15
 

ర‌ఘునాథుడు, మాతృస‌మానులు. మీకు నా వంద‌న‌ములు. పెద్ద‌వారు క‌ష్ట‌ప‌డి వచ్చినారు. వార్త‌నంపిన‌చో స‌రిపోయెడిది కాదా ! అయినా, మీ ద‌ర్శ‌న‌భాగ్య‌ము ల‌భించిన‌ది. నేను త‌మ‌కేమి చేయ‌గ‌ల‌వాడ‌నో అనెను.

తండ్రీ నీ స‌ద్గుణ‌ములు విన్న త‌రువాత‌నే బ‌య‌లుదేరాము. ఎండ‌పొడ‌కాన‌ని మేము ఈ అడ‌వులు కొండ‌లు దాటి రావ‌ము కేవ‌ల‌ము ప్రాణ‌ముల‌మీద తీపి మాత్ర‌ము చేత‌నేకాదు. మా దుర్గాధిప‌తులు స‌హ‌జ‌ముగా అమాయ‌కులు. మ‌ధుర ప్ర‌భువుల‌వారి దుర్భోధ‌ల‌తో మాత్ర‌మే వారు దుష్టులుగ‌మారుచున్నారు. సార్వ‌భౌముల‌పై తిరుగుబాటుచేసి స్వ‌తంత్రులుగా ప్ర‌క‌టించుట‌కు మ‌ధుర‌, జింజి నాయ‌కులిద్ద‌రునూ సంక‌ల్పించుకొన్నారు. అందుచేత గ‌త రెండు సంవ‌త్స‌ర‌ముల నుండి సార్వ‌భౌముల‌కు క‌ప్ప‌ము క‌ట్టుట‌లేదు. ర‌క్త‌పాత‌ము లేకుండ‌, యుక్తిగ కృష్ణ‌ప్ప‌నాయ‌నిం వారిని బంధించి తెచ్చిన‌వారికి ప్ర‌భువులు మంచి బ‌హుమాన‌మిత్తుమ‌న్నార‌ట‌. మ‌ట్ల అనంత‌రాజ‌నే సామంతుడు మా ప్ర‌భువును ఉపాయ‌ముగ బంధించి తీసికొని పోయినాడు. మా ప్ర‌భువున‌కు సార్వ‌భౌములు శిర‌చ్ఛేద‌న‌మును విధించిన‌చో మేమేమి కావ‌లెను ! రాణుల‌ము, నాల్గువంద‌ల మందిమీ మ‌హాగ్నికి ఆహుతికాక త‌ప్ప‌దు. ద‌యాగుణ సంపన్నుడైన ఓ ర‌ఘునాథా ! మేము నీ తల్లివంటి వార‌ము. కృష్ణ‌ప్ప నాయ‌కుల‌ను ర‌క్షించి, విడిపించే సామ‌ర్థ్య‌ము నీకొక్క‌డికే ఉన్న‌ది.

ర‌ఘునాథుని క‌నులార్ద్ర‌ములై క‌రుణాపూన‌రిత‌ములైన‌వి. అమ్మా ! కృష్ణ‌ప్ప నాయ‌కుల వారికెట్టి భ‌య‌ములేదు. వారి కెట్టి యాప‌ద క‌లుగ‌కుండ నేను ప్ర‌య‌త్నింతునుక‌దా ! గుండెల‌పై చేయి వేసికొని హాయిల నిద్రించండి. కాని, మీరు నాకొక మాట ఈయాలి. మీరందు కంగీక‌రించిన‌గాని నేను కృష్ణ‌నాయ‌ని ర‌క్ష‌ణ కొర‌కు ప్ర‌య‌త్న‌ము సైత‌మైన ప్రారంభించ‌నున‌.

అంద‌రు ఏమిటా మాల ? అన్నారు. చెప్ప‌వ‌య్యా, తండ్రీ ! అన్న‌ది, కృష్ణ నాయ‌కుల పెద్ద భార్య‌.

ప‌తి మ‌ర‌ణించిన త‌రువాత స‌తికి బ్ర‌తుకులేదు. నిజ‌మే. కాని శ‌రీర‌మును త్యాగుము చేయ‌గ‌ల హక్కు ఏ వ్య‌క్తికీలేదు. స‌తీస‌హ‌గ‌మ‌న‌ము దుష్టాచార‌మని అనేకులు బోధించుచున్న‌నూ మ‌న నాయ‌క వంశాల‌లో మాత్ర‌ము ఆ ఆచార‌ము ఇంక‌నూ నిర్మూలింప‌బ‌డ‌లేదు. నేను కేవ‌ల‌ము వారిని విడిపించుట‌కు ప్ర‌య‌త్న‌ము మాత్ర‌మే చేయ‌గ‌ల‌ను కాని ఫ‌లిత‌ము నా చేతుల‌లో లేద‌న్న‌ది మీకు కూడా తెలుసు. ఫ‌లిత‌మెట్లున్న‌ప్ప‌టికీ మీరు ప్రాణ‌త్యాగ‌ము చేయ‌మ‌ని నాకు వాగ్ధాన‌ము చేయ‌వ‌లెను అట్టిమాట మీరీయ‌ని ప‌క్ష‌మున నేను ప్ర‌య‌త్న‌ము కూడ చేయుట‌కు..

నాయ‌నా ! అలాగ‌న‌కు ఇది త‌ర‌త‌రాల నుండి వ‌స్తూన్న ఆచార‌ము క‌ద ! అయినా, నీవు కోరుతున్న వాగ్దాన‌మున‌కు మేమంద‌ర‌ము అంగీక‌రించుచున్నాము. నీవు ప్ర‌య‌త్నం చేస్తే. మాకు కొండంత ఆశ‌. ఓట‌మ‌న్న‌ది నీ జాత‌కంలో లేద‌ని మా ఆస్థాన పండితులు, విద్వాంసులు అయిన ర‌త్న‌ఖేట శ్రీ‌నివాస దీక్షితుల‌వారు ఎప్పుడూ చెపుతూ ఉంటారు.

మ‌ర‌ల భాద్ర‌ప‌ద శుద్ధ చవితికి మీరు ప‌తిదేవునితో కూడి విఘ్నేశ్వ‌రార్చ‌న చేతురుగాని, అవి ర‌ఘునాధుడు వారికి స‌క‌ల‌మ‌ర్యాద‌లు చేయించి, అనేక అమూల్యాభ‌ర‌ణ‌ముల‌నిచ్చి స‌గౌర‌వ‌ముగ వెనుక‌కు పంపినాడు.

శ్రావ‌ణ‌ము యుద్ధ‌మున క‌నుకూల‌ము కాదు. కాని, ప‌ర‌రాజులు దండెత్తి వ‌చ్చిన‌చో వారిని త్రిప్పికొట్ట‌క త‌ప్ప‌దుకదా ! అనుకూల‌కాల‌మున‌కై వేచి యుండుట వెఱ్ఱిత‌న‌మే.

ప్ర‌యాణ‌ము ముందుగా నిర్ణ‌యించుదానికంటె మూన్నాళ్లాల‌స్య‌మైన‌ది. కృష్ణ‌గిరి, నంది దుర్గ‌ముల వ‌ద్ద వ‌ర్ష‌పాత‌మువ‌ల‌న ప్ర‌యాణ‌మున‌కు విఘ్న‌ము వాటిల్లిన‌ది. కొంత చుట్టుదారిని పోద‌ల‌సివ‌చ్చిన‌ది. ర‌ఘునాధున‌కు ఆత్ర‌ముగ నున్న‌ది. ఈ స‌రికి పెనుగొండ ముట్ట‌డి జ‌రిగియుండ‌వచ్చును. పరిస్థితులెట్లున్న‌వో అని భీతి చెందినాడు.

గోలుకొండ సైన్య‌ము కోట‌ను ముట్ట‌డించిన‌ది. అప్ప‌టికే వెలుగోటి ప్ర‌భువులు, మ‌ట్ల‌వారు వారి సైన్యాల‌తో శ‌త్రుసేన‌ను ఎదుర్కొన్నారు. రాయ‌ల‌వారి సైన్యానికి బ‌య‌ట‌నుండి తాకిడిని ఆపు చేయుట‌కు బ‌హుక‌ష్ట‌మైన‌ది. రాత్ర‌యిన‌ది. తెల్ల‌వార‌గ‌నే గోలుకొండ‌వారు పెనుగొండ‌లో ప‌తాక పాత‌వ‌చ్చున‌నే ధైర్యంతో నున్నారు. మ‌ట్ల‌వారూ, వెలుగోటివారూ వెనుక‌కు మ‌ర‌లే ప్ర‌య‌త్నాల‌ను గుట్టుచ‌ప్పుడు కాకుండ చేసికోనారంభించినారు.

ఇమ్మ‌డి వేంక‌ట‌ప‌తిరాయ సార్వ‌భౌముల గుండెలు క‌ళ‌పెళ‌మంటున్న‌వి. వారి ఆశ‌ల‌న్నీ తంజావూరు మీద‌నే. అచ్యుత‌ప్ప నాయ‌కుడెంత ప‌ని చేశాడు ! త‌న కుమారుని స‌సైన్యంగా పంపిస్తున్న‌ట్లు వార్త పంపాడు. చారులు ఆ వార్త‌ను ధృవీక‌రించారు కూడాను. కానీ సైన్య‌మేదీ ? రాజేడీ ? ఇరువ‌ది అయిదు సంవ‌త్స‌రాల క్రింద‌ట రక్క‌సి తంగ‌డి యుద్ధంలో ఒరిగిపోయిన విజ‌య న‌గ‌ర జ‌య‌ప‌తాక‌ను తిరిగి ఎగుర‌వేయ‌వ‌లెనన్న త‌న ఆశ‌యేమ‌యింది ? మ‌ర‌ల ఓట‌మినంగీక‌రించ వ‌ల‌సిన‌దేనా ?