38
 

అతిధీ  -  అభ్యాగ‌తీ    

 

తిథి, వారం, నక్ష‌త్రం, పట్టింపులేకుండా ఎప్పుడంటే  అప్పుడు పెట్టే బేడా స‌ర్దుకుని చ‌క్కా వ‌చ్చేవాళ్ళ‌ని అతిథులంటారు. ఈ అతిథుల్నీ అభ్యాగతుల్నీ దైవంగాభావించి, పూజించి త‌రించాల‌ని హిందూ ధ‌ర్మశాస్త్రం ఘోషిస్తున్న‌ది. అభ్యాగ‌త స్వ‌యంవిష్ణుః అనిన్నీ అతిథి దేవోభ‌వ అనిన్నీ పూర్వ‌కాలంలోని వారేకాక మ‌న‌కంటె ఒక్క త‌రానికి ముందువాళ్ళుకూడా భావించేవాళ్ళు. భోజ‌నం చేసేస‌మ‌యానికి దూర తీరాల నుంచేకాక ప‌క్కింటివారైనాస‌రే వ‌స్తే దేవ‌తార్చ‌న అయ్యిందా అనో ఈపూట శాక‌పాకాలు ఏమిటి అనో ప్ర‌శ్నించి భోజ‌నం అయిందో లేదో తెల్సుకోనేవారు. వారిమొహాన బొట్టుగాని విభూతిగానీ ఉందో లేదో తిల‌కించేవారు. బొట్టు లేక‌పోతే భోజ‌నం చెయ్య‌న‌ట్టే లెక్క‌. కాళ్ళు క‌డుక్కోండి అని గృహ‌స్థు ఆ వ‌చ్చిన‌వారిని ఆహ్వానించేవారు. త‌మ కుటుంబానికి స‌రిప‌డామాత్ర‌మేకాక ఇంకోఇద్ద‌రు అనుకొకుండా వ‌చ్చినా త‌డుముకోకుండా ఉండేలాగా ఎక్కువ బియ్యంపోసి అన్నం వండే అల‌వాటు ఎంతోమందికి ఉండేది. వండ‌వ‌ల‌య‌దు వేవురు వచ్చెనేని అని ఎంత మంది వ‌చ్చినా అలుపూ సొలుపూ లేకుండా వండివార్చే స్త్రీని అన్న‌పూర్ణ‌మ్మ అనో సీత‌మ్మ‌వంటి చ‌ల్లిని త‌ల్లి అనో శ్లాఘిస్తూ ఉండేవారు.

కాలం అన్ని విష‌యాల్లోలాగే ఈ విష‌యంలోనూ మార్పుతెచ్చేసింది. ఎవ‌రైనా ముందే ఉత్త‌రం వ్రాసివ‌చ్చినా అతిథిసేవ‌లు చేసేందుకు సిద్ధంకాలేక‌పోతున్నాము. అర్థిక‌మైన ఇబ్బందులేకాక ఎన్నో ఇక్క‌ట్ల‌కు లోనుకావ‌ల్సి వ‌స్తుంది. తెల్లారిలేస్తే పాల స‌ర‌ఫ‌రా స‌రిగ్గా ఉండ‌దు. ఇంకా ఎగ‌స్ట్రా మిల్క్ సంగ‌తి స‌రేస‌రి. స‌రైన పనివారు దొర‌క‌రు. అందుకే రాకోయీ అనుకోని అతిథి అని గృహిణులు కూనిరాగాలు పాడుకోక త‌ప్పటంలేదు.

ఇలాటి బెడ‌ద‌ల‌ని త‌ట్టుకోడం వ‌ల్లెల‌లోని స్త్రీ కంటే ప‌ట్నాలలోని స్త్రీల‌కే క‌ష్టంగా ఉంటుంది. అందులో రాజ‌ధాని న‌గ‌ర‌మో ఏ పెద్దాసుప‌త్రి ఉన్న న‌గ‌ర‌మో అయితే మ‌రీను.

భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఉద్యోగాలు చెయ్య‌క‌పోతే రోజులు వెళ్ళ‌ని ప‌రిస్థితులివి. పిల్ల‌ల్ని స్కూళ్ళ‌కు త‌యారు చేయ‌డం వారికీ త‌మ‌కీ భోజ‌నాఉ సిద్ధం చేసికోడం మ‌ళ్ళీ మ‌ధ్యాహ్నానిక టిఫినో క‌ట్టుకోడం ఎనిమిదన్న‌ర య్యేస‌రికి జై తెలుగుత‌ల్లీ అంటూ బ‌స్సు కోసం వ‌డిగాపులుప‌డి ఎలాగో ఆఫీసు చేరుకొని, మ‌ళ్ళీ ఉస్సుర‌నుకొంటూ ఏ ఆరున్న‌రో ఏడో అయ్యేస‌రికి గూడుకు చేరుకొనేస‌రికి కాళ్ళు తేలిపోతూ ప్రాణం ఎక్క‌డికో ఎగిరి పోతున్నట్లు ఉంటుంది. ఇలాట‌ప్పుడు ఏ అన్న‌గారి బావ‌మ‌రిదో పిన‌తండ్రి కోడ‌లు చెల్లెలో స‌తీస‌మేతంగా వ‌చ్చి ఇంట్లో తిష్ట‌వేస్తే ఎలావుంటుందో వ‌ర్ణించ‌న‌ల‌వి కాదు.

హైకోర్టుప‌నులో, హాస్ప‌టిల్  ప‌నులో ఒక ఊరునుంచి ఇంకో ఊరికి ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకోడానికో సెక్ర‌టెరియెట్‌లో ప‌నులో అంటూ వ‌చ్చే పోయే వారికి అంతూపొంతూ ఉండ‌దు. ఆ మ‌ధ్య‌న తిరుప‌తికి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యింది. ఒక‌రికిచ అత‌ను సెల‌వుపెట్టేసి ఇంకో ఊరికి మార్పించుకోవాని ప్ర‌య‌త్నం చేశాడు. ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యేస‌రికి ఆరునెల‌లు ప‌ట్టింది.

మీకు తెలీదు. ద‌గ్గ‌ర‌బంధువులు, దూర‌పు బంధువులు, దగ్గ‌ర స్నేహితులు దూరం స్నేహితులు క్యూలో నిల‌బ‌డ‌తారు. వారంద‌రికీ అతిథి మ‌ర్యాద‌లు చేయ‌డం నా త‌రంకాదు. ఏదో మ‌నం తిన్న‌ట్లే ప‌ప్పు ప‌చ్చ‌డితో భోజనం పెడితే తృప్తిప‌డి వెళ్ళ‌రు. వెన‌కాల అదనీ ఇద‌నీ పెళ్ళానికి వంటింట్లో సాయ‌ప‌డే ఆడంగివాడ‌నీ పంగ‌నామాలు పెడ‌తారు. పిల్లాజెల్లాతో దిగి ఇంటిని ప‌శువుల దొడ్డిలా చేస్తారు. ఇదీ అత‌నిబాధ‌. మ‌రి మ‌నం ఇంకొక‌రింటికి వెళ్ళిన‌ప్పుడు వాళ్ళూ మ‌నలాగే బాధ‌ప‌డుతూ అంటే అత‌నుమాత్రం అతి ద‌గ్గ‌ర ర‌క్త‌సంబంధీకుల ఇంట్లో అయితేనే దిగుతాడుట‌. లేకుంటే ఏ హోట‌ల్లోనో బ‌స‌చేస్తాడుట‌కాని ఇలా స్నేహితుల బంధువుల‌...బందువుల స్నేమ‌హితుల‌...ఇళ్ళ‌ల్లో దిగ‌డ‌ట‌.

ఇప్పుడే ఉత్త‌రం వ‌చ్చింది. ఓ దూర‌పు బందువుల కుటుంబం వేసంగి సెల‌వుల్లో రాజ‌ధానీ న‌గ‌రంలోని ముఖ్య‌ప్ర‌దేశాల‌న్నీ చూచివెళ్ళాల‌ని పిల్ల‌లు మారంచేస్తుంటే అనుకుంటున్నారట‌. మా ఇంట్లో దిగ‌క పోతే నేను మ‌హాఇద‌యిపోతాన‌ని ఇక్క‌డే దిగ‌డానికి నిర్ణయించుకొన్నారుట‌. మీరు త‌ప్ప‌కుండా రండి. మ‌ళ్ళీ రెండు రోజుల్లో తిరుగుప్ర‌యాణం పెట్టుకోవ‌ల్సి ఉంటుంది. ఈ రెండురోజుల‌కే త్రాగేటందుకు ఓ పెద్ద ప్లాస్టిక్ డ్ర‌మ్ముతో నీళ్ళు తెచ్చుకోండి. స్నానాలు చేసేందుకు ఎలాగా వీలులేదు క‌నుక మొహాలైనా క‌డుక్కోడానికి ఓ బ‌క్కెట్ నీళ్లు నేను ఎలాగోలాగ తంటాలు ప‌డి సంపాదిస్తాను. ఇక పిన్నిగారి మ‌ళ్ళూ, స్నానాలూ కుద‌ర‌వ‌ని కూడా చెప్పండి ఇక్క‌డి నీటి ప‌రిస్థితిని మీరు పేప‌ర్ల‌లో చూడ‌టం లేదా అని వెంట‌నే జాబు వ్రాసి ప‌డేశాను.

హిందూధ‌ర్మ‌మూ భార‌తీయ సంస్కృతీ విటిన్నిటికీ నీ జాబు తిలోద‌కాలు ఇస్తున్నద‌ని ముక్కుమీద వ్రేళ్ళేసుకోండి. కాలంతో పాటే మ‌న‌మూను. ఇప్ప‌టి ప‌రిస్థితుల్ని బ‌ట్టి ఒక్క మ‌నిషిని కూడా భ‌రించ‌లేక‌పోతున్నాం. ఇలా అన్నాన‌ని బంధువులు రాకూడ‌దు అని బోర్డు ఇంటిముందు త‌గిలించాన‌నుకోండి నా బాధ‌ల్లా బీర‌కాయ పీచువంటి బంధువులు, స్నేహితులు మొద‌లైన‌వారి గురించే.