43
 

మాకూ కొంత కేటాయింపు

 

ఈ మ‌ధ్యే ఎన్నిక‌ల భార‌తం పూర్తియ్యింది. టి.విల్లోనూ పేప‌ర్ల‌లోనూ ఓట‌ర్ల సంఖ్య ప్ర‌ముఖంగా క‌న్పించేది. అందులో ఆక‌ర్ష‌ణీయంగా ఉన్న విష‌యం ఒకటుంది.  ఏ కాన్‌స్టిట్యుయోన్సీలో చూసినా మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య ఇంచుమించు పురుషుల‌తో స‌మానంగా ఉండ‌టం ! కొన్ని కొన్ని చోట్ల‌లో కొంత స్త్రీల సంఖ్యే అధికంగానూ వుంది. కానీఎన్నికైన పురుషులెంద‌రు ?  మ‌హిళా మ‌ణులెంద‌రు ?  ఓట‌ర్ల సంఖ్య‌లో స‌మానంగా ఉన్న మ‌హిళ‌లు పాల‌నాయంత్రాగంలో ఎంత‌శాతం ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు ?  ఈ విష‌యాల‌కోసం పాత‌పేప‌ర్ల తిర‌గ‌వెయ్య‌క్క‌ర్లేదు. చుక్క‌ల్లో చంద్రుడు లాగా మ‌న‌మంత్రిణిగారు ద‌ర్శ‌న‌మిస్తూనే వున్నారుగ‌దా ?

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే స్త్రీలూ, పురుషులూ దేశంలో కాస్త అటూ ఇటూగా స‌మానంగానే ఉన్నా, అక్ష‌రాస్య‌త‌లోగాని, ఉద్యోగాలు చేయ‌డంలోగాని, ఈ సంఖ్య‌లో ఎంతో బేధం కొట్టొచ్చిన‌ట్లుగా క‌న్పిస్తూనే వుంది. భార‌త‌దేశంలో అఓరాస్యులైన మ‌హిళ‌లు కేవ‌లం ప‌ద‌మూడు శాతం పురుషులు ముప్పైనాలుగు నుండి న‌ల‌భై శాతం వ‌ర‌కూ వుంటారు. ఈ లెక్క కేవ‌లం ఓ మాదిరి...అంటే హైస్కూలు చ‌దువువ‌ర‌కే ప‌రిమితం ! ఇక గ్రాడ్యుయేష‌నో పోస్ట్ గ్రాడ్య‌యేష‌నో పూర్తిచేసిన‌వారి సంఖ్య మ‌రింత దిగ‌జారే వుంది, టెక్నిక‌ల్ సైంటిఫిక్, రిసెర్చ్ విష‌యం ఆ పెరుమాళ్ళ‌కే ఎరుక ! చాలామంది అనుకుంటారు. ఎక్క‌డ చూసినా ఆడ‌వాళ్ళే, ఐ.ఏ.ఎస్‌. ఐ.పి.ఎస్ ల్లో కూడా సెల‌క్ట్ అవుతున్నారుగ‌దా అని నిజ‌మే సెల‌క్ట్ అవుతూనే వున్నారు. కానీ సంఖ్య‌తో పోలిస్తే ఎంత త‌క్కువ శాత‌మో ఆలోచించండి !

స్త్రీల‌కు విద్యాసంస్థ‌ల‌లోనూ, అన్ని ఉద్యోగాల లోనూ రిజ‌ర్వేష‌న్ వుంటే ప‌రిస్థితి కొంత మెరుగ‌వుతుంది. కొంత శాతం సీట్లు మ‌హిళ‌ల కోసం కేటాయిస్తే మంచిది !  కొంత‌కాలం త‌రువాత వాళ్ళ ప్ర‌తిభ‌వాళ్ళే చూపించుకో గ‌ల్గుతారు !

అన్నిరంగాల్లోనూ స్త్రీలు త‌మ‌శ‌క్తిని నిరూపిస్తూనే ఉన్నారు. కాని సంఖ్య‌లో మాత్రం పురుషుల‌తో పోలిస్తే వెన‌క‌బ‌డే వున్నారు. ఎందుచేత అని ఆలోచించాలి !  ఇందుకు ఎన్నో కార‌ణాలు ఉన్నాయి. అబ్బాయికైతే వేలు, ల‌క్ష‌లు డొనేష‌న్‌లు క‌ట్టి చ‌దివించే త‌ల్లిదండ్రులు అమ్మాయిల చ‌దువుక‌న్నా వ‌రుల న‌న్వేషించ‌డంలోనే శ్ర‌ద్ధ చూసిస్తారు. అంతెందుకు ప్ర‌త్యేకంగా బాలిక‌ల‌కు ప‌బ్లిక్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి ?

కొన్ని విష‌యాల్లో ఓర‌కంగా స్త్రీలు వెనుక‌బ‌డే ఉన్నార‌న్న‌ది న‌గ్న‌స‌త్యం మ‌న‌న్ని వెన‌క‌బ‌డిన జాతిగా గుర్తిస్తే బాగుండున‌ని వాపోయే యువ‌తుల్ని చూస్తే హృద‌యం ద్ర‌విస్తుంది.

రిజ‌ర్వేష‌న్ రాజ్యాంగ బ‌ద్ద‌మే. వీటిని ఏ కోర్టూ నిషేధించ‌డానికి వీలులేదు. స్త్రీల‌కు విద్యావ‌కాశం క‌ల్పిస్తూ ఉద్యోగావ‌కాశం క‌ల్పిస్తూ రాజ్యాంగం ఆర్టిక‌ల్ 15 (3) లో కొన్ని కేటాయింపులు చేసిన విష‌యం కేవ‌లం గ్రంథానికి ప‌రిమితం కాకూడ‌దు.

స్త్రీల‌కు రిజ‌ర్వేష‌న్స్ ఉన్నా ప్ర‌భుత్వం గానీ ప్రైవేటు సంస్థ‌లుగాని ఎలా అమ‌లుచేస్తున్నాయో ?  అన్న విష‌యాన్ని జాగ్ర‌త్త‌గా మ‌న్నించాలి ! ఎక్క‌డైనా అన్యాయం జ‌రిగిన‌ట్లుగా అన్పిస్తే న్యాయంకోసం మ‌నం ఘ‌టితంగా పోరాడాలి !

ఈ రిజ‌ర్వేష‌న్లు అనేమాట‌లో ఆడ‌వారు మగ‌వారికంటే త‌క్కువ నైపుణ్యం గ‌ల‌వాఉ క‌నుక‌నే కొంద‌రు లేవ‌దీయ‌వ‌చ్చు.  ఇది పూర్తిగా అబ‌ద్ధ‌మ‌ని కొన్ని రంగాల్లో ఉన్న‌త స్థానాల్లో ఉన్న మ‌హిళ‌లు నిరూపిస్తూనే ఉన్నారు. మ‌హిళ‌ల సామ‌ర్థ్యాన్ని నిరూపించుకునేందుకు ఇచ్చేచిన్న అవ‌కాశ‌మే ఈ కేటాయింపు.

స్త్రీల కెంత మేధాశక్తి, ఉన్నా శంక‌రాచార్యుల‌వంటి జ‌గ‌ద్గురువును వాదంలో ఒక స్త్రీ ఒడించ‌గల్గింద‌ని మ‌నం ఎంత చెప్పుకున్నా పురుషుల‌తో స‌మంగా బ‌య‌ట‌కొచ్చి త‌మ శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను బ‌హిర్గ‌తం చేయ‌గ‌ల అవ‌కాశం కొద్ది మంది మ‌హిళ‌ల‌కే ద‌క్కింది. ఇందుకు గృహ‌వాతావ‌ర‌ణ‌మూ, సంప్ర‌దాయ‌మూ, రాజ‌కీయ‌మూ కూడా కార‌ణాలే.

మ‌హ్మ‌మ‌దీయ దండ‌యాత్ర‌ల తరువాత దేశంలో కల్గిన అనేక‌మైన మార్పుల్లో ఒక‌టి స్త్రీలు మ‌రింత‌గా అసూర్య ప‌శ్యంలుగా ఉండిపోవ‌ల్సిరావ‌టం ! సాంఘిక మ‌ర్యాదల‌లో కూడా వారి స్థాయి క్ర‌మంగా స‌న్న‌గిల్లుతూ వ‌చ్చింది. వారి శారీర‌క ర‌క్ష‌ణే వారికి బ‌హుదుర్ల‌భ‌మైపోగా వంటింటికే అంటుకుపోక త‌ప్ప‌లేదు.

ఈ నాటికి ప‌రిస్థితిల్లో చాలా మార్పు సంభ‌వించింది. అవ‌కాశాలు చాలా మెరుగైనాయి బండ‌బారిన క‌త్తిలాగా ఉన్న మ‌హిళ‌ల మేధ‌కు మ‌ళ్ళీ ప‌దును పెట్ట‌క త‌ప్ప‌దు ! వ‌జ్రానికైనా సాన‌పెట్టాల్సిందే. అంత‌ర్గ‌తంగా వున్న స్త్రీ శ‌క్తిని మేల్కొల్పాల్సిన అవ‌శ్య‌త ప్ర‌బ‌లంగా ఉంది ! ఈ రిజ‌ర్వేష‌న్ అంటే ప‌రోక్షంగా మ‌హిళ‌ల‌ని జాగృతం చేయ‌డానికి ఆల‌పించే మేలుకొలుపు గీతం అనుకుంటే బాగుంటుంది.

కొన్ని సీట్లు మ‌హిళ‌ల‌కి కేటాయించే సంద‌ర్భంలో మెరిట్‌లోగాని ఎఫిషియన్సీ ద‌గ్గ‌ర గానీ రాజీ ప‌డ‌మ‌ని ఎవ్వ‌రూ అన‌డంలేదు. కాక‌పోతే మ‌గవారితో స‌మానంగా కాంపిటీష‌న్‌లో పాల్గొన‌డానికి ఈ రిజ‌ర్వేష‌న్స్ ఎంతో ఉప‌క‌రిస్తాయి !

బ‌స్సుల‌లో స్త్రీల‌కు ఏ అయిదారు సీటో, సినిమా హాళ్ళ‌ల్లోనూ రేష‌న్ షాపుల ద‌గ్గ‌రా ప్ర‌త్యేక క్యూ సిస్ట‌మ్‌తోనో స్త్రీలు సంతృప్తిప‌డి పోరు. అన్నిర‌కాల విద్యా సంస్థ‌ల‌లోను అన్ని రకాల ఉద్యోగాల్లోను కొంత‌కేటాయింపు త‌ప్ప‌ని స‌రిగా వుండాలి ! ఆర‌కంగా ఉన్న రూల్స్ ని అమ‌లు జరిగేలా చూడాలి !

ఏ అమ్మాయికైనా సైంటిస్ట్‌గానో డాక్ట‌ర్‌గానో ఇంజ‌నీర్‌గానో రాణించాల‌నే అభిలాష ఉన్న‌ట్ల‌యితే తల్లిదండ్రులూ అన్న‌దమ్ములూ ఆపాప‌ని నిరుత్సాహ ప‌ర‌చ‌కుండా ప్రోత్స‌హించాలి !  వివాహ‌మైనాక కూడా విద్యాభిలాష ఉన్న స్త్రీకి  భ‌ర్త తోడ్పాటు వుంటే పూల‌తీగెకు పందిరి వేసిన‌ట్లే !

మ‌హిళ‌ల అభివృద్ధితోగానీ, దేశాభివృద్ది పరిపూర్ణం కాదు.