24
 

న్యాయ‌వాదిగా నారీమ‌ణి

 

పేరుకే స‌మాన‌త్వంగానీ ఎందులోనూ స‌మాన‌త్వం లేద‌క్కా. మా పరిమ‌ళ ఎవ‌రిమీద పెద్ద అభాండ‌మే వెయ్య‌బోతోంద‌ని గ్ర‌హించి న‌వ్వాను. అవునూ స‌మాన‌త్వం ఎక్క‌డ లేదు ?  ఎవ‌రెవ‌రికి లేదు ?  లేద‌ని తెలిసినా న్యాయ‌వాదినివైన నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు ?   అన్యాయాన్ని ఎద‌రించ‌లేవా ?  ఇన్ని ప్ర‌శ్న‌లు మామూలు ప‌రిస్థితుల్లో అయితే వాడిగా వేడిగా వ‌డ్డించేదాన్నే. కానీ కొంత వ‌ర‌కు ప‌రిమ‌ళ స‌మ‌స్య ఏమిటో ఊహించ‌గ‌లిగాను కాబ‌ట్టి త‌ను చెప్పేదాకా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇవాళే పేప‌ర్లో ఓ వార్త చ‌దివాను. అది ప‌రిమ‌ళ‌కేసే ప‌రిమ‌ళ క్ల‌యింట్స్ ఓడిపోయారు.

పరిమ‌ళ  ఇప్పుడిప్పుడే పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకుంటున్న న్యాయ‌వాదిని. అక్కా నువ్వే చెప్పు నేను తెలివి త‌క్కువ‌దాన్నా ?  అంది. అదేం ప్ర‌శ్నే పిచ్చి ప్ర‌శ్న .  తెలివి త‌క్కువ దానివైతే యూనివ‌ర్శిటీ ఫ‌స్టులో, గోల్డుమెడ‌ల్సు, ఆలిండియా లెవ‌ల్లో ఫ‌స్టు ప్ర‌యిజులూ ఎలా వ‌స్తాయే ?  అన్నాను. నాకు కామ‌న‌సెన్స్ లేదా వాదించ‌లేనా నాకు ధైర్యంగా ఆర్గ్యుచేసే శ‌క్తి లేదా ?  అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తుంద‌ని తెలుసు. అందుకే నువ్వు చాలాశ‌క్తి సామ‌ర్థ్యాలున్న ఎడ్వొకేట్‌వి. ఒక‌వేళ ఏ కేసులోన‌న్నా ఓడిపోతే అది కేసులో ఉన్న‌లోప‌మేగాని నీ తెలివిలోపం కాదు. అయినా ప‌మ్మీ కేసు ఓడిపోతే ఇంత‌బాధ ప‌డితే ఎలానే అన్నాను. అక్కా నేను బాధ‌ప‌డ్తున్న‌ది అందుకు కాదు అంది. అయితే మ‌రెందుకే చంపుతావ్ అస‌లు సంగ‌తి చెప్పుక ?

 నాకు రెండ‌రోజుల క్రితం ఒక పెద్ద కేసు వ‌చ్చింది. ఎనిమిది వేల‌కి సెటిల్ చేసుకున్నాం. గెలిస్తూ పెద్ద ప్రెజెంట్ కూడా ఇస్తాన‌న్నారు. ఏమైనాస‌రే త‌ప్ప‌కుండా తెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో నిద్రాహారాలు మాని ప్రిపేర్ చేశాను. కానీ ఈ రోజు పొద్దున్న వాళ్ళు వచ్చి సారీ మేమింకో ప్లీడ‌ర్ గార్ని పెట్టుకుంటాం అన్నారు. ఎంతో చెప్పి చూశాను. కానీ వాళ్ళు విన‌క ఫైల్ ప‌ట్టుకుపోయారు. ఇంత‌కీ ఏంకేసు ?  హ‌త్య నేను చిన్న‌దాన్ని అనుభ‌వం త‌క్కువ వున్న‌దాన్ని అని అంటే బాధ‌ప‌డేదాన్ని కాను. కానీ ఆడ‌దేం చేస్తుంది. మ‌గప్లీడ‌ర్ని పెట్టండి అని అంద‌రూ వాళ్ళ‌ని ఊద‌ర‌కొట్టారుట ! పాపం ప‌రిమ‌ళ ! ఎంతో ధైర్య‌స్థ‌యిర్యాలుగ‌ల ప‌రిమ‌ళ మొహం చిన్న బోయింది. ఆడ‌వాళ్ళు చేస్తే వీళ్లు జైళ్ళ‌పాలు కావ‌ల్సివ‌స్తుందిట ! మ‌గ‌వాళ్ళు చేస్తే శిక్ష‌లు ప‌డ‌టం లేదా ?

ఏ కార‌ణం అయినా కానీండి మ‌హిళా న్యాయ‌వాదుల‌నే స‌రికి చాలా మందికి ఒక ర‌క‌మైన తేలిక‌భావం ఏర్ప‌డిపోయింది. పెద్ద‌పెద్ద కేసులు స్త్రీల చేతుల్లో పెట్ట‌డానికి వాళ్ళ‌చేతులు వొణుకుతాయి. అని జ‌య‌భార‌తి చెప్తూ ఉంటుంది. అంతెందుకు ఇన్ని వేల‌మంది పురుషులు న్యాయ‌వాదులుగా వున్న ఈ జంట‌న‌గ‌రాల్లో స్త్రీ న్యాయ‌వాదులు ఎంత‌శాతం ఉన్నారు ?  పోనీ సంఖ్య‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ద్దండి. స్త్రీలు పెద్ద జూనియ‌ర్లుగా వుంటూ కొద్దో గొప్పో ధ‌నార్జ‌న చేసుకుంటూ ఆఫీసుల్లో వున్నారేగాని ఇండిపెండెంట్‌గా ఆఫీస్ న‌డ‌ప‌గ‌ల్గి త‌మ ద‌గ్గ‌ర జూనియ‌ర్‌ని మెయిన్‌టెయిన్ చెయ్య‌గ‌ల స్త్రీలెంత‌మంది వున్నారు. వేళ్ళ‌మీద లెక్క‌పెట్ట గ‌లిగేంత మంది వున్నారు ?

ఎందుక‌ని త‌క్కువ‌గా ఉన్నారు. వాళ్ళ‌కి తెలివికి లోపం ఉందా ధైర్యానికి లోప‌ల ఉందా. క‌ష్ట‌ప‌డి కేసు చ‌దివి లా పాయింట్లు తీసి వాదించ‌లేరా ?  అంటే ఇవేవీ కార‌ణాలు కావు. కేవ‌లం స్త్రీ అనే తేలిక‌భావంతోనే వార్ని త‌క్కువ‌గా చూడ‌డం జ‌రుగుతోంది. పేరుకి ఇది ఇండిపెండెంట్ ప్రొఫెష‌న్ అయ్యింది. ఎందుకుంటే వారు మ‌రో పెద్ద మ‌గ ప్లీడ‌రు వ‌ద్ద జూనియ‌ర్స్‌గా మాత్ర‌మే ఉండ‌వ‌ల్సి వ‌స్తోంది. అందుచేత వారి సీనియ‌ర్స్ ఆఫీసుల‌కి వెళ్ళి కేసు స్ట‌డీ చేసి ప్రిపేరు చేసి మ‌ళ్ళీ కోర్టుకి వెళ్ళి కొంత వ‌ర్క్ చేసి ఇంటికి వ‌చ్చి  ఇళ్ళ‌ల్లో భ‌ర్త‌కి పిల్ల‌ల‌కి కావాల్సిన‌వి స‌మ‌కూర్చ‌వ‌లసి వ‌స్తోంది. దానాదీనా మహిళా న్యాయ‌వాదుల‌కు ప‌ని ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఊపిరి స‌ల‌ప‌నియ్య‌దు. ఇక ప్ర‌భుత్వం కేటాయించిన ముప్ఫ‌యిశాతం ఉద్యోగాల నియ‌మ‌కాలు పూర్తిగా అమ‌లు కావ‌టానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగం వ‌స్తే కుటుంబం విడ‌పోవ‌ల్సి వ‌స్తుంది. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఒకే జిల్లాలో ఉంటార‌నే గ్యారంటీ ఏమీ లేదు. పిల్ల‌ల చ‌దువుల‌కు లోక‌ల్ నాన్ లోక‌ల్ రిస్ట్రిక్ష‌న్స్ ఉండ‌నే ఉన్నాయి.

ఇంక కొంత‌మంది మ‌హిళ‌లు స్టాండింగ్ కౌన్సిల్స్‌గా నియ‌మింప బ‌డ‌తారు. మునిసిప‌ల్ ప్లీడ‌ర్‌గానో, గ‌వ‌ర్న‌మెంట్ ప్లీడ‌ర్ గానో లేక బ్యాంకుల‌కు లీగ‌ల్ ఎడ్వ‌యిజ‌ర్లు గానో వుండి కొంత‌వ‌ర‌కు ప్ర‌శాంతంగా కాల‌క్షేపం చెయ్య‌గ‌లుగుతారు. ఇదీ చాలా కొద్ది మందికే ల‌భ్యం అవుతుంది.

అంతెందుకు ఇన్ని రాష్ట్రాలున్నాయి ఒక్క  రాష్ట్రానికైనా చీఫ్ జ‌స్టిస్‌గా మ‌హిళ‌ను నియమించారా ?   ఛీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియాగా ఎప్ప‌టికైనా ఏ మ‌హిళా న్యాయ‌మూర్తిని అయినా ఉన్న తాస‌నాన్ని అధిరోహించ‌గ‌ల్గుతుందా ?  ఏమో ! ఎందుకీ అనుమానం ?  ఎక్క‌డుందీ వ్య‌త్యాసానికి కీల‌కం మూల‌కం ?  కేవ‌లం స్త్రీగా పుట్ట‌డం లేనేనా ?