19
 

ఇంతో స్యంద‌న‌ము ఆ బాలిక భ‌వ‌న సింహ‌ద్వారం ద‌గ్గిర ఆగింది. సూతుడు రెండు గుర్రాల‌ను అదిలించి, సూత్రాల‌ను ప‌ట్ట‌టుండ‌గా బోయీలు దిగి గుర్రాల‌ను ప‌ట్టుకొన్నారు. సింహ‌ద్వార‌ము తలుపులు తెర‌వ‌గానే బోయీలు స్యంద‌నాన్ని లోనికి న‌డుపుకుంటూ తీసుకుపోయారు. లోని ప్రాంగ‌ణంలోనికి పోయి స్యంద‌నం ఆగింది. సేవ‌కులు తెర‌లు ఒత్తిగించ‌గా ఆ బాలిక‌లిద్ద‌రూ చ‌ర్రున లోనికి ప‌రుగెత్తినారు. అక్క‌డ చెలులు దిష్టితీయ‌గా మేడ ఎక్కి ఆ బాలికా , న‌గ‌రాజ‌కుమారీ ఆ బాలిక‌త‌ల్లి మ‌ర‌క‌త‌వ‌ల్లి వీణ వాయించుకొంటూ ఉన్న సంగీత గృహంలోనికి పోయినారు. కూతుర్ని చూడ‌గానే మ‌ర‌క‌త‌వ‌ల్లి చెంచుల‌క్ష్మీ ! వ‌చ్చావుటే ! ఊరేగింపు గురువు గారింటిని దాటిపోయేవ‌ర‌కూ ఉన్నారు కాబోలు ! న‌గా ! అక్క త్వ‌ర‌గా ర‌మ్మంది చెంచూ ! వేషం మార్చ‌కుండానే వ‌చ్చావా ? అని ప్ర‌శ్నించింది.

వ్య‌వ‌ధి ఏది, అమ్మా ?

ఆల‌స్య‌మైనాస‌రే సాధార‌ణ‌పు బ‌ట్టలు క‌ట్టుకొని, వేషం న‌గ‌లు తీసి దాచుకొని మరీ ర‌మ్మ‌న్నాను కాదుటే, త‌ల్లి !

ఆ వేషంతోనే రావ‌డం మమ్మ‌ల్నెవ్వ‌రూ చూడ‌లేద‌మ్మా !

ఉహూ !
అలాగా ? నీకు దిష్టి తీసిన చెలులు, బండి తెర‌లు ఒత్తిగించిన సేవ‌కులు, బండి న‌డిపే సూతుడూ ?

అది కాద‌మ్మా...!

అదికాదూ ! ఇదికాదూ ! తల్లీ ! నీ అందం గ‌ట్టిగా చూచి ఆనందించ‌డానికి నాకే భ‌యం. ఎందుకు పుట్టావు త‌ల్లీ, మా కులంలో !

నా కోసం కాట్రాయి న‌ర‌సింహ‌మూర్తి స్వామి దేవేరి చెంచుల‌క్ష్మికి ఎన్నో పూజ‌లు చేశావుట‌గా !

అందుక‌నే నీకు చెంచుల‌క్ష్మి అని పేరు పెట్టుకొన్నాను. ఆ ప‌ర‌మ‌కృపానిధి, వైకుంఘ‌ల‌క్ష్మి వ‌ర‌ప్రసాదం వ‌ల్ల పుట్టిన త‌ల్లివి. నీకు ఆ దేవి అందాల‌న్నీ వ‌చ్చాయి త‌ల్లీ !

స‌రేలే ! అమ్మా ! ఇవాళ ఊరేగింపులో యువ‌రాజుల‌వారు ఓ పక్క శ్రీ కృష్ణునీ, ఓ పక్క రామ‌భ‌ద్రునీ పోలి ఉన్నారు. ఏమి గంభీరంగా ఉన్నారే ! ఇది రెండ‌వ‌సారి ఆయ‌న్ని చూడ‌డం. ఇదివ‌ర‌కు నాట్యంచేసిన‌పుడు హార‌మూ అంగుళీయ‌క‌ము ఇచ్చిన‌దీ యువ‌రాజేన‌మ్మా.

ఆయ‌నా నిన్ను చూచారా ?

ఆ ! నన్ను ఎంతో తీక్ష‌ణంగా చూచారే !

తీక్ష‌ణంగానే ! అమ్మో రాజ‌దృష్టి !

రాజ‌దృష్టి అంద‌రికీ త‌గులుతుందా, అమ్మా ?

య‌ధాలాపంగా చూస్తే త‌ప్ప ఎవ‌రైనా స‌రే తల్లి ! దీనికి విరుగుడుగా ఒక మహానుభావుడైన మ‌హ‌ర్షి ఆశీర్వాదం పొందాలి !

కాని...

అమ్మాయి మోము మ‌ర‌క‌త‌వ‌ల్లి ఒక్క క‌నురెప్ప మూత‌కాలం చూచి, ఆ బాలిక మోమునందు వెలిగిపోయే ఆనంద జ్యోత్స్న‌ల‌ను ద‌ర్శించి ఆశ్చ‌ర్య‌మందిన‌ది. త‌న చిన్నారి బాలిక‌, ఇంక‌నూ చిదిమితే పాలుగారే పిల్ల‌, ఇంకా ప‌దారేళ్ళు నిండ‌లేదు, అప్పుడే ఒక గాయ‌కుని గంభీర కంఠ మ‌ధుర శ్రుతికై ఎదురు చూసే రాగిణి అయిన‌ది. స‌ర్వ‌విద్య‌లూ చెప్పిన వెంట‌నే హృద‌య‌గ‌త‌ము చేసుకుంటుంది. సంగీతంలో అప‌ర‌శార‌దాదేవి ! కంఠ మాధుర్య‌ము .జ‌గ‌ద‌పురూప‌మ‌ని విన్న ఆశ్చ‌ర్యానంద భ‌రితులౌతారు, ఏడేళ్ళ బాలికై ఉన్న‌ప్పుడే సంస్కృతంలో, తెలుగులో శ్లోకాలూ, ప‌ద్యాలూ ఎంతో హృద‌యంగ‌మంగా రాసేది. చిన్న‌త‌న‌మే, బిడ్డ‌వి ముద్దు మాటలే, అయినా పండితులైన‌వారు కూడా భ‌య‌ప‌డ‌తారు. ఒక్క శ్లోకం రాయ‌డానికి ఈ ప‌సికూన‌కు, ఇంత చిన్న‌త‌నంలో ఎంతంత ఊహ‌లు ! ఈడుకు చిన్న‌దే అయినా, ఆలోచ‌న‌ల‌కు ప‌ద్దెనిమిదేడుల ప‌డుచు. విద్య‌ల‌లో తాను త‌న తోటివార‌ల‌కన్న మిన్న అని పేరు పొందిన‌ది అయినా, ఈ ప్ర‌తిభ ఎక్క‌డిది ?

మ‌ర‌క‌త‌వ‌ల్లి ఆలోచ‌న మ‌ర‌ల్చుకొని చూచేస‌రికి బాలిక అక్క‌డ‌లేదు. వీణ ఆపి, లేచి, త‌న సంగీత మందిరందాటి, ఈవ‌ల‌కు వ‌చ్చి, కొమ‌రిత మందిరంలోనికి పోయింది. అలంకార మందిరంలో అమ్మాయి లోగొంతుక‌లో.