2
 

జ‌య‌ఘోష‌

ఆనాడు బుధ‌వారం. విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయ‌ణ చేద్దాం రండి అంటూ బంధుమిత్రులంద‌రినీ ఆహ్వానించింది జ‌యంతి. బుధ‌వారం విష్ణుస‌హస్రంతో శుక్ర‌వారం ల‌లితా స‌హస్రంతో మారు మ్రోగిపోవ‌డం ఆ ప‌రిస‌రాల‌కు అల‌వాటే. అంటే చ‌రాచ‌ర ప్ర‌కృతి అంతా ఆ శుభ నామ పారాయ‌ణ‌ల‌తో ప‌రిపూత‌మై పోతోంద‌న్న‌మాట ప‌ర‌మ‌స‌త్యం !

విష్ణు స‌హ‌స్రం పూర్తిచేశారు. సుమారు న‌ల‌భై యాభైమందిదాక అత్యుత్సాహంతో, భ‌క్తిప్ర‌ప‌త్తుల‌తో ఉచ్ఛైస్వ‌రాల‌తో నామ గానం చేశారు. ఇంక పూజ పూర్త‌యిన‌ట్లే, హార‌తి యిచ్చేందుకు శాస్త్రిగారు సంసిద్ధులౌతుండ‌గా జ‌యంతి మ‌ధ‌ర స్వ‌రంతో అమ్మవారిని కీర్తించ‌డం మొద‌లుపెట్టింది.

త్రిలోకీ సౌంద‌ర్యార్ణ‌వ మ‌ద‌న జనిత సుధా... ఆ పైన ఆమె గొంతు మూగ‌బోయింది. క‌నులు మూసుకుంది. అంద‌రూ నిశ్శ‌బ్దంగా చూస్తున్నారు. జ‌యంతిలో చ‌ల‌నం లేదు. బ‌హుశా యిదేనేమో స‌మాధిస్థితి అంటే అనుకున్నారు శాస్త్రిగారు, మ‌రికొంద‌రు పెద్ద‌లు. జ‌యంతికి కాలూ చెయ్యీ ఆడ‌టంలేదు. ఏం చెయ్యాలి అంటూ జ‌యంతి ద‌గ్గ‌ర‌గా వెళ్ళి ఇవ‌త‌ల‌కి రావ‌డం చేస్తోంది.

ఒక ముత్తైదువ వెళ్ళి జ‌యంతి పాదాల‌కు న‌మ‌స్కారం చేయ‌బోగా అంద‌రూ ఆమె ద‌గ్గ‌ర మూగ‌డం చూపి శాస్త్రిగారు యుక్తిగా అంద‌ర్నీ కూర్చోబెట్టి ల‌లితా స‌హస్ర‌నామార్చ‌న ప్రారంభించారు. అర్చ‌న జ‌రుగుతున్నా అంద‌రి క‌ళ్ళూ జ‌యంతి మీద‌నే. ఏదో అద్భుత దృశ్యం మ‌ర‌ల తిరిగి రాద‌న్న భ‌యంతో వారి క‌ళ్ళ‌నామెకు అంటించేశారు. ధ‌న్యుల‌మైనామ‌న్న తృప్తి వారిలో ద్యోత‌క‌మౌతోంది.

అర్చ‌న పూర్తి అయ్యింది.
జ‌యంతీ మంగ‌ళాకాళీ భ‌ద్ర‌కాళీ క‌పాలినీ
దుర్గాశివాక్ష‌మాధాత్రీ స్వాహా స్వ‌ధా న‌మోస్తుతే !!

అంటూ జ‌యంతి ద‌గ్గ‌ర‌గా వెళ్ళి గొంతెత్తి ముమ్మారు దేవీస్మ‌ర‌ణ చేశారు శాస్త్రిగారు. అమ్మ‌వారికి జేగంట‌ల‌తో హార‌తిచ్చారు. అంద‌రిచేతా జ‌య‌ఘోష చేయించారు. జ‌యంతి మెల్ల‌గా క‌నులు తెరిచింది. శాస్త్రిగారు త‌న‌కి హార‌తిస్తున్నారేమిటి అని సిగ్గుప‌డి దిగ్గున లేవ‌బోయింది. కూర్చో త‌ల్లీ...కూర్చో అంటూ జ‌యతి భుజం పట్టి ఆపింది. అంద‌రూ ఆమెకు న‌మ‌స్కారాలు చేయ‌బోతుంటే సున్నితంగా తిర‌స్క‌రించింది. అంద‌రికీ బొట్టుపెట్టి తాంబూలాలు యిచ్చింది. మ‌హాభాగ్యంగా స్వ‌యంగా అమ్మ‌వారి నుండి అర‌టి ప‌ళ్ళు తీసుకుంటున్నంత ఆనందంతో స్వీక‌రించి అంద‌రూ ఇళ్ళ‌కు వెళ్ళిపోయారు. లోప‌లిగ‌దిలో జ‌యంతి మౌనంగా సోఫాలో కూర్చొని వుంది. ఇంకా ఆమె ప‌ర ధ్యానంలో వున్న‌ట్లే వుంది. పెద‌వులు మాత్రం స‌న్న‌గా క‌దుల్తున్నాయి. క‌నులు అర‌మోడ్పులు. అమ్మమ్మ మాట్లాడ‌కుండా అలా ఉండ‌టం హంసికి న‌చ్చ‌లేదు. జ‌యతి కూడా దూరంగా కూర్చుని జ‌యంతినే చూస్తోంది. హంసి చ‌టుక్కున జ‌యంతి ఒళ్ళో ప‌డుకుని నడుంచుట్టూ చేయివేసి గారంగా అమ్మ‌మ్మా అంది. జ‌య‌తి మంద‌లించింది. హంసీ అమ్మ‌మ్మ‌నిప్పుడు క‌దిలించ‌కు అంది.

జ‌యంతి ఆర‌మోడ్పు క‌నుల‌తో హంసిని చూస్తూ స‌న్న‌గా పాట‌పాడ‌టం మొద‌లు పెట్టింది. ఆ పాటేమిటో, ఆ పాట‌లోని ప‌దాలేమిటో తెలీటంలేదు. అదేమి రాగ‌మో, అది ప‌ద‌మో, శ్లోక‌మో ఏమీ అర్థం కావ‌టంలేదు. అదొక క‌ల‌వ‌రింత‌టాగ అస్ప‌ష్టంగా వుంది. రెండు మూడు క్ష‌ణాలైనాక జ‌య‌తి అనుకొంది అవును, ఇది హంసానంది రాగం అని. చిన్న‌ప్పుడు ద‌క్షిణామూర్తిగారి దగ్గ‌ర తామిద్ద‌రూ సంగీతం నేర్చుకునేట‌ప్పుడు త‌న‌కి గాత్రం అంత బాగుండ‌ద‌ని వాయులీనం నేర్చి జ‌యంతి గొంతులో అమృతం స్ర‌విస్తుంది అంటూ జ‌యంతికి గాత్రం నేర్పేవారు. అంటే ఆనాడు ద‌క్షిణామూర్తి పంతులు గారికి నా చెల్లెలు ఇంత ఉన్న‌తురాలు అవుతుంద‌ని తెలుసా ? జ‌య‌తి ఆశ్చ‌ర్యంగా జ‌యంతి పాడే పాట‌లోని మాట‌ల‌ను అర్థం చేసుకోడానికి ప్ర‌య‌త్నిస్తోంది.

ఈస‌రికి జ‌యంతి అటు ఆ ప‌రాలోకం లోంచి ఇటు ఈ ఇహ‌లోకం లోకి ఊయ‌ల లూగి ఊగి త‌న ఒడిలో వున్న హింసి త‌ల‌ను నిమురుతూ ఉన్న త‌న‌ను తాను నిలువ‌రించుకోడంలో కృత‌కృత్యురాలైంది. కానీ భావావేశంగానీ, భ‌క్త్యావేశంగానీ ఇంకా నింగివిడ‌చినేల‌కు రావ‌డానికి కిచ్చ‌గిస్తున్న‌ట్లు లేదు. క్ష‌ణం క్రితం మెరుపుల మొల‌కై ద‌ర్మ‌న‌మిచ్చి మ‌ర‌లిపోతున్న ఆ రాజ‌రాజేశ్వ‌రీ అమ్మ‌వార‌కై ఆర్తి అంత‌రించ‌లేదు. క‌నులు వ‌ర్షిస్తూనే వున్నాయి. హంసికి పాట‌లోని భావం అర్ధం అవుతోంది.

క‌రుణించ‌వే జ‌న‌ని క‌రుణించ‌వే
క‌రుణించి క‌నులార క‌నుపించ‌వే ||జ‌న‌నీ||
యుగ‌యుగ‌ము లెన్నిటినో క‌రిగించినాను
జ‌న్మ‌జ‌న్మ‌ల‌ను వెనుక కంపించినాను
నిన్నునే చూడాల‌నీ
నీ చూపు నా పైన వాలాల‌నీ ||జ‌న‌నీ||

ఏలాగ పూజిస్తే నువు సంత‌సిస్తావో
ఏలాగ నీ ద‌య‌ను నే పొంద‌గ‌ల‌నో
ఎపుడైన క్ష‌ణ‌మైన క‌నిపించి నావంటె
ఏ వ‌ర‌ము కోరాలో చెవిలోన చెప్ప‌వే ||జ‌న‌నీ||

నీ ఒడిని న‌ను చేర్చి లాలింతు కుంటావో
నాఒడిని బాల‌వై ఆడుకుంటావో
కాంక్ష‌లేమీ లేవు ఉన్నదొక‌టే త‌ప‌న‌
అనుక్ష‌ణ‌ము నిను కొల‌చు మంత్రమొక్క‌టి
నా చెవిలో ఊద‌వే ||జ‌న‌నీ||

జ‌యంతి క‌నుల లోంచి ధారాపాతంగా జాలువారే ఆశ్రుక‌ణాలు ఒళ్ళోప‌డుకున్న హంసి మోమును త‌డిపూస్తున్నాయి. తెలిసీ తెలియ‌ని భావోద్వోగం ఏదో హంసిని కూడా త‌ల‌క్రిందులు చేస్తుండ‌గా హంసి కూడా క‌న్నీరు మున్నీరౌతోంది. అ ఇద్ద‌ర్నీ చూసి జ‌య‌తి క‌నులు కూడా ఆర్ధ్ర‌మైనాయి. ఆమెకు చెల్లిలి భ‌క్తి ప్ర‌ప‌త్తులు గురించి తెలుసును గానీ క‌నులారా చూసే ఈ దృశ్యం ఆమె క‌ర్థం కాకుండా ఉంది. జ‌యంతి గొంతు గాద్గ‌దిక‌మై చిన్న ద‌గ్గు వ‌చ్చింది. హంసి లేచి జ‌యంతి గొంతు ద‌గ్గ‌ర రాచి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. జ‌యంతి హంసిని చూసి నొచ్చుకుంది. నిన్ను చూసుకోలేదురా త‌ల్లీ, నా మొహం నా క‌న్నీళ్ల‌తో త‌డిసి పోయిందిక‌దూ !

అమ్మ‌మ్మా ! ఇవ్వాళ్ళ నేనెంతో అదృష్ట‌వంతురాలిని. కాదు నిజంగా ధ‌న్య‌రాలినైనాను. నా జీవితంలో ఈ రోజును గురించి సువ‌ర్ణాక్ష‌రాల‌తో రాసుకుంటాను. నేను పెద్ద‌య్యినాక రాయ‌డం బాగా నేర్చుకుని నా పుస్త‌క‌మంతా నీ గురించే రాస్తాను. ఇంకా ఇంకా నీ గురించి తెలుసుకోవాలంటే నీతో ఇంకా ఇంకా సంచ‌రించి నిన్ను గురించి నేను అర్థం చేసుకోవాలి ! ఇంత‌కీ అమ్మ‌మ్మా నాకు నువ్వేమీ అర్థం కావ‌టం లేదు. ఇప్పుడేమో ప‌ర‌మ‌భ‌క్తురాలిగా క‌న్పిస్తున్నావు. అమ్మ‌వారికి ప‌ర‌మ‌దాసాను దాసురాలిగా క‌న్పిస్తున్నావు. వేదాలూ ఉప‌నిష‌త్తులూ చెప్పేట‌ప్పుడు జ్ఞానిలాగ క‌న్పిస్తావు. కీస‌రిగుట్ట‌లో అభిషేకాలు, యాద‌గిరిగుట్ట‌లో య‌జ్ఞాలు చేయించేట‌ప్పుడు క‌ర్మ‌కాండ‌ల‌కి ప్రాధాన్యం ఇచ్చేదానిలాగ క‌న్పిస్తావు. ఇంత‌కీ నీ మార్గం ఏమిటి ? భ‌క్తా ? జ్ఞాన‌మా ! క‌ర్మా ! యాగ‌మా ? హంసి అడిగిన ప్ర‌శ్న‌కి జ‌యంతి ఏం స‌మాధానం చెప్తుందోన‌ని జ‌య‌తి కూడా ఆత్రంగా ఎదురు చూస్తోంది.

జ‌యంతి న‌వ్వింది. జ‌యంతి న‌వ్వును చూడాలంటే హంసికి చాలా ఇష్టం. జ‌యంతి పెద్ద‌గా సౌంద‌ర్య‌వ‌తి కాకపోయినా త్రిభువ‌నైక సౌంద‌ర్య‌రాజి అయిన ఆ త్రిపుర‌సుంద‌రీ భావ‌న చేస్తున్నందునో ఏమో ఆమె క‌నుల‌లో ఆమె ద‌ర‌హాసంలో, ఆమె మోములో ఏదో ఒక వింత వెలుగు త‌ళుకుమ‌నే తార‌లాగా మెరిసిపోయే ఆ సౌంద‌ర్య‌వీచిక‌ను త‌న క‌నుల కెమేరాలో బంధించాల‌ని హంసి తాప‌త్ర‌యం - చెప్పు అమ్మ‌మ్మా నీ మార్గం ఏది ? హంసి రెట్టించింది.

పిచ్చి తల్లీ, నా మార్గం ఏదో నాకే తెలియ‌దు రా, ఇంక నీకేంచెప్ప‌ను. కానీ నా గ‌మ్యం మాత్రం నాకు తెలుసు. నా గ‌మ్య‌మేమిటో నాకు తెలుసుక‌దా ! నేను స‌త్యం అనుకున్న‌దీ నేను చ‌దివి తెలుసుకుందీ నా అనుభ‌వంలోకి వ‌చ్చిందీ నేను భావించిదీ అంద‌రికీ...నా వారంద‌రికీ తెలియ‌చెప్పాల‌న్న‌దే నా త‌ప‌న ! ఇది నా అంత‌ట నేను నిర్ణ‌యించుకుని ఆచ‌రిస్తున్న ఆశ‌యం ! ఇది త‌ప్పా ఒప్పా అనిగాని నా ప‌ద్ద‌తే స‌రైన‌ది అనిగానీ నేను నిర్ణ‌యించుకుని ఆచ‌రిస్తున్న ఆశ‌యం ! ఇది త‌ప్పా ఒప్పా అనిగాని నా ప‌ద్ద‌తే స‌రైన‌ది అనిగానీ నేనే పెద్ద తెలిసిన దానిని కానీ కాదు. ఇది కూడా ఒక ప‌ద్ధ‌తి. ఆ ప‌ర‌మాత్మ నిలా పిపీలికాది బ్రహ్మ‌ప‌ర్యంతం చూస్తూ ఆనందించే ప‌ద్ధ‌తి ! నేను చేసిన సాధ‌న చాలా త‌క్కువ అనుభ‌వం ఎక్కువ‌, తెలుసుకున్న‌దీ త‌క్కువే. ఇంకా ఎన్నో జ‌న్మ‌లెత్తి ఆ అమ్మ‌ని ఇంకా కీర్తించి కీర్తింప‌చేయ‌డ‌మే నా గ‌మ్యం. ఆ అమ్మ‌ని ఇంకా ఇంకా ఆర్తితో త‌ల‌వాల‌నీ పిల‌వాల‌నీ నా ఆకాంక్ష‌రా త‌ల్లీ ! ఇంకొక్కమాట చెప్తావిను. నాకు ఏమీ తెలీదు అని తెలుసుకోడ‌మే జ్ఞానంట‌. అలా తెలుసుకున్న నేను నాకు తెలిసినంత నేను వ్య‌క్తం చేయ‌డం కూడా నా ధ‌ర్మంగా భావిస్తాను. అదీ అడిడిన వారికేసుమా ! హంసి తల్లీ ఏదీ ఆ అమ్మ‌వారి నొక్క‌మారు త‌ల‌చుకొని జ‌యం ప‌లికి ఈనాటికి విశ్ర‌మిద్దామా ? హంసి ఉత్సాహంగా జ‌యం ప‌లికింది. ఆ జ‌య‌ఘోష‌లో అప్పుడేవ‌చ్చిన ఆనంద‌రావు గారు కూడా పాలుపంచుకున్నారు.

శ్రీ‌శ్రీ‌శ్రీ రాజ‌రాజేశ్వ‌రీ అమ్మ‌వారికీ జై
శ్రీ‌శ్రీ‌శ్రీ మౌనానంద య‌తీశ్వ‌రుల‌కూ జై
శ్రీ‌శ్రీ‌శ్రీ శివ‌చిదానంద భార‌తుల‌కూ జై