోధ‌న‌చేసి తెలుసుకోవాలి.

ఒక వృక్షం ఫ‌ల పుష్ప ఫ‌లితంగా క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉండాలంటే ఆ చెట్టు యొక్క వేళ్ళ‌కు పురుగుప‌ట్ట‌రాదు. వేరుకు చీడ సోకితే ఎంత మ‌హాకృక్ష‌మైనా స‌రే న‌శించిపోక‌త‌ప్ప‌దు. బాలబాలిక‌లు మ‌న స‌మాజ మ‌హా వృక్షానికి వేళ్ళ‌వంటివారు. మ‌న సంస్కృతీ మ‌హాభ‌వంతికి పునాదుల‌వంటివారు. ఈ పునాదుల‌ను, ఈ వేళ్ళ‌ను వేయిక‌ళ్ళ‌తో కాపాడుకోవ‌ల‌సిన బాధ్య‌త మ‌న‌మీద ఎంతో ఉంది. పిల్ల‌లు ఆరోగ్య‌కరంగా. నీతి వ‌ర్త‌నులుగా పెర‌గాలంటే స‌రైన విద్య‌ను గ‌ర‌ప‌టం కంటే మ‌రో మార్గం లేదు. అందుకే విద్య మిన‌హా దారిలేదు. న అన్య పంధా

-- అధ్యాప‌క భార‌తి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉపాధ్యాయ సంఘం ప్ర‌త్యేక సంచిక‌
మే - 1986.