9
 


పంజ‌రంలోంచి  అంబ‌రంలోకి

రాత్రినుంచీ చిల‌క తెగ‌గోల‌పెడుతోంది. దాని అరుపుల‌తో మాకెవ్వ‌రికి నిద్ర‌కూడా ప‌ట్ట‌లేదు. తెల్ల‌వార‌బోతోంది. ఇంకో రెండుగంట‌ల్లో సూర్యుడు ధ‌గ‌ధ‌గా మెర‌స్తూ పైకి వచ్చేసి చీక‌ట్ల‌ని పార‌ద్రోలేస్తాడు. కానీ ఆ చిల‌క జీవితం ఏమౌతుందో ! 

ఇవ్వాల్టికి మూడురోజులైంది. మాపాలేరు దాన్ని సంత‌లో కొన్నాట్ట‌. పిల్ల‌ల‌కి స‌ర‌దాగా ఉంటుంద‌ని ప‌నిగొట్టుకొని ప‌ట్టుకొచ్చాడు. పిల్ల‌లు చాలా చ‌క్క‌ని పంజ‌రాన్ని కొన్నారు. దాన్నిండా ముత్యాలూ  తాడులాగా పూస‌లు క‌ట్టారు. అస‌లే బంగారు రంగు. ఈ అలంక‌ర‌ణ‌ల‌తో మ‌రింత మెరిసిపోతుంది. ఎన్నో ర‌కాల ప‌ళ్ళు తెచ్చి ముందుపెట్టారు.  చిల‌క‌లు ఏవేం తింటాయో తెలిసిన వాళ్ళంద‌ర్నీ అడిగి ఏమి చెప్తే అవన్నీ తెచ్చి చిల‌క‌కి పెడ్తున్నారు. అదిక్ష‌ణం సేపు అరుపుమాని ఆ పెట్టిన వాటిని ముక్కుతో తాకి మ‌ళ్ళీ అర‌వ‌టం మొద‌లు పెడ్తోంది. ఇదేదో స‌త్యాగ్ర‌హం చేస్తున్న‌ట్లుంది అని ఒక‌రూ భూక్‌హ‌ర్తాళ్ చేస్తోంద‌ని  ఒక‌రూ న‌వ్వుకుంటున్నారు. క‌డుపు మాడితే అదే దారి కొస్తుంద‌ని మాపాలేరు మోటు సామెత చెప్పాడు.

చిల‌క గొంతులో శ‌క్తి క్షీణించింది. ఎందుకు ఆహారం తింటంలేదు ?  దానికి పంజరం న‌చ్చ‌లేదు. దాని  ప్రొట‌స్టే అది. దానికి చేత‌నైన రీతిలో చేస్తోంది. మాసాయి లేచి వెళ్ళి చిల‌క‌ని చూసివ‌చ్చాడు. అమ్మా దీనికి కూడా సెలైన్ ఎక్కించ‌వ‌చ్చా అన్నాడు. ఇంత బాధ ఎందుకురా హాయిగా దాన్ని విడిచిపెట్టేస్తే చ‌క్క‌గా దానిక్కావ‌ల్సింది అది తింటుంది అన్నాను. ఒక  ప్రాణిని బంధిస్తే ఎంత‌బాధ ప‌డ్తుందో తెలుసా అంటూ వుంటే వాడు  క‌థ చెప్ప‌మ‌ని మ‌రాం చేశాడు. పొద్దున్నే క‌థ‌లేమిటి నీ మొహం అన్నాను. నా మ‌న‌స్సులో ఈ చిల‌క‌ని తెచ్చింద‌ర్గ‌ర్నించీ ఒకే భావం క‌ద‌లాడుతోంది. విదేశీ పాల‌న‌లో భార‌త దేశంలోని యావ‌న్మందీ వీర‌లూ ఈ చిల‌క‌లాగే నిర‌స‌న వ్ర‌తాల‌లో త‌ల్ల‌డిల్లి పోయారు గ‌దా అని ఈ చిల‌క లాగే మ‌న జ‌న్మ‌ల‌కి కార‌కులైన మ‌న అమ్మ‌ల‌కి అమ్మ నేల‌త‌ల్లి  ఇలాగే నిస్స‌మాయంగా విల‌పించింది క‌దా అని. అ అమ్మ‌ని విడిపించాల‌ని ఎందరెంద‌రో ముద్దుబిడ్డ‌లు ప్రాణాల‌కు తెగించి పోరాడారు. వారంద‌రికీ భాష్పాంజ‌లు అర్పింప‌వ‌ల‌సిన అగ‌త్యం అవ‌శ్యం మ‌న‌కి లేదూ అని భావావేశంలో ఊగిపోతూనే ఉన్నాను.

ప్రాతఃస్మ‌ర‌ణీయ స్వ‌తంత్ర పోరాటానికి ప్ర‌ధ‌మంగా ప్ర‌ప్ర‌ధ‌మ విప్ల‌వశంఖాన్ని పూరించిన ల‌క్ష్మీబాయి ఝాన్సీలో జ‌నించినా యావ‌ద్బార‌తానికీ ఆద‌ర్శమూర్తి అయ్యింది.

సాయి ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం ఇచ్చుకుంటూ పోతూ ఝాన్సీరాణీ క‌న్నా ముందు ఆంగ్లేయుల‌మీద విరుచుకుప‌డ్డ యోధులెవ‌రూ... చెప్ప‌మ్మా ! ఫో అమ్మా నువ్వెప్పుడూ ఆడ‌వాళ్ల‌నే ముందు చెప్పావు. అవునురా అమ్మ స్త్రీ జ‌న ప‌క్ష‌పాతి. శ్రీ‌వారి  చెర‌కుకి ఉడుక్కుంటూ నామాట అన‌డం కాద‌ని చరిత్ర పుస్త‌కాల్లో దాఖలాలు చూపించాను. రాణి చెన్న‌మ్మ 1824 లోనే ఆంగ్లేయుల‌తో పోరాడింది. వాళ్ళ‌ని త‌ప్పించ‌డానికి ఆమెకి అంగ‌బ‌లం త‌క్కువ‌గా వున్నా మ‌నోబ‌లం మిక్కుటంగా వుంది. కానీ వాళ్ళ‌పాపం పండేదాకా అవ‌తార పురుషుడు ముందుకు రాలేదు. అందుకే చిట్టూరిరాణి చెన్న‌మ్మ కృషి ఫ‌లించ‌లేదు.

అయోధ్య‌ను పాలించే నవాబు మ‌రణించ‌గా అత‌ని భార్య రాణి అయ్యింది. ఆమెను అయోధ్య బేగం అని గౌర‌వంగా పిలిచేవారు. అ అయోధ్య‌బేగం,  బేగం హ‌రిర‌త్‌మ‌హ‌ల్ మొద‌లైన ముస్లిము వ‌నిత‌లు త‌మ‌త‌మ అంతఃపురాల్నీ ఘోషాల‌నూ మ‌రిచ శ‌త్రువుల‌మీద క‌త్తి దూశారు. హజ‌ర‌త్‌మ‌హ‌ల్ గొప్ప‌సౌంద‌ర్య‌రాసి, ఆమె భ‌ర్త ఔధ్ న‌వాబ్ న‌జీద్ ఆలీషా. ఆలీషాను క‌ల‌క‌త్తాలో బంధించారిని తెలియ‌గానే బ్రిటీష్ సైనికుల‌తో త‌ల‌ప‌డి ల‌క్నోను వీర‌భోజ్యం చేసుకుంది. హ‌జ‌ర‌త్ !  అప్ప‌ట్లో హిందూ ముస్లిముల‌మ‌ధ్య అభేద్య‌మైన ఐక్య‌త‌ను ప‌లుతావుల్లో దృశ్య‌మాన‌మౌతోంది. ఈ హ‌జ‌ర‌త్ మ‌హ‌ల్‌కి సాయ‌ప‌డిన యోధుల్లో హిందువులే ఎక్కువ‌గా ఉన్నారు.

1914 నుండి హోమ్ రూల్ ఆందోళ‌న‌ను సాగించిన అనిబిసెంట్ ఐరిష్ మ‌హిళ అయినా భార‌త సంస్కృతిని ఆరాధించే వారు. ఈమె దివ్య‌జ్ఞాన స‌మాజానికి అధ్య‌క్షురాలిగా ఉండేవారు. భార‌త‌దేశానికి స్వ‌తంత్రం ఇయ్యాల‌ని అనిబిసెంట్ ఎంత‌గానో పట్టుబ‌ట్టి నందుకు ఆమెను నిర్భంధించారు. ఆ త‌రువాత 1917లో జ‌రిగిన భార‌త మ‌హాస‌భ‌కు అనిబిసెంట్‌ని అధ్య‌క్షురాలిగా చేశారు.

1908 ఏఫ్రియ‌ల్ 19వ తేదీన మాతృనివేద‌న అన్న సంపాద‌కీయంలో భార‌తీయుల‌నుద్బోదిస్తూ భార‌తీయ సోద‌రులారా మీరు మన‌మాతృవాక్య ప‌రిపాల‌న‌ముకే స్వాతంత్య్ర‌ము గాంచి గ‌రుడుని వ‌లె య‌శోవంతుల‌గుదురా ?  లేక న‌శింతురా అని ఒక్క ప్ర‌శ్న‌తో ముట్నూరి కృష్ణారావుగారు క‌ర్త‌వ్య నిర్ణ‌యం చేశారు.

బ్రిటీష్‌వారు చేసిన ఘాతుకాలు ఇన్నీ అన్నీ కాదు. కుసుమ‌కోమ‌లల‌ని పేర్కొనబ‌డే స్త్రీల‌ను సైతం మారి కిరాత‌కాల‌కు గురి చేశారు.

ఉప్పు స‌త్యాగ్ర‌హాలు ప‌తాక ప్ర‌ద‌ర్శ‌న‌లూ వందేమాత‌ర‌గానాలూ చేసి మ‌హిళ‌లు పురుషుల‌కు మ‌రింత ఉత్సాహాన్నీ మ‌రింత ప్రేర‌ణ‌నీ క‌ల్గించారు.

నెల్లూరులో 1932లో అపుర‌స్త్రీలు బ్రిటీష్ వారిని ఒక ఆట ఆడించారు. అక్క‌డ వారొక స‌త్యాగ్ర‌హ శిబిరాన్ని నిర్మించుకున్నారు. బ్రిటీష్ సైనికులు వ‌చ్చి ఆ శిబిరాన్ని వ‌శం చేసికొని అక్క‌డ ఉన్న స్త్రీల‌ను అరెస్టు చేశారు. గ‌డ్డ‌పాటి పిచ్చ‌మ్మ అనే మ‌హిళ నాయ‌క‌త్వంలో రేప‌ల్లెపుర వీధుల‌గుండా వారిపైన చెంగులేగాక భార‌తీయ జెండాను రెప‌రెప‌లాడిస్తూ కోమ‌ల కంఠాల‌తో వందేమాత‌ర నినాదాలు చేస్తూ ఊరేగింపుచేశారు. వీరిని అరెస్టు చేసి రాత్రి బాగా చీక‌టిప‌డ్డాక వ‌దిలారు. వారు కాలిన‌డ‌క‌న నెల్లూరు వెళ్ళి స‌త్యాగ్ర‌హ శిబిరాన్ని తిరిగి స్వంతం చేసుకున్నారు. ఇలా స్త్రీలు శిబిరాన్ని వ‌శం చేసుకోడం మ‌ళ్ళీ మ‌ర్నాడు సైనికులు వీరిని అరెస్టు చెయ్య‌డం ఇలాగ నెల్లూరు శిబిరం నాల్గుమార్లు చేతులు మారింది. మ‌ల్లిపెద్ది శేష‌మ్మ కొల్లి నాగ‌భూఫ‌ణ‌మ్మ‌, పాతూరి రాఘ‌వ‌మ్మ మొద‌లైన వారెంద‌రో ధైర్య‌సాహాసాల‌ను ప్ర‌క‌టించి ఆరేసినెల‌లు కారాగారవాసం అనుభ‌వించారు. ఈనాడు క‌నీసం మ‌న‌కి వాళ్ళ పేర్ల‌న్నా తెలియ‌వు. ప్ర‌భాత‌భేరీలు, న‌గ‌ర సంకీర్త‌ల‌ను మొద‌లైన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేవారు. క‌ర‌ప‌త్రాలు పంచి ప్ర‌జ‌ల‌ను ఉత్తేజ‌ప‌రిచేందుకు మ‌హిళ‌లు త‌మ క‌ర‌క‌మ‌లాల‌ను లాఠీదెబ్బ‌ల‌కు సైతం వెర‌వ‌క ఇలా ఎంద‌రో వ్య‌క్తులు ఎన్నో దృశ్యాలు ఉహాప‌థం నుండి మాయ‌మైపోతూ వుంటే మ‌రో క్రొత్త దృశ్యం క‌నుల‌ముందు నిలిచేది.

ఆర‌య్యింది. చిల‌క గొంతునుండి శ‌బ్ధం చాలా క‌ష్టంగా వ‌స్తోంది.

లేచాను పంజ‌రం నుండి తీసి మెల్ల‌గా చిలుక‌ను బాల్క‌నీలో ఉంచాను. దానికి ఎక్క‌డ లేనిబ‌లం వ‌చ్చింది. రివ్వున ఎగురుతూ నా వైపు చూసి గొంతెత్తి అరిచింది. ఆ చూపులోనూ ఆ అరుపులోనూ ప్ర‌కృతి ర‌హ‌స్యాన్నంతా విప్పి చెప్తున్న వేదార్థ‌మేదో ఉన్న‌ట్లు అన్పించింది. నాకు తెలుసు ఈ చిల‌క నిష్ర్క‌మ‌ణానికి ఇంట్లోఎంత గ‌లాటా అవుతుందో కానీ నేను చెప్పబోయే స‌మాధానాన్ని కూడా ముందే ఊహించి పెట్టుకున్నాను. ప్రతి ప్రాణి పుడుతూనే తెచ్చుకున్న హ‌క్కు స్వ‌తంత్రం అని. చిల‌క కోసం ఆకాశంలోకి చూశాను. పింగ‌ళి వెంక‌య్య‌గారు రూప‌క‌ల్ప‌న చేసిన మువ్వ‌న్నెల జండా గ‌ర్వంగా, ముచ్చ‌ట‌గా రెప‌రెప‌లాడుతోంది.