56
 

‘స్వ‌యం ర‌క్ష‌

అన్ని రంగాలలోనూ పురోభివృద్ధి సాధించుకుంటున్న  స్త్రీలు త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌డంలో కొంత నిర్ల‌క్ష్య‌భావం వ‌హిస్తున్నార‌న‌డంలో త‌ప్పులేదు.

క‌ట్నం చాల‌లేద‌ని, క‌ట్టుకున్న భ‌ర్త పీక నులిమేసినా, ఒంటినిండా కిరోసిన్ పోసి అగ్గిపుల్ల గీసి అంటించినా కిక్కురుమ‌న‌కుండా కొంద‌రు అబ‌ల‌లు ఆహుతైపోతే ఒళ్ళుకొవ్వెక్కిన జాల‌యివెధ‌వ‌ల కామానికి బ‌లైపోతున్నారు మ‌రికొంద‌రు అభాగినులు.

మ‌నుష్యులు ఈసురోమ‌న్న‌ట్లుగా ఉంటే దేశం ఎలా బాగుపడుతుంది అని వ‌గ‌చారు గురజాడ ఈనాడు స్కూళ్ళ‌కి, కాలేజీల‌కీ వెళ్ళె ఆడపిల్లల్ని చూస్తుంటే గుండె త‌రుక్కుపోతుంది. గాలికి అల్ల‌ల్లాడిపోయే ఉల్లిపొర బ‌ట్టల్నిసైతం మోయ‌లేన‌ట్లుగా ఒంగిపోయి, తాటాకుబొమ్మ‌ల్లా రెప‌రెప‌లాడి పోతూంటారు. వేళ‌కీ చ‌క్క‌ని పుష్టిక‌ర‌మైన ఆహారాన్ని తిన‌టం వాళ్ళ‌కి నామోషీ ఏదో  రెండు మెతుకులుగ‌తికి గ‌బ‌గ‌బా హైరాన ప‌డుకుంటూ న‌డిచో, బ‌స్సెక్కో  కాలేజీల‌కి పోతారు. మ‌ళ్ళీ సాయంత్రం ఈసురోమంటూ గూళ్ళ‌కి చేరుకుని పుస్త‌కాలోమూల‌కీ, చెప్పులోమూల‌కీ విసిరికొట్టి మంచానికి అడ్డంగాప‌డ‌తారు. వాళ్ళ‌ని లేసి ఏ హార్లిక్సో పట్టించాలంలే నానా యాత‌నా ప‌డాల్సిందే.

మ‌రి కొంద‌రికి ఏ ట్యూష‌నో ఏ సంగీతం క్లాసో ఉంటుంది, శ‌రీరాన్ని బ‌ల‌వంతాన అక్క‌డికి తోసుకెళ‌తారు. కాళ్ళు న‌డ‌వ‌మ‌ని మొరాయిస్తున్నాస‌రే.

ఈనాడు మ‌నం తినేవ‌న్నీ క‌ల్తీప‌దార్థాలే. డాక్ట‌ర్లే స్వ‌యంగా ద్రాక్ష‌మొద‌లైన పండ్లని  తినొద్ద‌ని సెల‌విస్తున్నారు. ఎందుకంటే ఆ ప‌ళ్ళ‌ల్లో (మ‌నం తినే ఆకు, కాయ‌కూర‌ల్లో కూడా ) విటమిన్స్ కంటే క్రిమిసంహార‌క మందుల ప‌రిమాణ‌శాతం హెచ్చుగా ఉంటోందిట‌.

అమ్మాయివెంట ప‌డే అబ్బాయిల‌కి గుణపాఠం చెప్పాల‌న్నా, క‌ట్నం కోసం హ‌త్య‌లు చేసే అత్త‌ల ఆర‌డినిక‌ట్ట‌డి చేయాల‌న్నా ఒంట‌రిగా వచ్చే స్త్రీని ఎత్తుకుపోయి మాన‌భంగం చేయ‌డ‌మో, బ్రోత‌ల్ హౌసుల‌కు అమ్మ‌ట‌మో వృత్తిగా చేప‌ట్టిన సంఘ‌విద్రోహుల నెదుర్కోవాల‌న్నా అతివ‌లు విధిగా శ‌రీర వ్యాయామం చేసి తీరాలి. ఆడ‌వారి శ‌రీర నిర్మాణానికి వ్యాయామం హానిక‌రం అని కొంద‌రు పెద్ద వాళ్ళు భ‌య‌ప‌డ‌తారు. అది త‌ప్పు. ప్ర‌వీణులైన వారి స‌లహాలు తీసుకుని ఎవ‌రికి ఏ ఎక్స‌ర్‌సైజ్ స‌రైన‌దో నిర్ణ‌యించుకుని అలాచేస్తే చాలామంది ఆరోగ్యం ఎంతో బాగు ప‌డుతుంది. వ్యాయ‌మం చేయ‌క‌పోతే మిగ‌తా స‌బ్జ‌క్టుల్లో మార్కులు త‌గ్గించే సాఠ‌శాల‌ను చూడ‌టం జ‌రిగింది.

బాలిక‌ల‌ను కానీ, యువ‌తుల‌కు కానీ వ్యాయామం విధిగా నేర్పే స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి క్రీడ‌ల‌కి అవ‌కాశం క‌లుగ‌చేసే మ‌హిళా క‌ళాశాల‌లు ఎన్ని ఉన్నాయి. ఐచ్చికంగా స్త్రీలు వ్యాయామం, ఆస‌నాలు నేర్చుకోవాలంటే ఎన్ని వ‌సతులు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయి ?  అని పలుచోట్ల విచారించాను. ఈ విచార‌ణ‌లో తేలిందేమంటే మ‌గ పిల్ల‌ల‌కే ఈ అవ‌కాశాలు నూటికి న‌ల‌భై శాతం మాత్ర‌మే ఉన్నాయి. ఇక ఆడ‌పిల్ల‌ల‌కి ప‌ది శాతం ఉంటే అక్క‌డికి చాలా గొప్పేన‌నిపించింది.

స్త్రీలు సున్నితంగా పూల‌తీగ‌ల‌వ‌లె సుకుమారంగా ఉంటార‌ని క‌వుల వ‌ర్ణ‌న‌. సౌక‌మార్యం వేరు, దుర్భ‌లంగా ఉండ‌టం వేరు. ఆరోగ్యంగా బ‌లంగా ఉన్న స్త్రీలు సుకుమారుని కాకుండా పోరు. త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు త‌గినంత శ‌క్తి యుక్తుల‌ను పొంది ఉండాల‌ని ప్ర‌తి మ‌హిళా కోరుకోవాల్సిందే.

చాలామంది స్త్రీలు నేడు అనేకంగా పాఠ‌శాల‌ల‌ను న‌డుపుతున్నారు. కిరాణా షాపుల్లాగా ఐదారు గ‌దులుంటే చాలు అక్క‌డ ఓ స్కూలు వెలుస్తోంది.

అధికారులు అనుమతిస్తున్నారు. అలాగ కాకుండా బాల‌బాలిక‌ల‌న‌క స్కూల్లో తగినంత ప్లేగ్రౌండ్ లేక‌పోతే స్కూలు పెట్ట‌డానికి ప‌ర్మిష‌న్ ఇయ్య‌కుండా వుంటే బాగుంటుంది. చిన్న‌త‌నంనుంచీ రోజుకీ క‌నీసం ఒక్క గంటైనా డ్రిల్లో, ఆట‌లో పెడ్తే మాన‌సిక శారీర‌క అభివృధ్ధికి కార‌ణ‌మై ఉల్లాసం కల్గిస్తుంది. ఇలా చిన్న‌నాటినుంచీ అల‌వాటైతే వారి శ‌రీరం ధృడంగా ఉండి ఆక్ర‌మాల‌ను ఆరాచ‌కాల‌ను చాలా వ‌ర‌కు అరిక‌ట్ట గ‌లుగుతారు.

నారీ స్వ‌యం ర‌క్ష దేశానికి సుర‌క్ష అనే ప్రాతిప‌దిక మ‌న జీవ‌నంలో చోటు చేసుకోవాలి. అట్టే ఆలోచిస్తే ఉక్కున‌రాలు పురుషుల‌కన్నా స్త్రీలకే ఎక్కువ అవ‌స‌రం అన్పిస్తోంది. శారీర‌క ఆరోగ్యం ముఖ్యంగా మూడు విష‌యాల‌మీద ఆధార‌ప‌డి ఉన్న‌ద‌ని పైచ‌ర్య వ‌ల్ల తెల్ల‌మౌతుంది. ఒక‌టి చ‌క్క‌టి ఆహారాన్ని తిన‌టం. తినే ప‌దార్థాల్లో కల్తీ లేకుండా చూసుకోడం తిన్న ఆహారం ఒంట‌ప‌ట్టేలాగా యోగాస‌నాలో వ్యాయ‌మ‌మో చేసి శ‌రీరాన్ని మ‌న‌స్సునీ క్ర‌మ‌శిక్ష‌ణ‌లో ఉంచ‌డం. ఇలాజరిగిన‌పుడు స్త్రీలు ర‌క్ష‌కోసం ఎదురుచూడ‌క్క‌ర‌లేదు.

కాలంమారుతోంది. ఎప్ప‌టిక‌ప్ప‌డు మారి పోతూనే ఉంటుంది. ఆడ‌వాళ్ళు అసూర్యంప‌శ్య‌లుగా ఇళ్ళ‌ల్లోనే ఉండి పాలిపోడం లేదు. వీధుల్లోకివచ్చి త‌మ జీవితాన్ని తామే చ‌క్క‌జేసుకునేలాగ అనేక వృత్తుల్ని చేప‌డుతున్నారు. అబ‌ల అనే ప‌దం స్త్రీకి ప‌ర్యాయం కాకుండా చేయ‌డానికి నేటియువ‌తులు ప్ర‌తిన బూనాలి.