పుడ‌మి త‌ల్లి పుల‌కరించిన వేళ‌...

గ్రీష్మ తాపానికి ఎంత మ్రోడులు బారిన వ‌నం చిగిర్చింది. గండుకోయిల లేమాని చివుళ్ళ‌ను మెస‌వి తీయ‌గాపాడే ర‌సిక హృద‌యాల‌ను రంజింప చేయాల‌ని పంచ‌మస్వ‌రాలాప‌న‌కు గొంతుస‌వ‌రించుకొంటోంది. ప్ర‌తిచెట్టు ప్ర‌తి మొక్క పూమొగ్గ‌ల గుత్తుల‌తో ఆనందంగా త‌ల‌లూపుతున్న‌ట్లుగా ఉంది. సెల‌యేళ్లు నిండుగా న‌వ్వుతూ గ‌ల‌గ‌లా స‌వ్వ‌డి చేస్తూ నాట్య‌మాడుతున్న‌ట్లు ల‌య‌బద్ధంగా హోయ‌ళ్ళు మీరుతున్నాయి.

ప్ర‌కృతి మాత ఇంత ఆందంగా ఆనందంగా అలంకిరంచుకుని ఏ మ‌హోన్న‌త ఘ‌డియ‌ల కోసం ఎదురు చూస్తోంది ? ఏ అద్భుత ఘ‌ట‌న కోసం రంగాన్ని సంసిధ్ధ‌ప‌ర‌చింది ?  ఇంత‌టి పుణ్య‌క్ష‌ణాల్లో ఒక పాప‌డి గొంతు తొలిసారిగా కేరుమంది. పుడిమితల్లికా బాల రోద‌న‌లో ఏం విన్పించిందో సంతోషంతో పుల‌కిరించింది.

ఆ విరోధి ఉగాది ప‌ర్వ‌దినాన పుట్టిన ఆ ప‌సికందు భ‌ర‌త‌మాతకు క‌నువిందు అయ్యాడు. ఇత‌డే కేశ‌వుడు. త‌ల్లి రేవ‌తి తండ్రి బ‌ల‌రాముడు వంశం హెడ్గెవారు. చిన్న‌నాటి నుంచీ కేశ‌వుడి ప్ర‌వ‌ర్త‌న విశిష్టంగానే ఉండేది. పెద్ద‌ల‌కు వింత‌గొలుపుతూనే ఉండేవాడు. ఎప్పుడూ ప్ర‌శ్న‌లు వేస్తూనే ఉండేవాడు. స‌మాధానాలు త‌న‌కే త‌ట్టేవి. బాలకేశ‌వుడికి ఎవ‌రూ చెప్ప‌కుండానే ఎన్నో విష‌యాలు తెలిసి పోతూండేవి. ఆడుతున్నా పాడుతున్నా అన్నం తింటున్నా చ‌దువుకుంటున్నా ఏదో ఒక ఆలోచ‌న అత‌న్ని ముసురుతూ ఉండేది. మ‌న ఇంట్లో మ‌న‌కి స్వ‌తంత్రం లేదే. ఎవ‌రోవ‌చ్చి తిష్ఠ‌వేస్తే ఎందుకు ఈ పెద్ద‌లంతా చూస్తూ ఊరుకుంటున్నారు ?  ఊరికే చూస్తూ ఊరుకోడ‌మే కాకుండా వాళ్ళ‌కి దాసోహ‌మ‌ని చేత‌కాని వాళ్ళ‌లా ప్ర‌వ‌ర్తిస్తున్నారే. ఇదేం అన్యాయం. దీనికి విరుగుడు ఉందా లేదా ?  ఉంటే ఏమిటి ?  ఏంచెయ్యాలి అని ఆ లేత గుండె గుబులుతో ర‌గిలి పోయేది. ఈ విదేశీయుల్ని మ‌న‌దేశంలో ఉండ‌నీయ కూడ‌దు. వెంట‌నే వాళ్ళ‌ని వెళ్ళ‌గొట్టేయాలి అని గ‌ట్టి నిర్ణ‌యం తీసుకున్నాడు. ఉద్దేశం పెద్దదేగాని చేతులు మ‌రీ బుల్లివి ఏంచ‌స్తాడు ?

త‌న‌కి చేత‌న‌య్యింది చెయ్య‌డానికి కేశవుడికి అవ‌కాశం వ‌చ్చింది. ఎక్క‌డో స‌ముద్రానికావ‌ల‌న ఎడ్వ‌ర్డు మ‌హారాజావారు సింహాస‌నాధిరోహ‌ణం చేశాట్ట ?  ఇక్క‌డ విందులూ వినోదాలూ జ‌రుగుతున్నాయి. అంద‌రితోపాటు కేశ‌వుడి చేతిలో కూడా మిఠాయి ఉండ‌లు పెట్టారు. ఘుమ‌ఘుమ లాడిపోతూ ఉన్న ఈ తీపి పదార్థం కేశ‌వుడి నోటిని ఊరించ‌లేక‌పోయింది. వెంట‌నే విసిరిపుచ్చుకు పారేశాడు. వాళ్ళు కాల్చే బాణాసంచాల మోత విన‌ప‌డ‌కుండా త‌లుపు లేసుకుని ముసుగుతున్న ప‌డుకొనిత‌న తిర‌స్కారాన్ని ప్ర‌క‌టించాడు.

ఇంత చిన్న వ‌య‌సులో కేశ‌వ‌రావు ప్ర‌క‌టించిన నిగ్ర‌హాగ్ర‌హాల వేగానికి దృఢ‌చింత‌న‌కీ పెద్ద‌లు ముగ్థుల‌య్యారు. వ‌య‌సును మించిన ఊహ‌లు ! ఎలా మ‌న దేశ‌మాత‌ను దాస్య‌విముక్త‌రాలిని చెయ్యాలి ! మ‌నం కూడా వివ‌తాసుతులం కాలేమా ?  అన్న త‌ప‌న‌తో కేశవుడు రోజుల‌ను గ‌డుపుతున్నాడు. ఏపాటైనా స‌రే అది జ‌న్మ‌భూమి గురించే పాడితే ఆ తల్లి మీద భ‌క్తి పాటే. అందుకే జెండాయుద్ధం అనే పాట కేశ‌వుడికి ప్రియ‌త‌మ‌మైంది. నాగ‌వూరు కోట మీద ఎగిరే ఆంగ్లేయుల జెండాల‌ని పీకేసి మ‌న‌జెండా పెట్టేస్తే స్వ‌తంత్రం వ‌చ్చిన‌ట్లే న‌నుకున్నాడు. అందుకే బాల‌సేన నేతృత్వం వ‌హించి త‌ను చదువుకునే మాష్టారు గ‌దిలోంచి కోట‌దాకా సొరంగం త‌వ్వేందుకు సంసిద్ధుడ‌య్యాడు. ఎప్పుడెప్పుడు మ‌న ప‌తాకాన్ని ఎగురవేస్తామా అన్న త‌ప‌న కేశ‌వ‌రావ్ హెడ్గెవారికి విశ్రాంతి లేకుండా చేసింది.

ఇత‌డి ఈ భావ య‌జ్ఞంలో చ‌క్క‌ని ఆవునెయ్యిలా వ‌చ్చిప‌డింది వందేమాత‌ర మంత్రం. ఒక్కో మారు వందేమాత‌ర మంత్రాన్ని ప‌ఠించ‌డం దేశ‌భ‌క్తితో ఉఱ్ఱూత‌లూగ‌డం కేశ‌రావుకి నిర్ణిద్రావ్యాసంగం అయ్యింది. వందేమాత‌రం అంటూ నినాదం చేస్తుంటే ఏదో మ‌హాశ‌క్తి వచ్చి త‌న‌ను చేరుకున్నంత ఉత్సాహం క‌లిగేది. ఎంత‌టి అపాయ‌మైనా లెక్క చేసేవాడు కాదు. ఎంత‌టి అపాయ‌మైనా లెక్క చేసేవాడు కాదు. ఎంత‌టి ప్ర‌మాద ప‌రిస్థితుల్లో కైనా ధైర్యంగా చొర‌వ‌గా చొచ్చుకుపోయేవాడు.

వందేమాత‌రం అని త‌న త‌ల్లిని తానుస్తుతించి నందుకుగాను ఈ కంచు కంఠాన్ని పాఠ‌శాల నుండ బహిష్క‌రించారు. క్ష‌మాప‌ణ కోరితే ప‌బ్బం గ‌డిచి పోయేదేగాని, తాను చేసింది త‌ప్పుకాదు అన్న ఎరుక న‌ర‌న‌రాల ఉర‌క‌లెత్తు తున్నందున త‌న‌ను కాద‌న్న బ‌డిని తానే కాద‌ని పోగ‌ల్గాడు. ఇక మ‌రి విదేశీ పాఠ‌శాల‌ల‌జోలికి పోక మెట్రిక్ నుండి మెడిసిన్ దాకా జాతీయ‌భిమానులు నిర్వ‌హిస్తున్న పాఠ‌శాల‌ల‌లోనే విద్యాభ్యాసం చేశాడు.

పెళ్ళి, పిల్ల‌లు, ధ‌నార్జ‌న‌, సంసారం, కుటుంబ తాప‌త్ర‌యం అనే చిన్న గిరిలో కేశ‌వ‌రావు వ్య‌క్తిత్వం ఇమిడేడి కాదు. అందుకనే డాక్ట‌ర్ కేశ‌వ‌రావు హెడ్గెవార్ త‌న‌గిరిని ప‌రిమితం చేసుకోక విశాల భార‌తాన్నే త‌న స్వంతం చేసికొన్నాడు. అత‌డి ఆశ‌లు పెద్ద‌వి. ఆశ‌యాలు గొప్ప‌వి. చేయ‌ద‌ల‌చిన కార్యం మ‌రింత ఘ‌న‌త‌ర‌మైన‌ది. ఇందుకు అనువైన భీమ‌బ‌లం ఉక్కు శ‌రీరం ప్ర‌కృతి ప్ర‌సాదించిన వ‌రంగా ల‌భ్య‌మైనాయి. ఆత్మ విశ్వాసం ఆత్మ‌బ‌లం ఆత్మ నిగ్ర‌హం అత‌డికి జ‌న్మ సంస్కార ద‌త్తాలు. ఇంత‌టి ధీరోదాత్తుడు గ‌నుక‌నే ఎన్ని ఆటంకాలు అవ‌రోధాలూ వ‌చ్చినా వెనుక‌డుగు వేయ‌కుండా యావద్భార‌త జ‌నాళిచేతా రాష్ట్ర గాన‌మ‌నే నాదోపాస‌న చేయించ‌గ‌లిగాడు హెడ్గెవార్‌.

వైద్య ప‌రీక్ష‌లో ఉత్తీర్ణుడైన త‌రువాత కేశ‌రావుని హితులూ, విహితులూ కూడా డాక్ట‌ర్‌జీ అనే పిలుచుకునేవారు. ఈ డాక్ట‌ర్‌జీ త‌మ వైద్య‌వృత్తి ద్వారా వ్య‌క్తుల‌కు రోగ నిర్మూల‌నా, నిరోధ‌మూ చేసినా చేయ‌క పోయినా అనైక్య‌త‌, స్వార్ధం దేశ‌భ‌క్తి రాహిత్యం అనే సామాజిక వ్యాధుల‌కి మాత్రం త‌మ ప్ర‌వృత్తితో వైద్యం చేశారు.

బ్రిటీషు ప్ర‌భుత్వం డాక్ట‌ర్‌జీని ముప్ప‌తిప్ప‌లు పెట్టేది. డాక్ట‌ర్‌జీ త‌న అతిశ‌యించిన దేశ‌భ‌క్తితో బ్రిటీష్ ప్ర‌భుత్వాన్ని ముప్ప‌తిప్ప‌లు పెట్టేవారు.

ఆ రోజుల్లో దేశ‌భ‌క్తులు విప్ల‌వ వీరులుగా పిలువ‌బ‌డుతుండేవారు. డాక్ట‌ర్‌జీ వీరుల్లో వీరుడేగాక శాంతి కాముకుడైన విప్ల‌వ వీరుడు అనే ఖ్యాతి పొందాడు. డాక్ట‌ర్‌జీ లోని స్వ‌తంత్ర భార‌త కాంక్ష మ‌హాగ్ని జ్వాల‌గా ర‌గిలి సుడిగాలిలో క‌లిసి దేశం న‌లుమూల‌ల్నీ చుట్టుముట్టింది. ఈ సెగ‌ల‌కు త‌ట్టుకోలేని బ్రిటిషు ప్ర‌భుత్వం హెడ్గెవార్‌ని దోషిగా న్యాయ‌స్థానంలో నిల‌బెట్టింది. వేర్పాటు వాదిగా ముద్ర వేయించుకుని బోనులో నుండి డాక్ట‌ర్‌జీ చెప్పిన స‌మాధానం స‌ముద్రాల కావ‌ల‌నున్న సింహాస‌నాసీనుని గుండె గుబ‌గుబ‌లాండించింది. ఈ ప్ర‌సంగం ప్ర‌తి భార‌తీయుడికీ నిత్య‌స్మ‌ర‌ణీయం.


నేను చేసింద‌ల్లా నా దేశ ప్ర‌జ‌ల హృద‌యాల్లో మాతృభూమిప‌ట్ల భ‌క్తిభావాన్ని పెంపొందించేదుకు ప్ర‌య‌త్నం చెయ్య‌డ‌మే ! నా ఈ భార‌త‌మాత ప‌ర‌హ‌స్తాల పాల‌న‌లో న‌లిగిపోతున్న‌ప్పుడు,  భార‌త‌దేశం భార‌తీయుల‌దే అని నొక్కి చెప్ప‌డం అప‌రాధ‌మూ నేర‌మూ ఎలా అవుతాయి. అని మేఘ గంభీర స్వ‌రంతో డాక్ట‌ర్‌జీ చేసిన గ‌ర్జ‌న‌ను అశేష ప్ర‌జానీకం అప్ర‌మ‌త్తంగా విని దేశ ప్రేమ‌తో ఉప్పొంగిపోయింది. ఫ‌లితంగా డాక్ట‌ర్‌జీకి సంవ‌త్స‌రం కారాగార శిక్ష ప‌డింది. బ‌య‌టికి వ‌చ్చాక మ‌రింత ప‌ట్టుద‌ల‌తో కార్య‌రంగంలోకి దూకారు కేశ‌వ్‌జీ.

స‌హాయ నిరాక‌ర‌ణోద్య‌మం ముమ్మ‌రంగా సాగుతుండ‌గా గాంధీజీ ముస్లిం సోద‌ర‌భావ ప్రేర‌ణ‌కు కొత్త ఊపిరి నిచ్చారు. గాంధీజీ ఖిలాఫ‌త్ ఉద్య‌మాన్ని స‌మ‌ర్థించ‌డం చూచాక డాక్ట‌ర్‌జీ ఒక ప్ర‌శ్న వేశారు. భార‌త‌దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియ‌న్‌, జొరాస్ట్రియ‌న్‌, మొద‌లైన అనేక మ‌తాల వారు ఉండ‌గా హిందూ ముస్లిం సోద‌ర భావానికి ఎందుకు ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు అని అడిగారు. ఇందువ‌ల్ల ఇరుప‌క్షాలూ మ‌రింత స‌న్నిహిత‌మ‌య్యే వీలు క‌ల్గుతుంద‌ని మ‌హాత్ముడు సెల‌విచ్చాడు. నిజానికి ఈ నినాదం అన‌వ‌స‌మ‌ని డాక్ట‌ర్‌జీకి అన్పించింది. అంత‌కుముందే అనేకులైన ముస్లిం దేశ‌భ‌క్తులు జిన్నా, అన్సారీ, అజ్‌మ‌ల్‌ఖాన్ మొద‌లైన‌వారు జాతీయ పోరాటంలో ప్రముఖ పాత్ర‌ను వ‌హిస్తూనే ఉన్నారు. మ‌ళ్ళీ ఈ ప్ర‌త్యేక నినాదం ఎందుకు అన్న‌ది డాక్ట‌ర్‌జీ భావం.

బ్రిటీషు వారు త‌మ‌కు ఉన్న రాజ్యం చాల‌క మ‌న భూభాగాన్ని కూడా అన్యాయంగా పాల‌న‌లోని తీసుకున్నాడు. వారిని త‌రిమికొట్ట‌డం మ‌న విధి. కాని శాంతియుతంగా ర‌క్త‌పాతం లేకుండా త‌రిమి కొట్టాలి. అన ఆహింసా విధానాన్ని ప్ర‌క‌టించారు డాక్ట‌ర్‌జీ. అస‌లు మ‌న దేశంలోకి విదేశీయులు ఎలా రాగ‌లిగారు. వ‌చ్చినా ఇక్క‌డ వేళ్ళూనుకుని ఎలా పాతుకు పోయారు. పాతుకు పోయారు స‌రే ప్ర‌భుత్వంలో జోక్యం ఎలా క‌ల‌గ‌జేసుకోగ‌లిగారు. జ్యోకం క‌ల‌గ‌జేసుకున్నా మ‌న‌ని త్రోసిరాజ‌ని వారి అధికారాన్ని మ‌న నెత్తిమీద రుద్దుతూ ఏకు మేకై ఇన‌వ‌స్థంభ‌మైన‌ట్లుగా స్థిరోభ‌వ వ‌ర‌దోభ‌వ అని ఎలా చిద్విలాసంగా ఉన్నారు ?

ఈ అన్ని ప్ర‌శ్న‌ల‌కూ ఒక‌టే మూలం అని త‌ట్టింది డాక్ట‌ర్‌జీకి. అదే అనైక్య‌త ఈ అనైక్య‌త స్వార్థంలోంచి పుట్టుకొచ్చింది. మ‌నం బాగుటే చాలు మిగ‌తా ప్ర‌పంచం ఏ గంగ‌లో క‌లిస్తే యేం అన్న ఆలోచ‌నే అనైక్య‌త‌ను దారి తీస్తుంది. అనైక్య‌త ఉంటే వుంది. మ‌న‌లో మ‌నం కొట్టుకున్నా తిట్టుకున్నా బ‌య‌టివారి ముందైనా ధీమాగా నిల‌బ‌డవ‌ద్దూ ?  ప‌రువు నిలిచేలా అంద‌రూ ఏక‌మై ప‌రుల‌ను పార‌ద్రోలారా ?  పార‌ద్రోల‌క‌పోగా మ‌న‌మే ఆహ్వానిస్తిమి. పిట్ట‌పోరు పిట్ట‌పోరు పిల్లి తీర్చిన‌ట్లు మ‌న క‌ల‌హాల‌వ‌ల్లే మ‌న సింహాస‌నం వారి వ‌శ‌మైంది.

డాక్ట‌ర్‌జీ చెల‌రేగిన ఈ విచికిత్స ఆయ‌న‌కో మార్గోప‌దేశం చేసింది. క‌ర్త‌వ్యం ఏమిటో వెన్నుత‌ట్టి చెప్పింది. మ‌న దేశానికి మ‌న‌కూ కావ‌ల్సింది ఐక‌మ‌త్యం. ఇందుచేత హిందువుల్లో ఐక్య‌భావం పెంపొందించేందుకు దీక్షా కంక‌ణ‌బ‌ద్ధులైన‌నారు. అందుకే కారాగారాల‌కు మూకుమ్మ‌డిగా వెళ్ళ‌డం వ‌ల్ల స్వ‌రాజ్యం ల‌భించ‌దు అని అన్నారు. ఇంత‌క‌న్నా చేయ‌వ‌ల‌సింది మ‌రొక‌టి ఉన్న‌ది. అని వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా ఉద్భోధ చేస్తూ ఉండేవారు.

హిందువంటే ఎవ‌రు ?  కేవ‌లం రామ‌కృష్ణాది దేవ‌తా పూజ చేస్తూ ఋగ్వేదాది గ్రంథాల‌ను ప్ర‌మాణంగా భావించేవారే హిందువులా ?  క్రీస్తునుగాని మ‌హ‌మ్మ‌దు ప్ర‌వ‌క్త‌ను గాని న‌మ్మేవారు హిందువులు కారా అని ప్ర‌శ్నిస్తే డాక్ట‌ర్‌జీ స‌మాధానం ఇలా ఉంటుంది. హిందూ దేశంలో పుట్టి హిందూ దేశాన్ని ప్రేమించే ప్ర‌తి ఒక్క‌డూ హైంద‌వుడే కానీ ఈ దేశాన్ని ద్వేషించే ప్ర‌తి ఒక్క‌డూ ఆ హిందువు అని అంటారు. దేశ‌భక్తి అంటే ఏమిటి ?  ఎలా ఉండాలి ?  అన్న విష‌యాన్ని న‌దుల‌కు వ‌ర‌ద‌లు వ‌చ్చి జ‌నం కొట్టుమిట్టాడిపోతున్న‌ప్పుడు, అహ‌ర్నిశ‌లూ కృషి చేసి ఆర్తుల‌ను ఆదుకునీ, క‌లరా, ప్లేగు వంగి భ‌యంక‌ర వ్యాధుల‌తో ఊళ్ళ‌కు ఊళ్ళు విల‌విల‌లాడిపోతున్న‌ప్పుడు సాయ‌ప‌డి, మ‌తోన్మాదులు ఆవుల్నీ, అర్భ‌కుల్నీ, అబ‌ల‌ల్నీ హింసించి ఆస్తుల‌ను దోచుకుంటుంటే గ‌జ‌గ‌జ‌లాడిపోయిన దీనుల్ని ఊర‌డించి సోదాహార‌ణంగా నిరూపించాడు డాక్ట‌ర్‌జీ.

దేశ‌భ‌క్తి. నిస్వార్థ‌సేవ‌, క‌రుణ‌, అనే మూడు గుణాలు డాక్ట‌ర్‌జీ నుండి ప్ర‌వ‌హించి జ‌న‌స‌ముద్రంతో సంగ‌మించాయి. హిందువుల్లో ఐక్య‌భావం పెంపొందించాల్సిన అవ‌స‌రాన్ని గ‌మ‌నించిన డాక్ట‌ర్‌జీ ఇందుకు అనువుగా ఒక సంస్థ‌ను త‌యారు చేశారు.