తెలి వెలుగులు రేకలు విప్పుకొంటుండగా, తంజపుర ప్రభువు, శ్రీశ్రీశ్రీ రఘునాథనాయంనివారు పెనుగొండ దరిదాపులలోనికి విచ్చేసిరన్న వార్త గుప్పుమన్నది. వారు విశ్రాంతి అయినా తీసికొనకుండా యుద్ధ వ్యూహ నిర్మాణములో నిమగ్నులైనారు. శత్రువులనను మూడువైపుల నుండి ముట్టడించవలెనన్నది వారి పథకము.
మట్ల అనంతరాజుకు గంపెడంత ధైర్యము వచ్చినది. కస్తూరి రంగప్పకు పౌరుషము పొంగి పొరలినది. విజయమో, వీరస్వర్గమో ! అంతేగాని పగతురకు వెన్నిచ్చి పారపోవునది లేదని బింకములు పలికినాడు. రఘునాథులు రాకపోయినచో కస్తూరి వారు మార్గమధ్యములో నుండెడి వారిలొ మొదటివారు.
అందరికినీ రఘునాధుని చిరునవ్వే సమాధానమైనది.
సూర్యాస్తమయ సమయానికి పెనుగొండలో విజయలక్ష్మి వెన్ను విరుచుకున్నది. విజయనగర సామ్రాజ్య రమామణి చిరుగర్వంతో విలాసవతియైనది. సార్వభౌములు రఘునాథుని గ్రుచ్చి కౌగరించుకొన్నారు. నిండుకొలువులో అర్ధాసనమిచ్చి బహుమాన పురస్సరంగా బిరుదులిచ్చి గౌరవించినారు.
రఘు : సార్వభౌములకు నాదొక విన్నపము.
సార్వ : రఘునాధ ! నీ మనసులో మాట స్వేచ్ఛగా చెప్పవచ్చును. నేడు నీవంటి వీరుని చూస్తూ ఉంటే నా ఆనందం ఆకాశ వీధుల్లో సంచరిస్తోంది. నీ వంటి కుమారుని కన్న అచ్యుతప్ప ఎంతటి ధన్యుడో కదా ! నీవు ఏది కావలెనన్న దానిని ఇచ్చుటకు సిద్ధముగా నున్నాను. మధురను జయించి, దానిని కూడ నీ రాజ్యమున కలుపుకొనిననూ సరే. జింజి దుర్గము రాజులకు మిక్కిలి క్షేమముగా నుండును కనుక జింజిని స్వాధీనపరుచు కొందునందువా ? చంద్రగిరికోటను నీ విక్రమమునకు చిహ్నముగ స్వీకరింతువా ?
రఘు : ప‌్రభూ ! నాకు రాజ్య విస్తరణ కాంక్షలేదు. నాకున్నది ధర్మరక్షణ కాంక్షయే ! జింజి దుర్గాపతిని తాము చెఱనుండి విడిపించలెనని నాకోరిక. అతడమాయకుడు. పరరాజుల దుర్బోధనలకు లోబడిన దుర్బలుడు...
సార్వ : అవశ్యం అట్లే కానిమ్ము అని కృష్ణప్పనాయకుని సగౌరవముగ సభాస్థలికి పిలిపించినారు. నీవు దుర్బోధలు విని నీ పినతండ్రి కనులు పెరికించి రాజ్యమును చేజిక్కించుకున్నావు. తిరిగి ఇలాగ తిరుగుబాటు చేసి మాకు ఆగ్రహం కలిగించావు. మరల ఇట్టితప్పు యెప్పుడూ చేయకు. పొమ్ము. కృష్ణప్ప అవమానభారమున తలవాల్చుకుని అట్లే నిలబడినాడు. రఘునాధుని కృపవలన నీవు బ్రతికి బయటపడినావు. మరల నిట్టి విశ్వాస ఘూతుకచర్యలను చేయకు. పొమ్ము అని మరియొకసారి మందలించి విడిచి పుచ్చినాడు.
కృష్ణప్ప : రఘునాధనాకా ! నా ప్రాణములు నిలిపినావు. అందులకు నీకేమి యీయగలను ? ప‌్రాణాధికమైన నా పుత్రిక లక్ష్మీదేవిని నీవు స్వీకరించి మా వంశమును ధన్యము చేయుము.
జింజి దుర్గాధిపతి కొమరిత లక్ష్మీదేవి, సాక్షాత్ క్షీరసాగరజనిత లక్ష్మీదేవి వలెనే పరమ రమణీయమూర్తి ఆమె నడయాడిన తావున సకల సౌభాగ్యములు, సిరలు వర్ధిల్లుచుండును.
రఘునాథుడు పెండ్లి కుమారుడైనాడు.
యుద్దమునకు వెళ్ళుచు పెళ్ళకి వెళ్ళినట్లుత్సాహముగా వెళ్ళిన రఘునాధ యువరాజులవారు రణభూమి నుండి కళ్యాణ వేదికకు వెళ్ళి కన్యాలాభముతో మరింత సంబరముగ వచ్చినారు. కుజాంతర్దశ కన్యాలాభముతో ఫలవంతమైనది.
***** |