రఘునాథుడు కొండ దగ్గరకు వచ్చినాడు. గుర్రపుడెక్కల చప్పుడు వినవచ్చినది. అది క్రమక్రమంగా దగ్గరవసాగినది. రఘునాథుడు చెట్ట గుబురుల వెనుకకుపోయి నిశ్శబ్దముగా నిలబడినాడు. ఆశ్యర్యము ! ఇరువది మంది సాయుధులైన అశ్వికులు మనోవేగమున పోవుచున్నారు. రఘునాథునకు నవ్వు వచ్చినది. ముందున్నది చంద్రశేఖర భట్టారకుడని ఆ మసక వెన్నెలలోనైన గుర్తించినాడు. ఓహొ ! భట్టారకా ! మరి రెండు ఘడియలలో శత్రువులను బంధించగల శక్తి నీకున్నది. పోయిరమ్ము ! అని ఆనందించినాడు. మరల గుర్రపు సవ్వడి ! మరల కనుమరుగైనాడు. అశ్వముపై నెవ్వరును లేరు. అది గమ్యము లేనట్లు పోవుచున్నది. రఘునాథుడు పరుగున బాటపైకి వచ్చినాడు. అది తన శ్వేతాశ్వము, తన పంచకళ్యాణి రామచంద్రుడు ! అత్రముగా, రామచంద్రా ! ఓ రామచంద్రా ! అని ఎలుగెత్తి పిలిచినాడు.
గంతులు చిందులు వేస్తూ వెనుతిరిగి వచ్చినది. రఘునాథుని ముందు నిలచినది. ముందు కాళ్ళు పైకెత్తి నిలబడి గట్టిగా సకిలించినది. యజమానికై అది పడిన దుఃఖము, తిరిగి అతడు లభించినందుకు కలిగిన ఆనందము ఆ సకలింపులో అతనికి బోధపడినది. ఆప్యాయముగ దానిమెడ కౌగలించుకొని, వెన్ను నిమిరి, వీపుపైన ముద్దుగా తట్టి అధిరోహించబోయినాడు. కాని అది అతనిని అధిరోహించనీయలేదు. మరల వెనుక కాళ్ళపై నిలబడి సకిలించినది. అతని శరీరమును రాచుకుంటూ, చుట్టు తిరిగినది. దాని భావవేగమునకు దాని నోటి నుండి కారుచున్న జలమును రఘునాథుడు తన పట్టువస్త్రముతో తుడిచినాడు. పిచ్చి చంద్రా ! ఏమిటి నీ గోల ! నగరికి వెళ్ళినాక నీకు తాటిబెల్లము తనిపిస్తాలే ! నిన్ను విడిచి పోనులే ! అంటూ మరల వెన్ను నిమిరి అధిరోహించినాడు. ఎక్కడకు పోవలెనన్నది ప్రశ్న. క్షణము యోచించినాడు. చంపక వనములోనికి పోనిచ్చినాడు.
అశ్వశాలలోనికి పోయి తాటిబెల్లము తెమ్ము అని ద్వారముకడనున్న భటుని ఆజ్ఞాపించినాడు. ఆహ ! అశ్వశాలలోనిది వద్దు, గోవిందా మాత్యుల గృహము నుండి తెమ్ము అని ఆదేశించినాడు.
ఆ భటునకు ప్రస్తుత పరిస్థితులు తెలియవు. రఘునాథుడు ప్రతిదినము రాత్రి కొంతవరకు అక్కడనే ఉండిపోవుట వానికి తెలిసిన విషయమే. కాకున్న నేడెందులకో తెలతెలవారుతుండగా ఈతడు వచ్చినాడని అనుకొనినాడు. కనులు నులుముకొనుచు గోవిందామాత్యుల ఇంటికి వెడలినాడు. ప్రభువువారు తాటిబెల్లము ఇప్పించుకు రమ్మన్నారు అన్నాడు తొందరగా. అప్పుడే జపమును విరమించుకొని పట్టు వస్త్రముతోనున్న అమాత్యులు వాని మాటలకు విస్తుబోయినారు. వారు కట్టుకొని యున్న ఎర్రని పట్టువస్త్రమును మించిన యరుణిమతోనున్న నిద్రలేని వారి కనులు దుర్నిరీక్ష్యములుగ నున్నవి. వారి మదికి చిరునవ్వుతో ప్రసన్నవదనయైన గాయత్రీదేవి ముఖ కమలమింకను స్ఫురించుచునే యున్నది. ఆ ప్రసన్నవదన మీ భటుని పలుకులలో ప్రతిఫలించినదాయని, గోవిందులు తబ్బిబ్బుగ చూచినారు. ఏడీ, నా రాఘవుడెక్కడ ! ఎక్కడకు తెమ్మన్నాడు తాటిబెల్లము!? అంటూనే లోనికి పోయి నూరు స్వర్ణదీనారముల సంచిని ఆ భటుని దోసిలిలోనికి విసిరినారు. ఫో ! యువరాజులు చంపకవనమున నున్నారన్న వార్త, మరియొకరి చెవిని వేయకుండా, నేరుగా మహారాజులకు విన్నవించు నేడు నీ అదృష్టము పండి, నీ ఇల్లు బంగారము కానున్నది. ఫో ! శరవేగాన వెళ్లు, మహారాజులకీ వార్త వీనులవిందుగ వినిపించు. నీ నోటినిండ పటికబెల్లము పోయించుకో ఫో ! పరుగున ఫో ! అని తరిమినారు.
ఆ భటుడు ఇందేదో మహా విచిత్రమున్నదనుకొన్నాడు. నాడు అసాధారణమైన విధమున సైన్యమప్రమత్తముగ నున్నది. రాజ ప్రాసాదప్రాకారము ముందు పెక్కుమంది సైనికులు గస్తీ తిరుగుతున్నారు. ఇందరు సైనికులు కాపు కాయుట ఆ భటుడు అదివరకెన్నడునూ చూచియుండలేదు. అతడు అంతఃపురమున ప్రవేశించకుండా వేయి విధముల అడ్డు తగిలినారు. నేను మహారాజులకు గోవిందామాత్యుల వారి నుండి వార్త తెచ్చాను. వారీ వార్తను మహారాజుల వారికి మాత్రమే మనవి అతిరహస్యముగ చేయమనినారు అన్నాడు. వెంటనే వారాతనిని వదలినారు.
శోకాతిశయముతో మంకెన పూవులవెనున్న మహారాజు కనులను చూచి భయపడినాడు, చంపకవన రక్షకభటుడు. అమాత్యులవారి కన్నులు కూడ ఇటులనే నెఱ్ఱగనునన్నవి. అయినప్పటికి వారి కనులలో నేదో ప్రసన్నత ! మహారాజు అతడు తెచ్చిన వార్తవిని. ఆనందము పట్టలేక ఆ భటుని కౌగలించుకొన్నారు. ఇలాటి చర్య ఏ రాజును చేయడు అనుకున్నాడా భటుడు, భయసంభ్రమాలతో. రాజుకు దయకలిగితే రత్నాతిస్తారు, వజ్రాలిస్తారు, హారాలిస్తారు. కాని, సేవకుని ఆదరణతో ఆలింగనం చేసుకున్న అచ్యుత దేవహహారాజులం వారిదెంత దొడ్డ మనసో ! నేను తెచ్చిన వార్త ఇంకా ఎంత దొడ్డదో ! అనుకొని తడబడిపోయినాడు. |