సమీపాస్థాన కవులను సరస్వతీ సమార్చన కొరకు, నర్తకులను గాయక గాయనీమణులను శారదా సమారాధన కొరకు ప్రత్యేకముగ పిలువనంపిరి.
శ్రావణ శుద్ధ దశమినాడు తంజపుర రాజ్యలక్ష్మి ఆంధ్ర కళాసరస్వతి, భావిభాగ్యోదయము నూహించుకొనుచూ కళకళలాడిపోయినది. కావేరీ మహాదేవి ఉరకలు పరుగులతో మురిపెముగా ప్రియసముద్రునికీ శుభవార్త చెప్పుటకు అతి వేగరియై కదలినది. ఉద్యానవనాదులకొడళ్ళు తెలియలేదు. ఫలపుష్పాదులతో విరగబడిపోయినవి. చేమంతికాకన్యల మహా విజృంభణములో పెద్ద ముత్తయిదువల పసుపు కుంకుమలు గుబాళించినవి. ప్రజల సంబరమునకంతులేదు. సరస నాట్య గానాలతో పండుగ చేసుకొనుచున్నారు. పల్లెపల్లెల నుండి జానపద కళాకారులు ఎఱ్ఱగొల్ల భాగవతులు, జంగాలపల్లె భాగవతులు, దాసరి భాగవతులు మున్నగు వీధినాటకముల వారు, పగటివేషాలవారు, బుఱ్ఱకథలవారు, ఒగ్గు కథలవారు, చెక్క భజనలవారు, శాకమూళ్ళ భజనలవారు, హరికధకులు, పండరి భజనలవారు, పిచ్చుకుంటల కథలవారు, తోలు బొమ్మలవారు, ఘల నాట్యాలవారు, పుటి నృత్యాలవారు, అశ్వ నృత్యాలవారు, కురుబ నాట్యాలవారు, కొరవంజి, పేరిణి, గుజరాతి నాట్యాలవారు, శాస్త్రీయ కళా సంపన్నులు మొదలైన వారెందరో వారంతట వారే వచ్చి ప్రదర్శనలిచ్చి ప్రజలను మెప్పించి ప్రభువుల నుండి బహుమానములను పొందినారు.
గోవిందాచ్యుతుల హృదయము లొక్కటికాగా రఘునాదుడు నిమిత్త మాత్రునివలె కర్తవ్య నిర్వహణమునకై దేశ సౌభాగ్యమునకై రక్షాబద్ధుడనైతినని అనుకొన్నాడు. మహీభార దక్షణ దీక్షాంకంకణ శోభితుడైనాడు. పండితులు, దీక్షితులు, వేదవేదాంగ వేత్తలు తమ ఉద్గీథలతో అభిషేక మహామంత్రములు ఉచ్ఛరించి పరమ పావన కావేరీ తుంగభద్రా పినాకినీ కృష్ణా గోదావరీ జలాలతో రఘునాథ భూరమణుని మూర్ధమును పరిపూతమొనర్చిరి.
రాజపురోహితులున్నూ, గోవిందామాత్యులున్నూ, అచ్యుతనాయనింవారున్నూ వజ్రవైఢూర్య ప్రవాళ మౌక్తిక మరకత మాణిక్య పద్మ పుష్యరాగాది నవరత్న ఖచిత సువర్ణకీరీటముతో రఘునాథుని శిరము నలంకరించిరి. ఆ క్షణమున నాకిరీటము విశాలభూమిని తన శిరస్సు పై నిడుకొని మ్రోయుచున్న యనుభూతిని కలిగించినది. సుముహూర్త సమయమున, పుత్రా రమ్ము ! అని అచ్యుతనాయనింవారు పిలిచి రాజముద్రికను వేలికి తొడిగిరి . బ్రాహ్మణులు శతమానంభవతి శతాయుశ్శతేంద్రియాముష్యేవేంద్రియోప్రతితిష్ఠతి అని ముత్యాల పేసలు జల్లి దీవించిరి. అచ్యుత మహారాజుల వారు చేసిన దానములేనా, ఇచ్చిన కానుకలేనా ! వస్త్రదానములు, సువర్ణదానములు, భూదాన గోదానములు మాత్రమేగాక మహాపరవశులై, ముత్యాలు, రత్నాలు దోసిళ్ళతో ముత్తయిదువుల ఒడులు నింపినారు.
పంచరాత్రోత్సవములు జరుగుచున్నవి. వేడుకలింకను పూర్తికాలేదు. త్రయోదశి ప్రాతఃకాల బ్రాహ్మీముహూర్తమున పదివేల యశ్వదళము అయిదువేల గజదళము, ఇరువది యైదువేల కాల్చలము వెంటరాగా సర్వసన్నద్ధులై యువరాజు శ్రీశ్రీశ్రీ రఘునాథనాయనింవారు సమ్రాట్టుల సహాయమునకై వివాహమునకు వెడలుచున్నట్లుగ ఆనందోత్సాహములతో కదనమునకు వెడలిరి.
మొదట సైన్యమును చంద్రగిరిలో నిలుపుజేసినారు. రాజులకు, సైన్యాధ్యక్షులకు ముందే గుడారములు నిర్మించబడినవి. రఘునాథ యువరాజులు తమ గుడారమునందు విడిది చేసినారు. గూఢచారులు తెచ్చిన వార్తలను అతి జాగ్రత్తగా పరిశీలించుచున్నారు.
తురుష్కుల అశ్వబలం పదివేలు, గజబలం అయిదువేలు, అగ్నికాగడాలను విసరగలిగిన వీరభటులు ఇరువది వేలు, కోటలో యుద్ధానికి సర్వసన్నద్ధముగ నిలిచియున్నారు. సగము సైన్యము దారిలో మనకు అడ్డు తగిలి చికాకుపరిచి పారిపోవునట్లుగ అక్కడక్కడ రహస్య స్థావరములలో కేంద్రీకరింపబడి యున్నారు కుమారనాథుడు తెచ్చిన వార్తను విని యువరాజు విభ్రమం చెందారు. తల పంకించారు.
అతడు సత్యము చెప్పుచున్నట్లే తోచుచున్నది. కాని, నమ్మశక్యము కాకున్నది. మధుల నాయకుడు ముత్తువీరప్ప సార్వభౌములకు కప్పము కట్టుటకు సిద్ధపడినాడు. పెనుగొండలో తురుష్కులకు యుద్ధమున సాయపడునది లేదన్న వార్తలను గోల్కొండ సుల్తానులకు పంపినాడు. ఇంతవరకు తిరస్కరించిన అపరాధమునకుగాను అయిదువేల అశ్వములు, వేయి సింహళపు టేనుగులు, మూడు లక్షల స్వర్ణధీనారములు సార్వభౌములకు సమర్పించుకొనుచున్నాడు. నేడో రేపో గమ్యము చేరగలవు. ఇకను, మధుర సైనికులు సహాయనిరాకరణ చేసినట్లాయెనా, మరి సుల్తానుల గతి యేనుగను ? వారును తిరోగమించవలసినదే ! జింజిప్రభువు ముందే కటకటాల వెనుకనున్నాడు. తంజపుర ప్రభువులు సార్వభౌముల కెల్లప్పుడూ కుడిభుజమే కదా ! |