ఇతడూ బంగారు వెలుగులవాడు
అతడూ నీల రత్నాంగ ప్రభాసితుడు
అంతే ఇతనికీ అతనికి భేదము !
ఇతడూ దక్షిణ నాయకుడూ
అతడూ ఏక పత్నీవ్రతుడూ
అంతే ఇతనికి అతనికి భేదము !
ఇతడూ రఘునాధ సుందరుడు
అతడూ రఘువరుడు పరమాత్ముడు
ఇరువురు ఒక్కటే హృదికీ !
అని మధురంగా దేశాక్షిరాగంలో పాడుకుంటున్నది.
తల్లి వింటూ చిరునవ్వు నవ్వుకుంటూ గుమ్మం ముందున్న సభా మందిరంలో ఒక ఆసనం ఆధివసించినది.
పాట పూర్తికాగానే మరకతవల్లి లేచి తలుపు తట్టినది. ఒక పరిచారిక తలుపు తీయగానే ఆమె లోనికి పోయి, అచ్చటనుండి అలంకార మందిరంలోనికి పోయినది. లేక లేక కలిగిన బిడ్డ కాబట్టి చెంచు అనే పేనుతోనే పిలుచుకుంటుంది.
చెంచూ ! రా తల్లీ ! లక్ష్మీనృసింహునకు నమస్కారంచేసి ప్రసాదం పుచ్చుకుందువుగాని, దేశికులు వచ్చి పూజచేసి ఇప్పుడే వెళ్ళినారు.
అమ్మా ! ఎందుకే నరసింహదేవునికి నామాలు పెడతారు ?
నరసింహ దేవునికే ఏమిటి తల్లీ ! శ్రీ రంగ శాయికీ నామాలు ఉంటాయి కదా !
నామంలోని ధవళ పుండ్రాలు విష్ణుపాదాలు కాదా ? విష్ణు ముఖానికి విష్ణుపాదాలా ? వీరవైష్ణవం వెర్రి తలలు ఇలా వేస్తూ ఉంటాయి కాదుటే అమ్మా ?
నీకీ వేదాంతం అంతా ఎందుకే ?
కస్తూరీ తిలకం, లలాట ఫలకే అని ఉంటే నాకు నామాలు అర్థంకావు.
సరేలే !
ఇద్దరూ కలిసి పూజాగృహంలోకి వెళ్ళినారు. అక్కడ మహా విమానాకారంలో ఉన్నది పూజామందిరం. బంగారు సెమ్మెల, వెండి సెమ్మెల, పంచలోహ దీప లక్ష్ముల హస్తాలలో దీపాలు వందలు వెలుగులు జిమ్ముతున్నవి.
వివిధ పుష్పాలు ఘుమఘుమలాడుతూ బంగారు పళ్ళెరాలలో వికసించి ఉన్నవి. బంగారు తట్టలలో ఫలాలున్నవి. మరకతవల్లి కుటుంబ దేశికుడైన శ్రీమాన్ తిరుమల లక్ష్మణ తాతాచార్యులవారు చెంచులక్ష్మి నరసింహుల మూర్తులకూ పూజచేసిచ తమ శిష్యుని శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాస వరదాచార్యుల నక్కడ ప్రసాద తీర్థాదుల అర్పింపడానికి ఉంచి తాను వెళ్ళిపోయినాడు.
మరకతవల్లీ చెంచులక్ష్ములు వచ్చేసరికి మరకతవల్లి అక్క శృంగారవల్లీ నాగరాజకుమారి అక్కడకు వచ్చినారు. శ్రీ మాన్ శ్రీనివాస వరదాచార్యులు అందరికీ శ్రీ నృసింహపాదోదకమూ, చెంచులక్ష్మీదేవి పూజాకుంకమూ, తులసి దళాలూ, పూవులూ, ప్రసాదమూ అర్పించినారు. అందరూ,
హేగోపాలక ! హే, కృపాజల నిధే ! హే సింధు కన్యాపతే !
హే కంసాంతక ! హే గజేంద్ర కరుణాపారీణ ! హే మాధవా !
హే రామానుజ ! హే జగత్రయగురో ! హే పుండరీకాక్షమాం
హే గోపీ జననాధ పాలయపరం జానామినత్వం వినా ! అని పాడినారు.
ఆ కంఠాలన్నీ మధురమేళ మాలికకాగా అందులో చెంచెలక్ష్మీ బాల కంఠము మహా మధురమేళార్ద్ర పరవశాత్మికమైనది.
ఆ రాత్రి పండుకొనబోవు సమయంలో చెంచులక్ష్మికి మహా రచయిత్రి శ్రీ గంగాదేవి రచించిన మధురా విజయం జ్ఞాపకం వచ్చింది, తన ధీరోదాత్త నాయకుడు శ్రీ రఘునాథుని విజయం తలచుకొంటూ ఉంటే.
హిమచందన వారి సేకశతా
న్యభవన్ యాని గృహేంగణాని రాజ్ఞా
హృదయం మామ వేదయంతి తాని
ద్విజబంధీ నయనాంబు దూషితాని. |