శత్రు విజృంభణమునకు పశువులు సహితము బాధపడుచున్నవిట ! పక్షుల కన్నీటితో ఆ గృహములు దూసరితములైనవట !
అలాంటి దేశాన్ని ప్రధమ బుక్కరాయల కుమారుడైన శ్రీకంపరాయులు విముక్తి చేసినాడు. ఆయనకు గోపనార్యుడు, అగ్నికి వాయువులా సహాయం చేసినాడు. గోపన పరమ విష్ణుభక్తుడు. వేదాంత దేశికుల వారి కత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడు. ఈ గోపనను శ్రీకంప రాయలవారు జింజి దుర్గాధ్యక్షునిగ నియమించినారు. శ్రీరంగమందలి రంగనాధస్వామి వారి విగ్రహమును మహమ్మదీయులు కైవసము గాకుండ వేదాంత దేశికులవారు తిరుపతికి జేర్చినారు. గోపన వేంకటేశ్వర స్వామిని దర్శించుకొన్న తరువాత శ్రీ రంగశాయిని జింజి దుర్గమునకు కొనివచ్చి రాజగిరిపై తాత్కాలిక ప్రతిష్ఠను చేసి, నిత్య దీప ధూపనైవేద్యాదికము లేర్పాటు చేసి, శ్రీ రంగమున యుద్ధము చేయుచున్న మహమ్మదీయులను పారద్రోలుటలో కంపరాయలకు కుడిభుజమైనాడు. శత్రువులు పిక్కబలమును చూపిన పిమ్మట గోపన శ్రీరంగశాయివారిని శాశ్వత నివాసస్థానమునకు భక్తి పూర్వకముగా గొనివచ్చి పునఃప్రతిష్ఠుని గాచించినాడు.
ఆ గోపవను గురించిన శ్లోకమే కాదుఊ శ్రీరంగ ప్రాకార కుడ్యం మీద శాసనంగా శిల్పించినారు ?
ఆనీయానీలశృంగద్యుతిరచిత జగద్రంజనా
కుంజనాద్రేః...చంచ్యామారాధ్యకించిత్సమయమధనిహ
త్యోద్ధనుష్కాం తులుష్కాన్
లక్ష్మీక్ష్మాభ్యాముభాఖ్యాం సహనిజనగరే స్థాపయన్ రంగనాధం
సమ్యక్చర్యాం సపర్యాం పునరకృతయశః ప్రాపణో గోపణేంద్రః
ఇది వేదాంత దేశికులు రచించిన శ్లోకమా ! అప్పుడాబాలకు దొడ్డా చార్యులవారు ఆచార్య సూక్తిముక్తావళిలో రచించిన శ్లోకమూ జ్ఞప్తికి వచ్చి పాడుకుంటూ పులకరించి పోయినది.
రఘునాథభూవరుడు ఎంత అందమైనవాడు ! ఇరువది నాలుగు సంవత్సరాల ప్రాయం, పదహారేళ్ళ బాలకుమారునికి ఉండే లేతతనం. పరాక్రమములో శ్రీ రమానాధ ప్రభువు శ్రీ రఘునాధుడే ! ఆ సోగమీసాలు తుమ్మెద రెక్కలు. ఎంత విశాలము ! సమనాసిక ! ఆ కళ్ళు అంత సోగలై అనేక మంది స్త్రీలకే ఓర్వలేనితనం తెప్పించవూ ! ఏనుగు పైన అంబారీలో కూర్చుండి వెళ్ళే ఆ ఠీవి ఇంద్రునికే లేదు.
ఆ బాలిక పసితనం విడిచి తెలుపుతనం చేకూర్చుకొంటున్న కుసుమం. పసిబుగ్గలు బూరిగా ఉండేవి చిన్నతనంలో, అవి తగ్గి విచ్చేపూవుల గండస్థలాలుగా మారి పోబోతున్నవి. ఉదయించిన ఎర్రని పూర్ణిమనాటి చంద్రుడు, ఆకాశంలో పైకి ప్రయాణిస్తూ అమృతకాంతులు చేకూర్చుకుంటున్నాడు. ఆమె కౌను తమలపాకు తీగలా పొడుగై సన్న బడుతున్నది. ఆమె కళ్ళల్లో చిన్ననాటి చిలిపితనపు కాంతులు పోయి, గంభీరాలైన నిర్మల నీలాకాశద్యుతులు మిలమిలలాడసాగినవి. ఆమె జఘనము మనోహర వక్రతతో విస్తృతమగుచున్నది. హృదయాన పరిస్ఫుటం కాలేని కోర్కెలు పొంగుతున్నట్లు తప్తజాంబూనదీ కలశాలు మూర్తి తాలుస్తున్నది. ఆ బాలిక యౌవనోన్ముఖి !
ఆ బాలిక రఘునాధుని చూచినప్పుడే ఆనందంతో ఉప్పొంగి పోయింది. అప్పటి నుండి ఆ బాలికకు అతడే మనోనాథుడు, మహొత్తమ నాయకుడు. ఒకనాడు తానాయనను నాట్యంలో మెప్పించి హారాంగుళీయకములను బహుమతిగా బడసినది. మరల, ఒకనాడు ఆయన ఎదుట తాను గాన సభ చేయాలి. ఒకనాడు తానా ప్రభువును దేవభాషామృతంలో ఆప్లావితుని చేయాలి.
ఆమెకు గంగాదేవి అంతరాంతరాలలో దేశికురాలైనది. ఆమెవలే తానూ తన నాధునికి తన కావ్యం వినిపించగల్గునా ? తానూ పెరిగి పెద్దయినప్పుడు తన అందం ఈ పురుషోత్తముడు చూచి మెచ్చుకుంటాడా ? ఇప్పుడే మెచ్చుకొనుచున్నట్లుగా చూస్తున్నాడు కాదూ ? ఆ మహాపురుషుని మెప్పు సముపార్జింపగల గాన వైశారద్యాన్ని తాను పొందగల్గునా ? ఆ ఉత్తమోత్తమ నాయకుని మోమున సంతోష దరహాస
చంద్రికదలు వెల్లివిరియజేయగలిగిన కావ్యరోహిణీ బాలనున తాను సృష్టించగలుగునా ?
ఆమె ఎదుట రఘునాధుడు ! ఆమె కన్నుల మూతల్లో రఘునాధుడు ! ఆమె లేచి కూర్చున్నది. ఆమె వ్రాత ముద్దులమూట గట్టు వ్రాత. ఆమెకు స్వంతంగా ఒక చిన్న గ్రంధభాండాగారమున్నది. చప్పుడు చేయకుండా తనగదిలో నుండి తన గ్రంధాలయంలోనికి దారి ఇచ్చే తలుపు తీసి, ఎనిమిది వత్తులు గలిగిన అష్టదళహస్త దీపాన్ని వెలిగించుకొని ఆ పుస్తకాలయం లోనికి పోయినది.
అందమైన రత్నకంబళులు పరచియున్న ఆ గృహంలో ఒకచోట దీపపీఠమూ దాని ప్రక్కనే పరుపూ దిండూ ఉన్నది. దీపం సెమ్మాను దీపపీఠం పై పెట్టి ఆ బాలిక తన మందిరం అంతా అలంకరించి ఉన్న పుస్తక మంజూషలు చూచుకొన్నది. |