11
 

న‌వ్వు

జీవితంలోతెల్లారిలేచిన‌ప్ప‌టినుంచి ఎన్నో భ‌యాలు, యాత‌న‌లు, దుఃఖాలు, వెంప‌ర్లాట‌లు, స‌మ‌స్య‌లు... అస‌లు ముచ్చ‌ట‌గా న‌వ్వుతూ సంభాషించుకోవ‌డానికిగానీ ఏ చ‌క్క‌ని హాస్యానికో  ఒక్క క్ష‌ణం ప‌రుగునుండి నిలిచి సంతోషించ‌డానికిగాని తీరిక ఉండ‌దు. ఒక‌వేళ ఉన్నా చక్కని హాస్యం అందించే సినిమాగాని ప‌త్రిక‌గానీ లేక అన్ని కొర‌త‌ల‌తోపాటు హాస్యం కూడా క‌రువైపోతోంది. హ‌స్ అనే సంస్కృత ధాతువులోంచి హాస్య‌మ‌నే మాట పుట్టింది. హ‌స్ అంటే న‌వ్వు. వికాసం. ఓ మంచిమాట విన్న‌ప్పుడైనా చూసిన‌ప్పుడైనా హృద‌యం ఆనందంగా స్ఫ‌దించిన‌పుడు అసంక‌ల్పితంగా పెద‌వులూ క‌నులూ విచ్చుకొని తామ‌నుభ‌వించిన సంతోషాన్ని ప్ర‌క‌టిస్తాయి. న‌వ్వు రావాలంటే ఇంత త‌తంగం వుంది. ఈ న‌వ్వుల‌లో ఎన్నో రకాలు. వంక‌ర న‌వ్వులు, వెకిలి న‌వ్వులూ, చ‌ల్ల‌ని న‌వ్వులు, విక‌టాట్ట‌హాసాలు, వికృతాట్ట‌హాసాలు, ప‌సిపాప‌ల బోసి న‌వ్వులు, ప్రేమికుల ప్రేమ న‌వ్వులు ఇలా చెప్పుకొస్తూ ఉంటే లిస్టు పెరిగిపోతుంది.

తిక్క‌న సోమ‌యాజి మ‌హాభారతంలోని ప‌దిహేను ప‌ర్వాల‌లోనూ ఎన్నో ర‌కాల న‌వ్వుల‌ను చిత్రించారు. దాదాపు ముప్పెపైకి పైగా న‌వ్వుల వెరైటీ వీరి ర‌చ‌న‌లో చూడ‌గ‌లం. అన్నిటిలోనూ శ్రీ‌కృష్ణ‌భ‌గ‌వానుని న‌వ్వు మ‌ర‌పురానంత‌గా హృద‌యాల‌కు హ‌త్తుకొంటుంది. శ్రీ‌కృష్ణుడు న‌ల్లనివాడు. దంతాలు మాత్రం తెల్ల‌గా మెరిసిపోతూ ఉంటాయి. పెద‌వులు మూసిఉన్న‌ప్పుడు వీటి శోభ తెలియ‌దు. కానీ న‌వ్వినప్పుడు చిన్న‌గా ప‌ళ్ళు క‌నిపిస్తూ ఉంటే న‌ల్ల‌ని మేఘాల‌చాటున మెరుపుతీగ మెరిసిన‌ట్లుగా న‌ల్ల‌న‌య్య న‌వ్వుని వ‌ర్ణించారు. ప‌రిశోధ‌న చేస్తే ఏ కావ్యంలోనూ ఇన్ని ర‌కాల న‌వ్వుల‌ను వ‌ర్ణించిన వారుండర‌ని అనిపిస్తుంది.

స‌హృద‌యులు న‌వ్వితే ప‌రిస‌రాల‌కు క్షేమం. దుర్మార్గుడు న‌వ్వుతూనే గొంతులు కోస్తాడు. తాను న‌వ్వుతూ ప‌క్క‌వారిని న‌వ్విస్తూ ఉండే కులాసా వ్య‌క్తుల ఆరోగ్యం ఏడ్చుగొట్టుమొహాల‌వారి ఆరోగ్యం కంటె ఎంతో మిన్న‌గా ఉంటుంద‌ని వైద్య‌శాస్త్ర‌జ్ఞులు న‌వ్వండి న‌వ్వండి అని మొత్తుకొంటారు.

న‌వ్వు ఆనందానికి, సుఖానికి, ఆత్మీయ‌త‌కూ చిహ్నం. అయినా మ‌న‌ల్ని చూసి ఎవ‌రైనా నవ్వుతార‌మోన‌ని హ‌డ‌లిపోతూ ఉంటాం. న‌వ్వుకుందురుగాక నాకేటి సిగ్గు అని తుడిచిపారేసుకొన్న వాళ్ళ భాగ్య‌మే భాగ్యం. కొంద‌రు ఎన్ని క‌ష్టాలున్నా ప‌ళ్ళ‌బిగువున బంధించేసుకొని ఎదుటివాళ్ళ‌ను న‌వ్వించ‌డ‌మే త‌మ ధ్యేయం అన్న‌ట్లుగా జీవిస్తారు.

నిత్య‌దుఃఖితులు అనేవారినందరినీ ఒక త్రాటికి క‌ట్టేశాడు చిన్న‌య‌సూరి. ఇలాటి వారిని ఏం చేసినా న‌వ్వించ‌లేము. స్వ‌ర్గాన్ని తీసుకువ‌చ్చి వాళ్ళ పెర‌ట్లో పెట్టినా వాళ్ళ మొహం తుమ్మ‌ల్లో ప్రొద్దుకుంకిన‌ట్లు మొట‌మొట‌లాడిపోతూనే ఉంటుంది. ఇంకా మ‌రీ ప్ర‌య‌త్నించానూ మ‌న‌మే ప్ర‌మాదంలో ప‌డిపోయే అవ‌కాశాలు ఉంటాయి. గంభీర వ్య‌క్తులు కొందరుంటారు. శంక‌ర‌శాస్త్రి బ్రాండువాళ్ళు, వాళ్ళు న‌వ్వితే త‌మ అష్ట‌యిశ్వ‌రాలూ కొట్టుకుపోతాయ‌న్న‌ట్లుగా ధుమ‌ధుమ‌లాడుతూనే ఉంటారు. హాస్యానికి ఈ బాప‌తువాళ్ళ‌కి చుక్కెదురు. పోజిటివ్ నెగిటివ్ కోణాల్ని క‌ల‌ప‌డం బ్ర‌హ్మ‌త‌ర‌మే కాని మాన‌వ‌మాత్రుల‌కు శ‌క్యంకాదు.

ఇప్పుడు వ‌చ్చే సినిమాల‌లో వికృత శ‌రీరాల‌ను చూసి హాస్య‌చిత్రాలుగా డబ్బు దండుకొంటున్నాయి. బాగా లావుగాఉన్న ఏనుగులా ఉన్నా వారిచేత ట్విస్టు డ్యాన్సులు చేయిస్తూ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ‌న‌వ్విస్తూన్నానుకొంటారు. అతిస‌న్న‌గా పుల్ల‌లాగా ఉన్న‌వారో, మెల్ల‌కంటివారో, న‌త్తివారో హాస్యాన్ని సృష్టించేవారుగా సినీ నిర్మాత‌ల‌కు గోచ‌రించ‌డం దుర‌దృష్ట‌క‌రం. లేదా జర్రుమ‌ని జారిప‌డడం, ఏ రుబ్బే రుబ్బే మిన‌ప్పిండి మొహంనిండా రుద్దు కోడం.... ఇదండీ నేటి హాస్యం. ఇహ టి.వి. నాట‌కాల్లో వ‌చ్చే హాస్యాన్ని వ‌ర్ణించ‌న‌ల‌వికాదు. స్త్రీ పాత్ర‌ధారిణి గ‌రిటో, అట్లకాడో, అప్ప‌డాల క‌ర్రో ప‌ట్టుకుని ముందు గ‌దిలో పేప‌ర్ చ‌దువుకొనే భ‌ర్త‌మీదికి వాగ్యుద్ధానికి త‌యారౌతుంది. ఇది హాస్య‌మో, య‌దార్థ చిత్ర‌ణ‌మో ద‌ర్శ‌కుల న‌డిగితేకాని అర్థంకాదు. వంటింట్లో చేసుకునే ప‌ని ముందు గ‌దిలో చేయ‌ని ఇల్లాలు టి.వి. నాట‌కాల్లో మ‌నం క‌న్నుపొడుచుకున్నా క‌న‌ప‌డ‌దు.

బావామ‌ర‌ద‌ళ్ళు, వ‌దినామ‌ర‌ద‌లు హాస్యంగా మాట‌లాడుకొనేవారిని పెళ్ళిళ్ళ‌లో వియ్య‌పురాలికి చిత్ర‌విచిత్రాలంకారాలు చేసి సున్నిత‌మైన హాస్యం సృష్టించేవార‌ని మ‌నం విన‌డ‌మేత‌ప్ప చూడం. ఇదివ‌ర‌కు పెళ్లి వ‌స్తోంది అంటే వియ్యాల‌వారినెలా హాస్యం ప‌ట్టించాల‌నే ఉద్దేశంతో కొత్త కొత్త ప్లానుల‌ను ఆలోచిస్తూ ఉండేవార‌ట‌. ఇప్పుడు క‌ట్నాల స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ వియ్యాల‌వారంటే శ‌త్రువుల‌ను చూసిన‌ట్లుగా లోలోన హ‌డ‌లిపోతూ ఉన్నారు. అప్పుడూ క‌ట్నాలున్నాయిగాని ఇంత‌గా అత్యాశ‌గా ఉండేది కాదు.

ఇక కాలేజీల్లోనూ స్కూళ్ళ‌లోను చ‌దువుకొనే ఆడ‌పిల్ల‌లు ఇద్ద‌రు ముగ్గురు ఒక‌చోట క‌లిస్తే ఒక‌టే న‌వ్వులు పుట్టుకొస్తాయి. ఎందుకు న‌వ్వుతున్నారో వారికే తెలీదు. ఏం మాట్లాడినా న‌వ్వే. ఆ మాట‌లో న‌వ్వు వ‌చ్చే సంగ‌తి ఉన్నా లేక‌పోయినా వాళ్ళ‌కి ప‌ట్టింపు ఉండ‌దు. ప‌గ‌ల‌బ‌డి న‌వ్వు కొంటారు. ఏమే మోర్నింగ్ హిందీ మేడ‌మ్ తెల్ల‌చీర‌కట్టుకొచ్చారే... న‌వ్వు....నేను బ‌స్టాప్‌కి వచ్చేస‌రికి బ‌స్ వెళ్లిపోయిందే న‌వ్వు... పెన్ లో ఇంక్ అయిపోయి నోట్సు రాయ‌లేదే...నవ్వు.... మేడ‌మ్‌ని పాఠం చెప్ప‌కుండా బ‌లే ఆడించాం...నవ్వు... ప‌గ‌ల‌బ‌డి న‌వ్వు...విర‌గ‌బ‌డి న‌వ్వు... ఇక వీళ్ళు రోడ్‌మీద న‌డుస్తూ ఉంటేఏ సైకిలో గుద్దేసేలాగ ద‌గ్గ‌రికివ‌చ్చినా, అడ్డం తొల‌గండి అన్నట్లుగా బ‌య్య‌మ‌ని కారు హార‌ర్ మ్రోగుతున్నా, పెన్నులూ, పుస్త‌కాలు జారిప‌డిపోతున్నా, ఒంటిమీద ప‌యిట ఉందో జారిపోయిందో కూడ ప‌ట్టించుకోరు. ఈ న‌వ్వుల సంద‌ట్లో వారికేమీ ప‌ట్ట‌దు. ఆకార‌ణంగా న‌వ్వుకొంటూ న‌డ‌చి పోతూ ఉంటారు.

ఈ న‌వ్వులే ఒక యువ‌తీ యువ‌కుడూ అయితే ఇంకోలాగున ప‌రిణ‌మించి జీవిత మంతా తీరిక‌గా ఏడ్వ‌డానికో రంగ‌భూమిని సిద్దం చేస్తాయి. సంతోషించ‌ర‌ని గ్యారంటీ ఏమిటీ అని అడ‌క్కండి. అలా స‌కృత్తుగా జ‌రుగుతుంది. జీవితం అంటే ఏమిటో తెలియ‌ని ఆ ప‌సివ‌య‌సులో చేసికొనే నిర్ణ‌యాలు మూడొంతులు విష‌లం కాక త‌ప్ప‌వు.

ఇలాగ న‌వ్వులు న‌వ్వులుగానే మిగిలిపోతే అంద‌రికీ ఆనంద‌మే గాని తాము న‌వ్వ‌డం, ఇత‌రుల‌ను న‌వ్వించ‌డం గొప్ప క‌ళ‌.