18
 

కొంచెం విడివిడి ఉషారుణార్ద్రాలై, అమృత క‌ల‌శాంత‌ర మ‌ధుస్విన్నాలై, నంద‌న వ‌నాంత‌ర సుంద‌ర నిత్య మందార కుసుమ ప‌త్రాలై, ప్ర‌ధ‌మ ప‌రీమ‌ళ ర‌చిత స్వ‌ప్న న‌ర్తితాలైన ఆమె పెద‌వుల‌పై మ‌హ‌దాంద్ర‌వ‌న సంచారిత ఫాల్గుణ పూర్ణిమాస‌నాధివ‌సిత న‌వ వ‌సంత‌మూర్తి ర‌ఘునాధుని చూపులు ఆవ‌రించి చుంబించి అర‌మూత‌లైన‌వి.

ఒక‌ప్పుడు గాంధ‌ర్వ చంద్రికాచ‌రిత చ‌కోరాలు, ఒక‌ప్పుడు నాట్య వాహినీ చ‌ప‌లిత మీనాలు, ఒక‌ప్పుడు కావ్యామృత వారాసి చ‌లితేందీవ‌రాలైన ఆమె క‌న్నుల ఆ రఘునాథ యువ‌రాజ‌చంద్రుని, ఆ స‌ర్వ విద్యాద‌ర్ప‌కంద‌ర్వుని, ఆ బాహు ప‌రాక్ర‌మ‌ప్ర‌కాశాంశుమంతుని చూపులు స‌మీపించి, ఆశ్చ‌ర్య‌మంది, కౌగిలించి, ప‌ర‌వ‌శ మూర్ఛితాల‌యిన‌వి.

ఎవ‌రీ బాలిక ? ఎంత ఈడు ఉంది ? ఆమె ప‌య్యెద‌పై ర‌ఘునాథుడు దృష్టుల ప్ర‌సారించినాడు. జ‌న్మ‌లు క‌దిలించు ఎత్తులు చిరుత‌లై ఉన్న‌వా అన్న‌ట్లు మిల‌మిల‌లాడిన‌వి. మోమున స‌ర్వ విద్య‌లు ప్ర‌కాశిస్తున‌వి. యవ్వ‌న స్ప‌ర్శితుడ‌గు ఆ బాలుడు, ఆ బాలిక ప్ర‌ధ‌మ యవ్వ‌న స్ప‌ర్శిత కాబోవు చున్న‌ద‌నుకొన్నాడు.

వారిదువురు స‌ర్వ‌మూ మ‌రచినారు.

వారిరువుర‌నూ బాలిక‌లు, సుమంగ‌ళీజ‌న‌ము ఇటున‌టు చూచి న‌వ్వుకొన్నారు. ఇది అంతా ప‌దినిమిషాల కాలంలో జరిగిపోయింది. యువ‌రాజు ప్ర‌క్క‌నున్న బంగారు దీనారాల సంచిలోనికి చేయిదూర్చి, గుప్పిట‌తీసి ఈ వ‌లావ‌ల క‌న‌క‌వ‌ర్షం కురిపించినాడు.
ఊరేగింపు సాగిపోయిన‌ది.

ఆ బాలిక నెమ్మ‌దిగా మెట్లు దిగి వ‌చ్చింది. ఆమె త‌న‌హ్రీ స్పందిత హృద‌యాన్ని త‌న‌లోనే దాచుకొని , చిరుతప్రాయ మ‌యినప్ప‌టికిన్నీ పైకి గంభీర‌మూర్తిని తాల్చి, అంద‌రి వెన‌కా న‌గ‌రాజ కుమారితోపాటు ఉప్ప‌రిగ దిగి, లోనిక‌క్ష్యంత‌రాల‌కేగి, గురుప‌త్నికి సాష్టాంగ న‌మ‌స్కారం చేసి, త‌క్కిన గురువుల‌కు న‌మ‌స్కారం చేసి, వారంద‌రిక‌డ‌నూ సెలవు తీసుకొని న‌గ‌రాజ కూమారితో స్యంద‌న మెక్కి ఇంటికి బ‌య‌లుదేరింది.

న‌గ‌రాజ కుమారి త‌న చెలిని చూచి, చెల్లీ ! ఏమిటే ఆ ఆలోచ‌న ? శృంగార ర‌సాలంబ‌న ప్రారంభః ఆలోక‌న విభావ సంభ‌విత మ‌నో సంచ‌లిత నాయికా ప్ర‌ధ‌మ స్థ‌తిః అని ప‌క‌ప‌క న‌వ్విన‌ది.

ఛీ ! ఛీ ఔ ఊరుకో ! బోయీలు వింటారు.
బోయీలూ వింటార‌న్న భ‌యం ! అంతే, కాని నిజ‌మ‌న్న‌మాట !
అన్న‌మాలాలేదు, త‌మ్ముడి పాలా లేదు.
నీ ఆట మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ అయింది.
నిన్ను వేటాడుతాను.
నేను ర‌ఘునాథుణ్ణి వెదికే -
నీ ధూర్త‌త్వం మితిమీరిపోతోంది.
నేను కాదే ధూర్తుణ్ణి !
మ‌రి ఎవ‌రే !

ఊరేగింపులో -

న‌గా ! యువ‌రాజులంవారు చిన్న‌త‌నంలోనే అంత పండితులూ, మ‌హాక‌వులూ అయ్యారు. దానికి ఉజ్జీగా వారు ఎంత గొప్ప‌వీరులే !

వారు ఎవ‌రి పుత్రులు ? అచ్యుత నాయ‌క మహారాజులం వారి పుత్రులు గారూ ?

గోవింద దీక్షిత‌ల వారి శిష్యులు కారూ ?

ప‌ద‌హారేళ్ళ‌కే లెక్కాప‌త్రం లేకుండా బుడ‌త‌కీచు సైన్నాల్ని చెండాడి వ‌చ్చారు.

లోగ‌డ రాజోత్పవాలు జ‌రిగినప్పుడు చూచాను వారిని, ఆమె క‌న్నులు ఏదో ఆనంద స్మృతి లో అర‌మూత‌లైన‌వి.

న‌గ‌రాజ‌కుమారి త‌న చెలియ‌నుచూచి, ఆమె ఆనందంవ‌ల్ల పుల‌క‌రించి పోవ‌డం గ‌మ‌నించి ద‌గ్గిర‌గా లాగికొన్న‌ది. న‌గ‌రాజ‌కుమారి ప‌దునారేడుల ఎల‌ప్రాయ‌పు ప‌డుచు. త‌న స్నేహితురాలు అందానికి అల్ల‌దే దూరంలో ఉండే అందం. మంచి జిగిదాల్చిన ఒడ‌లు సౌభాగ్యం. న‌గ‌రాజ కుమారీ ఈ బాలికా అప్ప‌చెల్లెండ్ర బిడ్డలు.