చంద్రశిలా వితర్దికపై అలవోకగా కూర్చుండి, చంద్రునివంక భావరహితంగా చూస్తున్నాడు, రఘునాథుడు. ఆకుల గలగల, అడుగుల సవ్వడి చివ్వున తలతిప్పి చూచినాడు. తమరా, గురుదేవా ! తబ్బిబ్బుపడినాడు. రాఘవా ! గోవిందదీక్షితుల వారి గొంతు అర్ద్రంగా, ఆనందంగా పలికినది. శత్రుచ్ఛేదము ఏలాగు చేశావు తండ్రీ ! నిన్నిలాటి చిక్కులో పెట్టినందుకు నాకెంతో వ్యధగా ఉంది అన్నారు. తమరు అలాగనరాదు. అంతా విధి లీల ! నేడిలా జరగవలసియున్నది గనుక జరిగినది. అంతే !... నన్ను క్షమింపవేడెదను అంటూ పాదములంటి నమస్కరింపబోయిన రఘునాథుని ఎత్తి, గుండెలకత్తుకున్నాకగాని ఆయన మనస్సు ఊరట చెందలేదు.
రఘునాథుడు తానెలా బందీ అయినదీ, ఎలా తప్పించుకొనవచ్చినదీ వివరించానాడు.
గోవింద : నాయనా, రాత్రి తండ్రిగారిపై నేను చూసిన కోసం నిజమైనది కాదు. నా మాటలలోని తీవ్రత నిజమైన తీవ్రతకాదు. రాజ్య పరిస్థితలువల్లనేనలాగున అనక తప్పలేదు. కొన్ని లతలు కలిసి త్రాడుగా ఆవుతేనే తప్ప ఏనుగును బంధించలేవు. ఈ పరిస్థితులలో మీరు సార్వభౌములకు సాయంగా వెళ్ళని పక్షములో మన రాజ్యాలన్నీ ఒక్కొక్కటిగ తురుష్కుల పాలుగాక తప్పదు. సార్వభౌములు తమమీద గంపెడంత ఆశతో ఉన్నారని మల్లయ్యగారు చెప్పారు. సార్వభౌములను మనం విరోధం చేసికొనకూడదు. మీ బాహుపరాక్రమం మీ గ్రహసంపత్తి యొక్క ఉచ్ఛదశ నాకు తెలియనివి కావు. తమరికి కాలం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మహారాజువారిని ఆ మాత్రం మందలించక నాకు తప్పదు. నా కోపవచనాలతో హృదయం నాకు పూర్తిగా తెలుసు. పుత్రమమకారం అంటే అలాగే ఉంటుంది. నాయనగారు శత్రువుఉల మిమ్ములను బంధించి తీసుకొని పోయినారన్న వార్తవిని క్రుంగిపోయారు. వారికి తమ క్షేమవార్తనిప్పుడే పంపించి ఇలా వచ్చాను. నేను
నిర్ణయించినట్లుగా దశమినాడు తాము యువరాజులుగాక తప్పదు.
రఘ : నాయనగారూ ! నాకీ రాజ్యమెందుకు, యుద్ధాలెందుకు ? చక్కగా కావ్యాలాపవినోదాలలో తేలియడక ? అనిన్నీ అనిపిస్తున్నది. భగవంతుడు నాకు భుజబలాన్ని ఇచ్చినదెందుకు, శక్తి సామర్ధ్యాల్ని ఇచ్చినదెందుకు, దుర్మార్గులను, దుష్టులను, స్వార్ధపరులను అణచి ప్రజారంజకంగా పాలించడానికి కాదా ? అనిన్నీ అనిపిస్తున్నది. నాకు కర్తవ్యము బోధపడకుండా ఉన్నది.
గోవింద దీక్షితులవారు వెండిమీసాల మాటునుంచి చల్లగా నవ్వారు. ఆ నవ్వులకాంతులను కూడా వెన్నెల వెంటబెట్టుకు పోయినది. రాఘవా ! ఆత్రమెందుకు నాయనా ! నీవా రెండు కార్యాలూ చేయడానికే జన్మించావు. చేసితీరుతావు కూడా.
అంగ రక్షకభటులు అటునిటు అప్రమత్తముగ నుండగ అచ్యుత మహారాజు చంపకవనానికి యేతెంచినారు. గోవిందామాత్యులకు అతి సమీపముగ కూర్చుండి చింతించుచున్న కుమారునీ, పుత్రునివలె అక్కున హత్తుకుని ధైర్యవచనములను కర్తవ్యమును చెప్పుచున్న అమాత్యులవారినీ చూచి అచ్యుత నాయనింవారు అమితానందభరితులై రాయెను.
నాయనా. రఘునాధా ! మళ్ళీ నిన్నీ కళ్ళతో చూడలేననుకున్నానురా, కన్నయ్యా!...
నాయనగారూ !
అచ్యుతప్ప నాయకులవారు రఘునాథులను ఆనందముగా ఆలింగనము చేసికొన్నారు.
గోవిందామాత్యులు లేచి నిలబడి, మహారాజులవారికి జయమగుగాక ! అనిరి.
గురదేవా ! నన్ను నాకోపావేశమును నావాచాలతత్వమును క్షమింపవేడెదను.
ప్రభూ ! మనలో మనకు క్షమార్పణలేటికి ? రఘునాథులకు తాము భయపడుచుండిన ఛిద్రదశా ఫలితమే రాత్రి మనము పడిన వేదన.
వేదన మాత్రమేనా ! చిట్టి నాయనకెంత గండము తప్పినది !
గోవిందామాత్యులు చిరునవ్వు నవ్వినారు.
|